మార్చి 8 మహిళా దినోత్సవం జరుపుకోవడంతోపాటుగా 1961 వరకట్న నిషేధ చట్టం,2005 మహిళా గృహ హింస చట్టం అమలుచేయాల్సిన బాధ్యత తప్పక ప్రభుత్వంపై ఉంది. మహిళలను బెదిరించి లొంగ తీసుకొని, శారీరకంగా వినియోగించుకొని, మాయ మాటలు చెప్పి, వివాహం చేసుకుంటానని వెంటబడి గర్భం దాల్చిన తర్వాత పొమ్మనటంతో దిక్కుతోచని స్థితిలో అబ్బాయిలపై కేసులు నమోదు అయినా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల జోక్యంతో మహిళా కేసుల్ని అధికారులు ఏమాత్రం న్యాయం చేయటం లేదు. గర్భం దాల్చిన మహిళలు పిల్లలకు జన్మనివ్వటంతో అటు తల్లిదండ్రులు సహకరించక, ఒంటరిగా చాలా బాధలు పడవలసి వస్తున్నది. పుట్టిన బిడ్డలకు తండ్రులెవరో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. తల్లులు ఆర్థిక సామాజిక అవమానాలకు గురవుతున్నారు. మహిళా సంఘాలు ఇలాంటి మహిళలకు అండగా ఉంటున్నా రాజకీయ జోక్యంతో కేసులు నీరుగారిపోతున్నాయి. కనుక ఇలాంటి మహిళలకు సత్వరం మహిళా కమిషన్ ద్వారా న్యాయం చేసి, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ఆందోళన కలిగిస్తున్న అవినీతి
కొన్ని దేవస్థానాలలో ఆర్థికపరంగా అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో ఎందరో భక్తులు తమకు వీలైనంతగా దేవాలయాలకు విరాళాలు యిస్తుంటారు. విదేశాలలో నివసించే భారతీయులు ఎక్కువ మొత్తంలో విరాళాలు యిస్తుండడంవలన దేవస్థానాలకు ఇటీవలి కాలంలో రాబడి విపరీతంగా పెరిగింది. కొందరు అవినీతి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ విరాళాలను గుటకాయస్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రముఖ దేవస్థానాలను కాగ్ పరిధిలోనికి తీసుకురావాలి. ఆయా దేవాలయాల ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వ వెబ్‌సైట్లతో ప్రచురిస్తే భక్తుల్లో విశ్వసనీయత పెరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
- సిహెచ్.సాయిఋత్త్విక్, విశాఖపట్టణం
వైఎస్ పాలన స్వర్ణయుగం
వై.యస్.ఆర్ పాలన ఒక స్వర్ణయుగంలా నడిచింది. రాష్ట్రంలో ప్రతీ పేద- మధ్యతరగతి కుటుంబం కనీసం ఒక పథకం ద్వారా లబ్ది పొందింది అన్నది అక్షరాల సత్యం. అందుకే నేటికీ కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా వున్నారు. ఆయన అకాల మరణం తర్వాత రాష్ట్రం అంధకారంలోనికి నెట్టి వేయబడింది. సమర్థవంతమైన నాయకత్వం కొరత వలన ప్రభుత్వం పాలన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అభివృద్ధిలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. రాష్ట్రం తిరిగి పుంజుకొని అభివృద్ధి పధాన పయనించాలంటే వై.యస్.ఆర్ వంటి మహానేత నాయకత్వం లభించాలి.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
కనీస వేతనాలు లేని కంప్యూటర్ టీచర్లు
రాష్ట్రంలో సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్ టీచర్లు కనీస వేతనాలకు నోచుకోలేదు. ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించే నిమిత్తం నియమించారు. వారికి ఒక్కొక్కరికి వేతనం రు.2476. ఇది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో తెలియదు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే వేతనం కొన్ని జిల్లాల్లో చెల్లించేవారు. కొన్ని జిల్లాల్లో రూ.1900లు చెల్లించేవారు. ఒక్కొక్క పాఠశాలలో కంప్యూటర్ల నిర్వహణ వేతనాలు తదితరాల నిమిత్తం రూ.1.60 వేల పైగా ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెల్లిస్తుంది. వీరిలో బోధకుల వేతనం రూ.60వేలు మినహా మిగతా లక్ష రూపాయలు కాంట్రాక్ట్ కంపెనీవే. రాజకీయ నేతల వాటాలు వారికి ముట్టడంతో వారికి కంప్యూటర్ టీచర్ల పరిస్థితి అవసరం లేదు. రోజుకు రూ.82లు ఏ విధంగా చెల్లిస్తున్నారో ఏలుతున్న ప్రభుత్వాలకే తెలియాలి! .
- గొన్నాబత్తుల శ్రీనివాసరావు, దిబ్బిడి
మార్చి 8 మహిళా దినోత్సవం జరుపుకోవడంతోపాటుగా
english title:
c
Date:
Saturday, March 16, 2013