Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొత్త పోప్

$
0
0

ఇది, కాథిలిక్ క్రైస్తవ చరిత్రలో మరో మహా పరిణామం! చివరికి తెల్లని పొగ వెలువడింది. వాటికన్ నగరంలోని కాథలిక్ క్రైస్తవ ఆరాధనా కేంద్రం సిస్టయిన్ చాపెల్- నైవేద్యశాల- బురుజుగొట్టం నుండి బుధవారం వెలువడిన ఈ శే్వతధూమం నిర్ణాయక పరిణామానికి ప్రతీక. ఆ నిర్ణాయక పరిణామం అర్జెంటీనా దేశానికి చెందిన కార్డినల్ -మతగురువు- జోర్గే మారియో’ ప్రపంచ కాథలిక్ క్రైస్తవ మతాధిపతి-పోప్-గా ఎన్నిక కావడం, ఆయన ‘వాటికన్ నగర రాజ్యాని’-సిటీస్టే-కి కొత్త అధినేత కూడ! పోప్ పదవీ బాధ్యతలనుండి తప్పుకోవాలని పదహారవ బెనడిక్ట్ నిర్ణయించుకున్నప్పటినుంచి అనేక వారాలపాటు కొనసాగిన ఉత్కంఠ ‘జోర్గే మారియో’తో బుధవారం తొలగిపోయింది. మంగళవారం ‘కార్డినళ్ల’ సమావేశంలో పోప్ ఎంపిక కార్యక్రమం పూర్తికాకపోవడంతో ‘చాపెల్’ బురుజుగొట్టం నుండి వెలువడిన నల్లని పొగ ప్రాంగణం బయట గుమికూడిన వేలాదిమంది కాథలిక్ భక్తులకు నిరాశను కలిగించిందట! నల్లని పొగ గొట్టం నుండి వెలువడడం అనిశ్చితికి సంకేతమట! అనిశ్చిత స్థితి ఒక్కరొజులోనే తొలగిపోవడం ‘పోప్ ఎన్నిక’ మహాసభల చరిత్రలో అపురూపమైన పరిణామం! గత రెండువందల యాబయి ఏళ్లలో పోప్ ఎంపిక కార్యక్రమం కనీసం ఐదురోజులపాటు కొనసాగింది. అందువల్ల ఇప్పుడు కూడ ‘సిస్టయిన్’ నైవేద్య కేంద్రం బురుజు గొట్టం నుండి కనీసం మరికొన్ని రోజులపాటు నల్లని పొగ వెలువడుతుందని భావించిన కోట్లాదిమంది కాథలిక్ క్రైస్తవులకు రెండవరోజుననే తెల్లని పొగ వెలువడడం ఆనంద సంభ్రమాశ్చర్యాలను కలిగించిన అపురూప ఘట్టం! ఇకపై ‘పోప్ ఫ్రాన్సిస్’ నామంతో వ్యవహరించనున్న ‘కార్డినల్’ జోర్గే మారియో రెండువేల ఏళ్ళ కాథలిక్ క్రైస్తవ చరిత్రలో 266వ సర్వోన్నత మతాధికారి! కాథలిక్ మత సంప్రదాయం ప్రకారం ‘కార్డినల్’ కేవలం మతాధికారి మాత్రమే కాదు, ‘పోప్’ను ఎన్నుకొనే ప్రతినిధి కూడ! వివిధ ప్రపంచ దేశాలకు చెందిన నూట పదిహేనుమంది ‘కార్డినళ్లు’ పోప్ ఎంపికకోసం మంగళవారం వాటికన్‌లో సమావేశమయ్యేనాటికి జోర్గే మారియో గురించి అర్జెంటీనా వెలుపలి ప్రపంచంలోని కాథలిక్కులకు తెలియదు. మతనిష్ఠా వినమ్రతకు మారుపేరుగా జీవిస్తున్న జోర్గేమారియో అర్భాటం లేకుండా దైవ కార్యాన్ని నిర్వహించడం ఇందుకు కారణం. ఎంపిక సమావేశాల ఆరంభం రోజున ‘సిస్టయిన్’ నైవేద్యశాలకు ఈ ‘కార్డినల్’ అరుదెంచిన వైనం కూడ అందరినీ ఆకర్షించలేదు. నూట పదిహేను మంది ‘కార్డినల్’ ప్రతినిధులలో మూడిండ రెండు వంతుల- డెబ్బయి ఏడు మంది-మద్దతు పొంది ఈ కార్డినల్ కాథలిక్ సర్వోన్నత పీఠాన్ని అధిష్టిచగలడన్న భావం మొదటి రోజున పొడచూపనే లేదు. అందువల్లనే మొదటి రోజున నల్లని పొగ వెలువడిన తరువాత కొత్త ‘పోప్’ ఎవరన్న విషయమై ప్రచారమైన పేర్ల జాబితాలో జోర్గే లేడు! రెండవ రోజుననే తెల్లని పొగ వెలువడడంతో పాటు మచ్చలేని జోర్గే మారియో ధవళతర వ్యక్తిత్వం కూడ ఆవిష్కృతం కావడం అద్భుత పరిణామం. ప్రచారం లేకపోయినప్పటికీ ఈ అర్జెంటీనా మతగురువు విశుద్ధ జీవనం గురించి మత పెద్దలకు చిరపచితమన్న వాస్తవం ఇలా ధ్రువపడింది.
ఐరోపాకు వెలుపలి ‘కార్డినల్’ ఒకరు పోప్‌గా ఎన్నిక కావడం పనె్నండు వందల ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం పోప్ ఫ్రాన్సిన్ ప్రాధాన్యాన్ని పెంచిన మరో మహాపరిణామం! నూట ఇరవైకోట్ల కాథలిక్ క్రైస్తవ సమూహ జనాధిపతిగా వెనుకబడిన లాటిన్ అమెరికా ఖండం వాడు నియుక్తం కావడం ఇలా అపురూపమైన పరిణామం! క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో ఆసియాలోని సిరియాకు చెందిన మూడవ గ్రెగరీ ‘పోప్’ పదవికి ఎన్నికయిన తరువాత ఇప్పటి వరకు ఐరోపా ఖండానికి చెందిన వారు మాత్రమే ఈ సర్వోన్నత కాథలిక్ పదవిని నిర్వహించారు. ఈ చరిత్రగతిని మార్చడం ద్వారా పోప్ ఫ్రాన్సిస్ నూతన అధ్యాయానికి ప్రతిరూపంగా మారాడు. పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో పుట్టిపెరిగి అర్జెంటీనా పౌరుడిగా డెబ్బయి రెండేళ్ళు జీవించాడు. ఇప్పుడాయన వాటికన్ పౌరుడు, విశ్వ కాథలిక్ సమాజానికి తొలిపౌరుడు! జోర్గేమారియో తండ్రి ఇటలీ నుంచి అర్జెంటీనాకు వలసపోయాడట! రోమ్‌లోని వాటికన్ రాజ్యం కూడ ఇటలీలోనే ఉంది. అందువల్ల పోప్‌గా ఎన్నిక కావడం ద్వారా జోర్గే తన పూర్వజుల భూమికి తిరిగి వచ్చినట్టయింది. ఆయన శ్వాసకోశంలో కొంతభాగం చిన్నప్పుడే దెబ్బతినిపోయిందట! అయినప్పటికీ ఆరోగ్యం చెడని మారియో ప్రపంచ కాథలిక్ క్రైస్తవ సమాజపు శ్వాసగా మారాడు!
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాథలిక్ క్రైస్తవ సమాజం వివిధ రకాల సంక్షోభాలకు గురయి ఉండడం నూతన ‘పోప్’ ఎన్నికకు నేపథ్యం. సర్వసంగ పరిత్యాగ భావనతో మతనిష్ఠాపరులై సామాన్య క్రైస్తవులకు ఆదర్శంగా వ్యవహరించవలసిన ‘గురువులు’, ‘ప్రచారకులు’, ‘ప్రచారికలు’, ‘పూజారుల’ వివిధ రకాల అక్రమ కలాపాలకు పాల్పడిన అభియోగాలు శతాబ్దికి పైగా వెల్లువెత్తుతున్నాయి. ఒక్క ఆస్ట్రేలియాలోనే 1930వ దశకం నుండి ఆరువందలమంది పిల్లలపై కాథలిక్ మతాధికారులు లైంగిక బీభత్సకాండ జరిపినట్టు విక్టోరియాలోని ఒక ‘చర్చి’ రూపొందించిన నివేదికలో పేర్కొన్నది. ‘కాథలిక్’ సమాజంలో మతనిష్ఠ తగ్గిపోతుండడం, వివిధ ఐరోపా దేశాలలోను అమెరికా దేశాలలోను నియతంగా ప్రార్థన సమావేశాలకు హాజరవుతున్న కాథలిక్కుల సం ఖ్య సన్నగిల్లుతుండడం మరో సమస్య! ఈ నేపథ్యంలో ‘పోప్’ పదహారవ బెనిడిక్ట్ బాధ్యతలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం కాథలిక్ సమాజాన్ని కల్లోల పరచింది. ఆరువందల ఏళ్ళకు పూ ర్వం ఒక ‘పోప్’ జీవించి ఉండగానే బాధ్యతలను వేరొకరికి అప్పగించే మత సంప్రదాయం ఉండేది. కానీ ఆరువందల ఏళ్ళుగా ఒక పోప్ మరణించిన తరువాత మాత్రమే మరో పోప్‌ను ఎన్నుకుంటున్నారు. స్వచ్ఛందంగా, సర్వోన్నత మతాధికారాన్ని పరిత్యజించడం ద్వారా ‘బెనడిక్ట్’ పూర్వ సంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. కానీ ఆయన పదవీ పరిత్యాగానికి ప్రధాన కారణం కొందరు మతగురువులలో నైతిక నిష్ఠ లోపించడమన్న ప్రచారం కూడ జరుగుతోంది! నైతికనిష్ఠ సన్నగిల్లడాన్ని నిరోధించడంలో భాగంగా మత గురువులు, ప్రచారికలు, ప్రచారకులు పెళ్ళిళ్ళు చేసుకొనడానకి అనుమతించాలన్న ప్రతిపాదనలు కూడా ప్రచారవౌతున్నాయి. అందువల్ల నూతన ‘వాటికన్’ అధిపతి అనేక ఏళ్ళపాటు ముళ్ళబాటలో పయనించవలసి రావడం ఖాయం! సంక్షోభానికి గురి అయినప్పుడు సంస్కరణల కోసం కృషి చేయడం ‘పోప్’ వ్యవస్థకు కొత్త కాదు. పదహారవ శతాబ్దినాటి పోప్ మూడవ పాల్ ఇలా సంస్కరణ చిత్తంతో కాథలిక్ సమాజానికి ఏర్పరిచిన ప్రమాణాలను తొలగించడం చరిత్ర. ఏసుక్రీస్తు క్రైస్తవ మతాన్ని ప్రారంభించిన తరువాత పదిహేను శతాబ్దుల వరకు రోమన్ ‘కాథలిక్’ సంప్రదాయమే అద్వితీయంగా పరిఢవిల్లింది. పదహారవ శతాబ్దం నాటి ‘సంస్కరణవాదం’ ఫలితంగా ‘ఈస్టర్న్ ఆర్థడాక్సీ’, ‘ప్రొటెస్టాంటిజమ్’ అన్న నూతన సంప్రదాయాలు ఏర్పడి రోమన్ మత సామ్రాజ్యానికి సమాంతరంగా పరిఢవిల్లుతున్నాయి. అయినప్పటికీ రెండువందల ముప్పయికోట్లమంది క్రైస్తవులలో నూట ఇరవై కోట్లమంది కాథలిక్కులు కావడం ‘పోప్’ పదవి ప్రాధాన్యానికి ప్రతీక. వినమ్రతకు ప్రతీక అని పేరు తెచ్చుకున్న పోప్ ఫ్రాన్సిస్ సంక్షోభాల సవాళ్ల చిక్కుముడులను విడదీయగలిగితే ఆయన పరిశుద్ధత మరింతగా వెలుగొందగలదు!

ఇది, కాథిలిక్ క్రైస్తవ చరిత్రలో మరో మహా పరిణామం!
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>