అచ్యుత రామయ్య తెల్లవారి నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని గుడి తలుపులు తెరిచాడు. దేవుడి ముందున్న నిన్నటి పూలనూ, విగ్రహానికి వేసిన నిన్నటి పూలమాలనూ తీసేస్తూ స్వామివైపు ఒకసారి చూచాడు. అతడికి స్వామి ఎందుకో దిగులుగా వున్నట్లనిపించింది. ఏమైందీ వేళ? ప్రతిరోజూ తాను స్వామికి చేస్తూన్న సేవలో లోపమా? పూజా విధానంలో అపశ్రుతా? లేక తన దృష్టిలో దోషమా? ఏమై వుంటుంది?- అన్న ఆలోచనలో పడ్డాడు పూజారి రామయ్య. యథావిధిగా పద్ధతి ప్రకారం పనులన్నీ చేసుకుంటూ వస్తూన్న ఆయనకు దిక్కుతోచలేదు. మనసు మనసులో లేదు. ఏవేవో సమస్యల్ని స్వామికి విన్నవించుకుందామనుకున్నాడు. పూజంతా పూర్తిచేసి మంగళహారతి యిస్తూ- ‘స్వామీ’ అని మొదలుపెట్టబోతున్నాడు. ఇంతలో- ‘‘ఆగవయ్యా అచ్యుతరామయ్యా!’’ అన్న మాట చెవిన పడింది. చటుక్కున కళ్లు తెరిచాడు అచ్యుత రామయ్య.
‘‘ఎప్పుడూ నీ సమస్యలేనా? ఎంత దేవుణ్ణైనా నాకూ తలకుమించిన భారాలున్నాయని ఆలోచించరా?’’ రామచంద్ర ప్రభువు అన్నట్లనిపించింది.
‘‘ఏమైంది స్వామీ? నీకూ సమస్యలేనా?’’
‘‘నాకేముంటాయయ్యా?’’ వ్యంగ్యంగా అన్నాడు రామచంద్రుడు.
‘‘అయినా ఈ భక్తులు మరీ తెలివివీరిపోతున్నారయ్యా. నేను వారికి అన్ని అవయవాలతోపాటూ అనుభవించడానికి మనసూ, ఆలోచించడానికి బుద్ధీ యిచ్చాను. వీళ్ళకు బద్ధకం మరీ ఎక్కువైంది. మనసును నియంత్రణ చేసుకోలేక- లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. బుద్ధితో ఆలోచించి, వివేకాన్ని తట్టిలేపి తమ సమస్యల్ని తామే పరిష్కారం చేసుకోవచ్చు కానీ బద్ధకం బుద్ధిని బజ్జోపెట్టేస్తుంది. అందుకే- యిదిగో యిలా నా మెదడును తింటారు. ఎలాగయ్యా... వేగేది?’’.
‘‘ఏమైంది స్వామీ?’’
‘‘ఇంకా ఏమైంది స్వామీ అని నెమ్మదిగా అడుగుతావేమయ్యా రామయ్యా? ఒక్కో భక్తుడూ ఒక్కో రకంగా వేధించి తింటున్నాడనుకో!’’
అచ్యుతరామయ్య ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు.
‘‘పెళ్లి చేస్తానా? అది నచ్చకపోతే ఏదో కారణం తల్లిదండ్రులకు చెప్పి తప్పించుకోవచ్చు కదా.. ఊహుఁ నీవు నిర్ణయించాక తప్పుతుందా? అని మళ్లీ నాకే తలంటు పోస్తారు. సరే. సమస్యలొస్తాయి సంసారమన్నాక. వెధవది బుద్ధి వుంది కదా! అదీ నేనిచ్చినట్లు వాడుకుంటారా? సొంత పైత్యం జోడించి- విపరీతంగా ఆలోచించీ- చించీ- వింత పోకడలు పోతారు. నేనిచ్చింది యిచ్చినట్లు అనుభవించి- సమస్యలొచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే ఏదైనా చేద్దును. అలా చెయ్యరే. సొంత బుద్ధితో.. దానే్నమంటారు? అదేదో యింగ్లీషు పదం. ఆ.. ‘ఈగో ప్రాబ్లం’ ఒకటి. తీరా గొంతు పట్టేసే సమయానికి నేను గుర్తొస్తాను. అదేనయ్యా... మానవ ప్రయత్నం అంటారు. బాగానే వుంది. మకరి బారిన పడ్డ కరి తన ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయి- శరణాగతికై దీనంగా ప్రార్థించాక- అప్పుడు వెళ్ళా.. కరిని కాపాడటానికి. చేసే పనిలో నిజాయితీ లేనప్పుడు నేను రుూ మనుషులకు ఎలా సాయపడగలను చెప్పు? ఆ కరి ఎంత దీనాలాపన చేసిందీ? అందుకే కదా.. ‘‘సిరికిం.. జెప్పక.. ’’ అంటూ ఉరికాను. ఇక్కడ అలాటి దీనాలాపనేవీ? కొబ్బరికాయలూ, అభిషేకాలూ అంటూ నన్ను ప్రలోభపరిచేందుకు ప్రయత్నం చేస్తారు కదా!’’
