కర్నూలు, మార్చి 13: విద్యుత్ సంక్షోభం పేరుతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ట్రాన్స్‌కో అధికారులు నీటి వ్యాపారులకు మాత్రం నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. గృహ వినియోగదారులకు ఉన్న నిబంధనలే వీరికి వర్తించడంతో ప్రతి రోజూ లక్షల రూపాయల నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వాల్టా నిబంధనలకు విరుద్ధంగా పక్కపక్కనే బోర్లను వేసి నీటిని నిరంతరాయంగా తోడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తూ వారికి విద్యుత్ శాఖకు చెందిన అధికారులు సహకరించడాన్ని ప్రజలు మండిపడుతున్నారు. కర్నూలు నగరంలో ఏర్పడిన నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రజలు ప్రైవేటు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఉచితంగా నీటిని సరఫరా చేయాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ఆ పని చేయకపోవడంతో ప్రజలు నీటికోసం ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడుతున్నారు. ఉచిత నీటి సరఫరా విషయంలో నామమాత్రంగా స్పందించే అధికారులు సరఫరాచేసే నీటిలోనూ నియంత్రణ విధించడం గమనార్హం. అయితే ప్రైవేటు వ్యాపారులకు నీటికోసం సొమ్ము చెల్లిస్తే ఎన్ని ట్యాంకర్లయినా నిమిషాల్లో సరఫరా చేస్తున్నారు. నగరంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఒకేచోట నాలుగైదు బోర్లువేసి నీటిని తోడుతున్నారు. జాతీయ రహదారి పక్కనే అందరూ చూస్తుండగానే వ్యాపారులు చేస్తున్న ఈ వ్యవహారాన్ని అధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వేసిన బోర్లు, వాటి నుంచి భారీ మోటార్ల సహాయంతో నీటిని తోడుకోవడం కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహాలకు చెందిన బోర్లు, నగర పాలక సంస్థ వేసిన బోర్లలో నీరు ఇంకిపోయే పరిస్థితి ఎదురవుతోంది. దాంతో వారంతా నగర పాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేసే నీటిపై ఆధారపడాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. సమయపాలన లేకుండా రెండు రోజులకు ఒకసారి గంట పాటు నీటిని సరఫరా చేస్తుండటంతో నీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాల్టా నిబంధనల ప్రకారం ఒక బోరుకు మరో బోరుకు కనీసం 250 గజాల దూరం ఉండాలన్న నిబంధన పాటించకుండా నగరంలో అనేకచోట్ల బోర్లను వేసి నీటి వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతులకు సరఫరా చేసే విద్యుత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోజుకు నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయలేని ప్రభుత్వం నీటి వ్యాపారులకు రోజూ కేవలం నాలుగు గంటల కోత విధించి 20 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటం విశేషం. గృహ సముదాయాల పక్కనే నగరం మధ్య ఒకే చోట పక్కపక్కనే బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షలు ఆర్జిస్తుంటే అధికారులు వౌనం దాల్చడం వెనుక ఆంతర్యం అర్థం చేసుకోలేని స్థితిలో లేమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో జోరుగా సాగుతున్న నీటి వ్యాపారంపై రెవెన్యూ, ట్రాన్స్‌కో తీసుకునే చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఎండిన నదులు
ఆదోని, మార్చి 13: ఆదోని డివిజన్‌లో అనేక గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే తుంగభద్ర, హగరి, హంద్రీ నదులు మూడునెలలు ముందుగానే ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. నదీతీరాప్రాంతాల ప్రజలకు తాగునీరు, సాగునీరు కరువైపోయింది. పంటలకు నీరు లేని పరిస్థితి ఏర్పడిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశువులకు కూడ నీరు లేని పరిస్థితి ఏర్పడింది. తాగునీటి కోసం నదీతీరప్రాంతాల ప్రజలు గుంతలు తవ్వి రాత్రి, పగలు నీటికోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాలేదని, నదీతీర ప్రాంతాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి నదులలో మే మొదటివారం వరకు అక్కడక్కడ గుంతల్లో నీరు ఉండేవి. తుంగభద్ర నదిలో మే చివరి వరకు కూడ ఒక పాయమాదిరిగా నీరు ప్రవహిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. తుంగభద్ర నది కౌతాళం మండలంలోని మేళిగనూరు, కుంబళనూరు, నదీచాగి, వల్లూరు, గుడికంబాళి, మరళి, కోసిగి మండలంలోని ఆగసనూరు, కందకూరు, లక్ష్మిపురం, మంత్రాలయం మండలంలోని తుంగభద్ర, తుంగభద్ర ఆర్‌ఎస్, మాధవరం తాండ, మాధవరం, రాంపురం, చట్నేపల్లి, సూగూరు, మంత్రాలయం, నందవరం మండలంలోని నదీకైరవాడి, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, పూలచింత, గురుజాల, మిట్టాసోమాపురం, నాగలదినె్న, రాచోటి, గంగవరం గ్రామాల నదీతీర ప్రాంతాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందిస్తోంది. తుంగభద్ర నది అనుసంధానంతో రాంపురం కెనాల్, తుంబిగనూరు ఆనకట్టద్వారా దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే హగరి నది పరివాహక గ్రామాలైన కోగిలతోట, ముద్దటమాగి, మార్లమడికి, వల్లూరు, నాగరకన్వి, హాలహర్వి మండలంలోని బన్నూరు, అమృతాపురం, సిద్దాపురం, గూళ్యం, జంగమరహోసళ్ళి, శిరగాపురం గ్రామాలకు తాగునీటితోపాటు