సూర్యాపేట, ఫిబ్రవరి 25: దురాజ్‌పల్లి లింగమంతులస్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భక్తులు పోటెత్తారు. లింగమంతునిస్మరణ దశదిశలా మారుమ్రోగింది. భక్తజన ప్రవాహం ఉప్పెనలా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం, జాతర పరిసరాల్లో ఇసుకవేస్తే రాలనంతగా జనమే కన్పించారు. లింగా...ఓలింగా...అంటూ భేరీనాధాలు, డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ భక్తిపారవశ్యంతో తమ ఇష్టదైవానికి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తిపారవశ్యంతో భక్తులుచేస్తున్న అరుపులు, కేకలతో పెద్దగట్టు ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. బలిచ్చేందుకు వెంట తెచ్చిన మేకలు, గొర్రెపొటేళ్లతో గుట్టపైన ఆలయాల చుట్ట్భుక్తులు పరుగులు తీస్తున్నారు. భక్తులు గుడిచుట్టూ పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. యాదవుల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధిగాంచిన ఈజాతరలో సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాల గంపలను నెత్తిన పెట్టుకొని గుడిచుట్టు ప్రదక్షీణలుచేసి తమ కోర్కెలను తీర్చమంటూ లింగమయ్యను వేడుకున్నారు. అధికారుల అంచనాకు అనుగుణంగానే గుడికి తూర్పు, పడమరవైపులనున్న మెట్లమీదుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట తరువాత అదుపుచేయలేనంతగా భక్తుల రద్దీ పెరిగింది. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సకల ఏర్పాట్లుచేసినట్లు ప్రకటించినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు.
ఐక్యత దెబ్బతీయలేరు: చక్రపాణి
నకిరేకల్, ఫిబ్రవరి 25: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు బాంబులుపేల్చి విధ్వంసం సృష్టించినా పట్టణ ప్రజలు నిబ్బరం, నిలకడతో సంయమనంపాటించి ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని దేశప్రజలకు అందించారని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. నల్లగొండ జిల్లాలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు వెళ్తూ విలేఖరులతో మాట్లాడుతూ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుదాడులు జరిగిన అనంతరం హైదరాబాద్ ప్రజలు తాము ఐక్యంగా సమస్యను ఎదుర్కొంటామన్న భావనను వెలిబుచ్చారని, బాధిత కుటుంబాలకు చేదోడువాదోడుగా అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు నిలిచి సంఘీభావం ప్రకటించాయన్నారు. సంఘటన అనంతరం ఎలాంటి అలజడి లేకుండా దేశసంస్కృతిని చాటిచెప్పారన్నారు. ఐక్యతను, శాంతిని తూడిచి వేయాలని చూసే ఉగ్రవాదులకు ప్రజలు సరైన సందేశాన్ని పంపారన్నారు. ఉగ్రవాదులదాడి ఒక పిరికిపంద చర్య అని ప్రజలు భావించారన్నారు. దేశంలో గతంలో ఎన్నో దాడులు జరిగాయని దాడులు దేశాన్ని ఏమిచేయలేకపోయాయన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ప్రజలకు ఐక్యతతో ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. సంఘటనకు బాధ్యులైన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. .