అందుకే అవినాష్ ముందుకు సాగేందుకు వెరచి ఆగిపోయాడు.
కానీ జీవనకు సంబంధించిన ఒక జీవిత రహస్యం తనకు తెలిసిపోయినట్లనిపించింది.
***
కోలుకుని లేచి తిరగడం మొదలెట్టాక జీవనకు గుర్తొచ్చింది, డాక్టర్ ఫీజ్, మెడిసిన్స్ అవినాష్ పే చేశాడని.
వసంతతో ఆ విషయం చెప్పింది.
‘‘అతన్ని కాంటాక్ట్ చేసి థాంక్స్ చెప్పి డబ్బు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది’’ అంది వసంత.
అతన్ని కాంటాక్ట్ చేయాలంటే ఆఫీసు తప్ప ఇంకోదారి కనిపించలేదు. ఇబ్బందిగానే ఆఫీసుకు ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతుంటే ‘‘అవినాష్ తీస్తే బావుండు, అవినాష్ తీస్తే బావుండు’’ అని గొణుక్కుంది గబగబా.
కానీ రంగారావుగారే తీసారు ‘హలో’ అని అతననగానే కొంచెం బిడియపడింది. తనేదో అవినాష్ మీద కక్షపట్టి సాధిస్తున్నట్లు అతననుకుంటున్నందుకు గిల్టీగా ఫీలయ్యింది.
‘‘హలో రంగారావుగారూ అవినాష్‌గారు ఉన్నారా?’’ అడిగింది మెల్లగా. గుర్తుపట్టేశాడామెను.
‘‘ఏమ్మా బాగున్నావా? అవినాష్ రాలేదమ్మా. సిక్‌లీవ్‌లో ఉన్నాడు’’ అని చెప్పేసరికి కొంచెం కంగారనిపించింది జీవనకు.
‘‘హెల్త్ బాలేదాండీ’’ అడిగింది.
‘‘సిక్‌లీవ్ అర్థం అదే కదమ్మా’’ అన్నాడు.
‘‘కొంచెం అతని రెసిడెన్స్ అడ్రస్‌ఇవ్వగలరా’’ అడిగింది.
‘‘ఏమ్మా అతని మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతీద్దామనా?’’ ఎదురు ప్రశ్న వేశాడు. జీవన అంటే చాలు అతనికి కొట్టే కారెక్టర్ తప్పితే ఏవీ అనిపించడంలేదు. ఆయన్ని కన్విన్స్ చేస్తూ ‘ప్లీజ్’ అంది. కాస్త మెత్తబడి అడ్రస్ చెప్పాడాయన, రాసుకుంది. పక్కనే ఉన్న వసంత ‘‘ఆఫీసులో లేనట్టున్నాడుగా’’ అంది.
‘‘అవునమ్మా సిక్ లీవ్‌లో ఉన్నార్ట’’ అని కాసేపు ఆగి.
‘‘అమ్మా.. నేను అవినాష్‌ను కలిసివస్తాను’’ అని అనలేకపోయింది. అమ్మా.. లైబ్రరీకి వెళ్ళొస్తానీ రోజు’’ అంది వసంతతో. ఎంత క్లోజ్‌గా ఉన్నా మనసుకు నచ్చిన అన్ని విషయాలు తనతో చర్చించాలని తెలిసినా ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయిందో తనకే తెలీదు.
‘‘అవును! ఇంట్లో ఊరికే ఉండడం బోర్‌గా ఉందేమో. జాబ్‌కు వెళ్ళేవరకూ ఏదో ఒక ఎంగేజ్‌మెంట్ ఉండాలిగా వెళ్ళు. కానీ తొందరగా వచ్చేయ్. ఒకవేళ లేటెయ్యేలా ఉంటే ఫోన్ చేసి ఇన్‌ఫాం చెయ్యి’’ లేకపోతే నాకు కంగారుగా ఉంటుంది’’ అంది వసంత.
‘‘సరే’’నని తలూపి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చింది. హాండ్‌బాగ్‌లోంచి అవినాష్ అడ్రస్ చూసుకుంది. హాండ్ బాగ్‌లోంచి కొంత డబ్బు తీసి చుట్టూ చూసింది కవరేదయినా కనబడుతుందేమోనని.
ఎక్కడా కనిపించలేదు.
వంగి టీపాయ్ మీద పేపర్స్ మీద ఒక కవర్ తీసి పైన చూసి ఖాళీగా ఉండడంతో కొంత డబ్బు అందులో పెట్టింది అవినాష్‌కివ్వడానికి, మెల్లగా బయలుదేరింది.
