దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయం వాటా క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే పరిణామం. విపరీతంగా పెరిగిపోతున్న దేశ జనాభా ఆకలి అవసరాలు తీరాలంటే, వ్యవసాయ ఉత్పతులు తదనుగుణంగా పెరగాల్సిందే! కానీ 1983లో జిడిపిలో 36.4 శాతంగా ఉన్న వ్యవసాయ రంగ వాటా 2011 నాటికి 13.9 శాతానికి పడిపోడం ఆందోళన కలిగించే పరిణామం. దీని వెనుక బలమైన కారణాలను అనే్వషించి, భవిష్యత్తులో ఆహారకొరత ముప్పునుంచి దేశాన్ని తప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. జిడిపిలో వ్యవసాయరంగ వాటా తగ్గిపోవడం ఒక్కసారిగా కాకుండా క్రమానుగతిన కొనసాగుతూ వచ్చిందన్న సంగతి గత ఎనిమిదేళ్ళ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ కాలంలో అది ఐదుశాతం మేర పడిపోయింది. ఈ పరిస్థితిలో దేశంలో వ్యవసాయరంగం క్రమంగా కునారిల్లుకొని పోవడానికి కారణాలేంటనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. పరిపాలనాపరమైన వినాశకర పద్ధతులతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయరంగం కుదేలవుతోంది. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర తక్కువగా ఉండటం వల్ల లాభసాటితనం తగ్గిపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలు,స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్ళయనా గ్రామీణాభివృద్ధి కుంటి నడకన సాగడం, పొట్టచేత పట్టుకొని నగరాలకు వలస పోవడం వంటి మానవ కార్యకలాపాలు వ్యవసాయం వెన్ను విరిచాయి. ఇక దేశవ్యాప్తంగా రుతుపవనాల దాగుడు మూతలు, కొన్ని ప్రాంతాల్లో దుర్భిక్షం, ఇంకొన్ని ప్రాంతాల్లో వరదల బీభత్సం..వ్యవసాయంపై రైతులకు విరక్తి కలిగేలా చేసాయి. వీటికి తోడు దేశంలోని ఇతర రంగాల్లో మాదిరిగా వ్యవస్థాపరమైన, సాంకేతికపరమైన ఆధునిక పద్ధతులను వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టకపోవడం..అందుకనుగుణమైన విధివిధానాలను రూపొందించకపోవడం కూడా తమవంతు పాత్ర పోషించాయి. అంతేకాదు చిన్నకారు, సన్నకారు, దళిత రైతులు, కూలీలు, మహిళలకు వ్యవసాయ రంగంలో లాభాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలు లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామీణ ప్రాంతాలనుంచి పంట ఉత్పత్తులను, మార్కెట్లకు తరలించడానికి అవసరమైన రోడ్ల సదుపాయాలు తగిన రీతిలో వృద్ధి చెందకపోవడం కూడా పెద్ద లోపం! గత దశాబ్దకాలంగా పరిశీలిస్తే ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందిన ప్రభావం వ్యవసాయ రంగంపై పడిందనేది కూడా వాస్తవం. ఇన్ని కారణాలతో వ్యవసాయరంగం కునారిల్లుకొని పోతున్నా.. వ్యవసాయరంగంలో పెట్టుబడులు పెరగడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. 2004-05లో వ్యవసాయరంగంలో నిధుల పెట్టుబడులు రూ. 69,149 కోట్లు ఉండగా 2010-11 నాటికి అవి రూ.1,30,907 కోట్లకు చేరుకోవడమే విచిత్రం. దీనికి కారణం ఊహించడం పెద్దకష్టం కాదు. 2004 సంవత్సరంలో ఒక నియమిత విస్తీర్ణంలో పెట్టే పెట్టుబడి మొత్తం, 2011 నాటికి దాదాపు రెట్టింపును దాటిపోవడం జరిగింది. ఇక్కడ పెట్టుబడుల మొత్తం పెరిగినంత వేగంగా, ఉత్పత్తుల ధరలు పెరగకపోవడం, రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోయి, పొలాలను వదిలేయడానికి, వలసలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నది. దీనివల్ల దేశంలో వ్యవసాయాన్ని వదిలిపెట్టేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో, రైతు సమాజం కుంచించుకొని పోతున్నది. ముఖ్యంగా నగరీకరణ వేగంగా చోటు చేసుకుంటున్న మహారాష్టల్రో ఇది మరింత వేగంగా కొనసాగుతోంది. ఈ పరిణామం స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థను తీవ్రం గా దెబ్బతీస్తుండగా, వలసలు పెరిగిన పట్టణాలపై జనాభా ఒత్తిడి తీవ్రం కావడానికి దోహదం చేస్తోంది.
2011-12 సీజన్‌లో దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వ్యవ సాయరంగంలో ఉత్పత్తులు లక్ష్యాలను సాధించలేకపోవడానికి కారణమయ్యాయ. ముఖ్యంగా గత రబీ సీజన్‌లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు క్షామ పరిస్థితులను చవిచూడగా, గుజరాత్, రాజస్థాన్‌లలో నైరుతి రుతుపవనాలు విఫలం కావడం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక పంజా బ్, హర్యానాల్లో నలబై శాతం వరకు తగ్గిన వాయువ్య రుతుపవనాల ప్రభావం చెప్పడా నికి అలవికాకుండా ఉంది. మహారాష్టల్రోని పూణె-సోలాపూర్-సంగ్లి-సితారా ప్రాంతా ల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల, పప్పు్ధన్యాలు, ముతక ధాన్యాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్రిసిల్ ఇండియా అంచనాల ప్రకారం 2012లో రుతుపవనాలు సమానంగా వర్షించకపోవడం, 50శాతం భూమి సాగు చేయలేని పరిస్థితుల వల్ల మొత్తం జిడిపిలో వ్యవసాయరంగం వాటా అంతకు ముందుకంటే 0.6 శాతం తగ్గుదల చూపింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాల ద్వారా 2011-12 సీజన్‌నో 539 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 624 మిల్లీమీటర్ల కంటె 13.9 శాతం తక్కువ. మరి ఇదే సీజన్‌లో ఈశాన్య రుతుపవనాల ద్వారా కురియాల్సిన సాధారణ వర్షపాతం 224 మిల్లీమీటర్లు కాగా, 113 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటె 49.6శాతం తక్కువ. మరి ఈ రకంగా వర్షపాతం తగ్గడం లేదా సకాలంలోవర్షాలు కురవకపోవడం వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
మానవ తప్పిదాలు, రుతుపవనాల దాగుడుమూతలు..కారణమేదైనా తీవ్రంగా నష్టపోవడం రైతుల వంతైంది. గత రెండు దశాబ్దాలకాలంగా చోటు చేసుకుంటున్న విపరిణామాలైతేనేమి, రైతు ఆత్మహత్యలను అరికట్టాలన్న సదుద్దేశంతోనైతేనేమి, కేంద్ర ప్రభుత్వ సన్న, చిన్నకారు రైతులను ఆదుకొనేందుకు ‘రుణమాఫీ’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందుకోసం రూ.52వేల కోట్లు కేటాయించి..ఆయా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో మొత్తం జమయ్యేలా చర్యలు తీసుకుంది. చెప్పడానికి బాగానే ఉన్నప్పటికీ, అమలులో తీవ్ర అవినీతి జరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక నిగ్గు తేల్చడంతో.. అన్ని రంగాల్లో పాతుకుపోయిన అవినీతి వల్ల ప్రభుత్వం కల్పించే లాభాలు నిజమైన లబ్దిదారులకు చేరబోవనేది మరోమారు స్పష్టమైంది. అంతే కాదు అన్నివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా వృధా అవుతున్న నేపథ్యంలో, ప్రజాకర్షక విధానాలు ఓట్ల వర్షం కురిపించకుండా అక్రమార్కులు అడ్డుపడుతున్నారనే అంశానికి ఇది మరో దృష్టాతంగా మిగిలిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కని ఈ పథకంపై తాజాగా చెలరేగిన దుమారం..దీనిపై విచారణకు ప్రధాని హామీ ఇవ్వడంతో సర్దుమణిగింది. ఇవే నిధులను వ్యవసాయరంగంలోవౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేసినట్టయితే ఎంతో ప్రయోజనం ఉండేది కదా అనే అభిప్రాయాలను కొట్టిపారేయడానికి వీల్లేదు.
