Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆమడదూరంలో లక్ష్యం

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం)
లక్ష్యాలు అధిగమించండని ముఖ్యమంత్రి నుంచి జిల్లా అధికారుల బాస్ వరకు సమీక్షల్లో పదేపదే సార్లు మొత్తుకున్నా వాటి ప్రగతి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు 15 రోజులే గడువు ఉన్నప్పటికీ చాంతాడులా ఉన్న లక్ష్యాలు అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇందిరమ్మ, రచ్చబండ పథకాల్లో 25,000 నిర్మించాల్సి ఉండగా 16,500 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు పూరె్తైన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేపట్టడం వల్ల త్వరితగతిన లక్ష్యాలకు చేరువకాగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముంచుకురావడంతో మిగిలిన లక్ష్యాలు ఎలా చేరుకుంటారో అధికారులకే ఎరుక. ఇదిలా ఉండగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం లక్ష్యాలు కూడా ఆశించిన స్థాయిలో జాబ్‌కార్డుదారులకు ఉపాధి కల్పించలేకపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 4.80 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఈ ఏడాది 360 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టి కూలీలకు వందరోజులు, 150 రోజులు పనికల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు 324 కోట్ల నిధులు మాత్రమే ఉపాధి హామీ పనులకు వెచ్చించినట్లు అధికారులు స్పష్టంచేస్తున్నారు. 1.17 లక్షల కుటుంబాలకు వందరోజులు పని కల్పించగా 25 వేల కుటుంబాలకు 150 రోజులు పనికల్పించారు. సుమారు రెండు లక్షల పైచిలుక కుటుంబాలకు వందరోజులు, 150 రోజుల పనికల్పించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు వ్యవధి తక్కువగా ఉండడం వల్ల ఉపాధి లక్ష్యాలు ఎండమావిగా మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా నుంచి వందలాది మంది పొట్టచేతపట్టుకుని పరాయి ప్రాంతాలకు వలసబాట నిత్యకృత్యంగా మారినా అధికారులు మాత్రం ఉపాధిహామీని అందరికీ వర్తింపజేయడంలో వెనుకబడి ఉన్నారనడానికి కేటాయింపులు వెచ్చించలేకపోవడం ఓ తార్కాణం. నిర్మల్‌భారత్ పురస్కార్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ లక్ష్యాలను జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అమలుచేయాలని ప్రణాళిక రూపొందించినా క్షేత్రస్థాయిలో ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతీమండలం నుంచి 2,500కు తక్కువ లేకుండా నిర్మాణాలు చేపట్టి సుమారు లక్ష మరుగుదొడ్లు జిల్లా వ్యాప్తంగా నిర్మించాలని అధికారులు భావించారు. ఒక్కో మరుగుదొడ్డికి 9,100 ఆర్థిక సహాయమందించేందుకు అధికారులు సమాయత్తమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వీటి వినియోగాలపై సరైన అవగాహన కల్పించలేకపోయారు. దీని కారణంగానే ఆదిలోనే లక్ష్యాలకు హంసపాదు పడింది. లక్ష మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 15 వేల మరుగుదొడ్లను మాత్రమే నిర్మాణాలకు నోచుకోవడం విశేషం. రాజీవ్ యువకిరణాలు విషయానికొస్తే...గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కార్యక్రమాల్లో శిక్షణలు అందించి వారందరికీ ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలని పలు శిక్షణా కేంద్రాలను ఇందిరక్రాంతి పథం అధికారులు ఆరంభించారు. అయితే అరకొర శిక్షణ, అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లో తక్కువ వేతనాలతో ప్లేస్‌మెంట్ అందిస్తున్నారన్న అపవాదును యువకిరణాల అధికారులు ఎదుర్కొన్నారు. దీనిప్రభావంతో గ్రామీణ ప్రాంతాల యువత కిరణాల వైపు కనె్నతె్తైనా చూడకపోవడంతో వేల సంఖ్యలో నిరుద్యోగులున్నప్పటికీ వందల సంఖ్యలోనే అభ్యర్థులు శిక్షణతో సరిపెట్టుకోవడంతో ఈ పథకం ప్రచారానికి పరిమితమైందని చెప్పాలి.

