Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు నీటి విడుదలపై సందిగ్ధం

$
0
0

అవుకు, మార్చి 6: అవుకు రిజర్వాయర్ నుండి ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయాలంటూ ఆయకట్టు గ్రామాల రైతులు గత నాలుగు రోజులుగా రిజర్వాయర్ పర్యవేక్షక అధికారులను కోరుతున్న విషయం విధితమే. నీటి విడులపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బుధవారం ఆకుమల్ల, సుంకేసుల, శివవరం, చెన్నంపల్లె, సంగపట్నం, సింగనపల్లె రైతులు స్థానిక ఎస్‌ఆర్‌బిసి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు. ఏకంగా కార్యాలయ ఆవరణలోనే వంటవార్పు చేపట్టారు. రైతుల పరిస్థితిని నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి దృష్టికి రైతులే స్వయంగా తెలుపుకున్నారు. ఈ విషయంపై స్పందించి ఎంపి సాయంత్రానికి అవుకులోని ఎస్‌ఆర్‌బిసిలో ఆందోళన బాటలో వున్న రైతులను కలుసుకొని రైతుల తరుపున ఇరిగేషన్ ఉన్నత అధికారులతో చర్చలు జరిపారు. కడపకు నీరు తరలిస్తున్నప్పటికి 100 క్యూసెక్కులైన ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు (13వ బ్లాక్‌కు) ఇవ్వాలంటూ ఛీప్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో చర్చలు జరిపారు. అధికారులు ఒప్పుకున్నారంటూ 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామంటూ ఆనందంగా రైతులకు ఎంపి వెల్లడించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన రైతులు ఎంపిని పూల మాలలో ముంచెత్తారు. ఈ ఆనందం కొన్ని నిమిషాలు కూడా నిలువలేదు. వెంటనే నీటి విడుదల దగ్గర వేచివున్న ఎంపి దగ్గరకు స్థానిక ఇంజనీర్లు వచ్చి ఉన్నత అధికారులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తాము విడుదలను అనుమతించమని చేతులు ఎత్తేశారు. మరోసారి ఎంపి ఉన్నత అధికారులతో చర్చించినప్పటికి ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో చేసేది ఏమిలేక ఎంపి వెళ్లిపోయారు. వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్న శనగ, మిరప పంటలను, రైతులు సాగు చేస్తున్నారు. ఉన్నఫలంగా కథ అడ్డం తిరగడంతో రైతులు మరింత డీలా పడిపోయారు.

శ్రీశైలంలో అడుగడుగునానిఘా
శ్రీశైలం, మార్చి 6: అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది పనితీరును 85 సిసి కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసుకొని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన టివీలో శ్రీశైల ఆలయంలోను, క్యూలైన్ల వద్ద, లడ్డు కౌంటర్ వద్ద, విఐపి దర్శనాల వద్ద, శివాజీ గోపురం, పాతాళ గంగ, టోల్ గేట్, గంగ సదన్, నంది మండపం, అమ్మవారి ఆలయం, మల్లన్న గర్భగుడిలో, మొదలగు భక్తుల రద్దీ ప్రదేశాల్లో సిసి కెమెరాలను గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. దీనితోపాటు ఆయ ఛాంబర్‌లో వాకిటాకిల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలపై సంబంధిత అధికారులతో వాకబ్ చేస్తూ అప్రమత్తమవుతున్నారు. పాతాళ గంగ, శివదీక్ష శిబిరాలు, యాత్రిక నివాస షెడ్యుల, హటకేశ్వరం, పాలధార పంచధార, కైలాస ద్వారం మొదలగు ప్రదేశాల్లో నీటి వసతులపై ఆరా తీశారు.
