Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వచ్చే నెల నుంచి రెండో విడత బాదుడు

$
0
0

విశాఖపట్నం, మార్చి 13: రెండో విడత విద్యుత్ సర్ చార్జిని భరించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలి. 2012 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన సర్ చార్జిని ఈ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విధించనున్నారు. ఒక యూనిట్‌కు 82.39 పైసులు విధించాలని ఈపిడిసిఎల్ ఎపి రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపంచింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన మీదట ఒక్కో యూనిట్‌కు 62.13 పైసలు పెంచుతూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించిన సర్‌చార్జిని ఏప్రిల్‌లో, ఆగస్ట్ సర్ చార్జిని మేలో, సెప్టెంబర్ సర్ చార్జిని జూన్‌లో చెల్లించాలి. దీనివలన ఈపిడిసిఎల్‌కు 157 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించనుంది. దీంతోపాటు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ రేట్లు అమల్లోకి రానున్నాయి. విద్యుత్ చార్జిలు ఏమేరకు పెరిగాయన్న సమాచారం ఈనెల 31న ఆయా డిస్కంలకు అందనుంది. పెరిగిన విద్యుత్ చార్జిలతోపాటు, ఈ సర్ చార్జిలను కలిపి వినియోగదారులు ఏప్రిల్ బిల్లులతోపాటు చెల్లించాల్సిందే.
ఇదిలా ఉండగా ఈపిడిసిఎల్ పరిధిలో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. మొత్తం విద్యుత్‌లో వ్యవసాయానికి గతంలో 10 నుంచి 12శాతం కేటాయించేవారు. ఇప్పుడు 20 శాతం వరకూ కేటాయించాల్సి వస్తోంది. జనవరిలో రోజుకు ఈపిడిసిఎల్ పరిధిలో 30 నుంచి 31 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగేది. అదే ఇప్పుడు 38 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని ఈపిడిసిఎల్ అధికారులు తెలియచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉండడంతో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని చెపుతున్నారు.
80 పరిశ్రమలకు ఎక్స్‌పెన్సివ్ పవర్
విద్యుత్ కోత వలన పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితుల్లో ఎక్స్‌పెన్సివ్ పవర్‌ను కొనుగోలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని యజమానులు చెప్పారు. ఇందుకోసం 80 కంపెనీలు ముందుకు వచ్చాయి. గత నెల నుంచి ఈ ఎక్స్‌పెన్సివ్ పవర్‌ను సప్లై చేస్తున్నారు. గత నెలలో యూనిట్ ఏడు రూపాయలకు విక్రయించారు. ఈ నెల యూనిట్ 12 నుంచి 13 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి, ఆయా పరిశ్రమల నుంచి ముందుగానే వసూలు చేశారు. ఇక సినిమా హాళ్ళు, ఐటి పరిశ్రమలకు 80 శాతం విద్యుత్‌ను అందిస్తున్నట్టు ఈపిడిసిఎల్ అధికారులు తెలియచేశారు.

విఆర్‌ఓకు రెండేళ్ళ జైలు శిక్ష
విశాఖపట్నం (లీగల్), మార్చి 13: లంచం తీసుకున్న కేసులో ఓ విఆర్‌ఓకు రెండు సంవత్సరాల జైలుశిక్ష, నాలుగు వేల రూపాయల జరిమానా విధిస్తూ, ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎవి రవీంద్రబాబు బుధవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సూరంపేట గ్రామం పెద్దిరెడ్డి భార్గవ నాయుడు 2001-08 మధ్య విఆర్‌ఓగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన కొండాలబత్తుల మన్మథరావు రెండున్నర ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాలని, అతని తండ్రి పేరున ఉన్న పొలం తల్లి పేరున బదలాయించాలని అర్జీ పెట్టుకున్నాడు. ఈ పనులు చేయడానికి విఆర్‌ఓ భార్గవ నాయుడు 1500 రూపాయలు లంచం అడిగాడు. దీంతో మన్మథరావు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. 2008 నవంబర్ 10వ తేదీన మన్మథరావు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎవి రవీంద్రబాబు పైవిధంగా తీర్పు చెప్పారు.

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
విశాఖపట్నం (లీగల్), మార్చి 13: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం రాజాప్రసాద్ బాబా బుధవారం తీర్పు చెప్పారు. ఈ శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ కేసుకు సంబంధించి ఎపిపి కొండ్రు అరుణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిలపాలెం మంగాపురం కాలనీకి చెందిన షేక్ వలి సైకిల్ మెకానిక్ పనులు చేస్తుంటాడు. వలికి, ఖాదీర్ బీబీతో 2001లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వీరి సంసార జీవితం కొంతకాలం సజావుగానే సాగింది. వలి నిత్యం మద్యం తాగి బీబీని శారీరకంగా, మానసింగా హింసించేవాడు. 2009 జనవరి 30వ తేదీన కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్లారు. అదను చూసుకుని భార్యను మేడపైన బెడ్ రూంలోకి తీసుకువెళ్లి చున్నీతో ఉరేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే బీబీ తండ్రికి షేక్ పీర్‌కు అనుమానం వచ్చి, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వా పరాలను పరిశీలించిన మీదట న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

ప్రజల చేతిలో అస్త్రం వినియోగదార్లచట్టం
* రేపు ప్రపంచ వినియోగదార్ల దినోత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 13: వినియోగదారుని చేతిలో పదునైన అస్త్రం. వినియోగదార్లు తమకు కలిగిన నష్టం, అసౌకర్యాలను ప్రశ్నించే స్థాయికి సామాన్య వినియోగదారుడు ఎదగాలి అప్పుడే వినియోగదార్ల చట్టానికి సాకారత చేకూరుతుంది. కీలకమైన చట్టం అమల్లో ఉన్న విషయంలో వినియోగదార్లకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయం. చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో మాత్రం ఎటువంటి కార్యాచరణకు సిద్ధం కాలేదు.
20 లక్షల పైచిలుకు జనాభా ఉన్న విశాఖజిల్లాలో రెండు వినియోగదారుల న్యాయస్థానాలున్నాయి. అయితే ఇక్కడ నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రజలకు ఈ చట్టంపై ఉన్న అవగాహన ఏపాటిదో అర్ధం అవుతుంది. కేవలం 371 కేసులు మాత్రమే ఇప్పుడు వినియోగదార్ల న్యాయస్థానంలో పెండింగ్ కేసులుగా ఉన్నాయి. దాదాపుమూడు దశాబ్ధాల కిందట భారతదేశంలో వినియోగదార్ల హక్కుల పరిరక్షణకు చట్ట్భద్రత కల్పించేందుకు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో విశ్రాంత జిల్లా జడ్జి నేతృత్వంలో వినియోగదార్ల సమస్కల పరిష్కారానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్లు పనిచేస్తున్నాయి. న్యాయమూర్తితో పాటు ఇద్దరు సభ్యులు ఈన్యాయస్థానాల్లో వినియోగదార్ల కేసులను పరిష్కరిస్తారు. వీరి పదవీకాలం ఐదేళ్ళుంటుంది. హైదరాబాద్, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం రెండేసి న్యాయస్థానాలున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నట్టు కన్పిస్తున్నా ప్రస్తుతం ఈ రెండు న్యాయస్థానాల్లోను న్యాయమూర్తుల పదవులు భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయి. ఒక కోర్టులో న్యాయమూర్తి సరోజనాయుడు 2011 సెప్టెంబర్‌లో పదవీవిరమణ చేయగా, మరో కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జగన్నాధరావు గతేడాది నవంబర్‌లో పదవీవిరమణ చేశారు. అప్పటి నుంచి న్యాయమూర్తుల నియామకం జరగలేదు. ఇక రాష్ట్ర స్థాయిలో వినియోగదార్ల హక్కుల రక్షణ కమిషన్ న్యాయమూర్తి సైతం గతేడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. ప్రజల్లో అవగాహన లేమి కారణంగా వినియోగదార్ల చట్టం పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతోంది.

యువతలో చైతన్యం రావాలి
ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే వినియోగదార్ల హక్కుల పరిరక్షణకు రూపొందించిన చట్టం ద్వారా మేలు చేకూరుతుందని జిల్లా వినియోగదార్ల సమాఖ్య అధ్యక్షుడు చాపా కుమార్ అభిప్రాయపడ్డారు. గత మూడు దశాబ్ధాలుగా వినియోగదార్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ప్రస్తుత తరంలో యువత, ముఖ్యంగా విద్యార్థులు వినియోగదార్ల హక్కుల పరిరణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. దీనిలో భాగంగానే జిల్లా సంయుక్త కలెక్టర్ సారధ్యంలో స్టూడెంట్స్ కన్స్యూమర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వీరు తమ పరిధిలో వినియోగదార్లకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను సమాఖ్య దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినియోగదారుడు తనకు కలిగిన నష్టాన్ని తిరిగి రాబట్టేందుకు కోర్టుల చుట్టూ తిరగాలన్న భయాన్ని వదిలిపెట్టాలని, ఫోరంలో కేసు నమోదు చేయడంతో పాటు న్యాయ పోరాటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదన్న వాస్తవం గుర్తించాలని సూచించారు.

కె.జి.హెచ్‌కు కొత్త పరికరాలు
* గ్యాస్ట్రోఎంట్రాలజీకి కొత్తశోభ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 13: ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలందించే కింగ్‌జార్జి ఆసుపత్రిలో ఇక అధునాతన వైద్య పరికరాలతో రోగులకు సేవలందనున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీలో విభాగంలో కొత్త పరికరాలను జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు కనీస సదుపాయాల కల్పనతో పాటు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలందించడం వల్ల కేన్సర్ రోగ లక్షణాలను ప్రాధమిక దశలోనే గుర్తించి వైద్యం చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. కెజిహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లా నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా రోగులు వస్తుంటారని, ఈఅంశాన్ని దృష్టిలో ఉంచుకుని రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ గ్యాస్ట్రోస్కోపి, కొలనోస్కోపి, డ్యుడినోస్కోపిలతో కూడిన వీడియో ఎండోస్కోపి యూనిట్‌ను కొత్తగా సమకూర్చుకోవడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. 35 లక్షల రూపాయల వ్యయంతో ఈయూనిట్‌ను నెలకొల్పడం జరిగిందన్నారు.

* ఏప్రిల్ నుంచి మళ్లీ సర్ చార్జి * యూనిట్‌కు 62.13 పైసలు పెరుగుదల * ఈపిడిసిఎల్‌కు రూ.157 కోట్ల ఆదాయం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles