తిరుపతి, మార్చి 3: శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు అలంకరించేందుకు తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లే శోభాయాత్ర ఆదివారం తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం నిర్వహించే గరుడ సేవలో స్వామివారికి ఈ లక్ష్మీహారాన్ని అలంకరించనున్నారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో ప్రారంభమై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగింది. అక్కడ నుండి అలిపిరి మీదుగా శ్రీనివాస మంగాపురానికి ఈ యాత్ర కొనసాగింది. అలిపిరి వద్ద అలంకృతమైన వాహనంలో ఈ హారాన్ని ప్రదర్శిస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య, భజనలు, దివ్య సంకీర్తనలతో శోభాయాత్ర అత్యంత కన్నుల పండువగా సాగింది. అలిపిరి నుండి రుయాసుపత్రి, ఇస్కాన్ మందిరం, టిటిడి పరిపాలనా భవనం, వివిమహల్‌రోడ్డు, నగర పాలక కార్యాలయం, నాలుగుకాళ్ల మండపం, సంగీతకళాశాల, ఎస్వీ గోసంరక్షణశాల మీదుగా యాత్ర శ్రీనివాస మంగాపురం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీహారాన్ని తిలకించేందుకు భక్తులు రోడ్లవెంబడి బారులు తీరారు. ఈ లక్ష్మీహారాన్ని కొన్ని శతాబ్ధాల క్రితం యదు వంశీకులైన మైసూర్ ప్రభువులు శ్రీవారికి సమర్పించినట్లు క్షేత్ర చరిత్ర చెపుతుంది. శ్రీవారి సాలగ్రహమాల, మకరకంఠి ఎంత పవిత్రమైనవో అంతే మహిమ లక్ష్మీహారానికి ఉన్నట్లు పెద్దలు చెపుతారు. ఈ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఈ లక్ష్మీహారాన్ని ప్రజలందరూ తిలకించేలా చర్యలు తీసుకున్నారు. ఈ శోభాయాత్ర నిర్వహించాలని టిటిడి సంకల్పించడం పట్ల స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కొబ్బరికానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి యేడాది శోభాయాత్ర ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీకల్యాణ వెంకన్నకు కానుకలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమల శ్రీవారికి అలంకరించిన ఆభరణాలను భక్తుల మధ్య శోభయాత్రను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భక్తులు ఈ హారాన్ని స్వామివారికి ప్రతిరూపంగా భావించి హారతులు పలికారన్నారు. ముందుగా శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ చిన్నంగారి రమణ స్వామివారి లక్ష్మీహారాన్ని అలిపిరి వద్దకు తీసుకువచ్చారు. భక్తులందరూ ఈ హారాన్ని దర్శించుకునేలా లక్ష్మీహారాన్ని అలంకృత వాహనంలో ఉంచి పూజలు చేశారు. ఇఓ ఎల్వీ సుబ్రమణ్యం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అంతకుముందు తిరుమల నాలుగుమాడావీధుల్లో ఊరేగించిన ఈ లక్ష్మీహారాన్ని బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి తిరుపతికి తీసుకువచ్చి శోభాయాత్రను కొనసాగించారు. ఈ శోభాయాత్రలో టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రమణ్యం, జెఇఓ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ ఇఓ చిన్నంగారి రమణ, సివిఎస్‌ఓ జివిజి అశోక్‌కుమార్, విజిఓ శివకుమార్‌రెడ్డి, ఉప కార్యనిర్వహణాధికారి శివారెడ్డి, హెచ్‌డిపిపి ప్రత్యేకాధికారి రఘునాథ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
* మార్మోగిన భక్తుల గోవిందనామ స్మరణలు
english title:
shobha yathra
Date:
Monday, March 4, 2013