దేవస్థానానికి టాటా వింగర్ వాహనం విరాళం
శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు టాటా వింగర్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. ఈ వాహనం ఖరీదు సుమారు రూ. 8.5లక్షలు ఉంటుందని తెలిపారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ ఆజాద్‌కు వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని దాత కోరిక మేరకు ఆలయం నుండి లడ్డు ప్రసాదాలను ప్రసాద విక్రయ కేంద్రాలకు చేర్చేందకు వినియోగించడం జరుగుతుందన్నారు. అలాగే ఎం మల్లికార్జుననాయుడు, ఎం శంకర్‌నాయుడు రూ.2లక్షల విలువైన కూరగాయలు విరాళంగా అందజేశారు. ఈ కూరగాయలను శివదీక్ష శిభిరాల వద్ద, అన్నదాన సత్రాలలో ఉచిత బోజనాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సత్ర యజమానులతో సమావేశం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వసతి విభాగం సంబందించి ఆయా సత్ర యాజమాన్యాలతో ఇఓ చంద్రశేఖర్ ఆజాద్ సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సేవలు అందించాలని, దేవస్థానం వారు ఉచితంగా ఆయా సత్రాలకు తాగునీరు సరఫరా చేస్తుందని, సత్రాల వారు ఇంజినీరింగ్ విభాగం నుండి టోకన్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా పొందవచ్చన్నారు. యధావిధిగా ఆయా సత్రాలలో నీరు నిల్వ చేసుకునేందుకు పెద్ద తొట్టెలు నిర్మించుకోవాలని సూచించారు. అలాగే భద్రతాపరమైన చర్యల్లో భాగంగా సత్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు.
శ్రీశైలం ఐటిడిఎ పిఓగా ఎన్ ప్రభాకర్‌రెడ్డి
శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా నక్కల ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జమ్ములమడుగు, వికారాబాదు ప్రాంతాల్లో ఆర్డీఓగా విధులు నిర్వరిస్తు ఐటిడిఎ పిఓగా ఉత్తర్వులు జారీ చేసిందని, శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు
ఓర్వకల్లు, మార్చి 6: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఓర్వకల్లు మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద జరుగుతున్న మామిడితోటల పెంపకం పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల గురించి తమ కూలీలకు అందుతున్న వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్‌షెడ్ పథకంలో భాగంగా రూ. 8 లక్షల ఖర్చుతో బ్రహ్మణపల్లె గ్రామ సమీపంలోగజ్జివాల వంక వద్ద నిర్మించిన ఉట కుంటను చూశారు. గ్రామంలో అమలవుతున్న వాటర్ షెడ్ పనుల గురించి వాకబ్ చేశారు. ఈ క్రమంలోనే కాల్వబుగ్గ రామేశ్వరంలో నర్సరిని సందర్శించారు. నర్సరిలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామ పిడి హరినాథ్‌రెడ్డి, అడిషనల్ పిడి సత్యనారాయణ, మోహన్‌రావు, ఎపిడి లక్ష్మణ్న, పివో కిరణ్‌కుమార్, ఎపివో నిర్మిల, టిక్నికల్ అధికారి ఆయూప్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

శ్రీశైలం వచ్చే భక్తులకు భద్రత కల్పించండి
కర్నూలు, మార్చి 6: మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలతోపాటు శ్రీశైలంకు వచ్చే భక్తులకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగి నరసింహావర్మ ఆధ్వర్యంలో బృంధం బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శ్రీశైలంతోపాటు మహానంది, యాగంటి తదితర దేవాలయాల్లో ఈనెల 10వ తేదిన జరుగు బ్రహోత్సవాలకు దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఒకవైపు ఉగ్రవాదులు దేశ సమగ్రతకు, భద్రతకు ఒక ఛాలెంజ్‌గా ఉందన్నారు. నిన్నటి దిల్‌సుఖ్‌నగర్ ఘటన, చిత్తూరు జిల్లా పుంగనూరులో తాలిబన్లు ఉన్నారని వార్తలను చూస్తుంటే తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండ ముందు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిసి కెమెరాలు, మోబైల్ పోలీసుల వాహనాలు, మెబైల్ వీడియో కెమరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అన్యమతస్తులు చిల్లర వ్యాపారారం అనే పేరుతో శ్రీశైలంలో ప్రవేశించడానికి అవకాశం వుందని, అలాంటి వారిని ఉపేక్షించకుండ తిప్పి పంపాలని ఆయన కోరారు. దేవస్థానంలోపల ఎక్కువ సిసి కెమెరాలు ఉంచి దానిని నిరంతరం నిఘాగా పరిశీలించాలన్నారు. శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్త జనానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి దగ్గర మెటల్ డిటీక్టర్స్‌తో క్షుణంగా పరిశీలించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దర్గస్వామి, బిజెయంయం జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రావు, జిల్లా కోశాధికారి ఉమామహేశ్వరప్ప పాల్గొన్నారు.

