మచిలీపట్నం టౌన్, మార్చి 13: పోలీసు డ్యూటీ మీట్‌లో భాగంగా రెండోరోజు బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందికి ఐదు విభాగాల్లో ఫైరింగ్ టెస్ట్ నిర్వహించారు. మంగినపూడి బీచ్ సమీపంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో నూజివీడు డిఎస్పీ సి చెన్నయ్య ఈ టెస్ట్ నిర్వహించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోట్రేట్ పార్లే, అబ్జర్వేషన్, ఐఓ, ఫొటోగ్రఫీ, డాగ్ స్క్వాడ్, యాంటి సబాట్‌జ్ చెక్ విభాగాల్లో పలు జట్లు పాల్గొని తమ సత్తా చాటాయి. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణంరాజు, ఎస్‌బి సిఐ కె వెంకటేశ్వరరావు, బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పల్లపరాజు, నూజివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఉప ఎన్నికలపై రెఢీ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 13: అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం అంశం మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికపై చర్చకు దారి తీసింది. ఒకవేళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అప్రమత్తమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ముఖ్యులతో మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించి దేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పేర్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. జనవరి 24న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని చంచల్‌గూడ జైలులో కలిసి మద్దతు పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా వీరితో చేతులు కలిపితే అధికార పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొక తప్పని స్థితిలో నానితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగిన 8 మంది సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే వైకాపా, టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఈమేరకు టిడిపి నాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అంచనాలు తారుమారై అవిశ్వాస తీర్మానం బలపడే అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పార్టీ నుండి వైదొలిగిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే జూన్, జులై నెలల్లో ఇతర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలతో పాటు రాష్ట్రంలో కూడా ఉప ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈనేపథ్యంలో పేర్ని నాని ముఖ్య నాయకులతో సంప్రదింపులు, మంతనాలు ముమ్మరం చేశారు. ఉప ఎన్నికకు అవకాశం ఉండదనే వాదన బలంగా వినిపిస్తుండగా పేర్ని నాని తన ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
ప్రచార లోపంతో...
రెవెన్యూ సదస్సులు వెలవెల!
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 13: ప్రచార లోపం వల్ల రెవెన్యూ సదస్సులు వెలవెలపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా నామ్‌కే వాస్తే అన్న చందంగా సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ నెల 12నుండి ఏప్రిల్ 10వరకు సదస్సులు నిర్వహించి కీలకమైన భూసమస్యలను పరిష్కరించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగలేదు. రెవెన్యూ సదస్సుల లక్ష్యం ముఖ్యంగా రైతుల్లోకి వెళ్ళకపోవటంతో పేలవంగా మొదలయ్యాయి. పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు, కౌలురైతుల గుర్తింపు కార్డులు, ఇతర భూసమస్యలతో అనేక మంది రైతులు సతమతమవుతున్నారు. రెవెన్యూ సదస్సుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు గణనీయమైన మేలు చేకూరనుంది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నా అధికార యంత్రాంగం నుండి ఆమేరకు స్పందన లేకపోయింది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పదిరోజులకు ముందు నుండి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించే వారు. చంద్రబాబు హయాంలో నిర్వహించిన జన్మభూమి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్వహించిన అనేక సదస్సులకు మంచి ప్రాచుర్యం లభించింది. పదిరోజులకు ముందు నుండి ప్రచార కార్యక్రమం ప్రారంభించేవారు. కరపత్రాలు, టాంటాంలు, మీడియా ప్రచార సాధనాలు, వాల్‌పోస్టర్లు, తదితరాల ద్వారా భారీగా ప్రచారం చేసి లబ్ధిదారులను చైతన్యపరిచేవారు. ఈ విడత ప్రాథమిక సమాచారం కూడా రైతులకు అందలేదు. దాదాపు నెలరోజుల పాటు గ్రామాలు పట్టుకుని అధికారులు తిరగాల్సి వస్తుంది. దీనికి ప్రభుత్వపరంగా పెద్దఎత్తున ఖర్చు కూడా అవుతుంది. రైతులకు కూడా ఎంతో మేలు జరిగే ఈ కార్యక్రమానికి సరైన ప్రాధాన్యత కల్పించలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదస్సులు ప్రారంభించిన రెండోరోజైన బుధవారం కూడా షరామామూలుగా ముగిశాయి. కొన్ని గ్రామాల్లో సంబంధిత ఉద్యోగులు హడావిడిగా కొందరు రైతులను పిలిపించుకుని దరఖాస్తులు స్వీకరిస్తూ మమా అనిపిస్తున్నారు. పురమాయింపు దరఖాస్తులతో సరిపెడుతూ సదస్సుల లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ముఖ్యంగా ప్రచార లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారులు, సిబ్బంది జీతభత్యాలు, వాహనాల ఇంధనం తదితర ఖర్చులు ప్రభుత్వం భరించకతప్పదు. ఇప్పటికైనా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి సదస్సుల లక్ష్యం నెరవేరేందుకు అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంది.