విద్యుత్‌కోతలపై రైతన్న కనె్నర్ర
కవిటి, మార్చి 13: విద్యుత్ కోతలకు నిరసనగా రైతన్నలు కనె్నర్ర చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యుత్‌ను అందించక పోవడంతో చేతికొచ్చే పంట పూర్తిగా నాశనం అవుతుందని, విద్యుత్‌ను ఆటంకం లేకుండా సరఫరా చేయాలంటూ మండలంలోని మాణిక్యపురం, బల్లిపుట్టుగ, కుసుంపురం, బి.గొనపపుట్టుగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, జగతి తదితర గ్రామస్థులు బుధవారం బొరివంకలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆగ్రాహావేశాలతో సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. గత కొన్ని రోజులుగా వేళలు పాటించకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తుండటంతో పొట్ట దశలో ఉన్న వరి పంట పూర్తిగా పాడైపోతుందంటూ పలుసార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు మండిపడ్డారు. గతంలో కూడా ధర్నాలు చేసినప్పుడు అధికారులు మాయ మాటలతో తమను మభ్యపెట్టి వెనక్కి పంపిస్తున్నా, సమస్యను మాత్రం తీర్చడం లేదని
ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ వద్ద నినాదాలు చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఎఇ వీర్రాజు రైతులను సద్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ఎడి వచ్చి లిఖిత పూర్వక హామీ ఇస్తే వెనుదిరుగుతామని భీష్మించారు. అప్పటికే గంట పాటు నిరీక్షించిన రైతులు ఎదురుగా గల ఎస్‌కెఇ వద్ద బైఠాయించారు. సుమారు గంట పాటు బైఠాయించడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విషయాన్ని అధికారులు ఉన్నతాధికారులకు చేరవేయడంతో సోంపేట ఏడీ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయ త్నం చేశారు. అయినా రైతులు ససేమిరా అంటూ విద్యుత్ అధికారులపై వ్యతిరేక నినాదాలు చేశారు. జిల్లా విద్యుత్ అధికారులు పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు ఒకలా ఉంటే మండల విద్యుత్ శాఖాధికారులు ఇంకోలా ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. సరైన పరిష్కారం జరుగకపోతే రోడ్డు పైనుంచి వెళ్లేలేదని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ ఎ.రవికుమార్, టౌన్ ఎస్సై కె.శ్రీనివాసరావులు సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని అనడంతో రైతులంతా తమ సమస్యను పరిష్కరిస్తామంటేనే బైఠాయింపు ఆపివేస్తామని అన్నారు. సీఐ హామీ మేరకు రైతులంతా వెనుదిరిగారు. దీంతో సిఐ స్థానిక విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడుతూ రైతు ల సమస్య కోసం ఉన్నతాధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అప్పటి వరకు విద్యుత్ కోతలేకుండా ఏడు గంటలు విద్యుత్‌ను అందజేయాలని విద్యుత్ శాఖాధికారులను కోరారు. దీంతో రైతులంతా సబ్‌స్టేషన్ నుంచి వెనుదిరిగారు.