రెవెన్యూ శాఖ బలోపేతానికి సదస్సులు
ఆదోని, మార్చి 6: రెవెన్యూ శాఖ బలోపేతం చేయడానికి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కన్నబాబు పేర్కొన్నారు. బుధవారం మార్కెట్‌యార్డులోని రైతు విశ్రాంతి భవనంలో జరిగిన రెవెన్యూ శాఖ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఆదోని, పెద్దకడుబూరు, మంత్రాలయం తహశీల్దార్లు బాలగణేష్, ఈరన్న, శ్రీనివాస్‌రావు, ఇతర మండలాల తహశీల్దార్లు, విఆర్‌ఓలు, రెవెన్యూ అధికారులు సదస్సులో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు, విఆర్‌ఓలు సదస్సుల్లో రెవెన్యూ విభాగానికి సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు విధులను చేయడానికి చేతకాకపోతే ఇతరులతో సదస్సుల్లో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికీ చాలాగ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డిడిలు అందలేదని చెప్పారు. కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో రైతులతో దరఖాస్తులు పెట్టించి రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డిడిలు అందించాలని కోరారు. అలాగే ఆయాగ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలపై జాబితా తయారు చేసి ఆ జాబితాప్రకారం రైతులతో పిటిషన్లుపెట్టించి సదస్సుల్లో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.సబ్‌రిజిష్టర్ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు పంపి వాటిపైన రిజిష్టర్ చేయొద్దని కోరామన్నారు. అయితే విలేజ్‌సైట్లు, పొరంబోకు భూములు ఇప్పుడు వాటి నుంచి తొలగించాలని కోరారు. పట్టాలు ఇచ్చినప్పటికీ భూములు దున్నుకొని రైతులకు భూములు దూనే్నలా చర్యలు తీసుకోవాలని కోరారు. సొంత భూముల రైతులకు హక్కులు కల్పిస్తూనే కౌలు రైతుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఒప్పించి కౌలు రైతులకు గుర్తింపుకార్డులను ఇవ్వాలని ఆయన చెప్పారు. అలాగే పొజిషన్ సర్ట్ఫికెట్లు కూడ అందరికి అందజేయాలని చెప్పారు. ఇళ్ల పట్టాల సమస్యలు, భూపట్టాల సమస్యలను కూడ పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు భూపట్టాలు ఇచ్చిన భూములు చూపకపోతే వారితో దరఖాస్తులు చేయించి భూములు చూపాలని చెప్పారు. భూములు ఇచ్చిన పట్టాలు ఇవ్వని వారికి కూడ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నెలరోజులపాటు జరిగే రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించి రెవెన్యూ శాఖను పటిష్ట పర్చాలని కోరారు. అందుకు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పూర్తి సహాకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఖాతాదారులను ఐశ్వర్యవంతుల్ని చేయడమే ఎస్‌బిఐ లక్ష్యం