కోరికష్టాలు తెచ్చుకోవద్దు
గుడివాడ, మార్చి 13: మున్సిపాలిటీల పాలనలో డిఎంఎ, శాఖాపరమైన ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనలను మున్సిపల్ కమిషనర్లు పాటించాలని, నిబంధనలు అతిక్రమించి కష్టాలు తెచ్చుకోవద్దని పురపాలక శాఖ ఆర్‌డి వి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇటీవల డిఎంఎ, పురపాలక శాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన సూచనలను తెలియజేశారు. పాలనా వివరాలు, ఆడిట్ అభ్యంతరాల నివేదికలను పరిశీలించిన అనంతరం జగ్గయ్యపేట ఇన్‌చార్జ్ కమిషనర్ డి రవికుమార్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలనా నిర్లక్ష్యంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నావని, పనిచేయకపోతే చేయలేదని అధికారులకు తెలియజేయాలని రవికుమార్‌కు సూచించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవకతవకలు, సూచనలను కొందరు కమిషనర్లు ఖాతరు చేయడం లేదని, మున్ముందు అటువంటి వారు చాలా ఇబ్బందులు పడతారని, ఆయా కమిషనర్ల శ్రేయస్సు కోసం సమీక్ష సమవేశాల్లో సలహాలిస్తున్నానన్నారు. పలువురు కమిషనర్లు ప్రజలు చెల్లించే డబ్బు దుర్వినియోగం, శాఖాపరమైన నిర్లక్ష్యంతో ఊచలు లెక్కపెడుతున్నారని, ఆ పరిస్థితి రాకుండా ప్రతిఒక్కరూ బాధ్యతతో పాలన చేయాలన్నారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే రూ.2వేల నగదును డ్రా చేసుకోవచ్చని, అనవసర పరిస్థితుల్లో డ్రాచేసిన అధికారులు శిక్షలు అనుభవిస్తున్నారన్నారు. కౌన్సిల్ తీర్మానాలను ప్రతినెలా పంపాలని, అప్పుడే తప్పులుంటే సరిచేసుకునే అవకాశముంటుందన్నారు. జగ్గయ్యపేటలో అత్యధికంగా అవకతవకలు జరుగుతున్నాయని, ప్రత్యేకాధికారులు కూడా పాలనాంశాలపై ఏవైనా అనుమానాలుంటే తనను సంప్రదించాలని ఆయన సూచించారు. గుడివాడ, మచిలీపట్నం, పెడన, నందిగామ, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషన్లు ఎన్ ప్రమోద్‌కుమార్, ఎస్ శివరామకృష్ణయ్య, టి బ్రహ్మయ్య, ఎన్ సాంబశివరావు, సిహెచ్ శ్రీనివాసరావు, సిహెచ్ మల్లేశ్వరరావు, డి రవికుమార్, జిల్లా మెప్మా ఐబి స్పెషలిస్ట్ ఎంఇ ఫణికుమార్, ఏలూరు కార్పొరేషన్ మేనేజర్ కెవిఎస్‌ఆర్‌ఎస్ శర్మ పాల్గొన్నారు.
