గరుగుబిల్లి, మార్చి 13: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని జిల్లా సిపిఎం కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కుడిమట్టి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో జిల్లాపరిషత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరగనున్న డిఆర్‌సి సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రితోపాటు పలువురు మంత్రులు హాజరవుతున్నందువల్ల నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. పునరావాసం పూర్తయ్యిందని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారని, అయితే అవి తప్పని మంత్రుల వద్ద రుజువుచేస్తామన్నారు. నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేంతవరకు పనులను జరగనివ్వమని స్పష్టం చేశారు.
చీకటి కొండలకు
అధికారుల బృందం
కురుపాం, మార్చి 13 : మండలంలోని అతి ఎతె్తైన ప్రదేశం చీకటి కొండల ప్రాంతాన్ని అధికారుల బృందం యువజన మహిళా సంఘాలతో కలిసి పరిశీలించింది. కొండలపైకి వెళ్లడానికి సాధ్యంకాని విధంగా ఉన్న కాలిబాటగుండా వీరు పురాతనమైన చీకటికొండలు ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా సెట్విజ్ సిఇఓ దుర్గారావు, మేనేజర్ సత్యం, నోటరీ అడ్వకేట్ బి.చంద్రవౌళి, జిపికె స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు కె సన్యాసిరాజు ఆధ్వర్యంలో 70 మంది మహిళా, యువజన సంఘాలు సాహస యాత్ర నిర్వహించారు. సుమారు ఐదు కిలోమీటర్ల కొండలను ఎక్కి 8వేల అడుగుల ఎత్తుగల కొండ చివర ప్రాంతానికి చేరుకున్నారు. గతంలో ఈ ప్రాంతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. బ్రిటీష్ పాలకులు ఈప్రాంతంలోనే ఉంటూ యుద్ద విన్యాసాలు చేసినట్లుగా చెబుతుంటారు. ఈ సందర్భంగా సెట్విజ్ సిఇఓ దుర్గారావు మాట్లాడుతూ ఇటువంటి కొండలు ఎక్కడం వలను యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. పురాతన ప్రాంతాలను దర్శించడం వలన గతంలో అక్కడ ఉన్న విషయాలపై అగాహన కలుగుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతం వనమూలికలకు ప్రసిద్దమని వాటిని గూర్చి తెలుసుకోవడం ఎంతో విశేషమన్నారు.
రూ. 79 కోట్ల పంట రుణాల పంపిణీ
బొబ్బిలి, మార్చి 13: జిల్లాలో ఈ ఏడాది 103 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించేందుకు లక్ష్యం కాగా ఇంతవరకు 79కోట్ల రూపాయల పంట రుణాలుగా అందించామని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. శివశంకర్ ప్రసాద్ తెలిపారు. స్థానిక వెలమ సంక్షేమ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందులో 10కోట్లు కొత్తరుణాలు, 69కోట్లు రెన్యూవల్ చేసినట్లు తెలిపారు. 90 కోట్ల రూపాయలు పాత బకాయిలు వసూళ్లు కావల్సి ఉందన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీలలో రాయితీలు అందిస్తామన్నారు. దాదాపు 10కోట్ల రూపాయల మేర మొండి బకాయిలున్నాయని, వీటిని చెల్లించేందుకు రైతులు ముందుకు వస్తే వారికి వడ్డీని తగ్గిస్తామన్నారు. 2016 నాటికి డి.సి.సి.బి.కి 100 సంవత్సరాలు పూర్తవుతాయని, అప్పటికి 100కోట్ల రూపాయల డిపాజిట్‌ల సేకరణ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రస్తుతం 47కోట్లు ఉందన్నారు. ఈనెల 28న డి.సి.సి.బి. మహాజన సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్‌లో ముగ్గురు డిబార్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 13: ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్టు ఆర్‌ఐఒ బాబాజీ తెలిపారు. బాడంగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, సాలూరు సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇద్దరు డిబార్ అయ్యారని పేర్కొన్నారు. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జూవాలజీ, మేద్స్, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ కేటగిరిలో మొత్తం 18917 మంది విద్యార్థులకు గాను, 17682 మంది హాజరయ్యారు. అలాగే వొకేషనల్‌కు సంబంధించి 4191 మందికిగాను 3314 మంది పరీక్షలు రాశారు.
‘విఆర్‌ఎల సమస్యలను పరిష్కరించాలి’
విజయనగరం (కంటోనె్మంట్), మార్చి 13: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వి.ఆర్.ఎలు మూడు రోజుల రిలేనిరాహార దీక్షలను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ వి.ఆర్.ఎ.ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమస్యలు పరిష్కారం కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆందోళనతోపాటు ఏప్రిల్ 23న అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వి.ఆర్.ఎలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హత గల వారికి పదోన్నతలు ఇవ్వాలని, వారసత్వ విధానాన్ని అమలు చేయాలని, జీవో-670ని సవరించాలని, పదవీ విరమణ చేసిన వారికి 50 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్.ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చిన్నయ్య, జిల్లా కార్యదర్శి బి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
16న ఎమ్మెల్సీ కోలగట్ల రాక
విజయనగరం (్ఫర్టు), మార్చి 13: ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి 16న పట్టణానికి రానున్నారని కాంగ్రెస్ నాయకులు కె.సీతారామశెట్టి, ఎస్.బంగారునాయుడు, ఆశపువేణు తెలిపారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా నియమితులై తొలిసారిగా విజయనగరం వస్తున్న కోలగట్లకు భారీఎత్తున స్వాగతం పలుకుతామన్నారు. వి.టి.అగ్రహారం వై జంక్షన్ నుంచి మయూరి జంక్షన్, రైల్వేస్టేషన్, ఎన్‌సిఎస్ ధియేటర్, కన్యకాపరమేశ్వరికోవెల, గంటస్తంభం మీదుగా మూడులాంతర్ల జంక్షన్ వరకు భారీ ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారన్నారు.
విద్యుత్ షాక్‌తో గీత కార్మికుడు మృతి
వేపాడ, మార్చి 13 : విద్యుత్ షాక్‌కు గురై గీత కార్మికు గొర్లె మాదయ్య (తాతా) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మండలంలోని చామలాపల్లి గ్రామానికి చెందిన మాదయ్య అనే గీత కార్మికుడు కల్లు కోసం ఎప్పటిలా బుధవారం సాయంత్రం శివారు గ్రామమైన వెంకయ్యపాలెం సమీపానికి తాటికల్లు గీసెందుకు వెళ్లాడు. ఈయన చెట్టు ఎక్కుడుండగా అక్కడి విద్యుత్ వైరుకు తాటికొమ్మ తగిలి మృతిచెందాడు ఈ సంఘటన తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పెద్దగెడ్డ జలాశయాన్ని
పరిశీలించిన సిఇ
పాచిపెంట, మార్చి 13: పెద్దగెడ్డజలాశయాన్ని నార్త్‌కోస్టు నీటిపారుదలశాఖ(విశాఖ) చీఫ్ ఇంజనీర్ కె.జలంధర్ బుధవారం పరిశీలించి జలాశయం స్థితిగతులపై ఆరాతీశారు. ప్రస్తుతం జలాశయంలో నీటి సామార్ధ్యం, ఆయకట్టు రైతుల వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తొలిసారి పెద్దగెడ్డ పరిశీలనకు రావడం జరిగిందన్నారు. 110 కోట్ల రూపాయలతో తోటపల్లి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత ఆయకట్టుకు ప్రస్తుతం 64వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. పెద్దగెడ్డ జలాశయ అభివృద్ధి పనులకు ఈ ఏడాది ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులు ఈనెలాఖరు లోపు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ జలాశయం ద్వారా రబీకిగాను ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీరందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్వాలటీ కంట్రోల్ ఇంజనీర్ కె.సుబ్బరాజు, డి.ఇ. రాజేశ్వరరావు, జె.ఇ. సురేష్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమీక్షా మండలి సమావేశం వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 13: జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 16న జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ సమావేశాన్ని వాయిదా వేసినట్టు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. తదుపరి తేదీని తరువాత ప్రకటిస్తామన్నారు.
వైద్య శిబిరానికి అధికారుల స్థల పరిశీలన
కురుపాం, మార్చి 13 : సబ్‌ప్లాన్ ఏరియాలో నిర్వహించే మెగా వైద్య శిబిరం కోసం పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అధికారులు స్థల పరిశీలన చేశారు.ఈనెల 24న కురుపాంలో జరిగే మెగా వైద్య శిబిరం ఏర్పాట్ల కోసం వీరు బుధవారం కురుపాం ఎఎంసి స్థలాన్ని పరిశీలించారు. ఐటిడిఎ పరిధిలోని 8 మండలాలకు చెందిన ప్రజల కోసం పెద్ద ఎత్తున్న ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్వహణ పెద్ద ఎత్తున జరిగేందుకు అధికారులు ముందు నుంచే ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారు బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిబిరానికి వేలాది మంది రోగులు వస్తారని ఆసిస్తున్నామన్నారు. దీర్ఘకాలి శస్త్ర చికిత్సలకు సంబంధించి వ్యాధులకు కూడ పూర్తిస్థాయిలో పరిశీలించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిఓ వెంట ఎఎంసి చైర్మన్ డి.రామకృష్ణ, కాంగ్రెస్ యువజన నాయకులు కోలా రంజిత్‌కుమార్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగభూషణరావు, దంతవైద్యులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు
‘అవినీతిలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు’
మెంటాడ, మార్చి 13 : తల్లి కాంగ్రెస్ పార్టీ, పిల్ల కాంగ్రెస్ వైఎస్సార్ సిపి విషపు కొమ్మలని తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గం శాఖ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. బుధవారం కైలాం గ్రామంలో పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక రామమందిరం వద్ద ఎన్టీ రామారావు చిత్ర పటానికి పూలమాల వేసి నిశాళులర్పించారు. అనంతరం గ్రామంలో పాదయాద్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా, కాంగ్రెస్ పార్టీలు విలీనమయ్యేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. అవినీతి సంపాదనలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారన్నారు విజయమ్మ ఇటీవల తమ డొల్లతనం బయట పెట్టారన్నారు. ప్రజారాజ్యం పార్టీగతి, వైఎస్సార్ సిపికి పడుతుందదన్నారు. జగన్‌ను జైలు నుంచి బయట పడటానికి విజయమ్మ మదిలో ఉన్నమాట, బయట పెట్టారన్నారు. విద్యుత్, గ్యాస్,పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి కాంగ్రెస్ పార్టీ నడ్డి విరిచిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్ మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొనసాగే అర్హత లేదన్నారు. గ్రామంలోని సీనియర్ నాయకుడు కొరిపిల్లి చిన్నంనాయుడు ఇంటి వద్ద నుంచి పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమరాయివలస, జయితి, ఇప్పలవలస గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చలుమూరి వెంకటరావు, కె.చిన్నంనాయుడు, గెద్ద అన్నవరం, తిరుపతి, పిఎసిఎస్ అధ్యక్షుడు గొర్లె ముసలినాయుడు, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి రాజగోపాల్ పాల్గొన్నారు.
‘రాష్ట్రంలో 27 వేల మంది క్షయ రోగులు’
పార్వతీపురం, మార్చి 13: రాష్ట్రంలో 27వేల మంది క్షయ రోగులు ఉన్నారని రాష్ట్ర క్షయ నివారణ జాయింట్ డైరక్టర్ డాక్టర్ రాణి సంయుక్త తెలిపారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని క్షయ నిర్థారణకు ఏర్పాటు చేసిన సిబి నాట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కేవలం రెండు గంటల్లోనే క్షయ నిర్థారణ కోసం రాష్ట్రంలోని రెండు సిబి నాట్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆ రెండు కేంద్రాలు కూడా విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం కావడం విశేషమన్నారు. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షయ నిర్థారణ పరీక్షల కోసం 922 మెక్రోస్కోపులు ఏర్పాటు చేశామన్నారు. 2లక్షల 50వేల మంది జనాభాకు ఒక మెక్రోస్కోపు కేంద్రాలున్నాయని అయితే 50వేల జనాభాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. విజయనగరం జిల్లాలో 31 మైక్రోస్కోపు కేంద్రాలుండగా మరో ఐదు కేంద్రాల కోసం ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో క్షయ నివారణాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని డాక్టర్ రాణి సంయుక్త తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులను పరామర్శించారు.
‘విటమిన్-ఎపై అవగాహన కల్పించాలి’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 13: జిల్లాలో తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు విటమిన్ ఎ సిరప్ పంపిణీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మి చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విటమిన్ ఎ పంపిణీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 17, 18 తేదీల్లో పత్రికా సమావేశాలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే జననీ సురక్షా యోజన, జె.ఎస్.ఎస్ నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. వీటితోపాటు 108 నిధుల వినియోగం, మాతృ, శిశుమరణాలకు సంబంధించి రికార్డులను సిద్ధం చేయాలన్నారు. త్వరలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి అధికారులు వచ్చి ఆయా పిహెచ్‌సిల్లో తనిఖీలు నిర్వహిస్తారని ఆమె తెలియజేశారు.
నాణ్యమైన విత్తనోత్పత్తిపై
రైతాంగం దృష్టి సారించాలి
గంట్యాడ, మార్చి 13 : నాణ్యమైన విత్తనాన్ని రైతులే స్వయంగ ఉత్పత్తి చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని విజయనగరం రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వరల్డ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గంట్యాడలో విత్తనోత్పత్తి పటల నిర్వహణ తదితర విషయాలపై రైతులకు అవగాహన సదస్సు బుధవార జరిగింది. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న రైతు శిక్షణా కేంద్రం డిడి మాట్లాడుతూ అవసరమైన విత్తనాలు కొరతగా వుండడం , విత్తనాలలో నాణ్యత లోపంవల్ల కేళీ రావడం తదితర సమస్యలు రైతాంగానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితిల్లో మేలు రకం విత్తనాల ఎంపిక, విత్తనశుద్ధి, ఎంతో ముఖ్యమన్నారు. రైతులే న్యాయంగా విత్తనాలను తయారు చేసుకునేందుకు విత్తనోత్పత్తి పధకం మండల వ్యవసాయాధికారి బి.శ్యాంకుమార్ మాట్లాడుతూ రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించి వరల్డ్ విజన్ సంస్థ అవగాహన సదస్సులు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. రైతులే స్వయగా అవసరమైన, నాణ్యమైన విత్తనాల తయారు చేసుకునేందుకు ఈ మండలానికి చెందిన వసాది,రావివలస గ్రామాలను విత్తనోత్పత్తి పధకం క్రింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వరల్డ్ విజన్ జిల్లా మేనేజర్, ఏరియా కోఆర్డినేటర్ మధుసూధనరావు, రైతు శిక్షణా కేంద్రం ఎఓ శ్రీనివాసరావు, వరల్డ్ విజన్ సిడిఓలు, రైతులు పాల్గొన్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 13: ఎండలు తీవ్రతరం అవుతుండటంతో మంచినీటి ఎద్దడి రోజు రోజుకు పెరుగుతొంది. జిల్లాలోని ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోమారు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లో రెండురోజులకోమారు సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటం, మరికొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కారణంగా ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని వివిధ గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ మోటార్ల సదుపాయం లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఉన్నప్పుడే వాటికి నీటి పంపింగ్ జరుగుతొంది. విద్యుత్‌కు అంతరాయం కలిగితే నీటి పంపింగ్ నిలిచిపోతుంది. ఇప్పటికే గ్రామాల్లో రోజుకు 12 గంటలకు పైగా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. రాష్ట్రంలో మంచినీటికి ఎక్కడా మూడు రోజులకు మించి నీటి సరఫరా జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ అవి పట్టించుకున్న దాఖలాలు లేవు. మంచినీటి సరఫరాకు నిధులున్నాయని అధికారులు చెబుతున్నా సరైన సమయంలో వాటిని వినియోగించకపోతే ప్రజలు మంచినీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడనుంది.
ప్రస్తుతం జిల్లాలోని 34 మండలాలకు గాను నాలుగు మండలాల్లో భూగర్భజలాల నీటి మట్టం ఆందోళనకరంగా ఉంది. ఎస్.కోట, చీపురుపల్లి, గర్భాం, బొండపల్లి ప్రాంతాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే భూగర్భ జలాల నీటిమట్టం మెరుగ్గా ఉన్నప్పటికీ రానున్న వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎస్.కోటలో 8.5 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, చీపురుపల్లిలో 8.86 మీటర్లు, గర్భాంలో 8.41 మీటర్లు, బొండపల్లిలో 7.4 మీటర్లు అడుగున నీటి నిల్వలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తీర ప్రాంతాల్లో కూడా మంచినీటి కొరత ఎక్కువగా ఉంది. అరకొర విద్యుత్ సరఫరాతోపాటు నీటిలో సాంధ్రత కూడా మోతాదుకు మించి ఉండటం వల్ల ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. సాధారణంగా నీటిలో జల కాఠిన్యత 2500 పిపిఎం ఉండాల్సి ఉండగా బోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 5000 పిపిఎంగా నమోదైంది. అలాగే క్లోరైడ్స్ 300 పిపిఎం కంటే తక్కువ ఉండాల్సి ఉండగా 500 పిపిఎం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులు కూడా మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాల నీటిమట్టం పెరిగేందుకు సరైన చర్యలు చేపట్టకపోతే రానున్న వేసవిలో నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
గత ఏడాదితో పోల్చి చూస్తే భూగర్భజలాలు మెరుగ్గా ఉన్నాయి. కేవలం నాలుగు మండలాల్లోనే నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని భూగర్భజలశాఖ డి.డి. ఎ.మాధవరావు తెలిపారు. భూగర్భజలాల నీటిమట్టం పెంపుదలకు ప్రణాళికను రూపొందించామని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ప్రజలు ఎక్కువగా మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారన్నారు.. అవసరమైన చోట బోర్లకు పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘త్వరలో మున్సిపల్ ప్రాంతాల్లో
4జి సేవలు’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 13: జిల్లాలో నాలుగు మున్సిపల్ ప్రాంతాలకు 4జి సేవలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైమాక్స్ పద్దతిలో పనిచేసే 4జి సేవల ద్వారా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 3జీ సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా వచ్చే నెల నుంచి అన్ని మండలాలకు వీటిని విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ ఎంఆర్‌ఎస్‌వి నాగకుమార్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 3జీ సేవలకు 23 టవర్లు, 2జీ సేవలకు సంబంధించి 188 టవర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి వీటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఎక్కువ మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగిస్తున్నందున నాణ్యమైన సేవలు అందించేందుకు 4జి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కేబుల్‌తో నిమిత్తం లేకుండా వైమాక్స్ పద్దతిలో 4జి సేవల ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునే వీలుంది. 4జి సేవలు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వినియోగం ఇప్పటికి మూడింతలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్డ్‌లెస్ ద్వారా పనిచేసే వైమాక్స్ పద్దతి ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న విషయం విధితమే.
కాగా, జిల్లాలో ప్రస్తుతం 31,500 ల్యాండ్ లైన్ కనెక్షన్లు, 9వేల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. 3.50 లక్షల ప్రి-పెయిడ్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు మొబైల్ పోస్టుపెయిడ్ 2400 కనెక్షన్లు ఉన్నాయి. రానున్న కాలంలో ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా బిఎస్‌ఎన్‌ఎల్ సేవలందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని జిఎం నాగకుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ సేవల విస్తరణకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు జి.ఎం. నాగకుమార్ పేర్కొన్నారు.
ఉగాది నుంచి 9 సరకులు రూ. 185కే పంపిణీ
తెర్లాం, మార్చి 13: రేషన్ డిపోల ద్వారా ఉగాది నుంచి 185 రూపాయలకు 9 నిత్యవసర సరకుల ప్యాకెట్లును అందజేస్తామని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి శాంతిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కిలో కంది పప్పు, కేజీ పామాయిల్ ప్యాకెట్, కిలో గోధుమ పిండి, అరకిలో పంచదార, కిలో ఉప్పు, పావుకిలో కారం, అరకిలో చింతపండు, 100గ్రాముల పసుపు అందజేస్తామన్నారు. జిల్లాలో లక్షా 62 మెట్రిక్ టన్నుల లెవీ బియ్యం సేకరించాలని లక్ష్యం కాగా ఇంతవరకు 97.579 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. బాయిల్ రైస్ 3,200 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉండగా ఇంతవరకు 675 మెట్రిక్ టన్నులను సేకరించడం జరిగిందన్నారు. 2009 నుంచి 2013వ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దీపం పథకం కింద 33వేల గ్యాస్ కనెక్షన్లు అందజేయడానికి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అందులో ఇంతవరకు 13వేల కనెక్షన్లు అందజేశామని, మిగిలినవి త్వరలో పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. ఈ నెలలో 10శాతం కిరోసిన్ తగ్గించి విడుదలైందన్నారు. ఈ తగ్గింపు జి. ఎల్.పురం, కురుపాం, మెరక ముడిదాం, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు తగ్గించడం జరిగిందన్నారు. మండల లెవెల్ స్టాక్ పాయింట్‌లో బియ్యం రాలిపోయి ఉండటాన్ని జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి టి.శాంతిరాజు గొడౌన్ ఇన్‌చార్జి నాగేశ్వరరావును మందలించారు. గొడౌన్‌లో బియ్యం రాలిపోయి కుప్పలు కుప్పలుగా ఉండటంతో తక్షణమే బస్తాలలో వేయాలన్నారు. గొడౌన్ పరిశుభ్రంగా లేనికారణంగా ఇన్‌చార్జిని ఎన్ని రోజులుగా విధులు నిర్వహిస్తున్నావ్, అసలు నీకు ఏమీ తెలిసినట్లు లేదే?రాలిపోయిన బియ్యాన్ని ఎవరు నష్టపోతారని మందలించారు. మరలా తనిఖీలకు వచ్చినప్పుడు ఎం.ఎల్.ఎస్. పాయింట్‌లో ఇలాంటి పరిస్థితితే కనిపిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పాయింట్‌లో ఉన్న బియ్యం, పంచదార వివరాలను అడిగితెలుసుకున్నారు.