ముంబయి, మార్చి 17: మనదేశ ఉత్పాదక రంగం శాతం జిడిపిలో 25 శాతానికి చేరినట్లయితే రానున్న కాలంలో ఉత్పాదక రంగంలో ప్రపంచంలోనే అయిదవ స్థానాన్ని చేరవచ్చునని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికలో అంచనా వేసింది. ఉత్పాదక రంగంలో ప్రస్తుతం మనదేశం ప్రపంచ దేశాలలో తొమ్మిదవ స్థానంలో ఉంది. దేశ వృద్ధిరేటులో ఉత్పాదక రంగ వాటా 25 శాతానికి చేరితే త్వరలోనే మనదేశం ఈ రంగంలో అయిదవ స్థానానికి చేరవచ్చునని బోస్టన్ గ్రూప్ అభిప్రాయపడింది. 2022వ సంవత్సరానికి జిడిపి వృద్ధిరేటులో మనదేశ ఉత్పత్తి రంగం 25 శాతానికి చేరేలా జాతీయ ఉత్పాదక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం ఈ రంగం వాటా జిడిపిలో 15 శాతం ఉంది. మన జాతీయ ఉత్పాదక విధానాన్ని పరిశీలించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి), ఆ విధానంలో నిర్దేశించిన 25 శాతం వాటాను ఉత్పాదక రంగం పెంచుకున్నట్లయితే ప్రపంచ దేశాలలో భారత్ ఉత్పాదక రంగంలో అయిదవ స్థానానికి తేలికగా చేరుతుందని అంచనా వేసింది.
కాగా ఉత్పాదక రంగంలో అత్యధిక సామర్ధ్యం ఉన్నప్పటికీ వృద్ధిరేటులో అందుకోవాల్సిన లక్ష్యాన్ని మనదేశం సాధించలేకపోతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రంగం నిలకడగానే ఉంది. ఈ రంగంలో నిపుణుల కొరత లక్ష్య సాధనకు అవరోధంగా ఉందని, సరైన వేతనాలు లేక నిరుద్యోగులు ఈ రంగం పట్ల ఆకర్షితులు కాలేకపోతున్నారని, అంతేకాక ఈ రంగంలో ఉద్యోగాల స్థాయి తదితర విషయాలలో నిరుద్యోగులలో సరైన అవగాహన, చైతన్యం కల్పించడంలో కూడా విఫలమైనట్లు ప్లేస్‌మెంట్ కమిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రాంగణ నియామకాలలో ఉత్పాదక రంగంవైపు ఉద్యోగాలలోకి ప్రవేశించాలని భావిస్తున్న విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని ఆ సర్వే తెలియచేసింది.
చైనా ఉత్పాదక రంగంతో మనదేశం పోటీ పడలేకపోవడానికి ఇదో ప్రధాన కారణమని ఆ సర్వే వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక ఉత్పాదక రంగమైన అమెరికాలో హెచ్చు వాటా సాధించేందుకు భారతదేశానికి అవకాశం ఉంది. అందుకు మనదేశంలో కార్మిక జనాభా ఎక్కువగా ఉండడం, ఇతర దేశాలతో పోలిస్తే కార్మికుల వేతనాల భారం తక్కువగా ఉండడం ఒక వరమయినా ఆ విషయంలో కూడా మనదేశం సరైన వాటాను పొందలేకపోతోందని ఆ సర్వే తెలిపింది.
బోస్టన్ కన్సల్టెన్సీ అంచనా
english title:
u
Date:
Monday, March 18, 2013