పెనమకూరు ఇన్‌చార్జ్ కార్యదర్శిపై విచారణ
తోట్లవల్లూరు, మార్చి 13: మండలంలో పెనమకూరు గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయినట్టు బుధవారం దినపత్రికల్లో వెలువడిన వార్తాకథనంపై అధికారులు స్పందించారు. ఎంపిడిఓ కెవి సాంబశివారెడ్డి, పంచాయతీ ప్రత్యేకాధికారి మండల పరిషత్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. పత్రికల్లో వచ్చిన వార్తాకథనంపై వివరణ అడిగారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కుమారస్వామి వివరణ ఇచ్చారు. విద్యుత్ శాఖకు చెల్లించేందుకు తీసుకెళ్ళిన చెక్ ట్రెజరీ వద్ద పోయిందని, అలాగే చెక్‌బుక్ కూడా పోయిందని తెలిపారు. దీనిపై ఎంపిడిఓ, ప్రత్యేకాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌బుక్ పోవటమేమిటని ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కార్యదర్శి చెప్పారు. పంచాయతీ నిధులపై అధికారులు వివరణ అడిగారు. ఇంటి పన్నులు, మంచినీటి కుళాయి ఫీజులు సుమారు లక్ష రూపాయల వరకు వసూలయ్యాయని, ఈ నిధులను తాను దుర్వినియోగం చేయలేదన్నారు. సిబ్బంది జీతాలకు రూ.40వేలు ఇచ్చానని, సిమెంటు తూముల కొనుగోలుకు రూ.47వేలు ఖర్చు చేశానని వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడే కార్యదర్శి నిబంధనలను పాటించని విషయం వెల్లడవటంతో ఎంపిడిఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10వేలు లేక రూ.15వేలు వాడవచ్చని, పెద్దమొత్తంలో ఇలా ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. వసూలైన పన్నులను పంచాయితీ ఖాతాకు జమచేసిన తరువాత మాత్రమే వాటిని తీసి వినియోగించాలన్నారు. ఇంకోసారి ఇలాంటి పనులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈసందర్భంగా ప్రత్యేకాధికారి శివప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ స్వాహా చేసేందుకు పంచాయతీలో నిధులు లేవన్నారు. చెక్‌బుక్ పోయినా తమ సంతకాలు లేకుండా పని చేయదన్నారు. కనుక ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. పంచాయతీలోని రికార్డులన్నీ తనిఖీ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపిడిఓ చెప్పారు. ఆరోపణలు రావటంతో కుమారస్వామిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు చెప్పారు. ఇతని స్థానంలో గరికపర్రు కార్యదర్శి వెంకటరత్నంను నియమిస్తున్నట్టు వివరించారు.
సామాజిక బహిష్కరణపై
దళిత మహిళ ఫిర్యాదు
ఎ కొండూరు, మార్చి 13: కలిసి మెలిసి ఒకే దళితవాడలో జీవించాల్సిన దళితుల్లో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఒక దళిత మహిళ కుటుంబాన్ని రెండు నెలలు సాంఘిక బహిష్కరణ చేయగా బాధిత కుటుంబం మండల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. మండలంలోని తూర్పు మాధవరం దళితవాడకు చెందిన చింతరాల చిన సామ్రాజ్యం 11 సంవత్సరాలుగా అదే దళిత పాఠశాలలోని మండల పరిషత్ పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిగా పనిచేస్తోంది. ఇటీవల ఆ దళితవాడలో సామ్రాజ్యం కుటుంబానికి మరో కుటుంబానికి అంతర్గత విభేదాలు ఏర్పడి చివరకు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనను పురస్కరించుకుని కుల పెద్దలు గత ఫిబ్రవరి 15నుండి ఆ కుటుంబాన్ని గ్రామం నుండి సామాజిక బహిష్కరణ విధించి వారితో ఎవ్వరూ మాట్లాడరాదని, పచారీ సరుకులు అమ్మరాదని, కూలీ పనులకు పిలువకూడదని వెలివేశారు. పాఠశాలలో కూడా ఆమె వంట వండితే భోజనం చేయవద్దని పిల్లలు స్కూల్‌కు రాకుండా నిలిపివేశారు. ఇదికాక ఏజెన్సీ నుండి తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. తనపై ఎటువంటి ఆరోపణలు లేవని, తనకు జీవనాధారమైన ఏజెన్సీని రద్దు చేస్తే తన కుటుంబం వీధిన పడుతుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయంచేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని డెప్యూటీ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసిందని, ఈవిషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని డెప్యూటీ తహశీల్దార్ తెలిపారు.