రామమందిరం పునఃనిర్మాణానికి సన్నాహాలు
శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 13: వివాదాలు, పోరాటాల మధ్య అధికారులచే కూల్చివేయబడ్డ జి.టి.రోడ్డులోని శ్రీరామమందిరం పునఃనిర్మాణం కానుంది. ఈ మేరకు ఆలయ ధర్మకర్తలు బరాటం గణపతిరావు, కుటుంబ సభ్యులను అధికార, పాలకప్రతినిధులు సమన్వయపరిచి శుభముహుర్తం పండితులచే ధృవీకరించి గతం కంటే సుందరంగా నిర్మించడానికి అంగీకరించినట్టు భోగట్టా. అయితే విహెచ్‌పి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10.35 గంటలకు పునఃనిర్మాణానికి భూమిపూజకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో స్వాభిమాన్ ట్రస్టు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి ధ్వజస్తంభారోహణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణమూర్తి, ఫల్గుణలతోపాటు ఆర్.ఎస్.ఎస్, బిజెపి, సిటిజన్‌ఫోరంలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
రామాలయం నిర్మిస్తున్న స్థలం వద్ద కీర్తనలు, భజనలతో సందడి చేయడం వెనుక కుట్ర ఉందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, బిజెపి నేత పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాల్, ఎం.బి.జె.నాయుడులు ఆరోపించారు. రామాలయాన్ని నిర్మించడం ద్వారా భక్తుల మనోభావాలను గుర్తించి గౌరవించడమే మంచి పద్ధతన్నారు. రామాలయ కూల్చివేత నేపధ్యంలో అనేక పోరాటాలు చేసిన రోజుల్లో కనిపించని చిన్నాచితక స్థాయి వీధినాయకులు ఒక్కసారిగా ప్రత్యక్షమై పునఃనిర్మాణానికి తామే కారణమంటూ ఆర్భాటంగా చెప్పుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సూర్యయజ్ఞం ప్రారంభం
పోలాకి, మార్చి 13: మండల కేంద్రంలో 14 రోజులపాటు నిర్వహించనున్న సూర్యయజ్ఞానికి బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ చేశారు. సుమారు 15 లక్షల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న ఈ యజ్ఞం కోసం యాగశాలతోపాటు 144 హోమగుండాలను ఏర్పాటుచేశారు. అదే విధంగా సప్తాశ్వారథారోహనుడైన సూర్యదేవుని విగ్రహంతోపాటు ద్వాదశి ఆదిత్య దేవతావిగ్రహాలు, గాయత్రీదేవి, వరసిద్ధివినాయక, సుబ్రమణ్యేశ్వరస్వామి తదితర దేవతా విగ్రహాలను కూడా ఏర్పాటుచేశారు. ప్రముఖ యజ్ఞకర్త వీరఘట్టం వాస్తవ్యుడు ఎస్.వి.ఎల్.ఎస్.శర్మయాజీ ఆధ్వర్యంలో సూర్యోపాసకులు నగరంపల్లె త్యాగరాజు బ్రహ్మత్వమున ఈ యజ్ఞం కొనసాగుతోంది. స్థానిక గాయత్రీసేవా సంఘం ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో గురువారం నుండి ప్రతీరోజు 144 మంది దంపతులచే పూజలు నిర్వహించబడతాయి. అదే విధంగా నమక, చమక,మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, సూర్యనమస్కారాలు తదితర పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక పురోహితులతోపాటు జిల్లాకు చెందిన మరికొందరు వేదపండితులు కూడా పాల్గొననున్నారు. ప్రతీరోజు భక్తులకు స్వామిప్రసాదంతోపాటు భోజన ఏర్పాట్లను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఈ యజ్ఞంతో మండల కేంద్రంలో ఆధ్యాత్మికశోభ నెలకొంది.

వివాదాస్పద భూముల పరిశీలన
నరసన్నపేట, మార్చి 13: మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కాలనీ వద్ద ఉన్న సొసైటీ భూములపై వివాదంపై కలెక్టర్ విచారణాధికారిగా నియమించిన డిఆర్వో నూర్‌భాషాఖాసీం బుధవారం ఆయా భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వస్థానిక పంచాయతీ అధికారులు ఈ భూముల్లో రిజర్వు స్థలాన్ని ఏర్పాటు చేయకుండా అన్యాక్రాంతంగా ఇళ్ల స్థలాలుగా మార్చివేసి విక్రయిస్తున్నారన్నారు. ఇది చట్టవిరుద్ధమంటూ కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. అయితే సొసైటీ అధ్యక్షుడు టంకాల గోపాలకృష్ణగుప్తా ఈ భూములు ప్రైవేట్‌భూములని, ప్రభుత్వానికి, పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదంటూ కలెక్టర్‌కు తెలియజేశామని చెప్పారు. వీటిని పరిశీలించి ప్రభుత్వ భూమి అయితే ఇళ్ల స్థలాలను రద్దుచేస్తామని డిఆర్వో పేర్కొన్నారు. సుమారు 80 మందికి రిజిస్ట్రేషన్లను కూడా చేసిందని డిఆర్వో దృష్టికి సొసైటీ సభ్యులు తీసుకువచ్చారు. దీనిపై పరిశీలించిన మీదట తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యనిర్వాహణాధికారి ప్రకాశరావు, ఆర్.ఐ.లు నారాయణమూర్తి, శ్రీ్ధర్, విఆర్వోలు ఎల్.శ్రీను, సింహాచలం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి ఆదాయం రూ.4,54,436
జలుమూరు, మార్చి 13: మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి పర్వదినం మొదలుకొని మూడవరోజు చక్రతీర్ధస్నానం వరకు మధుకేశ్వరుని స్వామికి 4,54,436 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ మేనేజర్ సి.హెచ్.ప్రభాకరరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,56,690 రూపాయలు, హుండీల ద్వారా 1,40,221 రూపాయలు, కేశఖండన ద్వారా 2,640 రూపాయలు, స్థలపురాణం ద్వారా 6,360, ఫోటోల ద్వారా 2,150, ప్రసాదవిక్రయాల ద్వారా 1,46,375 రూపాయలు వచ్చినట్లు మేనేజర్ తెలిపారు.

