మార్కాపురం, మార్చి 13: సామాన్య మానవునికి బియ్యం ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో 3400 రూపాయలు ఉన్న క్వింటా బియ్యం ధర ప్రస్తుతం 4800 రూపాయలకు చేరింది. దీంతో సామాన్య మానవుడు బియ్యం కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా ఓ వ్యక్తికి 4 కిలోల బియాన్ని కిలో రూపాయికి పంపిణీ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. సగటున ఓ వ్యక్తి నెలకు 10 నుంచి 12కిలోల బియాన్ని వినియోగిస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో బియ్యం ధర 50 రూపాయలకు చేరడంతో కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసుకొని కృత్రిమ కొరతను సృష్టించడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని పలువురు అంటున్నారు. అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించి వెలికితీయాల్సిన ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు ఆ వైపు కనె్నత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు మాత్రం కరవుప్రాంతం కావడంతో ఆహారధాన్యాల ఉత్పత్తి భారీస్థాయిలో తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని సర్దిచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం సన్నబియ్యాన్ని కిలో 30 రూపాయల ప్రకారం కార్డులపై పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ పంపిణీ మాత్రం నామమాత్రంగా మారిందని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా బియ్యం ధరలకు రెక్కలు రావడంతో పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలతోపాటు సామాన్య మానవుడు కూడా కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రమ నిల్వలపై దృష్టి సారించి బియ్యం ధరలను అదుపుచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తూకంలోనూ మోసాలే..
బియ్యం ధరలు భారీగా పెరిగి ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో తూకంలోనూ వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. 50 కిలోల బియ్యం కొనుగోలు చేసి తూకం వేస్తే 48 కిలోలు మాత్రమే వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తెలిసినవారికైతే 25కిలోల బియ్యం కొనుగోలు చేస్తే 24 కిలోలకే డబ్బులు తీసుకుంటున్నారని, మిగిలినవారి వద్ద 25 కిలోలకు తీసుకొని మోసం చేస్తున్నారని, గతంలో ఈవిషయంపై తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తూనికలు, కొలతల అధికారులు దాడులు నిర్వహించి సక్రమంగా బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మళ్లీ విద్యుత్ సర్‌చార్జీల బాదుడు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 13: అసలే విద్యుత్ కోతలతో అల్లాడుతుంటే మరోవైపు మళ్లీ జిల్లా ప్రజలపై విద్యుత్ సర్‌చార్జ్ బాదుడు బాదనున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఆదేశాలతో జిల్లాలోని అన్నివర్గాల ప్రజలపై పది కోట్ల రూపాయలకు పైగానే అదనపు భారం పడనుంది. ఈపాటికే గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వినియోగదారులు వాడిన విద్యుత్‌కు సర్‌చార్జీ వసూలు చేసింది. ఆ సమయంలో యూనిట్‌కు 1.30 రూపాయల వంతున జిల్లా ప్రజల వద్ద నుండి 20 కోట్ల రూపాయలకు పైగానే ముక్కుపిండి వసూలు చేశారు. గత సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వినియోగదారులు వాడిన విద్యుత్‌పై 80 పైసలు మళ్ళీ వసూలు చేయాలని ఆదేశాలు జారీకావటంతో జిల్లాలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఆదేశాలతో జిల్లాప్రజలపై మళ్ళీ పది కోట్ల రూపాయలకు పైగానే అదనపు భారం పడనుంది. గతంలో విధించిన సర్‌చార్జ్‌తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. చివరకు రిక్షా కార్మికుడి ఇంటికి కూడా వేల రూపాయల్లో విద్యుత్ బిల్లులు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం విధించే సర్‌చార్జీల దాటికి విద్యుత్ వినియోగదారులు మళ్ళీ ఇబ్బందులు పడనున్నారు. పెంచిన చార్జీలు అన్ని తరగతుల వారికి వర్తించనున్నాయి. కేటగిరి వన్ కింద గృహ, వాణిజ్య సంస్ధలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, వీధిలైట్లు, గుడి, బడి, తాత్కాలిక విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. హెచ్‌టి కింద పరిశ్రమలు, గ్రానైట్, ఆక్వా రంగం వస్తాయి. అసలే కష్టాల కడలిలో ఉన్న గ్రానైట్ రంగానికి ఈ పెంచిన ధరలు అశనిపాతంగా మారనున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలో అధికార విద్యుత్ కోతలతోపాటు, అనధికార విద్యుత్ కోతలు అమలౌతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలతోపాటు, పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన డిఆర్‌సి సమావేశంలో ట్రాన్స్‌కో అధికారులు జిల్లాకు సరఫరా అవుతున్న విద్యుత్ లెక్కలను ప్రజాప్రతినిధులకు అందచేశారు. జిల్లాకు ప్రతిరోజు 74 లక్షల యూనిట్లు రావల్సి ఉండగా కేవలం 64.58 లక్షల యూనిట్లు మాత్రమే డ్రా అవుతున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. ప్రధానంగా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆచరణలో అమలుకావటం లేదు. దీంతో రైతులు వేసిన పంటలు వాడుముఖం పడుతున్నాయి. నాలుగు నుండి ఐదు గంటల పాటు మాత్రం విద్యుత్ సరఫరా అవుతుండటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పగలు విద్యుత్ సరఫరా ఉండటం లేదు. అదేవిధంగా రాత్రివేళల్లో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అదేవిధంగా ఒంగోలు నగరం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కూడా అప్రకటిత విద్యుత్ కోతలు అమలౌతున్నాయి.
