నరసరావుపేట, మార్చి 6: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలోకి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రవేశించింది. ఉదయం 11గంటలకు నియోజకవర్గంలోని ములకలూరు వద్దకు చేరుకుని గ్రామస్థులతో మమేకమై, వారితో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలను షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, మహిళలకు వడ్డీలేని రుణాలు, పింఛన్‌దారులకు 700రూపాయల పింఛన్‌ను అందజేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం మూడువేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని తమప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్ జగన్ పరిపాలన వస్తే స్వర్ణయుగం వస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు తగ్గిపోతాయని, రైతులు క్షేమంగా ఉంటారని అన్నారు. అనంతరం ములకలూరులో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకుని పాదయాత్ర చేసుకుంటూ ఇస్సపాలెం చేరుకున్నారు. గ్రామంలోని మహిళలు రోడ్లపైకి వచ్చి, ఆమెను కలిసి పలు సమస్యలను విన్నవించుకున్నారు. షర్మిల వారితో మమేకమై వారి సమస్యలను ఆలకించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితే 24గంటలపాటు విద్యుత్‌ను ప్రజలు, రైతులకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ, బీసీ జిల్లా అధ్యక్షురాలు దేవళ్ళ రేవతి, కానూరి నాగేశ్వరి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్‌కె తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇస్సపాలెం గ్రామం నుండి పాదయాత్ర చేసుకుంటూ నరసరావుపేట పట్టణ శివారులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరానికి మధ్యాహ్నం 12.45గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకుని అయ్యప్పస్వామి దేవాలయం నుండి బీసీ కాలనీ, ఇందిరానగర్, సాయినగర్, బరంపేట మీదుగా బైపాస్ రోడ్డు నుండి పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి పల్నాడు రోడ్డుమీదుగా పాదయాత్ర కొనసాగింది. పల్నాడురోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆమెప్రజలనుద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు.
* గూడా శ్రీ్ధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ
వైఎస్సార్ సీపీలో చేరిన గూడా శ్రీ్ధర్‌రెడ్డి యూత్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట పట్టణ శివారుప్రాంతంలో వైఎస్ షర్మిల బస చేస్తున్న సమయంలో సుమారు 25వాహనాలు, పెద్దఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీతో షర్మిల బస చేసిన ప్రాంతానికి వెళ్ళారు. గూడా శ్రీ్ధర్‌రెడ్డి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బనియన్లు ధరించిన యువకులు ర్యాలీలో పాల్గొనడం విశేషం.
* షర్మిల పాదయాత్రలో ఎడతెరపిలేని వర్షం
ముప్పాళ్ళ నుండి ములకలూరు, ఇస్సపాలెం మీదుగా వైఎస్ షర్మిల పాదయాత్రగా నరసరావుపేట పట్టణ శివారుకు చేరుకుని కొద్దిసేపువిశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి పాదయాత్రను ప్రారంభించిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున వర్షం కురవడం ప్రారంభించింది. వర్షంలో సైతాన్ని లెక్క చేయకుండా షర్మిల పాదయాత్రను కొనసాగించింది. షర్మిల పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
గుంటూరు (కొత్తపేట), మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకుల జీవితాలతో చెలగాటమాడుతోందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ కోతలు విధించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. నగరంలో సరఫరా అవుతున్న తాగునీటిలో మురుగునీరు కలుస్తున్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో శుద్ధమైన మంచినీరు సరఫరా చేయకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వచ్చేవారం నుండి వాడవాడలా తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పాలకవర్గం లేక మూడేళ్లు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిరాల ఇమ్మానియేలు, ఎలుకా వీరాంజనేయులు, బత్తుల సాయి, కసుకుర్తి హనుమంతరావు, ముప్పాళ్ల మురళి, నాగేశ్వరరావు, పానకాల వెంకట మహాలక్ష్మి పాల్గొన్నారు.
