సీతంపేట,మార్చి 16:రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అటవీ జంతువులకు రక్షణ కల్పించాల్సిన సంబంధిత అటవీశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో జంతువులు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాలను కోల్పోతున్నాయి. అటవీ ప్రాంతంలో జంతువులు సంచరించే ప్రదేశాల్లో మంచినీటి కోసం ట్యాంకులు,కుండీలు ఏర్పాటు చేస్తున్నామని అటవీశాఖాధికారులు చెబుతున్నప్పటికి అవి ఆచరణలో కనిపించడం లేదనే చెప్పాలి. దట్టమైన అటవీ ప్రాంతంలో వేసవిలో నీరు లభించక వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. సీతంపేట ఏజెన్సీలో దోనుబాయి, పొల్ల, మానాపురం, రూపాయి, మేకవ, అంటికొండ, గజిలి, కుసిమి వంటి ప్రాంతాల పరిధిలో రిజర్వ్‌ఫారెస్ట్ ఉంది.అనవసర ప్రాంతాల్లో అటవీశాఖ పనులు చేపట్టి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా ఏజెన్సీ అడవుల్లో సంచరిస్తున్న ఏనుగులు మంచినీటి కోసం గ్రామాలకు సమీపంలో ఉన్న చెరువులు,గెడ్డలు,గుంతల పై ఆధారపడి దాహార్తిని తీర్చుకుంటున్నాయి.మరోవైపు అటవీశాఖ ఏరియల్ సర్వే జరపకుండా ఎక్కడ చెరువులు తవ్వితే వన్యప్రాణులకు ఉపయోగంగా ఉంటుందో అంచనాలు వేయకుండా మైదాన ప్రాంతాలకు సమీపంలో గతంలో లక్షలు వెచ్చించి తవ్వించిన చెరువులు,గుంతలు ఇప్పుడు ఏడారిని తలపిస్తున్నాయి. ఎక్కువగా మార్చి,ఏప్రిల్,మే నెలల్లో అటవీ ప్రాంతం నుండి దుప్పులు, అడవిమేకలు, జింకలు ఎక్కువగా మైదాన ప్రాంతాలకు దాహార్తిని తీర్చుకొనేందుకు వచ్చి వేటగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. వందల సంఖ్యలో పక్షులు వేసవితాపానికి నేలరాలుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు వెచ్చిస్తున్న నిధులు ఏమైపోతున్నాయో సంబంధిత శాఖాధికారులకే తెలియాల్సి ఉంది. ఏజెన్సీలో దాదాపు రెండు వేల హెక్టార్‌లలో అడవులు విస్తరించగా వేలాది రకాలైన అటవీ జీవులు సంచరిస్తున్నాయి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో గిరిజనుల పంటలు నాశనం అవుతుండడంతో ఆ గ్రామాల పరిసరాల వైపు కూడా అటవీశాఖాధికారులు చూడని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా చిన్నజీవుల మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది. క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు కూడా పత్తా లేకుండా పోయాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం ఏనుగులు దాహార్తి తాళలేక పెదరామ అనే గ్రామ సమీపంలో సంచరించి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే గతంలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో నీటి కుండీలు ఏర్పాటు చేస్తామని అటవీశాఖాధికారులు చెప్పినప్పటికీ తొమ్మిది చోట్ల మాత్రమే అవి ఏర్పాటు చేస్తున్నారు.నిజానికి అటవీశాఖ ఏర్పాటు చేస్తున్న 9 నీటి కుండీలు చాలని పరిస్థితి ఉంది.కాని ఏనుగులు ఇప్పటికి గిరిజన గ్రామాల సమీపంలో సంచరిస్తూనే ఉన్నాయి. ఇక నైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి వన్యప్రాణుల సంరక్షణ నిమిత్తం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రాముడికి దిక్కెవరు?
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
దైవాదీనం జగత్సర్వం మంత్రాదీనం తు దైవతమ్
తన్మంత్రం బ్రహ్మణాదీనం బ్రాహ్మణో మమదేవతా
జగత్తు అంతా దేవుడి ఆదీనంలో ఉంది. ఆ దేవుడు మంత్రానికి అదీనుడు. మళ్లీ ఆ మంత్రమేమో బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంది. కాబట్టి బ్రాహ్మడే నాకు దేవుడు - అని సంస్కృతంలో ఓ శ్లోకం ఉంది. కొంచెం మార్పులతో ఇప్పుడూ అంతే! ప్రపంచం దేవుడి చేతిలో ఉంది. ఆ దేవుడు పాలకవర్గాల చేతిలో ఉన్నాడు. మళ్లీ ఆ పాలకవర్గాలేమో వ్యాపారుల చెప్పుచేతల్లో ఉన్నాయి. కాబట్టి వ్యాపారమే మనకు దేవుడు. అందుకే - జి.టి.రోడ్డులో రామమందిరం కూల్చేసినా పాలరాతి మందిర నిర్మాణానికి చుట్టుపక్కల వ్యాపారులంతా ముప్పై లక్షలు పోగేసారు. కళింగరోడ్డులో వ్యాపారులు లేకపోవడంతో ఏడేళ్లయైనా అక్కడ రాముడు మొండిగోడల మధ్యనే దూపదీప, నైవేద్యాలు అందుకుంటున్నాడు. పాపం.. 2005 సంవత్సరంలో కళింగరోడ్డు విస్తరణ, అభివృద్ధి అంటూ అప్పటి ముఖ్యముంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేసారు. 2006లో కళింగరోడ్డులో డిఎస్పీ కార్యాలయం పక్కనే గల రామమందిరాన్ని అవసరం మేరకు మున్సిపల్ అధికారులు భూసేకరణ చేసారు. ఇప్పుడు జి.టి.రోడ్డు రాముడు గుడి పునఃనిర్మించాలంటూ ఉద్యమిస్తున్న మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ, భారతస్వాభిమాన్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి శ్రీనివాసానందసరస్వతి, హిందూపరిరక్షణకు చెందిన వివిధ సంస్థలు, థార్మికసంస్థలు ఉన్నాయి. కాని - కళింగరోడ్డు విస్తరణలో నిస్సహాతంగా మిగిలిపోయిన రాముడు కోసం ఉద్యమం కాదు కదా..కనీసం తొంగి చూసిన నాథుడే లేడు.
సహజంగానే రామమందిరాలకు శతాబ్ధాల చరిత్ర కలిగి ఉంటాయి. అలాంటి మందిరాలు కొల్లగొట్టేపనిలో ఎప్పటికప్పుడు రాజకీయనేతలు ముందువరుసలో ఉంటారు. ఏమంటే - రోడ్లు అభివృద్ధి చేయాలని, విస్తరణ జరపాలని, సుందరమైన సిక్కోల్ నిర్మించాలని చెబుతుంటారు. తీరా మందిరాన్ని కూల గొట్టిన తర్వాత అపచారం జరిగిపోయిందని లెంపలు వేసుకుంటుంటారు. అపచారాలు జరగడం సిక్కోల్‌లో కొత్తకాదు. దేవుడికి నిముషమైన విశ్రాంతి ఇవ్వకుండా పాన్పువేసిన మరుక్షణమే పక్కమీంచి లేపేసీ సుప్రభాతాన్ని ఆందుకోవడం అరసవల్లి ఆదిత్యుడు నుంచి ఉన్న అపచారమే! అంతకంటే అపచారం ఏముంటుందని సిక్కోల్‌లో పాలకులు చెప్పుకొచ్చే చివరి మాట. అన్నిటికంటే జోకు ఏమిటంటే కొత్తగా జి.టి.రోడ్డులో కూల్చేసిన రామమందిరాన్ని పునఃనిర్మాణం చేయాలని ధార్మిక సంస్థలు, తెలుగుతమ్ముళ్లు మూకుమ్మడిగా ఉద్యమించారు. వారి ఉద్యమాలకు అదిరోబెదిరో మళ్లీ జి.టి.రోడ్డులో 125 సంవత్సరాల రాతికట్టడాలకు భిన్నంగా మరో రెండువందల సంవత్సరాలు ఉండేలా పాలరాతితో రామమందిరం నిర్మాణానికి నడుంకట్టారు. జి.టి.