తిరుపతి, మార్చి 3: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తుల సౌకర్యార్థం ఏపిఎస్ ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ఆర్‌టిసి ఆర్‌ఎం వి నాగశివుడు వెల్లడించారు. ఆదివారం తిరుపతి ఆర్‌టిసి ఆర్‌ఎం కార్యాలయంలో ఆర్‌ఎం అధ్యక్షతన చిత్తూరు రీజియన్ డిపో అధికారులు, సీనియర్ అధికారులు, ట్రాఫిక్, గ్యారేజి, ఇన్‌చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం నాగశివుడు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి యేడాదిలాగే ఆర్‌టిసి వివిధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పలు శైవక్షేత్రాలకు ఈ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 370 బస్సులతో ప్రత్యేక సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నుండి 40 బస్సులు, తలకోన క్షేత్రంకు 60, తలకోన నుండి తిరుపతికి 60, తలకోన నుండి పీలేరుకు మరో 60 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సదాశివకోనకు 45, కైలాసగిరి కోనకు 200, సిద్దేశ్వరకొండకు 12, మల్లయ్యకొండకు 40, ఝరి క్షేత్రానికి 40, మొగిలి క్షేత్రానికి 30, కోటిలింగాల కోనకు 10 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. ఈ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఈనెల 9వతేది నుండి 12వతేది వరకూ నడుపనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు తాము అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బస్సుల రాకపోకలను, బస్సు స్టాపింగ్స్, ఇతరత్రా సౌకర్యాల కల్పనకు సీనియర్ ఆర్‌టిసి అధికారులు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసి అందించే సేవలను సద్వినియోగం చేసుకుని శైవక్షేత్రాలను దర్శించి భక్తులు పునీతులు కావాలని ఆర్‌ఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి అధికారులు చెంగల్‌రెడ్డి, జితేంద్రనాధ్‌రెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తుల
english title:
special buses
Date:
Monday, March 4, 2013