తాగుబోతు దాడిలో షర్మిలకు స్వల్పగాయం
నరసరావుపేట, మార్చి 6: వైఎస్ షర్మిల బుధవారం రాత్రి బహిరంగసభను ముగించుకుని యథావిధిగా పట్టణంలో పాదయాత్రను కొనసాగిస్తుండగా, మద్యం సేవించిన ఓ యువకుడు ఆమెపై రాయి విసరడంతో తలకు స్వల్పగాయమైన సంఘటన క్రిస్టియన్‌పాలెంలో జరిగింది. కర్లకుంట గ్రామానికి చెందిన గుత్తి మారుతి అనే యువకుడు మద్యం సేవించి షర్మిలపై రాయి విసరడంతో ఆమెకు గాయమైంది. దీనిపై షర్మిల ప్రైవేటు సెక్యూరిటీ మారుతిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా మందలించడంతో అక్కడే ఉన్న టూటౌన్ సిఐ కె కోటేశ్వరరావువెంటనే సెక్యూరిటీ నుండి మారుతిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ప్రశాంతంగా
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
గుంటూరు, మార్చి 6: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి 50,220 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,577 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2,685 మంది గైర్హాజరయ్యారు. బాపట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. దీంతో ఆ విద్యార్థులను డిబార్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్‌ఐఒ రూఫస్‌కుమార్, ఆర్‌జెడి జంగమయ్య పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆర్‌ఐఒ మూడు కేంద్రాలు, ఆర్‌జెడి మూడు కేంద్రాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్ 16 కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ 5 కేంద్రాల చొప్పున తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్ కమిటీ మరో ఐదు కేంద్రాలను పర్యవేక్షించారు.
గోవులను పూజిద్దాం - గోమాత సేవలో తరిద్దాం
* యజ్ఞయాగాదులు జగత్ కల్యాణదాయకాలు * జగద్గురు భారతీతీర్థ మహాస్వామి
గుంటూరు (కల్చరల్), మార్చి 6: దైవస్వరూపమైన గోమాతను పూజించడం అనాదిగా మన భారతీయ హైందవ సంప్రదాయంలో పూర్వం నుంచి కూడా మన మహర్షులే కాకుండా సాక్షాత్తు భగవంతుడే ఆచరించి చూపారని, సకల శుభాలను ఒనగూర్చే పవిత్రమైన శ్రీ గోమాతను నిత్యం పూజించి గో సంరక్షణకు పాటుపడాల్సిన బాధ్యత అందరిపై ఉందని శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి తమ అభిభాషణలో పిలుపునిచ్చారు. సంపత్‌నగర్‌లోని శృంగేరీ శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరీ దేవస్థానంలో గత ఐదు రోజులుగా విడిది చేసి అనేక ధార్మిక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న మహాస్వామి బుధవారం వేకువఝామునే తమ దైనందిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శారదా పరమేశ్వరీ దేవస్థాన ప్రాంగణంలో రూపుదిద్దుకున్న గోశాలలో కపిలగోవుతో సహా ఆరు గోమాతలకు శ్రీ భారతీతీర్థ మహాస్వామి తమ శిష్యబృందంతో ప్రదక్షిణలు గావించి వాటికి పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గ్రామ సీమలు పాడిపంటలతో విలసిల్లాలంటే అన్నింటా శుభాలను చేకూర్చే గోమాతను అర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సాదు జంతువులైన గోవులను కేవలం జంతువులుగా కాకుండా భగవత్ స్వరూపంగా భావించి వాటిని సదాసంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో గోహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటిని నివారించడానికి అందరూ కంకణబద్ధులై కృషి చేయాలన్నారు. ఆధ్యాత్మికపరంగానే కాకుండా శాస్ర్తియ దృక్పథంతో ఆలోచించినప్పటికీ గోవులు మనకెన్ని విధాలుగానో ఉపయోగపడుతూనే ఉన్నాయన్నారు. గో సంపద ఎంతగా వృద్ధి చెందితే దేశానికి అంత శుభకరమని స్వామీజీ తన అభిభాషణలో ఉద్భోధించారు. గోశాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న పోలిశెట్టి శ్యామసుందరం కంపెనీ అధినేతలు పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు, పోలిశెట్టి శ్యామసుందరంలను స్వామీజీ అభినందించారు. అనంతరం భారతీతీర్థ మహాస్వామి అతిరుద్రయాగం సందర్భంగా రుద్రపారాయణ చేస్తున్న యాగశాల వద్దకు వెళ్లి పండితులతో సంభాషించారు. యజ్ఞయాగాదులు జగత్కల్యాణ దాయకాలని స్వామీజీ స్పష్టం చేశారు. యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా తొలగి, సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. స్వామీజీ జగద్గురు ప్రవచన మందిరంలో జరుగుతున్న శ్రీ శృంగేరీ శారదాపీఠ సపరికర అద్వైత వేదాంత సభకు విచ్చేసి సుప్రసిద్ధ ఘనాపాఠీలు, వేద పండితులనుద్దేశించి సంస్కృతంలో అనర్గళంగా అభిభాషణం చేశారు.
