‘‘ఓ సీతా! వేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరించి పరమేష్ఠిని మెప్పించి, అతనిచే మేటి వరాలు పడసినవాణ్ణి. సురాధినాథుణ్ణి ఓడించాను. నీలకంఠుడితోడి కైలాసాన్ని ఊపివేశాను. ఊర్థ్వలోకాలు సాధించాను. పాతాళాధిపుణ్ణి జయించాను. ఈ విధంగా సర్వోన్నతుణ్ణి అయి సడిగన్న నన్ను వెంగలితనంతో తన తండ్రి వెడలత్రోయగా అతి హీన బలుడై కారడవుల్లో మునుల బతిమాలి పండ్లుతిని పర్ణములు నమిలి, వికృత శరీరుడై- తపోవృత్తితో జీవించే ఒక నిరుపేద మానవుడు, ఒక బడుగు నన్ను తునుమాడనేర్చునా?’’ అని రామ విభుణ్ణి నిందించాడు.
అప్పుడు జానకి ములుకులవంటి ఆ పలుకులు ఆలకించి, మదిని వ్యథతో కుంది, శోకం అతిశయిల్లగా వెక్కి వెక్కి యేడ్చింది. దేవగంధర్వ యక్ష సతులు సయితము ధృతి కోల్పోయి జానకిని కాంచి వలవల దుఃఖించారు.
అపుడు రావణుని దర్పము, సీతాదేవి శోకము భావించి, కోప తాపాలు అతివేలం కాగా హనుమంతుడు ఆ దుష్ట రాక్షసుడిమీదికి దుముక యత్నించి అంతలోనే అంతరంగంల ఈ క్రియ తలపోయసాగాడు.
‘‘బిరుదమగడినై మగటిమితోఈ లంకాధిపతిని సంహరించినట్లయితే రామ విభుడికి జానకి జాడ క్షేమ వార్త తెలుపగలను కాని దనుజుడి చేత నేను అసువులు బాసినట్లయితే లంకకు తెరువు తెలియలేక, సీతాదేవి ఈ లంకలో నెవ్వగల పొగులుతున్న విషయం ఎరుగలేక రామవిభుడు దుఃఖాల పాల్పడగలడు. నేను మరణించినట్లు తెలుసుకొంటే సూర్య వంశాగ్రేసురుడు ప్రాణత్యాగం కావిస్తాడు. ఇంతగా చిక్కులు పడి కష్టములకు ఓర్చి చేసిన కార్యం సమస్తమూ మధ్యలోనే చెడిపోతుంది.
అందువల్ల శక్తుడను అయి వుండిన్నీ, పంతము పూని ఈ దైత్యుడితో కయ్యము సల్ప యిది సమయం కాదు. ఒకవేళ రావణుణ్ణి మార్కొని పోరాడినా గెలుపు నిశ్చయం కాదు. కనుక ఈ దానవాధిపుడు మరలి యేగిన పిమ్మట సీతాదేవి దర్శనం చేసుకొని పిదప కాగల కార్యాలు చక్కపెట్టుతాను’’ అని ధైర్యం తెచ్చుకొని ఆ తరుశాఖమీద మిన్నక వుండిపోయాడు.
రావణుడు కామము, ప్రేమము, మోహము, వెరపు వెరగు కదర పలికిన వాక్కులన్నిన్నింటికి జానకీదేవి ఆ రాక్షసాంగనలు అందరూ ఆలకించుతూ వుండగానే అతి నిష్ఠుర వాక్కులతో దూషించింది. తగవు కరపింది.
రాక్షసేశ్వరుడంత కుటిల భావంతో భ్రుకుటులెత్తి చటుల రక్తాస్యుడై- జ్వాజ్వలమానమైన ఆ భీల ప్రళయాగ్ని కరణి- ఆగ్రహంతో మండిపడుతూ హుంకరించి, నయదూరుడై సీతాదేవిని భర్జించి, కరమందలి చంద్రహమెత్తి ఆమెను ఖండింప పూనుకొనడం కని మండోదరి రావణుడికి అడ్డమై కేలుపట్టుకొని, కుమతి అయిన విభుడితో సుమతియై ఈ వడువునవాకొంది.
మండోదరి రావణునకు నీతి తెల్పుట
‘‘ప్రాణేశ్వరా! ధరణీశ్వరుడు రామచంద్రుడు పౌరుషంతో నిన్ను హతమార్చుతాడని ఈ సీత ఎన్ని బుద్దులు కరపినా వినవేమి? నేనేమి చేయనేరుస్తాను? నిన్ను నిందింప పని యేమి? నీ పురాకృత కర్మ ఫలం నిన్ను కట్టి కుడుపుతున్నది,. ఇంతకు మా నుదుటి వ్రాతలు ఏ రీతినున్నవో?
నువ్వు పరసతిని మ్రుచ్చిలికొని తేవడం ఒక పాపం. ఈ అకార్య కరణంతో భువిలో నిందలు పాలు కావడం రెండవ పాపం. సీతాదేవిని తెగించి తెచ్చినది మొదలు ఆమెపై పడగొనడం మూడవ పాపం. దుర్బుద్ధివై ఆ స్ర్తిని బలిమిని అనుభవిస్తానని తలచడం నాల్గవ పాపం. పలు తడవులు అనరాని వినరాని మాటలు అనడం అయిదవపాపం. మనస్సులోని కామాన్ని అణచిపెట్టుకొనలేక ఆమెను చంపబోవడం ఆరవ పాపం. పాడి పాటింపక చేయరాని కృత్యం చేసి ప్రగల్భాలాడడం ఏడవ పాపం. ఈ పుణ్యసతి కారణంగా నీకు ఏడు పాపాలు సంభవించాయి. ఈ శరీరము పాతకముల పుట్టక.
-ఇంకాఉంది
ఓ సీతా! వేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరించి పరమేష్ఠిని
english title:
ranganatha ramayanam -167
Date:
Wednesday, March 13, 2013