‘‘ఎవరు స్వామీ?’’
‘‘ఎవరో ఎందుకయ్యా?’’ అని స్వామి ఏదో చెప్పబోయేటంతలో భక్తులు రావడం, వారి గోత్రనామాలతో స్వామికి అష్టోత్తర శతనామార్చనలు చేయడం, మంగళహారతి, తీర్థాదికాలతో మధ్యాహ్నం వరకు అచ్యుతరామయ్య హడావుడిలో పడిపోయాడు.
తర్వాత మధ్యాహ్నం గుడి తలుపులు మూసి యింటికి బయల్దేరబోతూ వుంటే- స్వామి పిలిచినట్లైంది.
‘‘ఏమయ్యా అచ్యుతా? నే చెప్పేది సాంతం వినకుండానే వెళ్లిపోతావేం?’’
‘‘అవునవును. మర్చేపోయాను. ఏదీ యిప్పుడే కదా కాస్త తెమిలిందీ?’’ అంటూ స్తంభాన్నానుకుని కూర్చున్నాడు అచ్యుత రామయ్య- ఇప్పుడు చెప్పు అన్నట్లు బాసింపట్టు వేసుకుని మరీ కూర్చున్నాడు.
‘‘అవునూ? ఆ సంచీలో ఏమిటీ పట్టుకెళ్తున్నావ్?’’
‘‘ఏముంది స్వామీ? కొబ్బరి చిప్పలూ, స్వీటు పాకెట్లూనూ. భక్తులు తమకు సమర్పించుకున్నవే.’’
‘‘చూచావా? అవన్నీ వాళ్లు నాకోసం తెచ్చినవి. ఒక్క ముక్కైనా నాకు పెట్టవా? నైవేద్యం అంటావు- ఒక్క కోవా ముక్క, ఒక్క కొబ్బరి చెక్క అయనా నా కోసం ఉంచావా? అరటిపళ్లు అన్నీ పట్టుకెళ్తున్నావు. నా కోసం ఒక్కటైనా వుంచావా? ఇంతేనయ్యా మీ భక్తులంతా. ఇలా చూపించి అలా పట్టుకెళ్లిపోతారు. నేను తినను కాబట్టి నా ముందు పెడ్తారు- నైవేద్యం అంటూ. చూపులు నాకూ- మేపులు మీకూనా? నిజంగా నేను తింటే- రుూ ప్రసాదాలూ, నైవేద్యాలూ మీకు వుంటాయా?’’
అపరాధం చేసినట్లు తలదించుకున్నాడు అచ్యుత రామయ్య.
‘‘కక్కుర్తిపడి- పోనీ.. కాస్త పాలో మరోటో తాగినానే అనుకో. ఓ... ఇంకా పొలోమని ప్రవాహంలా జనం క్యూ కట్టి చెంబులకు చెంబులు పాలు తాగు.. తాగు.. అంటూ ఊపిరాడకుండా పోస్తారు. పొరమాలేవరకూ ఆగదనుకో ఆ ఆరగింపు. ఇక ఆ ద్రవమంటే ‘యాక్’ అనిపిస్తుందా లేదా చెప్పు? పైగా బోలెడు ప్రచారం. ఫలానా చోట ఫలానా విగ్రహం పాలు తాగేస్తూంది, తేనె జుర్రుకుంటూందని.’’
