మహబూబ్‌నగర్, మార్చి 18: టిడిపికి మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడూ రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు పంపించారు. తాను ఎన్నో పదవులను రాష్ట్రంలో నిర్వహించానని, ఐదుసార్లు క్యాబినేట్ మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, తనకు పదవులపైన ఆశ లేదని తెలిపారు. తన లాంటి వారు పార్టీని వీడుతున్నారంటే బలమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని, టిడిపి ఆవిర్భవమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని, అలాంటి పార్టీ ప్రభుత్వాన్ని నేడు అవిశ్వాసంలో రక్షించడం అంటే చంద్రబాబు ఘోరమైన తప్పిదం చేశారని అన్నారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప తెలంగాణ కోసం చంద్రబాబునాయుడు ఏ పోరాటం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం చేయాలనే తపనతోనే తాను టిడిపికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం వైపు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జెఎసి కార్యక్రమాలలో పాల్గొంటానని, ఈనెల 21న జరిగే సడక్ బంద్‌లో పాల్గొంటానని తెలిపారు. కాగా చంద్రశేఖర్ రాజీనామా చేయడంతో టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు జితేందర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి చంద్రశేఖర్ స్వగృహానికి వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.
టిడిపికి మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ రాజీనామా చేశారు
english title:
chandra shekhar
Date:
Tuesday, March 19, 2013