రక్తదానం చేసి ప్రాణదాతలుకండి
మచిలీపట్నం టౌన్, మార్చి 13: ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వరలక్ష్మి పాలిటెక్నిక్ రోటరాక్ట్ ఆధ్వర్యంలో బుధవారం కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు. రక్తదానం చేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పరుచూరి బాబు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగరాజారావు, బ్లడ్ బ్యాంక్ అధికారి డా. సహదేవ్, గొర్రిపాటి రాజేశ్వరి, డా. ధన్వంతరి ఆచార్య, గఫార్, సాయిప్రసాద్, బిందు, కరెడ్ల సుశీల, అనురాధ, అజ్మతున్నీసా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, సురేష్, పిఎల్ పాండురంగారావు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి గ్రామోత్సవం
మోపిదేవి, మార్చి 13: మండల పరిధిలోని పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వసంతోత్సవం, శమీ పూజలు శాస్రోక్తంగా నిర్వహించారు. వసంతోత్సవం సందర్భంగా స్వామివారికి గణపతి పూజ, ఏకదాశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలను ఆలయ ప్రదాన అర్చకులు బద్దు పవన్‌కుమార స్వామి అధ్వర్యంలో శాస్రోక్తంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి వివిఎస్‌కె ప్రసాద్ స్వామివారి వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి శమీపూజలను రాజాగారి కోటలో ఉన్న శమీ వృక్షం వద్ద అర్చకులు విరూప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదమంత్ర లిఖితమై పత్రాలను శమీ వృక్షానికి వేలాడదీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుమారస్వామి, సూపరింటెండెంట్ తోట కేశవరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాన్ని నంది వాహనంపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా టెంకాయలు, పండ్లు, కానుకలను స్వామివారికి సమర్పించారు.
మోకాళ్లపై కూర్చొని వ్యాట్‌పై నిరసన
చల్లపల్లి, మార్చి 13: వ్యాట్‌ను నిరసిస్తూ ది చల్లపల్లి క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. టైలర్స్ అసోసియేషన్, మోటారు సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్, టిడిపి, బిసి సంఘాలు మద్దతు తెలిపి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చల్లపల్లి ప్రధాన సెంటరులో మోకాళ్ళపై మానవహారంగా ఏర్పడ్డారు. క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గూండా వెంకటేశ్వరరావు నిరసన కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మాంసంగా మారుతున్న చచ్చిన కోళ్లు
పాతబస్తీ, మార్చి 13: మృతి చెందిన వందలాది కోళ్ళను మాంసంగా మార్చి అమ్మాలని యత్నించిన మాంసం వ్యాపారిని అటకాయించిన శానిటరీ ఇన్స్‌పెక్టర్ మృతి చెందిన కోళ్ళను వ్యానులో తరలించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్టినగర్ ఆంజనేయ మార్కెట్‌లోని కోడి మాంసం దుకాణంలో బుధవారం ఉదయం సుమారు 400 మృతి చెందిన కోళ్ళు దిగుమతి అవుతుండగా స్థానికులు గ్రహించారు. వెంటనే శానిటరీ ఇన్స్‌పెక్టర్ బ్రహ్మారెడ్డికి సమాచారం అందించగా ఆయన కోళ్ళను పరిశీలించారు. మొత్తం మృతి చెంది ఉండగా వ్యాపారిని గట్టిగా మందలించి దిగుమతి అయిన కోళ్ళన్నింటిని తిరిగి అదే వ్యానులో ఎగుమతి చేయించారు. ఇలాంటి మాంసం, చేపలు అమ్మకాలు అదే మార్కెట్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చనిపోయిన