రిమ్స్‌ను ప్రజా ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం
* డైరెక్టర్ జయరాజ్
శ్రీకాకుళం (టౌన్), మార్చి 13: రిమ్స్‌ను ప్రజా ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ తెనే్నటి జయరాజ్ తెలిపారు. ఒక ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వైద్య కళాశాల, ఆసుపత్రి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రికి పేద వర్గాలు అధికంగా వస్తారని, వారికి మంచి ఆరోగ్య సేవలు అందించడానికి కృషిచేస్తామన్నారు. వైద్య కళాశాలలో ప్రస్తుతం ఉన్న వంద సీట్ల నుండి 150 సీట్లకు పెంచడానికి, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు రావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. తద్వారా రోగులకు మరిన్ని సేవలు అందగలవని చెప్పారు. రిమ్స్ ప్రాంగణంలో పూర్తికావలసిన వౌళిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి సంబంధిత ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించడంతో పాటు సదుపాయాలు మెరుగుపరచి, రిమ్స్ ప్రతిష్టను పెంచుటకు అహర్నిశలు ప్రయత్నిస్తామన్నారు.

ఆటో, బైక్‌ను ఢీకొన్న లారీ
లావేరు, మార్చి 13: జాతీయ రహదారిపై తాళ్లవలస గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మహిళ మృతిచెందగా ఏడుగురు తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నుండి శ్రీకాకుళం వెళ్తున్న లారీ తాళ్లవలస వద్ద ముందు వెళ్తున్న ఆటోను ఢీకొని తరువాత ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చొన్న ఉరిటి అనిత(36) తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త ఉరిటి శ్రీనివాస్, కుమారుడు సాయికుమార్, కుమార్తె స్వాతిలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్ ఓ దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య, పిల్లలతో కలిసి విజయనగరం నుండి శ్రీకాకుళం ద్విచక్రవాహనంపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
ఘటనాస్థలి వద్ద అనిత మృతదేహాన్ని చూసి పిల్లలు, భర్త హృదయవిదారకంగా రోధించడం పలువురిని కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అన్నంపేటకు చెందిన చల్ల చిన్నారావుకు చేతులు, నడుంపైన బలమైన గాయాలు తగిలాయి. తామాడకు చెందిన పల్ల లక్ష్మీకి తలపైన, కుడికాలుపైన గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా మెరకమూడిదాం మండలం సిద్ధయ్యపాలెంకు చెందిన ఇడసర నారాయణమ్మ ఆమె కుమారుడు కృష్ణారావు తీవ్రగాయాలపాలయ్యారు. అలాగే పొందూరు మండలం వాల్లెపల్లిపేటకు చెందిన కోరాడ మల్లేషు, అతని భార్య సూరీడులకు తలకు బలంగా గాయాలవ్వడంతో గుర్ల మండలం చోడవరంకు చెందిన తాలాడ గోవిందమ్మకు తలపైన కుడిచేతిపై గాయాలయ్యాయి. ఘటనాస్థలిని ఎస్సై ఎం.శ్రీను సందర్శించి బాధితుల్ని 108లో రిమ్స్‌కు తరలించారు. బాధితులు రిమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్నారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కార్మికుల కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత
శ్రీకాకుళం(టౌన్), మార్చి 13: జిల్లాలో అరిణాం అక్కివలస వద్దనున్న శ్యాంఫిస్టన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలక్టరేట్ ముట్టడి చేపట్టగా, కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ పోలీసులు కార్మికులపై పిడిగుద్దులు కురిపించారు. 220 మందిని అరెస్టుచేశారు. ఇదిలావుండగా యూనియన్‌లో కొనసాగుతున్న కొంతమంది కార్మికులను యాజమాన్యం పనిలోంచి తీసివేసి, మిగిలిన కార్మికులకు ఒప్పందం ప్రకారం కనీసవేతనం వర్తింపజేయడంతో, తొలగించిన కార్మికులు యూనియన్ నాయకులతో కలిసి వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం ఉదయం కార్మికులు సిటు యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సంతోషిమాత కోవెల వద్ద నుండి భారీ ర్యాలీగా కలక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగానే పసిగట్టిన పోలీసులు భారీ సంఖ్యలో కలక్టరేట్‌కు చేరుకొని కార్మికులను నిలువరించగా, పోలీసులకు, అధికారులకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. వన్‌టౌన్ సిఐ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్మికులను అరెస్టు చేయడానికి ఉద్యుక్తులవుతుండగా కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే కోపోద్రిక్తులైన పోలీసులు విచక్షణా రహితంగా ఆందోళనకారులపై పిడిగుద్దులు కురిపించారు. ఒకానొక దశలో బాష్పవాయువు ప్రయోగించడానికి సైతం సిద్ధపడ్డారు. ఈ తోపులాటలో మీడియా ప్రతినిధికి కూడా గాయాలైనాయి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్న కార్మికులపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించడం అన్యాయమని సిపిఎం నేతలు వ్యాఖ్యానించారు. ఇదంతా మంత్రి ధర్మాన చొరవతోనే సాగిందని, ఇందులో భాగంగానే ముందుగా భాష్పవాయుగోళాలు సిద్ధం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో డి.గోవిందరావు, పంచాది పాపారావు, తేజేశ్వరరావు పాల్గొన్నారు.

ఆరు లైన్లగా
జాతీయ రహదారి
* మెటల్ క్వారీలను గుర్తించిన అధికారులు
శ్రీకాకుళం (టౌన్), మార్చి 13: 16వ నెంబరు జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయడం జరుగుతుందని జాతీయ రహదారుల సంస్థ పౌరసంబంధాల అధికారి ఎస్.కె.చెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి అవసరమగు నాణ్యమైన మెటల్ క్వారీలను నిపుణులైన బృందం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతంలో గుర్తించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ నిపుణులైన బృందం కేంద్ర ఇంటలిజెన్సు బ్యూరో డైరెక్టర్ కె.పి.రావు, ఇండియన్ బ్యూరో ఆప్ మైన్స్ డైరెక్టర్ ఎం. ఎస్.రెడ్డిల నేతృత్వంలో పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమగు మెటల్‌ను క్వారీల నుండి సరఫరా చేసిన అనంతరం ఇంకా మిగిలితే దానిని జాతీయ రహదారి సంస్థకు, విదేశాలకు ఎగుమతి చేయుటకు కాంట్రాక్టర్‌కు అవకాశం కల్పించడం జరగుతుందన్నారు.

పరిశ్రమలకు భద్రత ముఖ్యం
ఎచ్చెర్ల, మార్చి 13: ప్రతీ పరిశ్రమకు భద్రత ఎంతో అవసరమని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భగవత్‌కుమార్ స్పష్టంచేశారు. 21వ శతాబ్ధపు గురుకులం ఆవరణలో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలతోపాటు పెద్ద, పెద్దవిద్యాసంస్థలు, స్టార్‌హోటల్స్, ఆసుపత్రులలో భద్రతాచర్యలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశ్రమల్లో భద్రత లోపిస్తే అక్కడ పనిచేసే సిబ్బందే ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారన్నారు. భద్రతాచర్యలు లోపించడం వల్ల ఏడాదికి రెండు లక్షల మంది కార్మికులు పరిశ్రమల్లో ప్రాణాలు కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. ఇటువంటి అంశాలకు సంబంధించిన కోర్సును యూనివర్సిటీలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సులను ఏర్పాటుచేసినట్లయితే ఉపాధి, ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయన్న సంకల్పంతో ఈ కోర్సును ప్రారంభించామన్నారు. ఇప్పటికే ఈ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులు అనేక చోట్ల అధికవేతనం పొందుతున్నారని గుర్తుచేశారు. ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులందరికీ ప్లేస్‌మెంట్ కల్పించనున్నామని కోర్సుడైరెక్టర్ అనిల్‌సుధీర్ స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, సిడిసి డీన్ జి.తులసీరావు, ఎగ్జామినేషన్స్ ఆఫ్ కంట్రోలర్ పి.చిరంజీవులు, టి.కామరాజు, అడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