తల ఆడిస్తూనే ఇబ్బందిగా కదిలాడు అచ్యుతరామయ్య. ‘‘అసలు విషయమేమిటంటే...’’ అంటూ దేవుడేదో చెప్పబోతూ వుంటే ‘‘ఆగు స్వామి! ఆకలిగా వుంది. ఇంటికెళ్లి కాస్త్భోజనం అయిందనిపించి, నడుం వాల్చి కాసేపు, మళ్లీవస్తాను.
నీవూ కాస్త విశ్రాంతి తీసుకో’’ అంటూ లేచాడతను.
‘‘చూచావా- నా ఒక్కడి బాధా వినడానికి నీకు సమయం లేదు. నేను మాత్రం మీ అందరి చిన్నా, పెద్దా భవభవ సాగరాలు, వాటి ఘోష వినాలి. దాటించాలి. ఏమిటోనయ్యా! ఇంత స్వార్థం పనికిరాదు మరి!’’
‘‘స్వార్థం కాదు స్వామీ! అలసట. వస్తాగా మళ్లీ’’ అంటూ అచ్యుత రామయ్య సంచీ భుజాన వేసుకుని బయలుదేరాడు.
సాయంత్రం అయిదు గంటలకు మళ్లీ స్వామి, స్వామి ఎదుట అచ్యుతరామయ్య. ఈసారి అతడికి స్వామి మరీ దిగులుగా కనిపించాడు.
‘‘ఏమైంది
స్వామీ?’’
‘‘ఏవౌతుందయ్యా? ఎప్పుడూ వుండేదే. ఆ భక్తురాలు చంచల మళ్లీ వచ్చింది. ప్రతిసారీ వచ్చినపుడల్లా ఏదో ఒక సమస్య చెప్పి- తీర్చమని వేడుకుంటుంది. నా మెదడు తింటూందనుకో. మొదటి రోజు వచ్చింది. తీరిగ్గా కూర్చుని- భర్తతో తగవు పెట్టుకుంది. కళ్లనిండా నీళ్లతో- నా భర్త నేను చెప్పినట్లు వినేలా చేయి స్వామీ! నా పట్ల ప్రేమ ఎక్కువయ్యేలా చూడు స్వామీ! అంటూ ప్రాధేయపడింది. పాపం అనిపించి ఆ పనిలో పడ్డా- రెండ్రోజుల తర్వాతవచ్చి మా మధ్య గొడవలు- ఆయన తెచ్చే సంపాదన సరిపోకనే స్వామీ! ఆ మార్గమేదో చూడుస్వామీ!’’ అంది. సరే. ఆ మరుసటి రోజు వచ్చి అసలు చెప్పిన మాట వినట్లేదు పిల్లలు. వారిని దారిలో పెట్టు స్వామీ’’ అంది. నేనేమైనా మాంత్రికుడినా- మంత్రం వేసి సరిచేయడానికి? పిల్లల్ని లాలించి, బుజ్జగించి వాళ్లే ఏదోలా దారికి తెచ్చుకోవాలి గానీ అనిపించినా పోనే్ల పాపం అనుకున్నా. మళ్లీ నిన్న వచ్చి ‘స్వామీ స్వామీ’ అంది. నేనూ అదే స్థాయలో- ‘ఈ మారేమి’ అన్నా. ‘మా ఆయన ఉద్యోగం పోయింది’ అంది. ‘అదెట్లా’ అన్నా. ‘‘ఏం చెప్పను. ఇదివరకు ఇలాగే చేస్తూన్న నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి సంవత్సరం పాటు యింట్లో కూర్చున్నాడు! నా ఒక్క జీతంతో ఎన్నని సర్దడానికవుతుంది స్వామీ? చాలా యాతన పడుతున్నా రెండు నెలల నుంచీ’’ అని కళ్లనిండా నీళ్లు పెట్టుకుందా యిల్లాలు. ‘ఏదో యింత తిని- ఇంట్లో ఉంటాడులే అనుకుంటే-ఆయనకూ- ఈగోలూ, సుపీరియారిటీ కాంప్లెక్సులూ- అనుమానాలూనూ. ఎలా చేయాలి స్వామీ’ అంటూ బోరున విలపించింది. ‘ఇప్పుడు అతడికి ఉద్యోగం కావాలి అంతేగా’ అన్నా. ‘అంతే స్వామీ అంతే’ అంది. ఏదో చేద్దాంలే అనుకుంటూనే వున్నా ఇంతలో- యిందాక మళ్లీ వచ్చింది. ‘స్వామీ, స్వామీ’ అంది. ‘వినక తప్పుతుందా? చెప్పమ్మా తల్లీ’ అన్నా. అతడికి ఉద్యోగం యిప్పించినా కుదురులేదట. ఉద్యోగం చేసినా జీతం యింటికి యివ్వకుండా జల్సాలకూ, ఫ్రెండ్స్‌తో పార్టీలకూ తగలేస్తాడట! ఇదివరకు అదంతా అనుభవమేనట!