కోళ్ళను రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారి గుట్టు రట్టవడంతో కట్టు కథలతో జనాలను నమ్మించాలని యత్నించారు. గుణదల పడవల రేవు వద్ద కోళ్ళ లోడు వ్యాను బోల్తాపడిందని కోళ్ళు చనిపోయాయని, వాటిని డ్రస్సింగ్ చేసి తిరిగి కోళ్ళ ఫారం యజమానికి పంపించడానికే మార్కెట్‌కి తెచ్చామని తెలిపారు. చనిపోయిన వాటిని వెంటనే కోళ్ళపారం యజమానివద్దకు తరలించాలి గాని ఇలా డ్రెస్సింగ్ చేసి పంపించడం ఎక్కడా లేదని ప్రతి ఒక్కరు విస్మయానికి గురయ్యారు. ఏది ఏమైనా ప్రజలకు అమ్మాలని చూసిన మృతి చెందిన కోళ్ళను సకాలంలో పట్టుకొని తిప్పిపంపిన శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఆహార భద్రతా విభాగం అధికారులు నగర పాలక సంస్థ అధికారుల స్థాయి దాటి జిల్లా వైద్య అధికారుల చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఇలాంటి అక్రమాలను నియంత్రించలేక పోయున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. పాతబస్తీలో కల్తీ మాంసం, అనారోగ్యంతో ఉన్న జీవాలను వధించిన మాంసం, అలాగే కొక్కెర, మశూచి రోగాలతో కోళ్ళు మృతి చెందగా వాటిని సైతం గుట్టుచప్పుడు కాకుండా వినియోగదారులకు మాసం రూపంలో అమ్ముతున్న వ్యాపారులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కెఎల్‌రావు, చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో డయేరియా లక్షణాలతో చాలా మంది బాధపడిన సందర్భాలున్నాయి. పాతబస్తీలో మాంసం ఉకాణాలపై జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని పాతబస్తీవాసులు కోరుతున్నారు.
నూతన విద్యా సంవత్సరం నుంచి విప్లవాత్మక మార్పులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 13: 2013-14 విద్యా సంవత్సరం నుంచి విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని జెఎన్‌టియు కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తులసీ రాందాస్ తెలిపారు. బుధవారం నాడిక్కడ ఆయన జిల్లాలోని ఇంజనీరింగ్, ఫార్మశీ కళాశాలల యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ పట్ట్భద్రులలో ప్రస్తుతం 15 శాతం మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులని దీన్ని కనీసం 50 శాతం దాటించాలన్నారు. కొత్తగా అవుట్ కమ్ బాస్‌డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, దీని వల్ల విద్యార్థులు బట్టిపట్టే స్థితి నుంచి తమ ఆలోచన పరిధిని పెంచుకునేలా సొంతగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారన్నారు. దీని వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత వెలుగు చూస్తుందన్నారు. ఇంటర్నేట్ ద్వారా వైస్ చాన్సలర్, డైరెక్టర్లు, కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్, విద్యార్థులు విదేశాల్లో ప్రొఫెసర్లు వివిధ పరిశ్రమల్లో మేనేజర్లను అనుసంధానించబోతున్నామన్నారు. వీరిలో ఎవరైనా తమకు కావాల్సిన వారితో ఎప్పుడైనా మాట్లాడుకునే వీలుందన్నారు. ఇ లెర్నింగ్ విధానాన్ని ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నారు. 2012-13 సంవత్సరంని అఫిలియేషన్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాద్ రాజు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ శాయిబాబు, రెక్టార్ డాక్టర్ రవీంద్ర తదితరులు ప్రసంగించారు.
