మనకున్న అనేక పండగల్లో దసరా, దీపావళి, సంక్రాంతిలాగే- మహిళా దినోత్సవం ఏటా మార్చి 8న మహిళలకు ఒక పండగలాగే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఉపన్యాసాలు మహిళల అభ్యుదయం గురించే. కొన్నిచోట్ల ప్రముఖ మహిళలకు సత్కారాలూ. ఆఫీసులలో, బ్యాంకులలోనూ ఇతర కార్మిక సంస్థలలోనూ, ఉద్యోగులకు చిన్న చిన్న గిఫ్టులిచ్చి మహిళా ఉద్యోగులను అధికారులూ, సహచర ఉద్యోగస్తులూ గౌరవిస్తారు. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. కానీ, ఆ మర్నాడే మళ్లీ ముందు రోజు చెప్పిన మాటలన్నీ నీటిమూటల్లా కారిపోయి, మహిళ స్థితి మామూలుగానే అయిపోతుంది. ఆఫీసుల్లో లైంగిక వేధింపులూ, అవమానాలూ, కాలేజీల్లో ఈవ్ టీజింగ్‌లూ.. ఇలా అన్నీ షరా మామూలే! వాచ్‌మన్‌ల దగ్గరినుంచి ఆటోవాలాల వరకూ ఏ ఒక్కరినీ నమ్మలేని పరిస్థితి. మహిళలు పట్టపగలు కూడా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి! ఏ విషయంలోనూ ఎక్కడా మార్పులేదు. చివరికి కొన్ని పత్రికలలోనూ సెక్సు గురించిన వ్యాసాలకు వేసే బొమ్మలను చూస్తే బాధగా ఉంటుంది. ఆడామగా ఇద్దరూ (్భర్యాభర్తలే కావచ్చు) గుడ్డలు లేకుండా, సన్నిహితంగా కూర్చోవడం చూస్తే, అన్నీ తెలిసిన పెద్దలకే అసహ్యంగానూ, జుగుప్సాకరంగానూ వుం టుంది. టీవీ చానళ్ల ప్రకటనల్లోనూ వీటిని చూపిస్తూనే వుంటారు. వీళ్ళకే ఇంత స్వేచ్ఛ ఉంటే ఇక సినిమాల గురించి చెప్పేదేముంది? సెన్సారు వాళ్ళని తిట్టేదేముంది? ఎవరిగోల వారిదిగా అయిపోయింది. పా ఠ్యపుస్తకాలు చదవకపోయినా, సినిమావాళ్ల జీవిత విశేషాలు చదివే కుర్రకారుకి, అరవై ఏళ్ళ మగువ ముప్ఫై ఏళ్ళవాడిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోందని, దానికి ఆమె పాతికేళ్ల కొడుకులు కూడా సంతోషించి ఆమోదముద్ర వేశారనీ, అతడు చాలా ధనవంతుడనీ చదివిన యువకులు ఆ కోవలో ఆలోచిస్తూ ఉంటారు. తాము కూడా ఈ పనులన్నీ ధైర్యంగా చెయ్యొచ్చును, కాకపోతే బాగా డబ్బు కావాలి. డబ్బు ఎలా సంపాదించాలి? అదీ షార్ట్‌కట్‌లో, అప్పటికప్పుడు కావాలి. కాబట్టి దొంగతనాలూ, హత్యలూ చెయ్యాలి- వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుని. కనుక హత్యలూ, అఘాయిత్యాలూ, దోపిడీలూ.. దేనికైనా రెడీ!
కొందరు ఆడపిల్లలు కూడా ఒకసారి ఇటువంటి ఆలోచనాచట్రంలో ఇరుక్కున్నాక బయటపడలేక- జరిగినన్నాళ్లు దర్జాగా బతికేస్తున్నారు- భవిష్యత్ మీద ఎలాంటి బెంగ లేకుండానే. ఈ పాపం ఎవరిది? ఎవరు దీనికి కారకులు? గతి తప్పిన పెద్దలు ఏ దిశను నిర్దేశిస్తారు పిల్లలకి. పిల్లల ముందే వాళ్లున్నారన్న ధ్యాసకూడా లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ప్రవర్తించడం- వాళ్ళ మనస్సులలో ఆ రకమైన ఆలోచనలను రేకెత్తించినట్టు కాదా? మహిళల్ని రక్షిస్తామని చెప్పుకునే నేతలు అత్యాచారాల కే సుల్లో పట్టుబడినా, రక్షక భటుల చేతుల్లోనే మహిళలు బలైపోతూన్న ఉదంతాలు ఎన్ని వింటున్నాం? కంచే చేను మేసినట్టు! దారుణంగా రేప్ చేసి, అమాయకులను బలిగొన్న పెద్దమనుషులు, పట్టుబడితే (వాళ్ల గ్రహాలు బాగులేక) వాళ్లకి శిక్షపడ్డప్పటి నుంచే క్షమాభిక్ష కోరుకుంటూ దరఖాస్తులు పెట్టుకోవడం, వాటి గురించి చర్చలూ.. ఎంత ఘోరం? అటువంటివారికి వెంటనే తగిన శిక్షలు వేసి చట్టాలను కఠినంగా అమలు చెయ్యాలి.
అంతేకానీ ఇంకా చర్చలంటే అర్థమేమిటీ? ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! మహిళా దినోత్సవం నాడు ప్రముఖులు చేసే ప్రసంగాలల్లో ఎన్ని అమలు జరుగుతున్నాయి. ఆ ఒక్కరోజేనా.
ప్రపంచమంతా మహిళలకిచ్చే గౌరవం? మర్నాటినుంచి షరా మామూలేనా? అందుకే తద్దినాల్లో జరుపుకునే పద్ధతుల్ని మార్చి, నిరంతరం మహిళలకి ఎలా గౌరవం ఇవ్వాలనే విషయం ఆలోచించాలి! మహిళలూ వాళ్లమీద ఆధారపడ్డ బిడ్డల్ని పసితనం నుంచే మంచి మార్గాన పెట్టి పెంచడం వాళ్ల ప్రథమ కర్తవ్యంగా భావించాలి. అప్పుడే నిజమైన మహిళల పండగ!
మనకున్న అనేక పండగల్లో దసరా, దీపావళి, సంక్రాంతిలాగే
english title:
m
Date:
Wednesday, March 6, 2013