బొబ్బిలి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో అన్ని విధాలా మహిళలకు రక్షణ కరువయ్యిందని, దీంతో కష్టాలపాలవుతున్నారని తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నానాటికి మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయన్నారు. అయినప్పటికీ పాలకులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. మహిళలకు ప్రభుత్వం ఎంతవరకు ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతుందన్నారు. విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్న పాలకులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీని ప్రభావం వల్ల నేరాలు నానాటికి పెరుగుతున్నాయన్నారు. పాన్‌షాపుల్లో సైతం మద్యం లభిస్తుందని ఆరోపించారు.
మహిళలపై జరుగుతున్న దాడుల విషయంపై పాలకులు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. టిడిపి హయాంలో యువత, మహిళలకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. తల్లి కాంగ్రెస్ అయితే పిల్ల వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అని, ఇరుపార్టీల నేతలు దొందూ దొందేనని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి, నియోజకవర్గం ఇన్‌చార్జి తెంటు లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా రెండో సారి ‘గాదె’ విజయం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 25: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి జరిగిన ఎన్నికలో సిట్టింగ్ అభ్యర్థి గాదె శ్రీనువాసులు నాయుడు విజయం సాధించడం పట్ల ఆయన్ను బలపరచిన ఉపాధ్యాయ సంఘాలు విజయోత్సవాల్లో తలమునకలయ్యాయి. మండలి పునరుద్ధరణ తర్వాత తొలిసారి పోటీలో నిలచిన శ్రీనివాసులు నాయుడు ప్రత్యర్ధుల నుంచి హోరాహోరీ పోటీని ఎదుర్కొన్నారు. అయితే ఈసారికూడా ఎన్నిక ఆషామాషీగా జరగలేదు. గతంలో సమీప ప్రత్యర్ధిగా నిలచిన జి.సింహాద్రప్పడు ఈసారి కూడా గట్టిపోటీనే ఇచ్చారు. తొలి నుంచి ఎన్నిక నువ్వానేనా అన్న రీతిలో జరుగుతుందని అన్ని వర్గాలు భావించాయి. తొలి ప్రాధాన్యత ఓట్లు విజేతగా నిలపకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. 900 పైచిలుకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులు నాయుడు గెలుపు సాధ్యమైంది. గత ఎన్నికతో పోలిస్తే ఈసారి మెజార్టీ కాస్త తగ్గింది. పోలింగ్ ముందు వరకూ పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. అయితే ఒక సారి ఎమ్మెల్సీగా చేయడంతో కాస్త వ్యతిరేకత ఉంటుందని భావించారు. దీనికి తోడు గతంలో ఓటమి పాలైన సింహాద్రప్పడుపై సానుభూతి పనిచేయడంతో పాటు కీలకమైన విశాఖపట్నం జిల్లాలో ఓట్లు గాదె గెలుపును ప్రభావితం చేస్తుందని భావించారు. దీనికి తోడు ఎమ్మెల్సీగా అధికార పార్టీతో అంటకాగిన విమర్శలను సైతం ఎదుర్కొని గెలుపును దక్కించుకోవడం విశేషం. ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ప్రత్యేక పాలన పొడిగింపుపై పెదవి విరుపు
ఆంధ్రభూమిబ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 25: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార, విపక్ష పార్టీల కిందిస్థాయి నాయకత్వం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కిందట పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పానల విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రత్యేకాధికారుల పానలను మరో ఆరునెల్లపాటు పొడిగిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మండల స్థాయి అధికారులకే పరిధిని బట్టి మూడు నుంచి అయిదు పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ పనులతో పాటు అదనపు బాధ్యతలు తలకెత్తుకోవడంతో పాలనాపరమైన అంశాలు వెనుకబడిపోతున్నాయి. కార్యదర్శులు కూడా ప్రత్యేకాధికారులు చూసుకుంటారులే అని భరోసా పడిపోవడంతో పలు పనులు ఎక్కడివక్కడే నిలచిపోతున్నాయి. అతి ముఖ్యమైన తాగునీటి సరఫరా పారిశుద్ధ్య, వీధిదీపాల నిర్వహణ వంటి అంశాలు కూడా సక్రమంగా సాగట్లేదు. జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో పనిచేసే కార్యదర్శురు, తాజాగా మండల స్థాయిలోని ఎంపిడిఓ, ఎమ్మార్వో, హౌసింగ్, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర శాఖల నుంచి ప్రత్యేకాధికారులను నియమించడంతో యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడుతోంది. ఇక గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్ళు, వౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో కార్యదర్శులు, ప్రత్యేకాధికారుల నడుమ సమన్వయం లేదు. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన కిందిస్థాయి నాయకత్వం చెప్పిన పనులకే ప్రాధాన్యత ఉంటోంది. ఇక్కడ విపక్ష పార్టీలకు చెందిన వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంతమంది కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానం తీర్పు వెలువడిన నేపధ్యంలో త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని భావిస్తుండగా, ప్రత్యేకాధికారుల పాలనపై వెలువడిన ఉత్తర్వులు పంచాయతీలకు పోటీచేసే ఆశావహుల ఆశలపై నీళ్ళు చల్లినట్టైంది. మరో రెండు నెలల్లో మండల, జెడ్పీలకు సైతం ప్రత్యేకాధికారుల పాలన ముగియనుంది. వీటికి సైతం ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయస్థానం నుంచి అనుమతి లభించినప్పటికీ పాలనాపరమైన కోవలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.