పేదల ఇళ్లల్లో పెద్దల పాగా
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 13: నగరంలో విశాలమైన రహదారుల మధ్య బహుళంతస్తుల భవనాల్లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మితమైన గృహాలు అన్యాక్రాంతమవుతుండటంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే 8వేల గృహాల నిర్మాణం జరుగటం.. అవకతవకలు జరిగిన లబ్ధిదారుల ఎంపిక పూర్తయి వారికి స్వాధీనం చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. తీరా కొందరు దళారులు ఆ ప్రాంతంలో తిష్టవేసి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన మరుక్షణంలోనే పదోపరకో వారి చేతిలో పెట్టి వాటిని తమపరం చేసుకుని ప్రస్తుతం ఒక్కొ ఇంటిని కనీసం నాలుగు లక్షల రూపాయలకు పైనే విక్రయిస్తున్నారు. ఎంతో కష్టంపై ఇల్లు సంపాదించుకున్న వారు తిరిగి కాలువ గట్టులు, బుడమేరు గేట్లు లేదా రహదారులను ఆశ్రయించి గుడిశెలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు శాంపిల్ సర్వే జరిపి కొన్ని ఇళ్లను తనిఖీ చేసి.. అదీ చేతులు మారటం కాదు... తమవంతుగా చెల్లించాల్సిన 30 వేల షేరు ధనం చెల్లించని వారి 8 గృహాలను సీజ్ చేయటంతో విపక్షాలు అధికారులను చుట్టుముట్టాయి. వారిని మరో అడుగు ముందుకేయలేని విధంగా దిగ్బంధనం చేశాయి. లబ్ధిదారులు తొలుత కేవలం 10వేలు చెల్లించారు. మిగిలిన 30వేలు బ్యాంక్ హామీ పొంది నెలవారీ కిస్తీగా చెల్లించుకునే అవకాశం ఉన్నా అత్యధిక మంది పట్టించుకోలేదు. పైగా ఆ ఇళ్లు రెండు మూడు చేతులు మారినా 30వేల షేరు ధనం మాత్రం చెల్లించకపోవడాన్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నారు. ఇక విపక్షాల వాదన మరో విధంగా ఉంది. పాపం పేదవారు అమ్ముకున్నారు... కొన్నవారు 30వేలు చెల్లించకపోయారు, చూసిచూడనట్లు పోవాలంటారు... అయితే పేదవారైతే నాలుగు లక్షలకు ఎలా కొనుగోళ్ళు చేసారనే దానికి ఏ ఒక్కరి నుంచి సమాధానం లేదు. సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతంలో గజం రూ. 15వేలు ధర పలుకుతున్నది. 90 గజాల స్థలం కొనాలంటే నాలుగున్నర లక్షలు ఖర్చు... అందులో ఇల్లు నిర్మించుకోవాలంటే మరో నాలుగు లక్షలు ఖర్చు అందుకే నాలుగు లక్షలకు వెనుకాడకుండా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇల్లు కళ్ళు మూసుకుని కొనేస్తున్నారనేది వాస్తవం... అసలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులను నగరంలో వౌళిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయాల్సి ఉంటే గత కమిషనర్లు గుల్జార్, ప్రద్యుమ్న ఒకరిని మించి మరొకరు నిబంధనులను పక్కన బెట్టి కేవలం ఒక గృహ నిర్మాణంకే రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. లబ్ధిదారుల నుంచి వారి షేర్ ధనం వసూలు చేస్తే కనీసం రూ. 25 కోట్లు వరకు వస్తాయి. ప్రస్తుతం ఆ సొమ్ముతో కొన్ని నెలలు సిబ్బంది జీతభత్యాలు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. వాస్తవానికి లబ్ధిదారుల ఎంపిక సమయంలోనే ప్రభుత్వం విధివిధాలు నిర్దేశించింది. ఈ గృహాలను విక్రయించడం... లేదా అద్దెలకివ్వడం నేరం... పైగా ప్రతి జంక్షన్‌లోనూ లబ్ధిదారుల ఫోటోలతో పేర్లు బహిరంగంగా ఉంచాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే అలా జరుగకపోవటం వలన చేతులు మారుతున్నాయి. మరోవైపు సొంత గూడు కోసం దాదాపు లక్ష మందిపైగా అదీ వామపక్షాల పోరులోనూ... జన్మభూమి.. గ్రామసభల్లోనూ దరఖాస్తులు అందజేసి నిరీక్షిస్తున్నారు. ఇక తమకెపుడు సొంత ఇల్లు దక్కుతాయని వీరంతా నేతలను ప్రశ్నిస్తున్నారు. కొందరు పదేపదే ఇళ్ళు తీసుకుంటున్నారు... అమ్ముకుంటున్నారు.. రోడ్డెక్కుతున్నారు.. తిండిలేకపోయినా