రోడ్డులో గల వ్యాపారులంతా ముప్పై లక్షల రూపాయల వరకూ పోగేసి నిర్మించేందుకు మే 29న. శంకుస్థాపనకు మూహూర్తం ఖరారు చేసారు. అక్కడే విజయాంజనేయ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇదంతా ధార్మికసంస్థలు, ప్రతిపక్షనాయకులు చేపట్టే పోరాటాలో.. లేక రామమందిరాన్ని కూల్చినా..కట్టినా అధికార పార్టీయే చేయాలన్న కానె్సప్టో. అందుకే మంత్రి ఒక మాటతో విరాళాలు పోగయ్యాయి. ఏడేళ్ల క్రితం కళింగరోడ్డులో పురాతనమైన రామమందిరాన్ని కూల్చేసి మొండిగోడలతో సీతారాములు, లక్ష్మణుడు విగ్రహాలకు రోడ్డుపై నీడలేకుండా చేసిన ఇదే కాంగ్రెస్ పాలకులు అక్కడ మందిరం మళ్లీ నిర్మించేందుకు నడుం కట్టలేదు. అప్పుడూ ఈ ధార్మిక సంస్థలు, కాసాయవస్త్రాలు వేసుకున్న స్వామీజీలు, పీఠాలు, ప్రతిపక్షనేతలు ఉన్నారు. వారి దృష్టికి పాపం కళింగరోడ్డులో ఉన్న రామమందిరం పునఃనిర్మించాలన్న ఆలోచన రాలేదు. అప్పటి నుంచి కళింగరోడ్డులో రాముడు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకునే వారే లేరు. పాపం కళింగరోడ్డు ‘రాముడు’ చేసిన పాపం ఏమిటో?
కస్తూరిబా పాఠశాల బాలికలకు అస్వస్థత
పొందూరు, మార్చి 16: మండల కేంద్రంలోని పొందూరులోని కస్తూరిబా గాంధీ విద్యాలయంకు చెందిన 50 మంది బాలికలు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 104 మంది బాలికలు అభ్యశిస్తున్న ఈ పాఠశాలలో ఒకేసారి 50 మంది బాలికలు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలకు లోనుకావడం ఆందోళన కలిగించింది. వెంటనే వీరిని స్థానిక 30 పడకల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యాధికారి చింతాడ హరనాధ్ బాలికలకు సత్వర వైద్యసేవలందించారు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం వసతి గృహంలో మధ్యాహ్నం కోడిగుడ్డు, రాత్రి వంకాయకూర, రసంతో భోజనం పెట్టారని అస్వస్థతకు గురైన బాలికలు తెలిపారు. ఆ తరువాత తాడివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎ.ఎన్.ఎం ఇచ్చిన ఐరన్‌మాత్రలను వేసుకున్నామని వివరించారు. శనివారం వేకువజామున విపరీతమైన కడుపునొప్పి వచ్చిందని, ఆ తరువాత వాంతులు, విరోచనాలు అయ్యాయని చెప్పారు. 50 మంది బాలికలు ఇదే పరిస్థితిని ఎదుర్కోవడంతో తమ ప్రాణాలపై ఆశపోయిందని వారు ఏడుస్తూ చెప్పారు. ఈ విషయంపై పాఠశాల ప్రత్యేకాధికారి సన్యాసప్పడుతో ప్రస్తావించగా ఎ.ఎన్.ఎం ఇచ్చిన మాత్రలు వికటించడంతో తమ పాఠశాల బాలికలు అస్వస్థతకు గురయ్యాయన్నారు. దీనిపై ఎ.ఎన్.ఎం సుగుణతో ప్రస్తావించగా ఉన్నతాధికారులు పంపిణీ చేసిన మాత్రలనే తాను వారికి అందజేశానన్నారు. ఆసుపత్రి వైద్యులు హరనాధ్ మాట్లాడుతూ బాలికలు తిన్న ఆహారం కలుషితమైనందునే ఈ విధంగా జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పొందూరు ఎస్.పి.హెచ్.ఒ చంద్రనాయక్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తాడివలస పిహెచ్‌సి ఇచ్చిన ఐరన్ మాత్రలను పరిశీలించి వాటిని వాడవద్దని సూచించారు.
.
పలాస నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా
తెరపైకి మరో నేత?
