న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రముఖులు ప్రయాణించడానికి రక్షణ శాఖ కొనుగోలు చేయతలపెట్టిన హెలికాప్టర్ల ఒప్పందంలో ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ మిలన్‌లోని ఇటలీ అధికారుల నుంచి కొన్ని డాక్యుమెంట్లను సంపాదించగలిగింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థకు అనుకూలంగా ఈ ఒప్పందం మొగ్గేలా చేయడానికి ఏ భారతీయుడైనా ఈ ముడుపులు అందుకున్నారా అనే విషయం దర్యాప్తు చేయడానికి ఈ డాక్యుమెంట్లు తోడ్పడవచ్చని సిబిఐ భావిస్తోంది. ఆదివారం మిలన్‌నుంచి తిరిగొచ్చిన సిబిఐ బృందం సభ్యుడొకరు మిలన్‌లోని ఇటలీ ప్రాసిక్యూటర్ నుంచి సుమారు 3600 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకు వచ్చినట్లు సిబిఐలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రానున్న రెండు రోజుల్లో ఈ డాక్యుమెంట్లను పరిశీలిస్తారని, ఈ డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు (పిఇ) చేపడతారని ఆ వర్గాలు తెలిపాయి. ఆంగ్లో-ఇటాలియన్ సంస్థ అయిన అగస్టావెస్ట్‌ల్యాండ్‌కు ఈ కాంట్రాక్ట్ దక్కేలా చేయడానికి సుమారు 362 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే సిబిఐ అధికారి తీసుకొచ్చిన డాక్యుమెంట్లు ఎలాంటివో వెల్లడించడానికి ఆ వర్గాలు నిరాకరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టడానికి ఈ డాక్యుమెంట్లు సరిపోవచ్చని ప్రాథమికంగా అనిపిస్తోందని, ఎందుకంటే ఈ దశలో ఇటలీ దర్యాప్తు అధికారులు ఈ పత్రాలను మాత్రమే మనకు ఇవ్వగలరని చెప్పారు. అయితే తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని డాక్యుమెంట్లు ఇస్తామని వారు హామీ ఇచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. ఇటలీ వెళ్లిన ఇద్దరు సిబిఐ అధికారుల్లో ఒకరు ఇంకా మిలన్‌లోనే ఉన్నారని, ఆయన మరికొన్ని డాక్యుమెంట్లతో సోమవారం ఇక్కడికి వస్తారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. కొంతమంది భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ముడుపుల దర్యాప్తులో సహకారం అందిస్తామని అగస్టావెస్ట్‌ల్యాండ్ మాతృ సంస్థ అయిన ఇటలీ ప్రభుత్వ అధీనంలోని ఫిన్ మెకానికా ఇచ్చిన హామీపైన కూడా సిబిఐ ఆశలు పెట్టుకుని ఉంది. తాము అంతర్గతంగా జరిపిన దర్యాప్తు నివేదికను తమకు ఇవ్వాలని, భారత్‌లో వీటిని పరిశీలించి, సరయిన దర్యాప్తు నిర్వహించడానికి వీలవుతుందని ఫిన్ మెకానికా సంస్థ అధికారులతో జరిగిన సమావేశంలో సిబిఐ అధికారులు కోరారు. ఈ ముడుపులకు సంబంధించి భారతీయుల పాత్రపై దర్యాప్తుకు సహకారం అందించాలని కోరేందుకు ఈ కేసును విచారిస్తున్న జడ్జితో పాటుగా ఇటలీ న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు సీనియర్ అధికారులను కూడా సిబిఐ అధికారులు కలిసారు. ఈ వారం ఇటలీలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత మరికొంత సహకారాన్ని అందజేస్తామని ఈ బృందానికి చెప్పిన ఇటలీ అధికారులు, తమ దేశంలో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉందని కూడా చెప్పారు.
