విశాఖపట్నం, ఫిబ్రవరి 25: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, సబ్బవరంతో పాటు మరో 80 గ్రామాల విలీనంపై ఎమ్మెల్యేల మధ్య బేధాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు తమ ప్రాంతాలను జివిఎంసిలో విలీనం చేయాలని తీర్మానించి పంపించాయి. ఈ తీర్మానాల ఆధారంగా విలీన ప్రక్రియను జివిఎంసి మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పెందుర్తి, సబ్బవరం ప్రాంతాలను కూడా అందులో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రతిపాదించడంతో ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను మున్సిపల్ శాఖకు పంపించారు. దీనిపై తర్జన భర్జన జరుగుతున్న సమయంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ వెళ్లి, వాస్తవ పరిస్థితులను తెలియచేశారు.
వాస్తవానికి జివిఎంసి పాలకవర్గం ఉన్న సమయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ 2010లో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనానికి ప్రతిపాదించారు. అప్పట్లో ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను అంగీకరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటికే జివిఎంసిలో విలీనమైన గాజువాక మున్సిపాలిటీ, పక్కనే ఉన్న 32 గ్రామాలు ఏమాత్రం అభివృద్ధి చెందనందున కొత్త ప్రాంతాలను విలీనం చేయద్దంటూ పట్టుపట్టారు. దీంతో జివిఎంసి కౌన్సిల్ సమావేశంలో ఓ తీర్మానాన్ని అప్పటి మేయర్ పులుసు జనార్దనరావు రాశారు. ఎప్పుడైనా విలీన ప్రక్రియ అంశం తెరమీదకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, చర్చించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి నిర్ణయం తీసుకోవాలని రాశారు. ఈ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు కమిషనర్ సత్యనారాయణకు గుర్తు చేయడంతో ఆయన విలీనంపై అభిప్రాయాలను తెలియచేయాలంటూ, ఎమ్మెల్యేలు, ఎంపిలకు లేఖలు రాశారు. అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు విలీనంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గాజువాక ఎమ్లెల్యే చింతలపూడి వెంకటరామయ్య తటస్థంగా ఉన్నట్టు తెలిసింది. గతంలో విలీనానికి మద్దతు తెలిపిన ద్రోణంరాజు, మళ్ల అదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వెలగపూడి రామకృష్ణబాబు, తైనాల విజయకుమార్ విలీనాన్ని పూర్తిగా వ్యితిరేకిస్తున్నారు.
ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ ఆయా గ్రామాలను, మున్సిపాలిటీలను విలీనం చేయడం వలన కొత్తగా నిధులు వస్తే రావచ్చు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ప్లస్ నిధులను వినియోగించుకుని, ఆ తరువాత విలీనానికి ప్రయత్నిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. విశాఖ నుంచి భీమిలి, అనకాపల్లి మధ్య ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని, అక్కడక్కడ కొద్ది పాటి గృహ సముదాయాలు ఉన్నాయని వీటిని ఏవిధంగా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. 2005లో జివిఎంసిలో విలీనం చేసిన 32 గ్రామాలు ఇప్పటి వరకూ అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. విలీనం చేసుకోమని అనకాపల్లి, భీమిలి ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని, విలీనం చేసుకోడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యే వెలగపూడి కూడా విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇక సిపిఐ విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. జివిఎంసిలో విలీనమైన 32 గ్రామాలను అభృవృద్ధి చేసిన తరువాత, అనకాపల్లి, భీమిలి, సబ్బవరం విలీన గ్రామాలను విలీనం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి అన్నారు. కొత్తగా గ్రామాలను విలీనం చేసుకుంటే, అవి అభివృద్ధి చెందకపోగా, అక్కడున్న ప్రజలపై ముందు పన్ను భారం పడుతుందని అన్నారు. బిఆర్‌టిఎస్ పథకాన్ని ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా, నేటికీ పూర్తి చేయలేకపోతున్నారని, ఇంకా ఎక్కువ భారాన్ని జివిఎంసి భరించడం అంత మంచిదికాదని ఆయన అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ ఇప్పటికే జివిఎంసి అప్పులపాలైందని, మరికొన్ని భూములు, ఆస్తులను చూపించి అప్పులు తెచ్చుకోడానికే ఈ ప్రయత్నమని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బలం చేకూర్చేందుకే ఈ విలీనమని ఆయన అన్నారు. ఏదియేమైనా పార్టీ అధిష్టానంతో చర్చించి, దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని నర్సింగరావు అన్నారు.
సిపిఐ దూరం... వేచి చూసే ధోరణిలో సిపిఎం
english title:
v
Date:
Tuesday, February 26, 2013