కల్లూరు, మార్చి 6: బ్యాంకు సంబంధించిన ఖాతాదారులకు అవసరమైన వనరులను సమకూర్చి వారిని ఐశ్వర్య వంతులను చేయడమే ఎస్‌బిఐ లక్ష్యమని బ్యాంకు ఛీప్ జనరల్ మేనేజర్ రాకేష్ శర్మ అన్నారు. బుధవారం స్థానిక ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వున్న 64 ఎస్‌బిఐ బ్రాంచ్‌ల్లో ఖాతాదారులుగా వున్న వారికి అనేక రకాలుగా సేవలు అందిస్తూ బ్యాంకింగ్ రంగంలో ముందు ఉన్నామన్నారు. 1900కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు అభివృద్ధిబాటలో నడుస్తుందని బ్యాంకుకు మొత్తం అడ్వాన్సుల రూపేనా రూ. 2,500 కోట్లు ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన గృహ రుణాల్లో ఎస్‌బిఐ ముందుందని చెప్పడానికి హర్షిస్తున్నామని 654 హౌసింగ్ రుణాల కొరకు రూ. 77.17 కోట్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇదంతా ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది కృషి సహకారం వలన జరిగిందన్నారు. ఈ నెల 7, 8 తేదీలల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు ఇఎంఐలకు హౌసింగ్ లోను, కారులోన్లను అందిస్తున్నామన్నారు. హౌసింగ్ లోన్లకు 30 సంవత్సరాల రీ పేమెంట్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు జిఎం అప్పయ్య, ఆర్‌ఎం అంజనేయులు, వినోద్ కుమార్‌లు పాల్గొన్నారు.

8న ఆర్థిక సూత్రాల సమీక్ష
ఓర్వకల్లు, మార్చి 6: ఈ నెల 8న ఓర్వకల్లు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంపై సమీక్ష సమావేశం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో చంద్రశేఖర్‌రావు బుధవారం తెలిపారు. ఆయా శాఖలు చెందిన ఆధికారులు తమ అభివృద్ధి నివేదికలతో సమావేశానికి తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.
మద్యంకు యువత దూరంగా ఉండాలి
ఆత్మకూరు రూరల్, మార్చి 6: గిరిజన యువకులను మద్యపానానికి దూరంగా వుంచాలని ఆర్‌డిటి, మహిళ విభాగం ఇన్‌చార్జ్ విశాల ఫెరల్ అన్నారు. ఆత్మకూరు మండలంలో బైర్లూటి గుడెంలో బుధవారం ఆర్‌డిటి ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజనులను మద్యానికి బానిసై ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. చెంచు పిల్లలకు విద్యను అందించే అవశ్యకతను మహిళలకు వివరించారు. గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని అన్నారు.
కాల్వబుగ్గ ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్‌గా చంద్రపెద్దస్వామి
ఓర్వకల్లు, మార్చి 6: ఓర్వకల్లు మండల పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మెన్‌గా హుస్సేనపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌నేత చంద్రపెద్ద స్వామి నియామికులు అయినట్లు ఆలయ ఇవో మద్దిలేటి బుధవారం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 7న ఆయన దేవస్థానంలో పదవి స్వీకారప్రమాణం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం దారిలో ప్రైవేటు వాహనాలు బంద్
ఆత్మకూరు రూరల్, మార్చి 6: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే ప్రైవేటు వాహనాలు బంద్ చేస్తున్నట్లు వెహికిల్ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ అన్నారు. ఆత్మకూరు మండలంలోని ఎస్‌ఆర్‌బిసిలోని ఆర్‌టివో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే వహనాలను క్రమబద్దీకరణ చేస్తున్నామన్నారు. ఆటోలు, టాటా ఎసి, లారీలను శ్రీశైల క్షేత్రానికి వెళ్లడాన్ని నిషేధించమన్నారు. ఎవరైన ప్రైవేటు వాహనాల్లోవస్తే నిలుపుదలచేసి జరిమాన వేస్తామని అన్నారు.