సుప్రీంకు త్వరలో
సివిసి స్థారుూ నివేదిక
2జి స్పెక్ట్రమ్ కేసు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం దర్యాప్తుపైన, అలాగే ఈ కేసులో ప్రాసిక్యూషన్, ఒక నిందితుడు కుమ్మక్కయ్యారంటూ వచ్చిన ఆరోపణలపైన కేంద్ర నిఘా సంస్థ (సివిసి) త్వరలోనే సుప్రీంకోర్టుకు స్థారుూ నివేదిక సమర్పిస్తుంది. సిబిఐ అధికారులు ఇటీవల సివిసి అధికారులను కలిసి 2008లో కొన్ని టెలికాం కంపెనీలకు 2జి స్పెక్ట్రమ్ కేటాయించడంపై ప్రస్తుతం జరుపుతున్న దర్యాప్తును వారికి వివరించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ప్రస్తుతం జరుపుతున్న దర్యాప్తుకు సంబంధించిన స్థారుూ నివేదికలను సివిసికి దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఈ కేసునుంచి తొలగించిన సిబిఐ ప్రాసిక్యూటర్ ఎకె సింగ్, నిందితుల్లో ఒకరయిన యునిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్రలకు మధ్య జరిగిన సంభాషణగా చెప్తున్న వివాదాస్పద ఆడియో టేప్ కూడా ఈ స్థారుూ నివేదికలో ఉంటుందని ఆ అధికార వర్గాలు తెలిపాయి. 2జి కేసును బలహీనపరిచే ఉద్దేశంతో రికార్డు చేసిన ఈ ఆడియో టేప్ బయటపడడం వెనుక కార్పొరేట్ సంస్థల మధ్య ఉన్న వైరమే కారణమై ఉంటుందని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే యునిటెక్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ తమ ఎండి ఈ కేసులోని ప్రాసిక్యూటర్‌ను కోర్టు బైట ఎప్పుడూ కలుసుకోవడం కానీ, లేదా ఆయనతో ఫోన్‌లో సంభాషించడం కానీ చేయలేదని వాదిస్తోంది. ఈ ఉదంతం వెలుగు చూసిన తర్వాత సిబిఐ సింగ్‌ను 2జి కేసునుంచి తప్పించింది.
ఈ టేప్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ అధికారులు ఈ నెల 20న శ్వాన్ టెలికాం కంపెనీ, డిబిఆర్ రియల్టీ సంస్థ ప్రమోటర్, ఈ కేసులో నిందితుడు అయిన షాహిద్ బల్వాను ప్రశ్నించారు. ఇంతేకాకుండా దర్యాప్తు అధికారులు సిబిఐ ప్రాసిక్యూషన్ బృందాలకు చెందిన కొంతమందిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సిబిఐ జరుపుతున్న దర్యాప్తు పట్ల సివిసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా వారు చెప్పారు. 2జి కేసుకు సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. సివిసి దాఖలు చేసే స్థారుూ నివేదికలో ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ అధికారులు సాగించిన దర్యాప్తు వివరాలు కూడా ఉంటాయని ఆ అధికార వర్గాలు తెలిపాయి.
ఇండియా గేట్ దుర్భేద్యం!
భారీగా పోలీసుల మోహరింపు.. తనిఖీలు
ప్రముఖుల నివాసాల వద్దా భద్రత పెంపు
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్, అమర్ జవాన్ జ్యోతి ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు దుర్భేద్యంగా మార్చివేశారు. హైదరాబాద్‌లో జంట బాంబులు పేలిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని ముఖ్యమైన, జన సమ్మర్ద ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. రోడ్లపైనున్న సిసి టీవీ కెమెరాలను తనిఖీ చేయటంతోపాటు, కీలక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును భారీగా పెంచారు. పలుచోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్దఎత్తున ప్రజలు వచ్చే ఇండియా గేట్ ప్రాంతంలో ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగకుండా చూసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. అమర్‌జవాన్ జ్యోతి ప్రాంతంలో అందరిని తనిఖీ చేస్తున్నారు. ఇండియా గేట్ చుట్టూ వాహనాల రాకపోకలను కూడా నియంత్రిస్తున్నారు. అలాగే రాష్టప్రతి భవన్, ప్రధాన మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసాలు, కేంద్ర మంత్రుల నివాసాలతోపాటు పార్లమెంటు సభ్యుల అధికార నివాసాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
కన్యాకుమారిలో సోదాలు
కన్యాకుమారి (తమిళనాడు): హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనతో సంబంధం ఉందనే సమాచారం మేరకు కన్యాకుమారిలో పోలీసులు, ఇంటెలిజన్స్ బృందాలు ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. సముద్ర తీర ప్రాంతమైన ఈ పట్టణంలో నివసిస్తున్న కొంతమందికి హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉండివుండచ్చని హైదరాబాద్ పోలీసులు, ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు కొందరు తప్పించుకునేందుకు సరిహద్దు రాష్టమ్రైన కేరళకు చేరనున్నారనే సమాచారం అందిందనీ, దీంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి భద్రతను పటిష్ఠపరిచామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తీర ప్రాంతాలపై నిఘా పెంచడంతో పాటు అనుమానితులు, కొత్తవారు కనిపిస్తే సమాచారం అందించాలని మత్స్యకారులకు అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. దాక్కునే అవకాశమున్న ఏ ప్రాంతాన్నీ పోలీసులు వదలకుండా జల్లెడపట్టారు.
ఉగ్రవాదుల ముప్పు పొంచివుందన్న సమాచారం మేరకు మదురైలో ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. వాహనాలను తనిఖీచేసేందుకు ప్రత్యేక బృందాలు నియమించారు.
వారికి ఉరి సరికాదు
శిక్ష అమలులో కాలాతీతమే కారణం
రాజీవ్ హత్య కేసు దోషులకు మరణశిక్షపై
అప్పటి న్యాయమూర్తి థామస్ వ్యాఖ్య
తిరువనంతపురం, ఫిబ్రవరి 24: రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముగ్గురు దోషులు ఎదుర్కొంటున్న మరణశిక్ష విషయంలో మరో ఆసక్తికరమైన పరిణామం ఆదివారం చోటుచేసుకుంది. 13ఏళ్ల క్రితం మురుగన్, శంతన్, పెరరివళన్ అనే ముగ్గురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి నేతృత్వం వహించిన అప్పటి న్యాయమూర్తి కె.టి.్థమస్.. ఆ దోషులకు ఇప్పుడు ఉరిశిక్ష అమలు చేయడం రాజ్యాంగం ప్రకారం సరికాదని ఆదివారం ఇక్కడ పేర్కొన్నారు. ఎలాంటి ‘సమీక్ష’కు నోచుకోకుండా 22ఏళ్ల పాటు జైలుజీవితం గడిపిన నిందితులను ఇప్పుడు ఉరితీయడం రాజ్యాంగం ప్రకారం సరికాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి థామస్ ఒక వార్తాసంస్థకు వివరించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 13ఏళ్ల క్రితం ఈ ముగ్గురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసిన సమయంలో నిందితుల స్వభావాన్ని, శీలాన్ని తాము పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించడం రాజ్యాంగంలోని 22వ అధికరణానికి వ్యతిరేకమని థామస్ పేర్కొన్నారు. శిక్ష ఖరారు చేసిన చాలా ఏళ్ల తర్వాత దోషులను ఇప్పుడు ఉరితీయడం రాజ్యాంగం ప్రకారం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరణశిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చే సమయంలో నేరస్థుడి స్వభావాన్ని, శీలాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని 2010లో బరియార్ కేసులో న్యాయమూర్తి ఎస్.బి.సిన్హా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం రూలింగ్ ఇచ్చిందని థామస్ వివరించారు. పైగా మరణశిక్షను ఎదుర్కొంటున్న ముగ్గురు దోషులు రెండు దశాబ్దాలకు పైగా కాలం నుంచి జైలు జీవితం గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి యావజ్జీవ కారాగార శిక్షలోనైనా శిక్షాకాలాన్ని తగ్గించినా, తగ్గించకపోయినా మధ్య మధ్యలో నేరస్థుడి శిక్షను సమీక్షించాల్సి ఉంటుందని, ఇది నేరస్థుడి హక్కు అని థామస్ వివరించారు. రాజీవ్ హత్య కేసులో ఈ ముగ్గురు నిందితులు ఎలాంటి సమీక్షకు నోచుకోలేదని పేర్కొన్నారు.