చతురామ్నాయ పీఠాలను స్థాపించిన శ్రీ ఆదిశంకరులు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్రనామం తదితర రచనలకు సులభశైలిలో భాష్యాలను రచించారని, శంకరులు స్థాపించిన పీఠాల జగద్గురువులంతా వేదవాంగ్మయ ప్రచారానికి కృషి చేస్తూనే ఉన్నారన్నారు. ముఖ్యంగా శృంగేరీ శారదాపీఠం చతుర్వేదాలను పరిరక్షిస్తూనే ప్రధానంగా యజుర్వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని వేదప్రచారం చేస్తోందన్నారు. భారతీతీర్థుల దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు, దంపతులు విచ్చేసి స్వామివారిని సేవించుకుని, ఆశీస్సులు అందుకున్నారు.
వెనిజులాను అభివృద్ధి పథంలో నడిపించిన విప్లవ యోధుడు చావేజ్
గుంటూరు (కొత్తపేట), మార్చి 6: సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని అభివృద్ధిపథంవైపు నడిపించిన విప్లవయోధుడు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వై నేతాజీ కొనియాడారు. సిపిఎం ఆధ్వర్యంలో చావేజ్ సంతాపసభ నగరపార్టీ అధ్యక్షుడు భావన్నారాయణ అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ దేశాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం ముంపు సాగిలపడుతున్న తరుణంలో క్యూబాతో పాటు సామ్రాజ్యవాదాన్ని ఎదురించి ప్రజల పక్షాన చావేజ్ నిలిచారన్నారు. సామ్రాజ్యవాదుల సైనిక చర్యల ద్వారా చావేజ్‌ను రూపుమాపాలని ప్రయత్నించగా ప్రజాబలంతో ఆ కుట్రను తిప్పికొట్టారన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రజల సంక్షేమాన్ని మరిచిపోతున్న తరుణంలో చావేజ్ తన విప్లవ పోరాటాల ద్వారా ప్రజలను జాగృతం చేశారన్నారు. విస్తృత స్థాయిలో భూ సంస్కరణలను అమలు చేసి పేదలకు భూములు పంచారని, సోషలిజం వచ్చినప్పుడే ప్రజలంతా సుఖంగా ఉండగలరని ఆయన సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పి నరసింహారావు, పి రామారావు, రాష్ట్ర నాయకులు వేణుగోపాలరావు, ఎన్ కాళిదాస్, నాగేశ్వరరావు, సుధాకర్, అజయ్‌కుమార్, ఎండి అక్బర్, ఎల్ అరుణ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా
గుంటూరు (కొత్తపేట), మార్చి 6: రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా టిఎన్‌టియుసి నగరంలోని భజరంగ్ జూట్‌మిల్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిఎన్‌టియుసి ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఒక్క నిముషం కూడా విద్యుత్ కోతలు లేకపోవడంతో పెద్దపెద్ద పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి తరలిపోతున్నాయని, రాష్ట్రంలో విద్యుత్ కోతల వలన 30 వేల పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. జిల్లా టిఎన్‌టియుసి ఉపాధ్యక్షుడు నారా జోషి మాట్లాడుతూ పవర్ హాలిడేలు, విద్యుత్ కోతల వలన చిన్న పరిశ్రమలు విపరీతమైన నష్టాలకు లోనై చివరకు మూతపడుతున్నాయన్నారు. విద్యుత్‌పై రాష్ట్రప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వలనే 20 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని, విద్యుత్ లేక జనరేటర్లు కొనే స్తోమతలేని చిన్న పరిశ్రమలన్నీ దివాలా తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎ రమేష్, చింతమణి మోహనరావు, అబ్రహం, ఎన్‌ఎల్ మోహనరావు, ఎ ఆంజనేయులు, కె వెంకటేశ్వరరావు, వై మోహనరావు, వి వెంకయ్య, ఎ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భృంగి వాహనంపై మల్లేశ్వరుని గ్రామోత్సవం
మంగళగిరి, మార్చి 6: స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుగ