కానె్వంటు నుంచి ఎప్పట్లాగే సాయంత్రం ఇంటికొచ్చేసిన ప్రణీత వాళ్ళ అమ్మతో చెప్పడం ఆరంభించింది.
‘‘మమీ... రేపట్నుంచి నేను కానె్వంటుకి వెళ్ళను. ఇంటి దగ్గరే నీ ఒళ్ళో కూచొని చదువుకుంటా!’’ అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేసింది బిక్కమొహం పెడుతూ, కొంచెం దిగులుగా.
‘‘అదేమిటి? ఎప్పుడూ ఎంతో చాకచక్యంగా చురుగ్గా కనిపించే పిల్ల ఇవాళ డీలాపడుతూ స్కూలుకెళ్ళనని మారాం చేస్తోందేమిటి!’’ అని సబిత మనసులో అనుకుంటూ... ‘‘ఏం? ఎందుకు తల్లీ! అసలేమైంది నీకీవాళ? రోజూ ఎంచక్కా కానె్వంటుకి పరుగులు పెట్టేదానివి..!’’ ఉండబట్టలేక పదమూడేళ్ళ కూతుర్ని అడిగేసింది.
‘‘నేనెళ్ళనంతే... మా సైన్స్ టీచర్.. నాతో..’’ అంటూ ఏదో చెప్పబోతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది ప్రణీత.
అంతే... సబిత గుండెలో రాయి పడినట్లయింది. జరగరానిదేదో జరుగుతోందని గ్రహించి.. ఆరా తీయడానికి ప్రణీత వద్దకు చేరింది భయం భయంగా.. దిగులుతో.
ఇలాంటి సంఘటనలు బడుల్లో నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇవి చాలా సర్వసాధారణ విషయాలైపోయాయి. గుండెల్ని పిండేసే ఇలాంటి హృదయ విదారక విషయాలు ప్రతిరోజూ మనం వింటూనే వున్నాం. పత్రికల్లో చదువుతూనే వున్నాం. టీవీ చానళ్ళలో చూస్తూనే వున్నాం. అయినా ఈ యాంత్రిక ప్రపంచంలో ఇవి షరా మామూలైపోయాయి. ఎక్కడ చూసినా సామూహిక అత్యాచారాలు, పలురకాల లైంగిక వేధింపులు.. పసికందుల నుంచి పట్టుమని పదేళ్ళయినా నిండని విద్యార్థినులపై లైంగిక వేధింపులు. కాలం మారినా మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు.
ఇళ్ళల్లోనూ, నిర్జన ప్రదేశాల్లోనూ, పార్కుల్లోనూ, బస్టాపుల్లోనూ, సిటీ బస్సుల్లోనూ, కళాశాలల్లోనూ.. చివరికి పోలీసు స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుళ్ళపైనా ఆకతాయి వేధింపులు, లైంగికపరమైన దాడులు, శీలాన్ని చెరచడాలు నేటి జనజీవనంలో ఒక భాగమైపోయింది. వీటికి తోడు యసిడ్ దాడులు.. ఆయుధాలతో విరుచుకు పడడం.. వర్తమాన వ్యవస్థ దౌర్భగ్య స్థితిగతులకు దర్పణం పడుతున్నాయ. వీటికి మూలాలు ఎక్కడున్నాయి? ఈ రకమైన వికృత పైశాచిక సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరిస్థితులకు మూలకారకులు ఎవరు? ఇలా ఆలోచించుకుంటూ పోతే... అనేక ప్రశ్నలు మనల్ని వేధిస్తాయ. కానీ, వీటికి సరైన సమాధానాలు రాబట్టలేకపోతున్నాం. ఈ అకృత్యాలకు కారణాలు ఫలానా అని చెప్పలేకపోతున్నాం!
మనకు తెలిసిన కారణాలు, వాటి వెనుక వైఫల్యాలకు ప్రధాన నేపథ్యం మన సామాజిక వ్యవస్థలోనే దాగి వుంది. కళ్ళుండీ చూడలేక.. కామాంధులై... కబోదులై... కర్కశ హృదయులై.. బరితెగించి... వావి వరుసలు మరిచి. నీచమైన చేష్టలకు ఒడిగట్టే ప్రతి ఒక్కరిలోనూ ఈ లోపం దాగి వుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆడపిల్ల క్షేమంగా జీవించడం ఎలా..? జాతిపిత గాంధీజీ చెప్పినట్టుగా... ‘ఎప్పుడైతే స్ర్తి అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలుగుతుందో, అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క’. ఈ మాటల్ని పట్టించుకునే తీరిక నేటి నేతల్లో ఎక్కడిది?
మహిళలపై వేధింపులు, శారీరక హింసను నిరోధించడనాకి ఎన్ని చట్టాలు చేసినా, దోషులకు ఎలాంటి శిక్షలు విధించినా, ఎంతగా ప్రజాగ్రహం పెల్లుబికినా.. లైంగిక వేధింపులకు, నేరాలకు, అత్యాచారాలకు, సామూహిక మానభంగాలకు పాల్పడినవారికి కనీసం చీమ కుట్టినట్లైనా అనిపించడంలేదు. బాధితుల పట్ల సానుభూతితో మహిళా సంఘాలు, ఉద్యమ కార్యకర్తలు ఐక్యరాగంతో పోరాటాలు లేవనెత్తినా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు కనిపించడంలేదు. మహిళల భద్రత విషయమై అనేక జాగ్రత్తలు తీసుకొని, సంస్కరణలు చేపడుతున్నా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఇంకా లోతుగా వెళ్లి ఆలోచిస్తే... నేరస్థుల పట్ల కఠిన శిక్షలు అమలు చేయడం, భారత శిక్షాస్మృతిలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం, మారుతున్న నాగరికత వ్యవస్థలో నైతిక ప్రవర్తన పట్ల, ఆలోచనల్లోనూ విప్లవాత్మకమైన మార్పులకు ఆచరణ రూపంలో చర్యలు చేపట్టాలి. అందుకు అంతా సమష్టిగా బాధ్యతలను నెత్తిమీద వేసుకోవాలి.
మహిళలకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చి, వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మెలిగేటట్లు అన్నివిధాలుగా ప్రోత్సహించాలి. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ ఆవశ్యకతను అందరూ గుర్తించేలా ప్రచారం చెయ్యాలి. స్ర్తి, పురుషుల ఆకర్షణలకు, ఆకతాయితనాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. లైంగిక నేరాలకు దారితీసే పరిణామాలు, వాటి పర్యవసానాలకు ఎవరు ఎలా బాధ్యులవుతున్నారో వంటి విషయాలపై విద్యార్థులకు జ్ఞానబోధ చెయ్యాలి. యువత ఆలోచనా సరళిలో మార్పును తీసుకురాగలిగితే, కొంతలో కొంతైనా ఎక్కడో ఒక ముందడుగుతో పరివర్తన వస్తుంది. నేరాలు చేసే వారిని దండించేందుకు ఎలాగూ చట్టాలున్నాయ. వీటన్నింటికంటే మానవ ప్రయత్నం ముఖ్యం. మానవత్వం ప్రధానం.
మూల కారణాలు - నివారణ మార్గాలు
ప్రస్తుత సమాజాన్ని విమర్శనాత్మకంగా- భూతద్దంలో వెదికి చూస్తే అనేక లోపాలు, మానవ తప్పిదాలు వెలుగులోకొస్తాయి.
ఉదాహరణకి మనం సభ్య సమాజంలో తిరుగాడుతున్నపుడు- మనసు వక్రమార్గం పట్టేలా అశ్లీలమైన సినిమా వాల్‌పోస్టర్లూ... అర్ధనగ్న వస్తధ్రారణలూ.. ఇంటర్నెట్‌లో పొందుపరచిన శృంగార దృశ్య చిత్రాలు, వీడియోలు.. నీలి చిత్రాలు, నవనాగరిక సమాజాన్ని భ్రష్టుపట్టించే ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ టీవీ చానళ్ళు.. అశ్లీలత శ్రుతి మించిన విదేశీ సినిమాలు, సినిమా చానళ్ళు.. బహిరంగంగానే కామ ప్రేరిత దృశ్యాలు.. జుగుప్సను కలిగించే బూతు సంభాషణలు.. సెల్‌ఫోన్లలో మెసేజ్‌ల రూపంలో పంపించే అసభ్య సమాచారాలు... సన్నివేశాలు.. చెడు సహవాసాలు.. దుర్వ్యసనాలు... ఇలా ఒకటేమిటి? వ్యవస్థనూ, వ్యక్తులనూ పక్కదోవ పట్టించడానికి అడ్డదారులు అనేకం ఉన్నాయి.
సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన పత్రికల్లో సైతం సినీ తారల అర్ధనగ్న చిత్రాలు, టీవీ చానళ్ళలో హోరెత్తిస్తున్న ‘క్రైం టైమ్’ వార్తలు.. కల్పిత పాత్రల రూపంలో నేర స్వభావాన్ని ప్రేరేపించే కథనాలు అడుగడుగునా రాజ్యమేలుతుంటే.. తెలిసీ తెలియనట్టు సెన్సారు బోర్డు అధికారులు చలన చిత్రాల పట్ల నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తుంటే- ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోవాల్సిన యువత చివరికి అధోగతికి దిగజారిపోక ఇంకేమవుతుంది?
సమాజంలో అవాంఛనీయ పోకడలను నియంత్రించే సామాజిక బాధ్యత ప్రతిపౌరుడిపైనా వుంది. వ్యవస్థలో అన్ని సంస్కరణలూ ప్రభుత్వమే చేపట్టదు. మనకు చేతనైనంత మేరకూ మనమూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటిపట్ల బాధ్యత వహించాలిసన అవసరం వుంది. దీనిని మన ప్రాథమిక విధుల్లో భాగంగా స్వీకరించాలి.
మనతోపాటు ప్రభుత్వమూ చట్టబద్ధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆదర్శవంతమైన మానవ వ్యవస్థను మహోన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన ఆశలు, ఆశయాలు సక్రమమార్గంలో కార్యరూపం దాల్చి నేర చరిత్రలేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి మార్గం సుగమమవుతుంది.
కానె్వంటు నుంచి ఎప్పట్లాగే సాయంత్రం ఇంటికొచ్చేసిన ప్రణీత వాళ్ళ అమ్మతో చెప్పడం ఆరంభించింది.
english title:
sa
Date:
Saturday, March 16, 2013