అన్ని వర్గాలనూ మోసం చేశారు
* బికె పార్థసారథి (టిడిపి)
బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది. ఇక నిత్యం కరవులకు గురయ్యే ప్రాంతాల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఒక స్పష్టత లేదు. ఇక సాగు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం కరవులతోసతమతమయ్యే ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై ఒక స్పష్టత లేకపోవడం దారుణం
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్
* శంకరనారాయణ (వైకాపా)
ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్. ప్రస్తుత బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసం కాకుం డా ఎన్నికల కోసం తయారు చేసింది. దీని వల్ల ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. వ్యవసాయం, చేనేత రంగాల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై బడ్జెట్ లో స్పష్టత లేకపోవడం దారుణం.
అన్నదాతను మోసం చేసే బడ్జెట్
* జగదీష్ (సిపిఐ)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతను నమ్మించి మోసం చేసే బడ్జెట్‌గా ఉంది. అన్నదాతను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన నాయకులు అసెంబ్లీ సాక్షిగా అన్నదాతను మోసం చేశారు. జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నా బడ్జెట్‌లోజిల్లాకు అన్యాయం జరిగింది.
అంకెల గారడీ బడ్జెట్
* ఓబుళకొండారెడ్డి(సిపిఎం)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్ గా ఉంది. నిత్యం కరవులకు గురయ్యే ప్రాంతాల గురించిన ప్రస్తావన బడ్జెట్ లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. వైద్యనాథన్ కమిటీ, జయతీ ఘోష్ కమిటీలు చేసిన సిఫార్సులపై ఎక్కడాప్రస్తావన లేదు. రైతు సంక్షేమం కోసం ఆ కమిటీలు చేసిన సిఫార్సులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై ఎలాంటి ప్రస్తావనలు లేకపోవడం గమనార్హం. నిత్యం కరవులకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న విధానాల వల్ల సన్న,చిన్న కారు రైతుల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. వారి అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై బడ్జెట్ లో ఒక స్పష్టత లేదు. ఈ బడ్జెట్ పూర్తీగా కార్పొరేట్ వ్యవసాయానికి ఉపయోగపడే బడ్జెట్ గా ఉంది.
నిరాశా జనకమైన బడ్జెట్
* ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ
హిందూపురం: మహాత్మాగాంధీ సూక్తి పేరిట ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా కేవలం ధనవంతులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉందంటూ విమర్శించారు. కేవలం కమీషన్లు దండుకొనేందుకే సాగునీటి తదితర రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జలయజ్ఞం, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి వంటి రంగాలకు కమీషన్లు దండుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదు. మైనార్టీల ఓట్లను దండుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.1027 కోట్లు మాత్రమే ఆ రంగానికి కేటాయించింది. రూ.3 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేయగా మూడో వంతు మాత్రమే మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం బాధాకరం. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ఆలోచించాలి.
ఇది జనరంజక బడ్జెట్
* ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో వుంచుకొని ప్రవేశ పెట్టిన బడ్జెట్ జనరంజకం. విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు వంటి రంగాలను దృష్టిలో వుంచుకొని బడ్జెట్‌లో కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల ఆయా వర్గాల అభ్యున్నతికి అవకాశం ఏర్పడింది. విద్య, వైద్య రంగాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించడం వల్ల ఆయా రంగాలు పురోభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రైతుల రుణాలపై రూ.లక్ష దాకా ఏమాత్రం వడ్డీ లేదు. రూ.3 లక్షల వరకు తీసుకొనే పంట రుణాలకు పావలా వడ్డీ హర్షణీయం. ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని పంటలకు నష్టపరిహారం. హెక్టార్‌కు అదనంగా రూ.10 వేలు నష్టపరిహారం చెల్లింపు ఆదర్శప్రాయం. మహిళా సంఘాలకు రూ.5 లక్షల దాకా జీరో వడ్డీ అమలు చారిత్రాత్మకం. యువకులను ప్రోత్సహించే విధంగా ప్రతి నియోజకవర్గానికి స్టేడియం నిర్మాణం విశేషం. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో వుంచుకొని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆదర్శప్రాయం.
