‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు..’ అనే సామెత అనాదిగా వాడుకలో ఉంది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి కంకణం కట్టుకుంటే, కూలదోయడానికి మేమూ మీ వెంటే..అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. దీంతో బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ తమ వంతు పాత్ర పోషించేందుకు మద్దతు పలికాయి. అయితే ఈ ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా పడనిస్తామా? అని చంద్రబాబు నాయుడు గంధర్వుని పాత్ర పోషించి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి శ్రమ లేకుండా ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. తోటి విపక్షాల అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పలకకుండా ప్రభుత్వానికి బాబు అండగా నిలబడడంలో ఏమైనా మతలబు ఉందా? అని పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఎన్నికలకు ఇంకా సుమారు 14 నెలల గడువు ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎక్కువ తప్పులు చేయించాలి, ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాతే, ప్రజా కోర్టులో ఎండగట్టి లబ్ది పొందాలని బాబు భావించారు. ఇప్పుడే ఈ ప్రభుత్వాన్ని పడగొడితే, ఐదేళ్ళూ పాలించమని ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు పడగొట్టాయని, కాంగ్రెస్ ‘కన్నీరు’ పెట్టి ఓటర్ల మనసును దోచేసుకుంటుందని, సానుభూతి పొందుతుందేమోనని చంద్రబాబు మనోగతం. పైగా ‘వస్తు న్నా...మీ కోసం’ పేరిట పాదయాత్ర చేస్తూ ప్రజాభిమానం చూరగొంటున్న ఈ సమయంలో ఎన్నికలకు పరుగెత్తడం ఎందుకని బాబు అభిప్రాయం. సార్వత్రిక ఎన్నికల గడువు వరకు ఇటు ప్రభుత్వంపై ప్రజలకు ఆశలు సన్నగిల్లుతాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గుతుందని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతి తగ్గుతుందని, తెలంగాణ ఇవ్వలేదన్న అక్కసుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారని ఇలా ఎనె్నన్నో లెక్కలతో బాబు ఉన్నారట. కాగా చంద్రబాబు నిర్ణయంపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనే అసంతృప్తులు వెల్లువెత్తాయి.
అటువంటప్పుడు బాబు తన ప్రసంగాల్లో ఈ దుష్ట కాంగ్రెస్‌ను కత్తులు, కటార్లతో నరకండి, చంపండి అని ఎందుకు పిలుపునిస్తున్నట్లు? అని కార్యకర్తల్లో మీమాంస. దీనికి పార్టీ తరపున సమాధానం లేదు. శతృవు బలహీనంగా ఉన్నప్పుడే కదా దెబ్బతీయాలి, అటువంటప్పుడు అన్ని ప్రతిపక్షాలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలదోయవచ్చు కదా? అనే కార్యకర్తల సందేహాలకు సమాధానం లేదు. 2011న డిసెంబర్ 3న కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. అప్పుడు తెలుగు దేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే, ఆ తీర్మానాన్ని మజ్లిస్ మినహా ప్రతిపక్షాలన్నీ బలపరిచాయి. అయినా తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. తోక పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేము మద్దతు ఇవ్వాలా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ రోజున కూడా తోక పార్టీలే మద్దతునిచ్చాయి కదా?.
ఈ నెల 13న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనుకున్నట్లుగానే ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందంటూ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం 14వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందజేసింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం కూడా స్పీకర్‌ను కలిసి నోటీసు అందజేసింది. ఇక చేసేది ఏముంది?, స్పీకర్ మనోహర్ ఆ రెండు నోటీసులను పరిశీలించి, 15న (శుక్రవారం) శాసనసభ ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానానికి ఎంత మంది మద్దతునిస్తున్నారని ప్రశ్నించి, తీర్మానానికి సరిపడా సభ్యుల మద్దతు లభించడంతో చర్చకు స్వీకరించారు. అసెంబ్లీ రూల్స్ (75) ప్రకారం ఒక్క సభ్యుడు కూడా తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే తీర్మానాన్ని ఎంత మంది బలపరుస్తున్నారని స్పీకర్ ప్రశ్నించినప్పుడు తప్పని సరిగా 30కి తక్కువ ఉండకూడదు.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడతామని ప్రకటించినందున, ఇక ఆలస్యమెందుకని భావించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే చర్చకు స్వీకరించాల్సిందిగా స్పీకర్ మనోహర్‌ను కోరారు. ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి కలిసి వచ్చింది. అవిశ్వాస తీర్మానంలో నుంచి తన ప్రభుత్వానికి ‘విశ్వాసం’ చూపించుకోవాలన్న ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మరోసారి పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికి కిరణ్‌కు అవకాశం చిక్కింది. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానానికి దూరంగా ఉన్నదన్న ఘాటైన విమర్శలు తెలుగు దేశం పార్టీకి మిగులుతాయి. ఎంతైనా చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా? అనే విమర్శలు వస్తున్నాయి. తనలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉంది అని లోగడ బాబు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు ఇతర ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె చికాకు, ఇబ్బంది కలిగించినా, ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ మిలీనియం మార్చ్‌తో ప్రభుత్వానికి చాలా సమస్య వస్తుందనుకున్నా, చాలా తేలిగ్గా బయటపడ్డారు. మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీని పోలీసులు అరెస్టు చేసినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి, శాంతి-్భద్రతల సమస్య తలెత్తుతుందని అందరూ భావించినా, ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసినా, ఆ సమస్య కూడా తలెత్తకుండా ముఖ్యమంత్రి బయటపడ్డారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వం కూలిపోతుందేమోనన్న భయపడినా, చివరకు తెలుగు దేశం పార్టీ అండగా నిలబడింది.
‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు..’
english title:
g
Date:
Saturday, March 16, 2013