గురుకుల భవనాలపై వివాదం

ఎచ్చెర్ల, మార్చి 13: కోట్లాది రూపాయలతో నిర్మించిన 21వ శతాబ్ధపు గురుకుల భవనాలు సుమారు మూడేళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ భవనాలు నేడు మావంటే మావని అంబేద్కర్ వర్శిటీ, రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్(రీమ్యాప్) అధికారులు సిగపట్లు పడుతున్నారు. బుధవారం ఒక్కసారి ఆ వివాదం ముదరడంతో స్వయంగా ఉపకులపతి భగవత్‌కుమార్ సమక్షంలోనే ప్లెక్సీలు తొలగింపు, తాళాలు పగులగొట్టే ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మండలంలో షేర్‌మహ్మద్‌పురం కొండపై నిర్మించిన గురుకుల భవనాలను ప్రభుత్వం గత కొన్నాళ్ల కిందట వర్శిటీకి అప్పగించింది. అయితే ఎటువంటి కోర్సులు ఆరంభించకుండానే సుమారు 70 వేల రూపాయలను నెలకు నిర్వహణాఖర్చులు వర్శిటీయే భరించేది. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ రాజీవ్ యువకిరణాల పర్యవేక్షణలో ఒకేషనల్ కేంద్రాన్ని ఈ భవనాల్లో నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు పొందిన వెనువెంటనే దీనికి తగినట్టు గురుకుల ప్రధాన గేటు వద్ద బోర్డును కూడా మార్చేశారు. గురుకుల భవనాల్లో 576 మందికి సరిపడా సౌకర్యాలున్నాయి. ప్రస్తుతం సుమారు 300 మంది మాత్రమే వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఇంకా ఆరవ బ్లాక్ ఖాళీగా ఉండడంతో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సును నిర్వహించాలని వర్శిటీ అధికారులు నిర్ణయించారు. అడ్మిషన్లు పూర్తిచేసి ఖాళీగా ఉన్న ఆరవ బ్లాక్‌లో కోర్సు తరగతులు ప్రారంభించాలని వర్శిటీ అధికారులు భావించగా దీనికి రీమ్యాప్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వివాదానికి బీజం పడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి వర్శిటీ అధికారులు తీసుకువెళ్లగా ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సుకు కొన్ని గదులు కేటాయించాలని రీమ్యాప్ అధికారులను ఆదేశించారు. అయితే బుధవారం వీసీ భగవత్‌కుమార్ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సెమినార్‌ను హాల్‌ను పరిశీలించేందుకు తాళాలు తీయాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. తమ వద్ద తాళాలు లేవని సిబ్బంది స్పష్టంచేయడంతో వీసీ ఆగ్రహించడంతో వర్శిటీ అధికారులే తాళాలు పగులగొట్టి కొత్త తాళాలు వేశారు. గురుకుల సిబ్బంది చెబుతున్న మాటలు వినకుండా వీసీ, రిజిస్ట్రార్లు రాజీవ్ యువకిరణాలతోపాటు నేక్ సంబంధిత ప్లెక్సీలను కూడా తొలగించాలని సిబ్బందిని ఆదేశించడంతో వెనువెంటనే వాటిని తొలగించారు. ఈ విషయమై రీమ్యాప్ సిబ్బంది ఎజెసి రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వర్శిటీ, రీమ్యాప్‌లు వివాదాన్ని జిల్లా కలెక్టర్ ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి మరి.

లక్ష్యాలు అధిగమించండని ముఖ్యమంత్రి నుంచి జిల్లా అధికారుల బాస్
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>