***
చేతిలోని అడ్రస్ కాగితం చూసి డోర్ నెంబరు సరిచూసుకుంది జీవన.
బెల్‌మీద వేలు పెట్టబోతూ కాసేపు తటపటాయించింది.
‘‘ఇంటికొచ్చినందుకు చీప్‌గా అంచనా వేయడు కదా’’ అనుకుంది.
‘‘ఏవయినా అనుకోనీ.. తనకు చెయ్యాలనిపించింది చేస్తుందంతే’’ బింకం తెచ్చేసుకుంది.
బెల్ కొట్టి డోర్‌కు కొంచెం పక్కకు తప్పకుంది. డోర్ తీసిన అవినాష్ ఉక్కిరిబిక్కిరయ్యడు.
‘‘మీరా?’’ అని అలాగే నిలబడిపోయాడు.
‘‘మీరు హాస్పిటల్లోవాడిన మనీ ఇచ్చి, థాంక్స్ చెబుదామని వచ్చాను’’ అంది తనెందుకు వచ్చిందో తెలియజేస్తూ. తను రావడానికి ఒక కారణం ఉందని అనిపించేందుకు.
‘‘ఓ.. ప్లీజ్.. లోపలికి రండి. సడెన్‌గా చూసేసరికి నేను వండరయిపోయాను’’ అని పక్కకు తప్పుకుని లోపలికి చూపించాడు చేయి.
‘‘కానీ ఒక రిక్వెస్ట్’’ అన్నాడు.
‘‘రిక్వెస్టా?’’ అడిగింది.
‘‘అవును! బ్రహ్మచారీ శతమర్కటం అన్నారు కదండీ. నా రూమ్ చూసి మీరు వెక్కిరించకూడదు’’ అని ఎదురుగా ఉన్న కుర్చీ మీద బట్టలు తీసి స్టాండు మీద కేసి, బెడ్‌మీది పుస్తకాలన్నీ టకటకా తీసి ఒక మూలకు కుప్పగా పడేసి, టీపాయ్ మీది న్యూస్ పేపర్స్‌ని చుట్టగా చుట్టి మంచం కింద తోసి ‘కూర్చోండి’ అని కుర్చీ చూపించాడు.
కూర్చోబోతుంటే.. ‘‘ఆగండాగండీ నిన్న చైర్ కొంచెం బాలెన్స్ తప్పింది, ఎందుకయినా మంచిది మీరు బెడ్‌మీద కూర్చోండి’’ అని బెడ్‌షీట్ సవరించి చెప్పాడు.
‘‘మీరొక్కరే ఉంటారా ఈ రూమ్‌లో’’ కాజువల్‌గా అడిగింది.
‘‘్భలేవారే ఒక్కణ్ణే ఉండడానికి నేనేమయినా రాయినా? జీవినండీ బాబూ జీవిని! ఏ జీవయినా సరే తనకు సంబంధించిన జీవాలతో కలిసి ఉండాలనుకుంటుంది, కానీ ఒంటరిగా ఉంటుందేవిటండీ?’’ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ.
క్వొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది జీవన.
‘‘ఓ ఎవరని ఆలోచిస్తున్నారా? నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, అష్టదిగ్గజాలు, దిషునిఖాయ్ అంటే బుద్ధుడు, శంకరాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, చలం, గురజాడ అప్పారావు, రాయప్రోలు, కృష్ణశాస్ర్తి, శ్రీశ్రీ, సినారె ఇంకా... ఆ లేడీస్ కూడా ఉన్నారండీ. మొల్ల, ముద్దుపళని, యద్దనపూడి సులోచనా రాణి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, లత, ఇంకా.. ఒఫ్ బోల్డుమంది చూడండీ.. అటు చూడండీ.. అందరూ ఎంచక్కా ఎవరి రాక్‌లో వాళ్ళు కూర్చున్నారో మేమందరం కలిసిమెలిసి జీవిస్తామండీ’’ అన్నాడు బుక్‌రాక్‌వైపు చూస్తూ...
ఒకోసారి ఒకరి సిద్ధాంతాలు ఒకరికి పడక అర్థరాత్రిలో వాగ్వివివాదాలు జరుగుతాయండి. అన్ని సిద్ధాంతాలూ బలమైనవే కనుక ఎవరూ గెలవరు. ఎవరూ ఓడిపోరు. అయినా మరుసటి రోజు కొత్త పాయింట్స్‌తో మళ్ళీవాదన మొదలవుతుంది.
-ఇంకాఉంది
అందుకే అవినాష్ ముందుకు సాగేందుకు వెరచి ఆగిపోయాడు
english title:
amma - 36
Date:
Wednesday, March 13, 2013