‘‘ఆ మాత్రం మొగుణ్ణి కంట్రోల్ చేసుకోలేదా ఆమె?’’ అచ్యుతరామయ్య అడిగాడు.
‘‘అయ్యో రాత.. అంత చాకచాక్యమే వుంటే- నీ దగ్గర రుూ విన్నపాలెందుకు స్వామీ’ అంటుంది.
సరే, ఉద్యోగం సంగతి అలా ఉంచితే - తనకూ తన పిల్లలకూ ఇప్పటికే పాస్‌పోర్టులున్నాయి కాబట్టి అక్కడెక్కడో అమెరికాలో ఉంటున్న వాళ్ల బంధువుల మనసులో దూరి నేను రుూమెనూ, రుూమె పిల్లల్ని అమెరికా పిలిపించుకోమని సిఫార్సు చేయాలట! ఇదెక్కడి బాగోతమో నాకర్థం కావడంలేదు. అక్కడ జీతాలు బాగుంటాయట కదా! ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని తనూ, తన పిల్లలూ బతికేస్తారుట! ‘మరి మీ ఆయన సంగతి?’ అన్నా. ఆయన్ని కూడా తీసికెళ్లడానికైతే దుబాయ్ మంచి ప్లేసట! అక్కడకు వెళితే యిక్కడాడినట్టు ఆడడానికి కుదరదట! వెంటనే పనిష్‌మెంటు వుంటుందిట. ఓరి నాయనో.. అన్ని వివరాలూ సేకరించి మరీ నా దగ్గరకు వస్తూందయ్యా, డైరెక్షన్సూ యిస్తూంది చూచావా?’
అచ్యుతరామయ్య నేలమీద పరచుకున్న తువ్వాలు దులిపి భుజాన వేసుకుంటూ లేచి యింటికి బయల్దేరాడు.
‘‘వెళ్లిపోతున్నావా.. ఔరా రామయ్యా!’’ అంటున్నట్లనిపించింది. కానీ, ఏం చేస్తాడు వెళ్లక తప్పదు.
ఒకట్రెండు రోజులు గడిచిపోయాయి ప్రశాంతంగా.
‘‘అయ్యో! అయ్యో! అచ్యుత రామయ్యా! ఆవిడ వచ్చేస్తోందయ్య. ననె్నక్కడైనా దాచేయవయ్యా’’.
‘‘నీవు సర్వాంతర్యామివి స్వామీ! నేను నినె్నక్కడ దాచగలను? కోరిన వరాలిచ్చే దేవుడివి.’’
‘‘నిజమే..! కానీ ఇలా ఇంటర్వెల్ అనేది లేకుండా దేనిమీదా నా కాన్‌సన్‌ట్రేషన్ కుదరనివ్వకుండా- ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోరికలతో నా బుర్ర తినేస్తూంటే- నా తల తిరిగిపోతుందయ్యా..! ప్లీజ్! నన్ను నీ వెనక దాచుకోవా?’’-
‘‘ఇందుగలడందులేడని సందేహము వలదు.. చక్రి సర్వోపగతిన్’’ అంటూ పొగిడించుకుని మరీ పొంగిపోయావు కదా! అవన్నీ నిజమే అయినా- ఇప్పుడు బెంబేలు పడితే ఎలా?’’
‘‘తప్పదా..?’’
‘‘తప్పుతుందా... అంతేగా మరి!’’
పుట్టపర్తి తులజాదేవి,
జీ/్య ఎన్. మురళీధర్,
ప్లాట్ నెం.16, ఇంటి నెం. 12-1-508/బి/26,
రైల్వే క్వార్టర్సు వెనుక, వౌలాలి- పోస్టు, హైదరాబాద్-40.