బొబ్బిలి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో మహిళా సంక్షేమం ప్రకటనలకే పరిమితమవుతుందే తప్ప కార్యరూపం దాల్చడం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.హైమావతి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లాస్థాయి మహిళా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో పెద్ద పీట వేస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు వారిపై జరుగుతున్న దాడులు, హత్యలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించారు. అర్థరాత్రి మహిళలు ఎందుకు తిరగాలి అని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తే, హత్య, అత్యాచారాలు, చిన్నచిన్న సంఘటనలు జరగడం కామనే అంటూ మరొక మంత్రి కొట్టిపారేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో 3వేల కోట్ల మద్యం విక్రయాలు ఉంటే ప్రస్తుతం 26కోట్ల రూపాయలు ఆదాయం మద్యం ద్వారా సంపాదిస్తున్నారే తప్ప దీని వల్ల మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలను పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. మంచి సమాజం కోసం మార్పు తీసుకువచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతను, మహిళలను రెండు కళ్లుగా భావించి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ భావితరాలను కాపాడేందుకు ఇప్పటి నుంచే నడుంబిగించాలన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డి.జగదీష్ మాట్లాడుతూ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తూముల అచ్యుతవల్లి మాట్లాడుతూ దేశం పార్టీహయాంలోనే మహిళలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటు లక్ష్మునాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అరుణతోపాటు సాలూరు ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తూముల భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్, కె. ఏ.నాయుడు, పట్టణ, మండల అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, అల్లాడ భాస్కరరావు, గొట్టాపు వెంకటినాయుడుతోపాటు తూమరోతు వెంకట్, తదితరులు పాల్గొన్నారు. ఎన్.టి. ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
‘చిత్తశుద్ధితో పనిచేస్తే
ఆశించిన ఫలితాలు’
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 25: చిత్తశుద్ధితో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చునని ఆర్టీసీ జోనల్ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ వి.శ్రీదేవి అన్నారు. సోమవారం ఇక్కడ జోనల్ స్ట్ఫా శిక్షణా కళాశాలలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పెరుగుతున్న ప్రైవేటు వాహనాల జోరును దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు అవసరమైన నాణ్యతమైన అందించాలన్నారు. ప్రయాణికుల ఆదరణపై ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందని, అందువల్ల ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని అందించాలని కోరారు. పెరుగుతున్న నిర్వహణాఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా ఖర్చులను తగ్గించుకుని పొదుపుచర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. ఉద్యోగులు, కార్మికుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముందడుగు కార్యక్రమాన్ని యాజమాన్యం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.