వారు సామాన్యులే- అయినా అసామాన్య దీక్షాదక్షతలతో అఖండ విజయాలను త మ ఖాతాలో వేసుకున్నారు.. మట్టి వాసనే జీవన నేపథ్యమైనా మహత్తర కార్యాలను సాధించారు.. ఆధునిక వసతులు, ఆర్థిక స్థోమత లేకున్నా అలుపెరుగని పోరాటం చేసి సత్తా చాటారు.. సంకల్ప బలం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు.. సమస్యలకు ఎదురీది విజేతలుగా నిలిచిన వీరంతా సాటి మహిళలకు అనునిత్యం స్ఫూర్తిదాతలే.. విభిన్న రంగాల్లో గెలుపు తీరాలకు చేరిన వీరి విజయ గాథలను తరచి చూస్తే ఎనె్నన్నో అద్భుతాలు మనకు సాక్షాత్కరిస్తాయి.. సాంఘిక దురాచారాలు, హక్కుల కోసం పోరాటం, స్వచ్ఛంద సేవ, సాహసం వంటి అంశాల్లో అయిదుగురు మహిళలతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ప్రముఖ టీవీ చానెల్ ‘టీవీ 9’ నవీన అవార్డులతో సత్కరించింది. ఏటా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్’ ముఖ్యనేత మేధా పాట్కర్ ఈ అవార్డులు అందజేశారు. బాధలను వౌనంగా భరించకుండా మహిళలు నిరసన గళం విప్పినపుడే మార్పు తథ్యమని ఆమె అన్నారు. పల్లెల్లో మహిళలు చేసే పోరాటాలను తక్కువగా అంచనా వేయరాదని, సమస్యలకు ఎదురొడ్డినపుడే స్ర్తిల వ్యక్తిత్వం, పోరాట పటిమ ఆవిష్కృతమవుతాయని మేధా అన్నారు. రమాదేవి ( సాంఘిక దురాచారాలపై పోరు) సాకా నాగమణి ( హక్కుల కోసం పోరాటం), తిరుపతమ్మ (సాహసం), మాణిక్యం (స్ఫూర్తి విభాగం), జ్యోత్స్న ( యువ విజేత)తో పాటు ‘సమతా దండు’ (స్వచ్ఛంద సేవ) కార్యకర్తలు ఈ అవార్డులను అందుకున్నారు.
‘ట్రాఫికింగ్’పై సమరం..
అనంతపురం జిల్లా చిప్పలమడుగు గ్రామానికి చెందిన రమాదేవి కట్నం వేధింపులను భరించలేక పుట్టింటికి చేరగా అనుకోని రీతిలో వ్యభిచార వృత్తిలోకి వెళ్లింది. కొందరు వ్యక్తులు ఈమెను మోసం చేసి మహారాష్టల్రోని ఓ వ్యభిచార గృహానికి తరలించి డబ్బు చేసుకున్నారు. అక్రమ తరలింపు (ట్రాఫికింగ్) వలలో చిక్కి ఎంతోమంది మహిళలు వ్యభిచార కూపంలో నరకం అనుభవిస్తున్నారని తెలిసి రమాదేవి ఒంటరి పోరాటం ప్రారంభించింది. ఎంతోమంది మహిళలు వ్యభిచార కోరల నుంచి బయటపడేలా ఈమె సమరం సాగిస్తోంది. అసాంఘిక శక్తులకు ఏ మాత్రం భయపడక ఈమె తన సమరాన్ని కొనసాగిస్తూనే ఉంది.
హక్కుల కోసం..
వ్యవసాయ శాఖలో అధికారిణి అయిన నాగమణి తనకు ఎదురైన అన్యాయంపై అంతులేని పోరాటం చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఈమె ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారుల అక్రమాలకు కళ్లెం వేసి వారి ఆగ్రహానికి గురైంది. తప్పుడు ఫిర్యాదులపై ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేసినా, హక్కుల కోసం ఈమె అలుపెరుగని రీతిలో శ్రమిస్తోంది. తనకు సంపూర్ణ న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని ఈమె దీక్ష వహించింది.
వెల్లివిరిసిన గ్రామ స్వరాజ్యం..
గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లెలో సర్పంచ్‌గా సేవలందించిన మాణిక్యమ్మ నిరుపేద మహిళే అయినా జాతీయ స్థాయిలో తన గ్రామానికి గుర్తింపు తెచ్చింది. పెద్దగా చదువులేక పోయినా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ఈమె నిరూపించింది. తన గ్రామానికి ప్రాథమిక సౌకర్యాలను కల్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి అయిదు లక్షల రూపాయల గ్రాంటును ఈమె సాధించింది. ‘మట్టిలోనూ మాణిక్యాలుంటాయ’ని ఈ మాణిక్యమ్మ పదిమందికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఒంటరి పోరాటం..
తన కుమార్తెపై అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారకులైన నిందితులకు శిక్షలు పడేలా పోరాడిన తిరుపతమ్మ సాహసం నిరుపమానం. హైదరాబాద్‌లోని బోరబండలో ఉం టున్న ఈమె సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. కొన్నాళ్ల క్రితం ఈమె కుమార్తెపై కొందరు దుండగులు అత్యాచారం చేశారు. అనారోగ్యం ఫలితం కుమార్తె మృత్యువు ఒడిలోకి చేరాక తిరుపతమ్మ ఎలాంటి ప్రలోభాలకు, వత్తిడులకు లొంగకుండా నిందితులపై కేసు వేసి విజయం సాధించింది.
‘ఒలింపిక్ పతకం’పై గురి..
పదేళ్ల జ్యోత్స్న చిన్న వయసులోనే గట్టి సంకల్పంతో విజయ పథంలో దూసుకుపోతోంది. విజయవాడకు చెందిన ఈ బాలిక విలువిద్యలో జాతీయ స్థాయి పతకాలెన్నింటినో కైవసం చేసుకుంది. ‘చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ’లో శిక్షణ పొందుతున్న ఈమె వచ్చే ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కచ్చితంగా పతకం సాధించి పెడతానని అంతులేని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
‘వంగపూల’ మహిళలుంటే- బెంగ లేదు..
ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ‘వంగపూల’ రంగు చీరలు ధరించిన మహిళలు ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడతారు. ‘సమతా దండు’ పేరిట ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన వీరు సాటి మహిళల సమస్యలపై సమరభేరి మోగిస్తారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పది గ్రామాల్లో వీరు సేవలందిస్తున్నారు. గృహహింస, బాల్య వివాహాలు, క ట్నం వేధింపులు, ఆస్తిహక్కు, సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో వీరు మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. సమాజ సేవకు చదువు, హోదాతో పనిలేదని వీరు నిరూపిస్తున్నారు.
వారు సామాన్యులే- అయినా అసామాన్య దీక్షాదక్షతలతో అఖండ విజయాలను త మ ఖాతాలో వేసుకున్నారు..
english title:
ee
Date:
Wednesday, March 6, 2013