మహబూబ్‌నగర్, మార్చి 17: ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే చర్యలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ అన్నారు. ఈనెల 21న తెలంగాణ వాదులు చేపట్టనున్న సడక్ బంద్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో పాటు పోలీసు అధికారులు జాతీయ రహదారిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తిమ్మాపూర్ నుండి అలంపూర్ చౌరస్తా పుల్లూరు గేటు వరకు పోలీసు 30 యాక్టును అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. 44వ జాతీయ రహదారిపై నిత్యం వేలాదిగా వాహనాలు, లక్షలాదిగా ప్రజలు ప్రయాణిస్తుంటారని, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు శాఖ తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 44వ జాతీయ రహదారిపైనే కాకుండా పరిసర ప్రాంతాలలో పది కిలోమీటర్ల మేర పోలీసు యాక్టు అమలులో ఉంటుందని అన్నారు. నిబంధనల మేరకు పోలీసు యాక్టు అమలులో ఉన్న ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని, ఇప్పటికే జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధించామని అన్నారు. ప్రజలు గుంపులుగుంపులుగా జమగూడటం కూడా నిషేధించబడిందని ఎస్పీ వెల్లడించారు.
ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే చర్యలను అరికట్టేందుకు పోలీసు శాఖ
english title:
police act 30
Date:
Monday, March 18, 2013