విశాఖపట్నం, మార్చి 16: కేంద్ర సహాయ మంత్రి డి పురంధ్రీశ్వరి ఎట్టకేలకు బెట్టువీడారు. పంతాన్ని పక్కన పెట్టి సర్దుకు పోతే పోలా అనుకుంటూ సంయమనాన్ని పాటించారు. ఈనెల 17న భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి డి పురంధ్రీశ్వరి తలపెట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించి వివాదానికి తెరదించారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాకు చెందిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు పురంధ్రీశ్వరి, గంటా శ్రీనివాసరావు మధ్య చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదం సుఖాంతమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 17 విశాఖ ఏజెన్సీ పర్యటన జిల్లాలో పర్యటిస్తున్నారు. అదే రోజు కేంద్ర సహాయ మంత్రి డి పురంధ్రీశ్వరి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భీమునిపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌లో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకపక్క ముఖ్యమంత్రి, మరోపక్క కేంద్ర సహాయ మంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఇద్దకీ ప్రాధాన్యతనివ్వాల్సిందే. ఇదే అధికారులకు శిరోభారమైంది. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అవడంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండటం సంప్రదాయం. ఇదే సందర్భంలో భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో కేంద్ర సహాయ మంత్రి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును సంప్రదించారు. అక్కడ మొదలైంది అసలు వివాదం. సిఎం జిల్లాలో పర్యటిస్తున్న దృష్ట్యా కేంద్ర మంత్రి పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ద్వారా మంత్రి గంటా శ్రీనివాస రావు కేంద్రమంత్రి కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. అయితే ఈవిషయంలో కేంద్ర మంత్రి తరపునుంచి ఘాటైన సమాధానం రావడంతో సమస్య జఠిలమైంది. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కేంద్రమంత్రి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మాట వాస్తవమేనని మంత్రి గంటా ప్రకటించడంతో ఈ అంశానికి విశేష ప్రాచుర్యం లభించింది.
అయితే శనివారం నగరానికి వచ్చిన కేంద్ర సహాయమంత్రి పురంధ్రీశ్వరిని ఈవిషయమై విలేఖరులు వివరణ కోరగా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. అయితే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు తనకు మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోందన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. ఒకే పార్టీలో ఉంటున్న తాము కుటుంబ సభ్యుల్లాంటి వారమని, స్పర్ధలుంటే కలసి చర్చించుకుని పరిష్కరించుకుంటామని వివాదానికి తెరదించారు. అయితే ఈఎపిసోడ్ వరకూ ఇద్దరి మధ్య పోరు సుఖాంతమైందని భావించినా జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం, తదితర అంశాల్లో ఇద్దరి అభిప్రాయాలు మాత్రం పరస్పర విరుద్ధంగానే ఉండటం విశేషం.
ఇది కార్మిక విజయం
* భెల్‌లో బిహెచ్‌పివి విజయంపై పురంధ్రీశ్వరి
* కార్మికులకు అండగా ఉంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: బిహెచ్‌పివి కార్మికులకు ఏసమస్య వచ్చినా పరిష్కారానికి తనవంతు కృషి అందిస్తానని కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి డి పురంధ్రీశ్వరి హామీ ఇచ్చారు. భెల్‌లో బిహెచ్‌పివి విలీనాన్ని పురస్కరించుకుని కార్మికులు కేంద్ర మంత్రిని శనివారం ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భెల్‌లో వినీనం కార్మిక విజయంగా పేర్కొన్నారు. నష్టాల ఊబిలో చిక్కుకున్న బిహెచ్‌పివిని ప్రైవేటీకరిస్తే టేక్‌ఓవర్ చేసేందుకు పలు ప్రైవేటు సంస్థలు ఎదురు చూశాయని, ఇదే సందర్భంలో అప్పటి పార్లమెంట్ సభ్యులు ఎన్ జనార్ధన రెడ్డి అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకున్న జనార్ధన రెడ్డికి కార్మికులు రుణపడి ఉంటారన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుక తాము చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ మద్దతుగా కార్మికులు చేసిన పోరాట ఫలితమే విజయానికి కారణమని అన్నారు. తనకు సన్మానాలు, సత్కారాలు అవసరం లేదని, మీలో ఒకరిగా గుర్తిస్తే చాలని భావొద్వేగం నడుమ ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్ణీత గడువులోగానే వుడా ప్రాజెక్టులు పూర్తి
* రాష్ట్ర మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన విశాఖ నగరాభివృద్ది సంస్థ (వుడా) చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థాగతంగానే కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పెట్టుబడులు,వౌలిక సదుపాయా కల్పన శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వుడా నిర్మిస్తున్న హరిత హౌసింగ్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను విసి ఎన్ యువరాజ్‌తో కలసి శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధానాలు, ఇతర కారణాల వల్ల జాప్యమవుతున్న ప్రాజెక్టులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణ కాంట్రాక్టరు లేవనెత్తిన వివాదం ఫలితంగా అర్ధాంతరంగా ఆగిన హరిత హౌసింగ్ ప్రాజెక్టును కొనసాగించేందుకు ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఈప్రాజెక్టును 18 నెలల కాలంలో పూర్తి చేసి కేటాయింపు దార్లకు అప్పగించే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు. వుడా ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులను విడదీసి ఒకే సారి పూర్తయ్యేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగపూర్ క్లాస్ టౌన్‌షిప్‌గా చేపట్టిన ఈప్రాజెక్టు పనుల్లో నాణ్యత పరంగా ప్రమాణాలకు భంగం కలుగకుండా చూడటంతో పాటు జరిగిన పనుల్లో నాణ్యతాలోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 710 అపార్ట్‌మెంట్ యూనిట్లతో 2009లో 120 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకూ కేవలం 25 కోట్ల రూపాయల పనులు మాత్రమే పూర్తయ్యాయని, జాప్యం కారణంగా 40 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుందని విసి యువరాజ్ మంత్రి గంటాకు వివరించారు. కేటాయింపుదార్లపై అదనపు భారం పడకుండా ఉండేందుకు సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించామని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి కేటగిరీ బ్లాకులను, ఇప్పటికే సిద్ధం చేసిన నమూనా యూనిట్‌లను మంత్రి గంటా పరిశీలించారు. అనంతరం మంత్రి, వుడా అధికారులు కైలాసగిరి హెల్త్ ఎరీనా ప్రాజెక్టును సందర్శించారు. విశాఖ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి గంటా అధికారులకు సూచించారు. జాగింగ్, సైక్లింగ్ అవసరాలకు వేర్వేరుగా ట్రాక్‌లతో పాటు జిమ్, మెడిటేషన్ కేంద్రాలను అదనపు హంగులతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈనెలాఖరులోగా జాగింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వుడా అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో పలు శంకుస్థాపనలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: జిల్లా ఏజెన్సీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పలు శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం విశాఖ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి జికె వీధి మండల కేంద్రానికి చేరుకునే ముఖ్యమంత్రి అక్కడనుంచి రోడ్డుమార్గాన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సమగ్ర గిరి ప్రగతి సదస్సులో పాల్గొంటారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) పథకం కింద 528 కోట్లతో 962కిమీ మేర నిర్మించనున్న 246 రోడ్ల పనులకు సంబంధించి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. గిరిజన ప్రాంతంలో వైద్య సేవలను సమర్ధవంతంగా అందించేందుకుగాను అధునాతన సదుపాయాలతో కూడిన 108 అంబులెన్స్ (జీప్)లను ప్రారంభిస్తారు. తక్కువ బరువుతో అడ్వాన్స్ లోకేషన్ ట్రాలర్ (ఎవిఎల్‌టి)లను ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. వైద్య పరికరాలతో కలిపి ఒక్కో వాహనానికి 10 లక్షల రపాయలను వెచ్చించనున్నారు. జిల్లాలోని 11 గిరిజన మండలాల్లోను 12 వాహనాలను ఇందుకోసం సమకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాహనాలను 78 మంజూరు చేశారు. చింతపల్లి మండలంలో 78.9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటి వరకూ చింతపల్లిలో కేవలం30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది. చింతపల్లి, జికెవీధి, కొయ్యూరు, జి మాడుగుల మండలాలకు చెందిన గిరిజనులకు ఈఆసుపత్రి అందుబాటులో ఉంటుంది. అలాగే గిరిజన ప్రాంతంలో లోఓల్టేజి సమస్యను పరిష్కరించేందుకు గాను చింతపల్లిలో 26కోట్ల రూపాయల వ్యయంతో 133 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు 16 కోట్లతో సౌరవిద్యుత్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. తద్వారా ఏజెన్సీలోని 57గ్రామాలకు ఈ సదుపాయం కల్పించాలని భావించగా ఇప్పటికే 46 గ్రామాల్లో పూర్తి చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిరిజనులతో ముఖాముఖి చర్చిస్తారు. వనసంరక్షణ సమితి సభ్యులకు వెదురు ఎగుమతులకు సంబంధించి పర్మిట్లను అందజేస్తారు. ఈపర్యటనలో ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రులు జైరాం రమేష్, వై.కిశోర్‌చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొంటారు.
వెదురు రవాణాకు అనుమతులివ్వాలి
* సిపిఎం కార్యదర్శి నర్సింగరావు
విశాఖపట్నం, మార్చి 16: గిరిజనులందరికీ వెదురు రవాణా అనుమతులు ఇచ్చి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం కార్యదర్శి డిమాండ్ చేశారు. అడవి నుంచి వెదురు రవాణా చేసి అమ్ముకునేందుకు గిరిజనులకు ఆమోదం తెలిపే పథకాన్ని ప్రారంభించడానికి ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి జైరాంరమేష్ జికె వీధి వస్తున్నారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దాడుగుల, మున్నవారిపల్లె వన సంరక్షణ సమితి (విఎస్‌ఎస్) సభ్యులకు వెదురును రవాణా చేసి అమ్ముకునే హక్కుపత్రాలను మాత్రమే పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఇది వెదురు హక్కు పత్రాలు విఎస్‌ఎస్‌లకే కాకుండా ఇతర అటవీ ప్రాంతాలన్నింటికి వర్తింపుచేయాలన్నారు. 1997లో ప్రపంచబ్యాంకు నిధులతో ప్రారంభించిన విఎస్‌ఎస్‌లో ఫలసాయం నేటికీ గిరిజనులకు పూర్తిగా అందడంలేదన్నారు. ఇపుడు వెదురు రవాణా అనుమతులు సమితి సభ్యులకు మాత్రమే ఇవ్వడం సరైందికాదన్నారు. విఎస్‌ఎస్‌లు చాలా పరిమితిమైన ప్రాంతాల్లో అటవీ అభివృద్ధికాని ప్రాంతాల్లో వేశారన్నారు. కానీ తరతరాల నుంచి సామాజిక అటవీ ప్రాంతంలోనున్న వెదురు కూడా చట్ట ప్రకారం గిరిజనులకు చెందాలన్నారు. ఆ వెదురుకు కూడా గిరిజనులకు అనుమతినివ్వాలని, అపుడు మాత్రమే గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని, అలా కాకుండా విఎస్‌ఎస్‌లకు మాత్రమే పరిమితం చేస్తే అత్యధిక గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం వెదురు అమ్ముకునేందుకు అనుమతులను అమలు చేసి ఉండాల్సి ఉందన్నార. ఏడేళ్ళ తరువాడ అమలు చేయడాన్ని ఆరంభిస్తున్నారని, గిరిజనుల అభివృద్ధిపట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియజేస్తోందన్నారు. కేంద్రమంత్రి జయరాంరమేష్ సిఎంకు 2009 అక్టోబర్‌లో లేఖ రాసారని, దానిని గుర్తుచేస్తూ తిరిగి 2001 మార్చిన 21న మరోసారి లేఖ రాసారన్నారు. దాని ప్రకారం అటవీ హక్కుల చట్టంలో సంయుక్త అటవీ యాజమాన్యం కమిటీలు వేయాలని అప్పటికీ ఉన్న వాటిని పునర్నిర్మించాలని తెలిపినా ఇంతవరకు గ్రామాల్లో ఆ కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం లేకుండా ఏ విధంగా అమలు చేస్తారని జిల్లా గిరిజనశాఖామంత్రిని ప్రశ్నించారు. ఆ కమిటీ గ్రామ సభల తీర్మానం ప్రకారం ఈ వెదురు రవాణా, భూమిపై హక్కులు ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే 2006 చట్టం ప్రకారం గిరిజనులందరికీ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ నేటికి అత్యధిక గిరిజన కుటుంబాలకు భూ అధికార పత్రాలు ఇవ్వలేదన్నారు. బాక్సైట్ ప్రాంతాల్లో ఒక్క గ్రామంలో కూడా ఇవ్వలేదని, ఇంతవరకు అటవీశాఖాధికారులు కొన్ని కోట్ల విలువైన వెదురును స్వాధీనం చేసి అమ్ముకుంటున్నారన్నారు. దీనినిబట్టి గిరిజనాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని అర్ధమవుతోందన్నారు. సంయుక్త అటవీ యాజమాన్యం కమిటీలు ఏర్పాటు చేయకుండా ఇపుడు హడావిడిగా పథకాన్ని ప్రారంభిస్తే గతంలో పథకాల మాదిరి ప్రచార ఆర్భాటంగా మారుతోందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టకుని లబ్ధిపొందాలని దీనిని చేస్తున్నారన్నారు.
ప్రత్యక్ష పోరాటానికి బిఆర్‌టిఎస్ బాధితులు సిద్ధం
* కార్యాచరణ కమిటీ ఏర్పాటు
* పనులు అడ్డుకోవాలని నిర్ణయం
సింహాచలం, మార్చి 16: సింహాచలం కారిడార్‌లో బిఆర్‌టిఎస్ బాధితులు న్యాయం జరిగేంతవరకు ప్రత్యక్ష పోరాటం చేయాలని తీర్మానం చేశారు. వేపగుంట పైడిమాంబ కాలనీ నుండి పాత అడవివరం వరకు రహదారికి ఇరువైపులా బాధితులు శనివారం సాయంత్రం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. రెండు వందలకు పైగా ఇళ్ళు విస్తరణలో పోతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలు సైతం సమావేశానికి హాజరై తమ ఆవేదనను వెళ్ళగక్కారు. కమిటీ తీసుకున్న ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని, అవసరమైతే త్యాగాకు కూడా సిద్ధమేనని కమిటీకి భరోసా ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ తొలుత పనులు అడ్డుకోవాలని నిర్ణయించారు. వందల సంవత్సరాల నుండి నివాసముంటున్న వారిని తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో వ్యతిరేకించింది. హక్కులను కాలరాసేలా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థలాలను ఆక్రమించుకొని ఉన్న బాధితులకు అనుకూలమైన ప్యాకేజీలు ఇచ్చివందల ఏళ్ళ నుండి నివాసముంటున్న బాధితులకు అన్యాయం చేయడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తమ వద్ద న్యాయపరంగా ఎదుర్కొడానికి అవసరమైన అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని బాధితులు చెప్పారు. అభివృద్ధికి ఆటంకం కలిగించాలన్నది తమ ఉద్దేశం కాదని ఉన్న గృహాలు తొలగించి పొమ్మంటే ఎక్కడికి పోతామని బాధితులు ప్రశ్నించారు. గోశాలవ రాంనగర్, రామకృష్ణ పురం, చినగదిలి, పెదగదిలి ప్రాంతాల్లో బాధితులకు ఇచ్చిన ప్యాకేజిని తమకు వర్తింప చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. బిఆర్‌టిఎస్ రహదారి విస్తరణలో ఎన్నో ఆక్రమణలు చోటు చేసుకున్నాయని కమిటీ ఆరోపించింది. రహదారి ప్రణాళికా యుతంగా కాక రాజకీయ ఒత్తిళ్ళకు, జివిఎంసి ఉద్యోగుల నిర్లక్ష్యానికి అనుకూలంగా రోడ్డును మార్పులు చేశారని కమిటీ ఆరోపించింది. అధికారులు స్పందించి ఇళ్ళు కోల్పోతున్న బాధితుల గోడు వినిపించుకోవాలని లేదంటే పోరాటం తీవ్రంగా ఉంటుందని బాధితులు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పాశర్ల ప్రసాద్, లోగిశ మాధవ రావు, డాక్టర్ నాగేశ్వర రావు, సూరిబాబు, పాలవలస రాంబా, ఇజ్జురోతు సత్యారావు, అక్కిరెడ్డి అప్పారావు, వై.రామారావు, భీమేశ్వర రావు పాల్గొన్నారు.
బిఆర్‌టిఎస్ బాధితుల వినతులు పరిశీలిస్తాం
సింహాచలం, మార్చి 16: బిఆర్‌టిఎస్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితుల వినతులు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ హామీ ఇచ్చారు. సింహాచలం కారిడార్ విస్తరణ నేపథ్యంలో జరుగుతున్న మార్కింగ్ పనులను శనివారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది బాధితులు కూడా కమిషనర్‌ను కలిసారు. బాధితులు పరిస్థితిని కమిషనర్‌కి వివరించేందుకు ప్రయత్నించారు. స్థలానికి స్థలం, టిడిఆర్ సర్ట్ఫికెట్లు నష్టపరిహారం అంశాలపై గతంలో పనిచేసిన అధికారులు ఇచ్చిన హామీలను విలేఖరులు కమిషనర్ వద్ద ప్రస్తావించారు. స్థలానికి స్థలం ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని కమిషనర్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బాధతులకు కొంత వరకు న్యాయం చేసే అంశాలను సూచనప్రాయంగా చెప్పారు. తెల్లకార్డు ఉన్నవారికి 50 గజాల సథలం ఇచ్చే అవకాశం ఉంని, మిగిలిన స్థలానికి టిడిఆర్ సర్ట్ఫికెట్ ఇవ్వవచ్చని అన్నారు. నిర్మాణాలు కోల్పోయిన వారు వేరేచోట ఇళ్ళు నిర్మించుకోడానికి దేవస్థానం అడ్డుకునే అవకాశం ఉందన్న ప్రశ్నపై కమిషనర్ స్పందిస్తొ ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని, పరిష్కారం కడూ చూపే అవకాశం ఉందని కమిషనర్ అన్నారు. బాదితులకు సంధించిన వివరాలు, హక్కులపై సర్వే నిర్వహిస్తామని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు.
క్లీన్, గ్రీన్ విశాఖ కార్యక్రమానికి చురుగ్గా సన్నాహాలు
విశాఖపట్నం (జగదాంబ), మార్చి 16: క్లీన్ విశాఖ-గ్రీన్ విశాఖ డంప్ ఫ్రీ కార్యక్రమ ప్రారంభానికి చురుగ్గా సన్నాహాలు చేయాలని కమిషనర్ ఎంవి.సత్యనారాయణ పేర్కొన్నారు. తన చాంబర్‌లో శనివారం ఉదయం అధికారులతో డంప్ ఫ్రీ విశాఖ కార్యక్రమ కార్యాచరణపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కని కార్యాచరణ ప్రణాళికతో కాల సూచికను అనుసరించి కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. అధికారులంతా వారికి నిర్దేశించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి వ్యర్థరహిత విశాఖగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి శనివారం ఈ కార్యక్రమం పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారని ఆయా కార్యక్రమాలలో ప్రగతి కల్పించాలని హితవు పలికారు. కంపోస్టు యార్డుల ఎంపిక, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు, పొడిచెత్త నిల్వ కేంద్రాల ఏర్పాటు, కార్యక్రమానికి కావలసిన ప్రచారం, పుష్‌కార్డులు తదితర సామాగ్రిని సమకూర్చుకోవాలని కోరారు. అదే విధంగా కాపులుప్పాడ చెత్త నిల్వ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక, ప్రస్తుతమున్న తోపుడుబళ్ళు, వాహనాల మరమ్మతులు, ప్రచార కార్డుల ముద్రణ తదితరమైన వాటి గురించి పలు ఆదేశాలు జారీ చేశారు. రైతుబజార్లు, మార్కెట్లు, చికెన్‌సెంటర్లు, కళాశాల నుండి సేకరించవలసిన చెత్త, వ్యర్థాల సేకరణపై నిర్ధిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. క్లీన్ విశాఖ, గ్రీన్ విశాఖ డంప్ ఫ్రీ కార్యక్రమ ఇన్‌ఛార్జి పి.పూర్ణచంద్రరావు కార్యక్రమం ఏర్పాట్లు ప్రగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు కె.రమేష్, బి.నాగేంద్రకుమార్, ప్రధాన ఇంజనీర్ మి.జయరామిరెడ్డి, ప్రధాన వైద్యాధికారి డివి.రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.బాలకృష్ణ, ఎస్‌ఇలు స్పోర్ట్స్ డైరెక్టర్ వై.శ్రీనివాసరావు, డిఇఓ లక్ష్మీనరస తదితరులు పాల్గొన్నారు.
కళ్లలో ఇసుక కొట్టి నాలుగు తులాల బంగారం చోరీ
చోడవరం, మార్చి 16: మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తి కళ్లలో ఇసుక కొట్టి సుమారు నాలుగు తులాల బంగారు వస్తువులు దుండగులు పరారైన సంఘటన మండలంలోని లక్ష్మీపురం పాలసంఘ భవన సమీపంలో శుక్రవారం రాత్రి సంభవించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. కింతలి గ్రామానికి చెందిన పెదపూడి చిన్నారావు అనకాపల్లి నుండి తమ గ్రామానికి మోటార్ బైక్‌పై వెళ్తూ లక్ష్మీపురం పాల సంఘం భవన సమీపంలో మూత్రవిర్జన కోసం బండినుండి మూత్రవిసర్జన చేస్తుండగా మోటార్ బైక్‌పై అతనిని వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తులు అతని వద్దకు వెళ్లి కళ్లలో ఇసుక చల్లి చేతికి ఉన్న ఉంగరాలతో పాటు జేబులో కవరుతో ఉన్న సుమారు నాలుగుతులాల బంగారు వస్తువులను తస్కరించుకుపోయారు. కాసేపటికి చేరుకున్న బాధితుడు పెదపూడి చిన్నారావు లబోదిబోమంటూ దుండగుల కోసం తన స్నేహితులతో కలసి వెదికినప్పటికీ దుండగులు కనిపించలేదు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
రూ. రెండుకోట్లకు టోపీ
పరారైన ఫైనాన్షియర్
అనకాపల్లి టౌన్, మార్చి 16: అంజయ్యకాలనీలో నివశిస్తూ అక్కడి వారితో గత ఇరవై ఏళ్లుగా కలిసిమెలసి జీవనం సాగిస్తూ అక్కడ స్థానికుల అండ దండలతో ఫైనాన్సు చేస్తూ అక్కడి వారి వద్దనండి అందిన డబ్బులు వసూలు చేసి అంతే నమ్మకంగా ఇల్లు మారుతున్నానని నమ్మబలికి సుమారు రెండుకోట్లు వసూలు చేసి పత్తాలేకుండా పరారైన సంఘటన అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకొంది. దీనికి సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గాంధీనగరం అంజయ్య కాలనీకి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అదే కాలనీలో నివశిస్తూ తన చుట్టుపక్కల కాలనీ ప్రజల వద్ద నుండి అలాగే విశాఖపట్నంలో గల ప్రజల వద్దనుండి సుమారు రెండుకోట్ల రూపాయలు వసూలు చేసి వారికి అధిక వడ్డీ ఆశచూపి ఈనెల 14న తుమ్మపాలలో కొత్త ఇంటికి మారుతున్నానని చెప్పి కనబడకుండా పరారయ్యాడు. తన సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. దీంతో బాధితులు అతని సొంత ఇల్లు అదేకాలనీలో ఉండటంతో ఆ ఇంటికి బాదితులు తాళాలు వేసి ఉంచారు. అయితే మరికొందరు వ్యక్తులు ఆ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఇంటి తాళాలు పగులగొట్టి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో అక్కడి స్థానికులు వారితో వాగ్వివాదానికి దిగడంతో ఫైనాన్షర్ తమకు అప్పుబాకీ ఉన్నాడని, ఇల్లు తనకా పెట్టాడని ఈ ఇల్లు తమదని చెప్పి అక్కడివారిని బెదిరించి తరిమేశారు. దీంతోవారు లబోదిబోమంటూ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో మంగాపురం రమణ, వేగి వరలక్ష్మి, సూరిశెట్టి లక్ష్మి, ఇళ్ల లక్ష్మి, సూరిశెట్టి ఉమ, మళ్ల దేవి, ఎస్. కుమారి, బి. కుమారి తదితరులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.