2011లో దేశవ్యాప్తంగా 14,027 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైం బ్యూరో అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో 1995 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 2,70,940కి చేరుకుంది. గత దశాబ్దకాలంగా పరిశీలిస్తే రైతు ఆత్మహత్యల విషయంలో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నది మహారాష్ట్ర! 1995 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 54వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 2003 నుంచి తొమ్మిదేళ్ళ కాలంలో 33752 మరణాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు మొత్తం ఐదు రాష్టాల్లో- కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్- రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. దేశవ్యాప్త రైతు ఆత్మహత్యల్లో కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లోనే 68శాతం నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితులు ఎంతటి దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఐదింటిలో మహారాష్టల్రోనే ఆత్మహత్యలు అధికం. నేషనల్ క్రైం బ్యూరో అందించే ఈ గణాంకాలు మన కేంద్ర వ్యవసాయశాఖామాత్యులు శరద్ పవార్‌కు ఏమాత్రం గిట్టనివి. అందుకనే వాటి ప్రస్తావనను పార్లమెంటులో తీసుకొని రావడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు.
రైతు ఆత్మహత్యలు అధికంగా చోటు చేసుకునే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని ‘వ్యవసాయ రుణమాఫీ, రుణ ఉపశమన పథకం (ఏడిడబ్ల్యుడిఆర్‌ఎస్) పేరుతో 2008 మేనెలలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఈ పథకాన్ని విదర్భ (మహారాష్ట్ర)లో ప్రారంభించారు. అదే ఏడాది రైతు ఆత్మహత్యలు అధికంగా చోటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు జరిపారు. మొత్తం 3.69 కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు, ఆరవై లక్షలమంది ఇతర రైతులకు ఈ పథకం కింద రుణాలు మాఫీ అయి, కొత్త రుణాలు తీసుకోవడానికి అర్హత పొందుతారనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 77,55,227 మంది రైతులకు రూ. 115353. 75 కోట్లు మంజూరయ్యాయి. ఈ మొత్తం లబ్దిదారులకు చేరినట్లు రికార్డుల్లో నమోదైనా, వీరిలో అసలైన లబ్దిదారులెందరున్నారనేది తేల్చడం కొండను తవ్వి ఎలుకను పట్టడమే అవుతుంది.
భారతీయ వ్యవసాయ రంగం మధ్య దళారీలతో నిండివుంది. ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించినా, వాటి అమలు కేవలం కాగితాలకే పరిమితమై ఉంటోంది తప్ప ఆచరణకు నోచడం లేదు. అంతే కాదు గడచిన దశాబ్దకాలంగా పరిశీలిస్తే..దేశంలో వ్యవసాయం ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతూ..సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. మిగిలిన రంగాలతో పోలిస్తే వ్యవసాయంలో వచ్చే లాభాలు చాలా తక్కువగా ఉండటం, లేదా నష్టాలు అధికం కావడం ఈరంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి మరో ప్రధాన కారణం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో పెట్టుబడులను తగ్గించేయడం, రుతుపవనాలపై ఆధారపడాల్సి రావడం, రుణాలు అంత తేలిగ్గా అందుబాటులో లేకపోవడం వంటివి కూడా రైతులు సంక్షోభంలో చిక్కుకోవడానికి, వ్యవసాయమంటే విరక్తి చెందడానికి దారితీస్తు న్నాయ. అందువల్ల సంక్షేమ పథకాల కంటే.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే మార్గాలను అనే్వషించడం ఉత్తమం. ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షో భం నుంచి బయటపడాలంటే మరోమార్గం లేదు. అంతేకాదు సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలను అమలు చేయడం ముఖ్యం. ఏవో కొన్ని ప్యాకేజీలు ప్రకటించడం వల్ల ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదు.
దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయం వాటా క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే పరిణామం.
english title:
v
Date:
Saturday, March 16, 2013