అద్దె గృహాల్లో మగ్గుతున్న వారు అందరిలా రోడ్డెక్కలేకపోతున్నారు.. పరువు ప్రతిష్ట అడ్డం వస్తున్నది. వీరి కోసం పోరాడే నేత ఎవరూ కన్పించడంలేదు. అందుకే అర్హుల జాబితాను ప్రకటించి, ఒక వేళ ఈ ఇళ్లు కొన్న వారిని బైటకి పంపి సీనియార్టీ ప్రకారం మరొక లబ్ధిదారునికి ఆ ఇళ్లు కేటాయించాలనే డిమాండ్ వినవస్తున్నది. ఇక బిజెపి ప్రభుత్వ హయాంలో వాంబే పథకం కింద నిర్మితమైన వ్యక్తిగత గృహాలు సైతం అత్యధికంగా చేతులు మారాయి. ఇందులోనూ రాజకీయ నేతల హస్తమే ఉంది. కొందరు బాహాటంగా రెండుమూడు ఇళ్లు కొనుగోలు చేసి ఒకే భవనంగా మార్చుకుని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్‌లు నిర్వహిస్తున్నా ఏ రాజకీయ నాయకుడు కూడా నేటికీ ప్రశ్నించకపోవటంలో ఆంతర్యం ఏమిటో అంతుబట్టటంలేదు. ఏదిఏమైనా వాంబే గృహాలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాల పై అధికారులు డేగకన్ను వేసి ఎప్పటికప్పుడు అనర్హులను గుర్తించి వారిన గెంటివేసి వారి స్థానంలో అర్హులకు ఆ ఇళ్ళు కేటాయించాలనే ఉద్యమం ఇప్పుడిప్పుడే చాపకింద నీరులా ఆరంభమవుతున్నది. అయితే నాయకత్వం వహించే వారు కరవవుతున్నారు. ఎవరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు వారివి కదా..
చిట్టినగర్ జంక్షన్ అభివృద్ధికి ప్రణాళికలు
అజిత్‌సింగ్‌నగర్, మార్చి 13: ప్రధాన కూడలిగా ఉన్న చిట్టినగర్ జంక్షన్‌ను అభివృద్ధి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ జి సువర్ణ పండాదాస్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం నగర పరిధిలోని చిట్టినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన స్థానిక సెంటర్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన ఆయన జంక్షన్ అభివృద్ధితో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించవచ్చునని, ఆ దిశగా అవసరమైన అంచనాలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధింత టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొలుత వన్‌టౌన్ ప్రాంతంలోని మేజర్ అవుట్ ఫాల్ డ్రైయిన్‌లో మురుగు పారుదలకు అవరోధంగా ఉన్న చెత్త చెదారంను చూసిన కమిషనర్ పండాదస్ పారిశుద్ధ్య పనుల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మురుగు కాల్వల్లో చెత్త వేయకుండా ప్రజల్లో తగు అవగాహన కల్పించాలని సూచించారు. 27వ డివిజన్ శానిటరీ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బంది మస్తరును పరిశీలించిన ఆయన పలు సూచనలు చేసారు. అనంతరం సింగ్‌నగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పర్యవేక్షించి చెత్త వాహనాల ట్రిప్ షీట్‌ను పరిశీలించారు. తరలించిన చెత్త బరువు తూచే వేబ్రిడ్జి రికార్డులను పరిశీలించి మొత్తం ఎన్నిట్రిప్పులు, ఎన్ని టన్నుల చెత్తను తరలించారన్న విషయంపై ఆరా తీసిన ఆయన ఉదయం 6 గంటల కల్లా మొత్తం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సూచించారు. కరెంటు సరఫరా లేని సమయంలో కాటా పనిచేయక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని స్థానిక సిబ్బంది కమిషనర్ పండాదాస్ దృష్టికి తీసుకురాగా ఇందుకు అవసరమైన ఇన్వర్టర్ ఏర్పాటు విషయమై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక ఆవరణలో ఉన్న నిరుపయోగ డంపర్ బిన్లను స్క్రాబ్ కింద విక్రయించి వచ్చిన ఆదాయంతో నూతన డంపర్ బిన్లను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఇఇ లు ఓం ప్రకాష్, సహాయ వైధ్యాధికారులు డాక్టర్ గోపాల్ నాయక్, డాక్టర్ బాబూ శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి సునీత తదితరులు పాల్గొన్నారు.