జూటూరులో అన్నదానం
పాములపాడు, మార్చి 6 : మండల పరిధిలోని జూటూరు గ్రామంలో ఉపాధ్యాయులు శ్రీశైలంవెళ్లే శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. పాములపాడు, జూపాడుబంగ్లా, మిడుతూరుకు చెందిన 15 మంది ఉపాధ్యాయుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
చలివేంద్రం ప్రారంభం
పాములపాడు, మార్చి 6: మండల కేంద్రమైన పాములపాడులోని సాక్షర భారత్ యువజన విద్యాకేంద్రం సమీపంలో గ్రామ పంచాయతీ సేవా భారతి యూత్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీశైలంవెళ్లే పాదయాత్రికులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైఆర్‌డిఎస్ అధ్యక్షులు షర్బుద్దీన్ ఆలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ప్రాణానికి మంచి నీటిని ఇచ్చి దాహం తీర్చడం గొప్ప సమాజసేవ అని గొప్ప వ్యక్తి కావాలంటే సామాజిక సవేను ప్రతి ఒక్కరు సమాజసేవ కోసం ఖర్చుచేసి ఇలాంటి చలి వేంద్రాలు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిన్నస్వామి, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యావలంటీర్లకు వేతనాలు చెల్లించండి
గూడూరు, మార్చి 6 : గూడూరు మండలంలో పనిచేస్తున్న 24 మంది విద్యా వాలంటీర్లకు మూడు నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే వేతనాలు ఇవ్వాలని బుధవారం తహశీల్దార్ సంతాన కృష్ణకు, ఎంపిడివో లలితబాయికి వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు నెలల నుండి విద్యా వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం లేదని దీంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని జీతాలు వెంటనే ఇవ్వాలని వారుకోరారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు గోపి, సబిత, రాజు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి కృషి
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 5 : కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు లబ్దిని వారికి అందేలా చర్యలు చేపడుతామని కార్మికశాఖ సహాయ కమిషనర్ గాయత్రి దేవి అన్నారు. స్థానిక స్టేడియంలో గత రెండు రోజుల నుండి కార్మిక క్రీడ పోటీల్లో భాగంగా బుధవారం ఆమె అధ్లెటిక్స్ ఫిల్డ్, ఇవెంట్స్‌లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. 100 మీటర్ల పరుగు పందెంలో మధు మహేష్, శ్రీ్ధర్, లక్ష్మిపతి, లాంగ్ జంప్‌లో శ్రీ్ధర్, సుబ్బయ్య, భాస్కర్, శాట్‌పుట్‌లో జయబహదూర్, విజయకుమార్, సురేష్, జావలిన్ త్రోలో ప్రభాకర్, రవికుమార్, వెంకటసుబ్బయ్య, మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నట్లు లేబర్ అధికారి సుబ్బారావు తెలిపారు.
నేడు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు, మార్చి 6: జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పాలక మండలి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం ఈనెల 7వ తేది ఉదయం 10.30గంటలకు జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం తెలిపారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలుపరుస్తున్న పథకాలపై సమీక్షిస్తారన్నారు. సమీక్షా సమావేశానికి సంబంధించిన సభ్యులు, అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు.
చిన్న సోమన్నను కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
కర్నూలు టౌన్, మార్చి 6: క్రిష్ణగిరి మండల సింగిల్‌విండో సిఇఓగా పని చేస్తున్న చిన్న సోమన్నను కొంతమంది స్థానిక నాయకలు కిడ్నాప్ చేశారని, వారిని వెంటనే శిక్షించాలని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నాప్‌ను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చిన్న సోమన్న కుటుంబీకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాల సుందరం, బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘం ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ నల్లారెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు వేల్పుల జ్యోతి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పట్నం రాజేశ్వరి, దండుశేషు యాదవ్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

అవుకు రిజర్వాయర్ నుండి ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయాలంటూ ఆయకట్టు గ్రామాల
english title: 
srbc

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>