యజ్ఞము అను శబ్దము ‘యజ పూజాయాం సంగతి కిరణ దానయోః’ అను ధాతువుననుసరించి, పూజించుట దానము చేయుట అను అర్థము కల్గియున్నది. యజ్ఞముల వలన దేవతలు తృప్తినొందుదురు.
తృప్తినొందిన దేవతలు ఇష్టకామ్యముల నొసగందురు. ఈ దృష్టితో యజ్ఞములనాచరించి, దేవానుగ్రహమును సంపాదించి, పాడి పంటలు అన్నపానాదులు కల్గచేసి రాజ్యములను సుభిక్షముగా పరిపాలించిన రాజవంశములు అనేకములు కలవు.
ప్రాణులు అన్నమువలననే ఉద్భవించుచున్నవి. వర్షమువలన అన్నము ఉత్పత్తి యగుచున్నది. వర్షములు యజ్ఞములవలన కల్గుచున్నవి. యజ్ఞములు కర్మ సముద్భవములు అని భగవద్గీత యజ్ఞ్ఫలాలను పేర్కొన్నది.
అష్టవిధ ధర్మములలో యజ్ఞము మొదటిది. జగత్ ప్రతిష్ఠకు ధర్మమే ఆధార భూతము. ‘్ధర్మోవిశ్వస్య భగవతః ప్రతిష్ఠా’ అని వేదముల ధర్మము యొక్క ఆవశ్యకతను తెలుపుచున్నవి. రాజ్యమును సముచిత స్థితిలో పరిపాలింపవలెనన్న రాజులు మొదట తాము యజ్ఞాచరణ ద్వారా ధర్మమును నిర్వహించి ప్రజలను ధర్మమువైపు నడిపించేవారు. ధర్మాసక్తిని పెంపొందించేవారు.
యజ్ఞములు నాల్గు విధములు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము. యోగయజ్ఞము. సాధ్వాయజ్ఞాన యజ్ఞము. మానవుడు ఫలాపేక్ష రహితముగా, ధర్మసిద్ధముగా న్యాయార్జితమైన ధనముతో చేసిన దేవాలయాదులను కట్టించుట, చెఱువులను తవ్వించుట, వనములను, తోటలను పెంచుట, చదువులను నేర్పించుట, వివాహాదులను గావించుట, ఆరోగ్యశాలల నేర్పరచుట విద్యాలయముల స్థాపించుట, గోగణములు పెంచి గోవుల దానముల చేయుట మొదలగునవి ద్రవ్యయజ్ఞములు.
ఇంద్రియ నిగ్రహముగలవారై పరద్రవ్యము నాశించక భగవత్సాక్షాత్కారము కొఱకై వ్రతముల నాచరించుట, ఉపవాసములుండుట, జీవకారుణ్యము కల్గియుండుట నామజపమును చేయుట మొదలగునవి తపోయజ్ఞములు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనబడు అష్టాంగ యోగాభ్యాసము ద్వారా జీవాత్మ పరమాత్మలను ఐక్యానుసంధానము చేయుట యోగ యజ్ఞము.
వేద పురాణ ఇతిహాసములను ఉత్తమ గ్రంథములను అర్థముతోపాటు చదివి ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదించుట స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమనబడును. ఇవన్నియు మానవులు స్వశక్తికొలది ఆచరింపదగిన యజ్ఞములు. వీటిని ఆచరించుటయే ధర్మము.
మనకు పురాణ ప్రసిద్ధమైన రాజవంశములకు మూలములు సూర్యచంద్ర వంశములు. సూర్యవంశమునకు చెందిన రఘువంశములో ప్రసిద్ధులైన రాజులు దిలీప మహారాజు, రఘుమహారాజు, అజమహారాజు, దశరథమహారాజు, శ్రీరామచంద్రుడు మొదలైనవారు ధర్మాభినివేషులై యజ్ఞములనాచరించిరి. ప్రజల యొక్క సుఖ శాంతులకై సంక్షేమము కొరకై ద్రవ్య వినిమయమాచరించి త్యాగధనులనిపించుకున్నారు.
కవికుల తిలకుడైన కాళిదాస మహాకవి రఘువంశ కావ్యములో, నీతి ధర్మ పరాక్రమములు గలవారు రఘువంశీయులు. రఘు మహారాజు యజ్ఞములకొరకై భూమని దోహదము చేసినాడు (పితుకుట) భూమాత వలన లభించిన ద్రవ్యమును యజ్ఞముల నాచరించుటకై వినియోగించి దేవతలను తృప్తిపరచినాడు. ఇంద్రుడు సస్యముకొరకై స్వర్గదోహనముచేసాడు.
ఈ విధముగా రఘు మహారాజు తాను నిర్వహించి యజ్ఞ్ఫలాలను ఇంద్రునకు ఇంద్రుడుత్పత్తి చేసిన సస్యమును రఘు మహారాజునకు ఇచ్చుకొని పరస్పరము వారి వారి సంపదలను వినియోగము చేసినారు. ఏతావతా రఘు మహారాజు ప్రజల అన్నపానములకు కొఱత రాకుండుటకై యజ్ఞముల నిర్వహించినట్లు తెలియుచున్నది.
యజ్ఞము అను శబ్దము ‘యజ పూజాయాం సంగతి కిరణ దానయోః’
english title:
yagnam - yagna phalam
Date:
Wednesday, March 13, 2013