డిసిఎంఎస్‌ను లాభాల బాటలో నడిపిస్తా
చైర్మన్ బీరం వెల్లడి
ఒంగోలు అర్బన్, మార్చి 13: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) 30 లక్షల రూపాయల నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా బుధవారం ఒంగోలు కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ జెడి నర్సింహులు, జిల్లా కో ఆపరేటివ్ అధికారి కొండయ్య, డిసిఎంఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టే నాటికి డిసిఎంఎస్ 30 లక్షల రూపాయల నష్టాల్లో ఉన్నమాట వాస్తవమేనన్నారు. గత పాలకవర్గ హయాంలో వ్యాపారం పూర్తిగా తగ్గిందని, ఖర్చులు విపరీతంగా పెరగడంవల్ల నష్టం వాటిల్లిందన్నారు. నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల బాటలో పయనింప చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న సొసైటీ ఆస్తులను ఇప్పటికే గుర్తించామని, ఆ ఆస్తులను పూర్తిస్థాయిలో సొసైటీ కింద ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కనిగిరి, శింగరాయకొండలో ఉన్న స్థలాలను అద్దెకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సొసైటీ ఆవరణలో స్వాతి పైప్స్‌కు స్థలాన్ని లీజులకు ఇచ్చామని, దాని గడువు 2017 వరకు ఉందని, మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారిన తరువాత పన్నులు పెరిగాయన్నారు. వస్తున్న అద్దెలకంటే పన్నుల శాతం ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటన్నింటిని పాలకవర్గంతో చర్చించి అద్దెలు పెంచే విధంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం డిసిఎంఎస్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల పండ్లతోట రైతులకు ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్, ఫినాయిల్, ఐసిడిఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు స్టేషనరీ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల నష్టాల్లో ఉందన్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఉన్న సొసైటీ ఆస్తులను గుర్తించి పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈనెలాఖరులో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని సొసైటీ అధ్యక్షులు పాల్గొంటారన్నారు. సమావేశం నాటికి ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కనకం శ్రీనివాసులు, డైరెక్టర్లు మావులూరి శ్రీనివాసరావు, చెంబేటి నాగులు, గంగవరపు మీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
బయల్పడిన విగ్రహాలు
చినగంజాం, మార్చి 13: మండలంలోని పెదగంజాం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం తీరం వెంబడి మూడు నందులు, అమ్మవారు, నాగమయ్య, జంటనాగుల విగ్రహాలు బుధవారం బయల్పడ్డాయి. చినగంజాం అమీర్‌నగర్‌కు చెందిన నాగరాజు, తేజ, శివకుమార్, నాగేశ్వరరావు మరి కొందరు పెదగంజాం పల్లెపాలెం వద్ద ఈతకు వెళ్లగా విగ్రహాలు కన్పించాయని ఇరుగుపొరుగు వారికి సమాచారం తెలిపారు. స్ధానికులు అందించిన వివరాల మేరకు ఇటీవల కాలంలో కొందరు కాలంచెల్లిన విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సముద్రంలో కలిపినట్లు చెప్పారు. విగ్రహాల ఆకారాలు దెబ్బతిన్నాయి. కాలంచెల్లిన విగ్రహాలు కావటంతో సముద్రంలో కలిపినట్లు పలువురు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో 16 మందకి గాయాలు
అద్దంకి, మార్చి 13: మండలంలోని వెంపారాలడొంక వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగులవరం గ్రామానికి చెందిన 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం నాగులవరం గ్రామానికి చెందిన 16 మంది సిమెంటు పనికి రేణంగివరం వెళ్ళేందుకు ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు. నరసరావుపేట వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అద్దంకి ఎస్సై సమీముల్లా హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకొని, క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులందరికీ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు.
కొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల బంద్
చీరాల, మార్చి 13: రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపై విలువ అధారిత పన్నును విధించినందుకు నిరసనగా చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 5వ రోజుకు చేరిం