శ్రీ్ధర్‌హాళ్, మార్లమడికి, కోగిలతోట, బళ్లూరు ఎత్తిపోతల పథకాలకు హగరినీరే ఆధారం. హంద్రీ నది పరివాహక గ్రామాలైన కనకదినె్న, వలగొండ, పందికోన, కొత్తపల్లి, మద్దికెర, బురుజుల, హోసూరు, చిన్నకొత్తిలి, పెద్దకొత్తలి, మదనంతపురం, అలారుదినె్న, తెర్నేకల్లు, బన్నూరు, పుటకలమర్రి, ముత్తుకూరు, పొట్లపాడు, బైలుప్పుల, కారుమంచి, కూంకనూరు గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. ఇలాంటి మూడు నదులు కూడ మూడు నెలలు ముందుగానే ఎండిపోయి ఎడారులు తలపిస్తున్నాయి. మంత్రాలయంలో నది పూర్తిగా ఎండిపోవడంతో రాఘవేంద్రస్వామి దర్శనం చేయడానికి వచ్చిన భక్తులకు నది స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంత్రాలయంలోని రెండు రోజులకొక్కసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంకా గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎత్తిపోతల పథకాలతోపాటు నదులలో గుంతలు తవ్వి మోటర్ల ద్వారా పంపింగ్ చేసుకోవడానికి కూడ నీరు లేని పరిస్థితి నెలకొంది. కనీసం అక్కడక్కడ గుంతల్లో కూడ నీరు ఊరటంలేదు. ఈ పరిస్థితి హగరి, హంద్రీ నదుల ప్రాంతాల్లో కూడ చోటు చేసుకొంది. హంద్రీ నదిపై వందలాది ఎకరాల్లో పంటలువేసుకొని ఆ నీటితో మోటర్లు పెట్టుకొని నీళ్లు కట్టుకొని పంటలు పండించే పరిస్థితి ఈ సంవత్సరం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో నది నీటి ఆదారంతో ఏర్పాటు చేసిన పథకాలకు నీటి వనరుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రజలు నదులలో నీరు లేకపోవడంతో గుంతలు తవ్వి చిన్న చిన్న గ్లాసులతో బిందెల్లో నీరు తోడుకునే పరిస్థితి నెలకొంది. ఈవిదంగా నదులన్ని ఎండిపోవడంతో నదీతీర ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం, సాగునీటికోసం పడరానిపాట్లుపడుతున్నారు. తుంగభద్ర నది ఆధారంగా కౌతాళం మండలంలో నిర్మించిన నెదర్లాండ్ పథకానికి కూడ నీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. అందువలన చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన నీటికటకటను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని నదీతీర ప్రాంతాల ప్రజలకు, నదుల నీటితో నిర్మించిన నీటి పథకాల గ్రామాలకు తాగునీరు అందించడానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓవైపు కోత... మరోవైపు మోత!
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 13: కోతలతో ఇబ్బంది పెడుతూనే మరోవైపు విద్యుత్ సర్‌చార్జీల వసూలుకు ప్రభుత్వం ఆమోదం వ్యక్తం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి ప్రస్తుత మార్చి వరకు విద్యుత్ వినియోగదారులు వినియోగించిన విద్యుత్‌పై సర్‌చార్జీని వచ్చే ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల బిల్లు వరకు ప్రజల నుంచి అదనపు భారం వేయనున్నారు. దీని కారణంగా సగటున ఒక్కో యూనిట్‌కు వినియోగదారులు 62పైసలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. గతంలో సర్‌చార్జీల వసూలులో 100 యూనిట్లకు లోపు వినియోగించే వినియోగదారులపై భారాన్ని మోపకూడదని ప్రభుత్వం నిర్ణయించి ఆ తరువాత ఉపసంహరించుకోవడంతో పేదలపై కూడా సర్‌చార్జీ భారం పడుతోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు విద్యుత్ సరఫరాలో కోతలు తగ్గించి మరింత నాణ్యమైన పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సర్‌చార్జీ వసూలుకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజావసరాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని భగ్గుమంటున్నారు. రాత్రి వేళల్లో కోతలు విధించవద్దని స్వయానా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించినా ఆచరణలో మాత్రం అమలులో లేకుండా పోయింది. గ్రామాలు, మండల కేంద్రాల్లో రాత్రి వేళల్లో మూడు గంటల కోత విధిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాత్రి వేళల్లో కోతలు విధించవద్దన్న ప్రజల డిమాండ్ గాలిలో కలిసిపోయింది. అయితే గతంలో వినియోగించిన విద్యుత్‌కు ఇపుడు సర్‌చార్జీల రూపంలో బిల్లులు చెల్లించాల్సి రావడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అశ్వవాహనాధీశులైన భ్రమరాంబిక, మల్లికార్జునుడు
శ్రీశైలం, మార్చి 13: శ్రీశైల మహా క్షేత్రంలో 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివార్లను అశ్వ వాహనంపై అశీనులనుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల యాగాలకు పూర్ణహుతితో ముగింపు పలికడంతో చివరి రోజున ఆలయ దక్షణ ద్వారం వద్ద అశ్వవాహనం పై భ్రమరాంభిక, మల్లికార్జున ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజాదికాల అనంతరం ఆలయ ప్రాంగణములో ప్రదక్షిణలు నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు రాత్రి 8.30 లనుండి ఏకాంత సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల పుష్పాదులతో స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవాన్ని, శయనోత్సవాన్ని ఆలయ ప్రాంగణములో వున్న అద్దాల మండపంలో శాస్త్రోత్త పూజలతో మంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఎఇవో రాజశేఖర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.