పలాస, మార్చి 16: జిల్లాలో వైకాపా గ్రూపు రాజకీయాలకు పలాస నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నియోజకవవర్గ సమన్వయకర్తగా వజ్జ బాబురావును అధిష్ఠానం ప్రకటించగానే పార్టీలో గ్రూపుల గోల తారాస్థాయికి చేరింది. పార్టీలో రెండు వర్గాలుగా వీడిపోయిన కణితి, వజ్జ వర్గీయులు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జరిగిన సంఘటన పోలీసు స్టేషన్ వరకు చేరింది. అయితే నియోజవర్గంలో వజ్జ తీరుపై మాజీ ఎంపి కణితి విశ్వనాథం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనను పార్టీ పెద్దల వద్ద సవివరంగా కణితి వర్గీయులు వివరించడంతో అధిష్ఠానం సీరియస్‌గా పరిగణించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో నియోజవర్గ సమన్వయకర్తగా వజ్జ బాబూరావును తక్షణమే మార్చే ఆలోచనను పార్టీ పెద్దలు చేస్తున్నట్లు తెలిసింది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా మరోనేతను తెరపైకి తీసుకొచ్చేందుకు పార్టీ రాష్ట్ర నేతలు సమాలోచన చేసినట్లు వినికిడి. పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కుంభపాటి రవికి అప్పగిస్తామని కణితి వర్గీయులకు అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ నేత ఎంపికపైనా కణితి వర్గీయులు వ్యతిరేకించినట్లు సమాచారం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకముందే అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయాలని కణితి కోరినట్లు అతని వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయమై శ్రీకాకుళం పార్లమెంటరీ వైకాపా సమన్వయకర్త రవిని ఫోన్‌లో సంప్రదించగా ఇప్పటి వరకు పార్టీ అధిష్ఠానం నుండి ఎటువంటి సమాచారం లేదని, పార్టీ అంతర్గత విషయాలను చెప్పలేనని సమాధానం దాటవేసారు. మరోవైపు కణితి విశ్వనాధం ఆంధ్రభూమితో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన సంఘటనలు అధిష్ఠానానికి వివరించామని, వారు తీసుకున్న నిర్ణయానికి తామంతా కట్టుబడతామని ముగించారు.
స్ర్తినిధి బ్యాంకు ద్వారా రూ.17 కోట్ల రుణాలు
* డి.జి.ఎం సూర్యనారాయణ
నరసన్నపేట, మార్చి 16: జిల్లాలో స్ర్తినిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘ సభ్యులకు 24 గంటల్లో రుణాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బ్యాంకు జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.సూర్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక ఐకెపి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. 2011, అక్టోబర్ ఆరవ తేదీన స్ర్తినిధి బ్యాంకు ప్రారంభోత్సవం చేశామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల రుణాలు పంపిణీ లక్ష్యంగా చేసుకోగా మొబైల్ కీపింగ్‌లో పలు సమస్యలు రావడంతో లక్ష్యాన్ని అధిగమించలేకపోయామన్నారు. ప్రస్తుతం మొబైల్ కీపింగ్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించామని, దీనిని మహిళా సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్ర్తినిధి బ్యాంకు ద్వారా అందుకున్న రుణాలను 24 నెలల్లోగా చెల్లింపులు చేయాలన్నారు. ఈ రుణాలను వ్యవసాయం, పాడిపరిశ్రమ, వ్యాపారాభివృద్ధి, వివాహం, విద్య, ఆరోగ్యంపై మాత్రమే అందజేస్తున్నామని చెప్పారు. రుణం కావాల్సిన వారు మహిళా మండలి సమాఖ్యకు సమాచారం అందించాలని, వీరికి 24 గంటల్లో రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 1800 గ్రూపుల్లోని 7,534 మంది మహిళలకు ఈ రుణాలను అందజేశామని పేర్కొన్నారు. ఈయన వెంట డిఆర్‌డిఏ అదనపు పి.డి కె.్ధర్మారావు, ఏరియా కోఆర్డినేటర్ రవికుమార్, ఎపిఎం గోవిందరాజులు ఉన్నారు.
ధరల నియంత్రణలో కాంగ్రెస్ విఫలం
* మాజీ మంత్రి కళావెంకట్రావు
లావేరు, మార్చి 16: ధరల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి, దేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. మండలంలో లోపెంట, కేశవరాయునిపాలెం, మురపాక, చినమురపాక గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో శనివారం పార్టీ తరఫున పల్లెకుపోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ రైతు పక్షపాతినని చెప్పుకొంటూ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. దేశం పార్టీ అధికారంలోకి వచ్చే గడువు ఎంతదూరమూ లేదన్నారు. కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేష్, పి.మధుబాబు, పార్టీ నాయకులు వెంకటేష్, జనార్ధనరావు, షేక్‌భాషా, కేశవరావు, సిరిపురపు జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.
23,500 ఎకరాలకు సాగునీరు
* జిల్లా కో-ఆర్డినేటర్ సూర్యనారాయణ
నరసన్నపేట, మార్చి 16: జిల్లాలో మెట్ట్భుములకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను మంజూరుచేసిందని జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ ఎస్.సూర్యనారాయణ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 42 ఎత్తిపోతల పథకాలను నిర్మించామని, అయితే వీటిలో 34 నీటిపథకాలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా 23,500 ఎకరాలకు సాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు. పాతపట్నం, పెద్దపద్మాపురం, రుషికుద్ద, బెంకిలి, ఈదుపురం, గుండపల్లి, ఇంగుపేట, మండ ఎత్తిపోతలపథకాలు నిలిచిపోయాయని, వీటి మరమ్మతులకు ఆరుకోట్ల రూపాయల వరకు ప్రతిపాదనలు పంపించామన్నారు. కొరసవాడ గ్రామంలో 500 ఎకరాలకు సాగునీరందించేందుకు నాలుగుకోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రైతులకు అవగాహన పరిచేదిశగా ఈ నెల 23వ తేదీన మండల కేంద్రంలో జరిగే సదస్సుకు ల కలెక్టర్ సౌరభ్‌గౌర్ రానున్నారని పేర్కొన్నారు.
ఎపిఎంకు సహ చట్టం కమిషన్ నుండి తాఖీదు
సారవకోట, మార్చి 16: ఇందిరాక్రాంతి పథం ఎ.పి.ఎం ఉమారాణికి సమాచార హక్కు కమీషనర్ ఈ నెల 18, 20 తేదీల్లో హాజరు కావాలని తాఖీదులు జారీ చేశారు. మండలంలోని బుడితి మాజీ సర్పంచు మెండ సన్యాసిరావు, అవలింగి గ్రామానికి చెందిన బోర నారాయణరావులు ఈ చట్టం కింద గ్రామాలలోని స్వయంశక్తి సంఘాల వివరాలను అడిగారు.
ఈ వివరాలు ఇవ్వడంలో స్థానిక ఎపిఎం ఉమారాణి తీవ్ర జాప్యం చేయడంతో అర్జీదారులు రాష్టక్రమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. సమాచార చట్టంను అమలుచేయాల్సిన బాధ్యత గల అధికారిణి ఈ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కమీషనర్ అర్జీదారులు కోరిన పూర్తి సమాచారంతో తనముందు హాజరుకావాలని ఎ.పి.ఎం.ను ఆదేశించారు. అర్జీదారులకు కూడా ఆయా తేదీలలో హాజరుకావాలని సూచించారు. అర్జీదారులు కోరిన పూర్తి సమాచారంతో హైదరాబాద్ వెళ్లడానికి ఎ.పి.ఎం సిద్ధమయ్యారు.
పర్యాటక రంగానికి పెద్దపీట
శ్రీకాకుళం(టౌన్), మార్చి 16: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఈ దిశగా పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం శనివారం జిల్లా కలెక్టర్‌కార్యాలయంలో ఎజెసి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే విధంగా జిల్లాను తీర్చిదిద్దాలన్నారు. అరసవల్లి, శ్రీకూర్మంలలో పర్యాటక అతిథి గృహాలలో ఆలయ అధికారులు ఫర్నీచర్‌ను సమకూర్చారన్నారు. దానిని వెంటనే వినియోగించాలన్నారు. అతిథి గృహాల పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమించాలని, జనరేటర్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. శ్రీముఖలింగం వద్ద అతిథి గృహాలు ఈ మాసాంతానికి పూర్తిచేసి వచ్చే నెల మొదటివారంలో అప్పగించనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు సత్యనారాయణ తెలియజేయగా అక్కడ కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బారువ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటుకు, తేలినీలాపురం వద్ద సమాచార కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించి అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషా ఖాసీం, జిల్లా పర్యాటక అధికారి ఎల్.రమేష్, సెట్‌శ్రీ సి.ఇ.ఒ వి.వి.ఆర్.ఎస్.మూర్తి, వంగర ప్రత్యేకాధికారి సి.హెచ్.మహలక్ష్మీ, సోంపేట ప్రత్యేకాధికారి, సహాయ పర్యాటక అధికారి నారాయణరావు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా
ముద్రణకు సిద్ధంగా ఉండాలి
* రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంతరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 16: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్లు జాబితా ముద్రణకు ఈ నెల 20వ తేదీన అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంతరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌తో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్ నుండి అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు ఫోటో గుర్తింపు జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని గ్రామ పంచాయతీలు వారీగా జాబితాను తయారుచేయాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బి.సి ఓటర్లు ఓట్లను మార్కింగ్ చేయాలన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.నాగిరెడ్డి, కమీషనర్ రాంగోపాల్, డిఆర్వో నూర్‌భాషాఖాసీం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఇ.ఒ పాల్గొన్నారు.
ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వీడియోకాన్ఫరెన్సు అనంతరం జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఓటర్లు గుర్తింపు జాబితా తయారీలో తప్పులు జరుగకుండా చేయాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ శానిటేషన్ పనులు సక్రమంగా జరుగడం లేదని, దీనిపై దృష్టిసారించాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మందస, మార్చి 16: మండలంలోని కొత్తపల్లి జాతీయరహదారి వద్ద శనివారం సాయంత్రం కటక్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్‌లోడ్‌తో వెళ్తున్న లారీ మరో లారీని తప్పించబోయి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన లారీ క్లీనర్ కె.సత్యానారాయణ(58) అక్కడికక్కడే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం అకులమల్లం గ్రామానికి యలమంచిలి స్వామి (15) అనే ప్రయాణీకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి తండ్రి యలమంచిలి సత్తిబాబుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సత్తిబాబు ఎడమచెయ్యికు, శరీరభాగాలకు తీవ్రగాయాలయ్యాయి. వీరువురు ఇచ్ఛాపురంలో అప్పడాలు కొనుగోలు నిమిత్తం వచ్చి స్వగ్రామానికి తిరిగి ప్రయాణమవుతుండగా ప్రమాదానికి గురయ్యారు. స్వామి పదవ తరగతి పరీక్షలు రాయాల్సి వుంది. లారీ డ్రైవర్ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలానికి హెచ్‌సిలు నాగార్జున, విజయకుమార్‌లు వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కె.గోవిందరావు తెలిపారు.
చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 16: చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల అభివృద్ధి మండలి సమావేశం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమల ప్రతిపాదనలు కనీసం వంద వరకు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. వివిధ ఆహార పరిశ్రమలకు వచ్చిన అన్ని ప్రతిపాదనలు ప్రాజెక్టు రిపోర్టులు త్వరితగతిన పరిశీలించి వాటిని ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమలకేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణను ఆదేశించారు. కొబ్బరి రైతులతో 110 సంఘాల ఏర్పాటు చేశామని, తద్వారా వివిధ సంస్థల నుండి ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. జిల్లాకు అధిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. అధికంగా చిన్నతరహా పరిశ్రమలు రావడం వల్ల జిల్లా తలసరి ఆదాయం పెరగగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో డిఆర్వో నూర్‌భాషాఖాసీం, డిఆర్‌డిఏ పి.డి పి.రజనీకాంతరావు, వ్యవసాయశాఖ జె.డి మురళీకృష్ణారావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ ఇన్‌చార్జి ఉప సంచాలకులు వై.ఎస్.ప్రభుదాస్, ఐటిడిఏ ప్రాజెక్టు వ్యవసాయాధికారి బి.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.