ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నది. దీనికి కారణం అన్ని రాజకీయ పక్షాలకీ చెందిన నాయకులే. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు చాలవన్నట్లు, బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, వారిని మరింత కృంగతీసేదిగా వుంది. సుప్రీంకోర్టు తీర్పువలన ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రయత్నించకపోవడం దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పును తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి మాత్రం ఈ తీర్పువలన మనం నష్టపోయేది ఏమిలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుకు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే, వాస్తవంగా మన రాష్ట్రంకు పెద్దగా జరిగే నష్టం ఏమి ఉండదు. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి అవసరాలు అనే సాకు చూపించి, సాగునీరును వేలాది ఎకరాలకు అందించడానికి ప్రయత్నిస్తున్నది. బాబ్లీ ప్రాజెక్టుకు ఎగువన పదికి పైగా ఎత్తిపోతల పథకాలను మహారాష్ట్ర వేగంగా నిర్మిస్తూ ఉండటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సహజ న్యాయ నియమాలకు విరుద్ధంగా మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ ప్రాజెక్ట్‌కు కేవలం 10 కిలోమీటర్లు ఎగువన బాబ్లీప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2002లో చేపట్టింది. అయితే 2006వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు. గతంలో ఆల్మట్టి విషయంలో ఇటువంటి అశ్రద్ధే చూపి, తీవ్రంగా నష్టపోయిన విషయం విదితమే. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేయాలంటూ 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రాజెక్ట్‌కు గేట్లు ఏర్పాటుచేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ, మహారాష్ట్ర బాబ్లీప్రాజెక్ట్‌కు 14 గేట్లు ఏర్పాటుచేసింది. అందువలన, మహారాష్ట్ర సుప్రీం తీర్పును తు.చ. తప్పకుండా పాటిస్తుందనుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. వర్షాకాలంలో బాబ్లీ ప్రాజెక్ట్ మూసివేయకుండా పర్యవేక్షించేందుకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఈ కమిటీ ఎంతవరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గేట్లుమూయకుండా నిరోధించగలరన్నది అనుమానమే. ఇప్పటికే, మనం కావేరి జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటకల మధ్య జరుగుతున్న నీటియుద్ధాలను చూస్తూనే ఉన్నాం. అందువలన, త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేయడం వలన మనకు పెద్దగా జరిగే లాభం ఏమీలేదు. కేంద్ర జల వనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు వంటివారు, సుప్రీం తీర్పునుంచి నష్టపోకుండా, బయటపడే మార్గం చూపకుండా, ప్రాంతీయ బేధాలు సృష్టించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పువలన మన రాష్ట్రానికి పెద్దగా జరిగే నష్టం ఏమీలేదని ఆయన చెబుతున్నారు. అయితే, పోతిరెడ్డిపాడు ద్వారా విడుదలయ్యే కృష్ణాజలాల కంటే, బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా మహారాష్ట్ర వినియోగించుకొనే నీరు తక్కువని ఆయన పేర్కొంటున్నారు.
మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు ‘‘ఆత్మస్తుతి-పరనింద’’లతో, మేధావులు ప్రాంతీయ బేధాలు రెచ్చకొడుతూ కాలం గడుపుతుండగా, మహారాష్ట్ర మాత్రం వేగంగా బాబ్లీప్రాజెక్ట్, దాని ఎగువున పది ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తిచేయడంలో నిమగ్నమై ఉంది. ఇకనైనా అన్ని రాజకీయ పక్షాలు ఐక్యమై బాబ్లీప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాకపోతే, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు భూములలో మాగాణులకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నది.
english title:
b
Date:
Saturday, March 16, 2013