1.5 కోట్ల బంగారం పట్టివేత
పాతబస్తీ, మార్చి 13: వన్‌టౌన్ పోలీసులు బుధవారం రాత్రి శివాలయం వీధిలో పిల్లి అప్పారావు మార్కెట్‌లో రూ.1.50 కోట్ల విలువైన 3.50 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు శివాలయం వీధిలో బాంబులు, ఉగ్రవాదులు నివారణ చర్యలో భాగంగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వన్‌టౌన్ సిఐ కె.హనుమంతరావు, క్రైం ఎస్‌ఐ దుర్గారావు మరికొందరు సిబ్బంది శివాలయం వీధిలో ప్రయాణీకులు, వినియోగదారుల బ్యాగ్‌లు, సూట్‌కేసులు సోదా చేస్తుండగా కోయంబత్తూరు నుండి వచ్చిన కృష్ణన్ సతీష్‌కుమార్ (31) ఓ చిన్న బాగ్‌లో రూ.1.50 కోట్ల విలువైన 3.50 కిలోల బంగారు ఆభరణాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. అతను ఎలాంటి ఆధారాలూ చూపించనందున అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఐదో రోజుకు చేరిన వస్తవ్య్రాపారుల బంద్
పాతబస్తీ, మార్చి 13: వ్యాట్ టాక్స్‌ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వస్తవ్య్రాపారులు చేపట్టిన ఆందోళనకు ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు సంఘీభావం తెలపడంతో వస్తవ్య్రాపార సంఘాల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. మంగళవారం తెలుగుదేశం పార్టీ అండగా నిలవగా, బుధవారం ఏకంగా ముఠా కార్మికులే రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం అటు సిపిఐ, సిపిఎం నాయకులు సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు సిహెచ్ బాబూరావు వస్తల్రత వద్ద రిలే దీక్ష శిబిరం వద్దకు చేరి మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల మీద భారం వేస్తున్నారని దీన్ని అడ్డు పెట్టకుని ఆదాయ శాఖ అధికారులు కూడా వ్యాపారులను వేదిస్తున్నారన్నారు. గతంలో వస్త్రాలపై వ్యాట్ టాక్స్‌ని రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. వస్తవ్య్రాపారులు తాము అనుకున్నది సాధించేవరకు సిపిఎం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సిపిఐ నేత దోనేపూడి శంకర్ మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకులు నారాయణ వస్త్ర వ్యాపారులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై సిపిఐ వత్తిడి తెస్తుందన్నారు. ప్రతి పోరాటంలోనూ సిపిఐ నాయకులు అండగా ఉంటామన్నారు. బుధవారం సిపిఐ ముఠా కార్మిక నాయకులు పల్లా సూర్యారావు ఆధ్వర్యంలో ముఠా వర్కర్లు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటరులో వందలాది మంది వ్యాపారులు మానవహారంగా ఏర్పడి వ్యాట్ టాక్స్‌ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వస్తల్రత, కృష్ణవేణి మార్కెట్ అసోసియేషన్ నాయకులు చింతలపూడి రఘురాం, బచ్చు వెంకట నర్సింహరావు, వెలంపల్లి రామచంద్రరావు, కొమ్మూరి బసవరాజు పాల్గొన్నారు.
మాజీ శాసనసభ్యుడు కె.సుబ్బరాజు శిబిరాన్ని సందర్శించి వస్త్ర వ్యాపారుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. వస్త్ర వ్యాపారుల బంద్‌లో వ్యాట్ భారంలేని పొరుగు రాష్ట్రాలకు వస్తవ్య్రాపారం తరలిపోతుందన్నారు. దీనివల్ల రాష్ట్రం అనేక విధాలుగా ఆదాయం కోల్పోతుందన్నారు. సుబ్బరాజు వెంట ఎఐవైఎప్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, ఎఐటియుసి నేత శీరం దుర్గారావు, వస్తల్రత క్లాత్ ముఠా కార్మిక సంఘం అధ్యక్షుడు చీపుళ్ళ సత్యనారాయణ పాల్గొన్నారు.
20న హుండీల లెక్కింపు
ఇంద్రకీలాద్రి, మార్చి 13: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఉన్న హుండీలను ఈనెల 20న లెక్కిస్తున్నట్లు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రీజనల్ జాయింట్ కమిషనర్ కె ప్రభాకర శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి హుండీల లెక్కింపుకార్యక్రమంలో పాల్గొనే్న అసక్తి ఉన్న భక్తులు 19న తేదీనే దేవస్థానం సమాచారం కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకొని ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన భక్తకోటికి విజ్ఞప్తి చేశారు.