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2013-14 సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై అధికార పార్టీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకొని కమీషన్ల కోసమే అధికార పార్టీ బడ్జెట్‌ను రూపొందించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులకు, ఎస్టీ, ఎస్టీల సంక్షేమానికి, రైతు ప్రయోజనాలకు ఈ బడ్జెట్ ఎంతగానో దోహద పడుతుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది జనరంజక బడ్జెట్ అంటూ అధికార పార్టీ శ్రేణులు పేర్కొంటుండగా నిరాశ పరిచే బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
సిఎస్‌డిటిల సస్పెన్షన్‌తో అవినీతి అధికారుల్లో దడ!
హిందూపురం, మార్చి 18: వాణిజ్య కేంద్రమైన హిందూపురంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం పేరిట వివిధ వ్యాపార వర్గాల నుండి ఇటీవలే ముగ్గురు సిఎస్‌డిటిలు లక్షలాది రూపాయాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయం విధితమే. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ పేరిట ఆయా సిఎస్‌డిటిలు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేటతెల్లం కావడంతో వారిపై కలెక్టర్ దుర్గాదాస్ సస్పెన్షన్ వేటు వేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. లేపాక్షి సిఎస్‌డిటి రత్నమయ్య, ఆత్మకూరు, ముదిగుబ్బ సిఎస్‌డిటిలు ఈశ్వరయ్య, ఆదిమూర్తిలపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో రత్నమయ్య హిందూపురంలో ఆర్‌ఐగా పనిచేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో కూడా స్థానికంగా పనిచేసిన సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంతోపాటు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయమై ఆయన్ను సరెండర్ చేయడం జరిగింది. తాజాగా లేపాక్షి సిఎస్‌డిటిగా పనిచేస్తూ పరిగికి కూడా ఆ హోదా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం పేరిట రత్నమయ్యతోపాటు ఈశ్వరయ్య, ఆదిమూర్తిలు ఓ కారులో వచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండటంతో వివిధ వ్యాపార వర్గాలతో రత్నమయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యాపారుల లోపాలను ఆసరాగా చేసుకొని రత్నమయ్య నేతృత్వంలో ఈ అక్రమ వసూళ్లు సాగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో కూడా ఇలా పలువురు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ బృందాల పేరిట వ్యాపారులతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులతో సంబంధిత సిఎస్‌డిటిలు అవగాహన కుదుర్చుకొనే ఇంతటి బహిరంగ వసూళ్లకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం గుప్పుమనడంతో తనకేమి సంబంధం లేదని ఓ ఉన్నతాధికారి చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇకపోతే రెవెన్యూ తరహాలోనే వాణిజ్య శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు విజిలెన్స్ బృందాల పేరిట వ్యాపార వర్గాలతో పెద్ద ఎత్తున తరచూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ముగ్గురు సిఎస్‌డిటిలపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడంతో రెవెన్యూ వర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రధానంగా విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికార, ఉద్యోగ వర్గాల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
ఆర్‌ఎంపి, పిఎంపిల
క్లినిక్‌లపై సోదాలు
ధర్మవరం టౌన్, మార్చి 18: పట్టణంలో పిఎంపి, ఆర్‌ఎంపిల నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లలో మందుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని సోమవారం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమన్న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పలు ఆర్‌ఎంపిలు, పిఎంపిలు కేవలం ప్రథమ చికిత్స నిర్వహించే మందులను దుకాణాలకు రాసివ్వాల్సి వుంది. అయితే ఇందుకు విరుద్ధంగా వీరు స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని ఓ ఏజెన్సీ వద్ద లక్షల రూపాయల మందులను కొనుగోలు చేసుకొని క్లినిక్‌లలో అక్కడే మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నట్లు సోదాల్లో బయటపడిందన్నారు. ఈ రోజు 10 ఆర్‌ఎంపిలలో సోదాలు నిర్వహించి పలు మందులను సీజ్ చేశామన్నారు. అలాగే వారికి మందులు అమ్మే ఏజెన్సీపై కూడా త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చెన్నకేశవపురంలో ఓ చిల్లర దుకాణంలో సైతం రూ.5వేలు విలువ చేసే మందులను కనుగొన్నామని ఇక మీదట ఇలా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశామన్నారు.
అడిగిన వెంటనే ఉపాధి..
బుక్కరాయసముద్రం, మార్చి 18: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో సోమవారం ఉపాధి హామీ పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నంపల్లి-వెంకటాపురం రోడ్డు 1.5 కిలోమీటర్లు 3 లక్షల 5 వేల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం రోడ్డును పరిశీలించి అక్కడ పనిచేస్తున్న కూలీలను, మేట్లను పని విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రతి నెలా రెండో శనివారం మేట్లు ద్వారా అర్జీ రూపంలో పని కోసం దాఖలు చేసుకుంటే వారికి ఎంపికైన పనులతో ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను, మేట్లను పని నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. వేసవికాలంలో చేసే పనికి అదనంగా 25 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని, ఈ డబ్బును నీటి కోసం, ఇతరత్రా సౌకర్యాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. డైలీ మస్టర్ లిస్ట్‌ను తనిఖీ చేసి ఎంపికైన ఉఫాధి హామీ కూలీల పేర్లను మొత్తం మస్టర్‌లో కనబరచాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు గడ్డపారలు ఇప్పటివరకూ అందించలేదని ఆయన దృష్టికి తీసుకుపోగా అందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఒక మేట్ గ్రూపుకు నాలుగు గడ్డపారలు చొప్పున అందజేస్తామని కూలీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎపిఓ , అధికారులు, కూలీలు పాల్గొన్నారు.
భూమి హక్కు పొందడం
ప్రతి రైతు బాధ్యత
భూమి హక్కు పొందడం ప్రతి రైతు బాధ్యత అని సోమవారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శశిభూషణ్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, అనంతపురం ఆర్డిఓ ఇస్మాయిల్, డ్వామా పిడి ఢిల్లీరావ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ తగాదాలులాంటివి పరిష్కరించుకోవడం కోసం గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించినపుడు సంబంధిత అధికారులకు వాటి వివరాలను తెలియపరిస్తే కొన్ని పరిష్కారాలు అక్కడికక్కడే నెరవేర్చుకోవచ్చునని అన్నారు. అంతేకాకుండా రైతుకు వారి భూములపై అవగాహన ఉంటే బ్యాంకుల ద్వారా ట్రాక్టరు లోన్స్‌కానీ, ప్రభుత్వం అందించే ఎరువులను గానీ ఇన్‌పుట్ సబ్సిడిలాంటివి గానీ సక్రమంగా వర్తిస్తాయని అన్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డిఓ ఇస్మాయిల్‌లు మాట్లాడుతూ సక్రమమైన భూమిని హక్కుదారులు కాకుండా ఎవరైనా దౌర్జన్యపరులు ఆక్రమించుకుని ఉంటే రెవెన్యూ సదస్సులలో అర్జీ ద్వారా తెలియపరిస్తే వాటిని విచారించి హక్కుదారుడైన రైతులకు అందేలా చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని వారన్నారు. అడంగల్‌లో ఆధార్ నంబర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఆధార్ కార్డు లేని రైతులకు సంబంధిత అధికారుల ద్వారా గానీ, మీసేవ కేంద్రాల ద్వారా కానీ అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ విజయలక్ష్మి, పశు వైద్యాధికారి డా.రామచంద్రారెడ్డి, మండలంలోని వివిధ శాఖల అధికారులు, ఆర్‌ఐలు, విఆర్వోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి భవనం ప్రారంభించారు.
ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు అవలంభించాలి
లేపాక్షి, మార్చి 18: నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులను అవలంభించి విద్యార్థులకు తగిన రీతిలో పాఠ్యాంశాలు చెప్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధక సంస్థ ఆచార్యులు సురేష్‌కుమార్ మిశ్రా సూచించారు. సోమవారం ఆయన బిసలమానేపల్లి ప్రాథమిక పాఠశాలను, చోళసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థులను కలిసి అనేక అంశాలపై ప్రశ్నలను అడిగారు. ఉన్నత పాఠశాలలో ఆయన విషయాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో ఏ పుస్తకమైనా ప్రతి ఉపాధ్యాయుడు ఇంటి వద్దే బాగా చదివి ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధించాలన్నారు. అప్పుడే విద్యార్థికి ఉపాధ్యాయుడు సంపూర్ణ విద్యను అందించగలడన్నారు. ఆయన వెంట లేపాక్షి, హిందూపురం రూరల్, చిలమత్తూరు మండలాల ఎంఇఓలు నాగరాజు, సిరాజుద్దీన్, కలీముల్లా తదితరులు ఉన్నారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి
అనంతపురం సిటీ, మార్చి 18: వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకుల సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో పొలికేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి జిల్లా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ నుండి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం నాయకులు, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, కాంగ్రెస్ హిందూపురం ఇన్‌ఛార్జి అంబికా లక్ష్మినారాయణ, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు బోయ తిరుపాల్, మహిళా అధ్యక్షురాలు కృష్ణమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు వాల్మీకులు ఉద్యమించాలన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వాల్మీకులకు సముచిత స్థానం కల్పిస్తే ఆ పార్టీకి వాల్మీకులు మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, సాకే.నరేష్, రామాంజనేయులు, గిడ్డన్న, శ్రీ్ధర్, రాజన్న, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ప్రారంభం కాని ప్రణాళికేతర పనులు!
హిందూపురం టౌన్, మార్చి 18: అన్నీ ఉన్నా అల్లుడిలో నోట్లో శని అన్న చందంగా మారింది హిందూపురం మున్సిపాలిటీ పరిస్థితి. మున్సిపాలిటీలోని వార్డుల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికేతర నిధులు మంజూరు చేయగా పనులు దక్కించుకొన్న కొందరు కాంట్రాక్టర్లు వాటిని ప్రారంభించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి హిందూపురం మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.169.73 లక్షల నిధులను మంజూరు చేయగా తొలి విడత కింద రూ.84.86 లక్షలను విడుదల చేసింది. విడుదల చేసిన నిధులను ఈ నెల 31వ తేదీ లోపు ఖర్చు చేయాలని, లేనిపక్షంలో ఆ నిధులను వెనక్కు వెళతాయని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. దీనికి తోడు ఎప్పుడెప్పుడు టెండర్లు పిలవాలని, వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి, పనులు పూర్తి చేయాలన్న నిర్ధిష్ట ప్రణాళికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు విడుదలైన రూ.84.86 లక్షలకు సంబంధించి వివిధ వార్డుల్లో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 30 పనులను ప్రతిపాదిస్తూ టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి వాటిని తెరచి ఈ నెల 15వ తేదీ నాటికి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. నిధులు ఖర్చు చేయడానికి మరో 13 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ మేరకు వ్యయమవుతాయోనన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రణాళికేతర నిధుల పనులకు సంబంధించి స్థానికేతర కాంట్రాక్టర్లు అధిక సంఖ్యలో పనులు దక్కించుకొన్నారని స్థానిక కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు మొండికేస్తున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్‌వి శివారెడ్డి, ఇంజనీర్ భాస్కర్‌రావుల వద్ద స్పష్టం చేశారు. గతంలో పలు పనులకు సంబంధించి కొందరు స్థానికేతర కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని పనులు చేయలేదని, దీన్ని దృష్టిలో వుంచుకొని టెండర్లు రద్దు చేయాలని స్థానిక కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు లిఖిత పూర్వకంగా మున్సిపల్ అధికారులను కోరారు. అయితే ప్రణాళికేతర నిధుల పనులకు సంబంధించి ఇ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు పిలవడంతో అర్హత ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైనా టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, ఇందుకు స్థానిక కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించేందుకు విముఖత వ్యక్తం చేస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పట్టణాభివృద్ధిని దృష్టిలో వుంచుకొని వచ్చిన నిధులు వెనక్కు వెళ్లకుండా పనులను ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచిస్తున్నా ససేమిరా అంటున్నారు. దీనిపై మున్సిపల్ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. గడువు లోగా పనులను ప్రారంభించి నిధులను వ్యయం చేస్తారా లేక స్థానిక కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గి టెండర్లను రద్దు చేస్తారా అన్నది వేచి చూడాల్సింది.
20నుంచి శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి
బ్రహ్మోత్సవాలు
యాడికి, మార్చి 18: శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు దేవదాయశాఖ అధికారి దేవదాసు పేర్కొన్నారు. 20న అంకురార్పణతో ప్రారంభమై, 30న శయనోత్సవంతో ముగుస్తాయని తెలిపారు. 20న అంకురార్పణ, 21న ధ్వజరోహణ, పుష్పవిమానోత్సవం, 22న సింహవాహనం, 23న శేషవాహనం, 24న ఆంజనేయ వాహనం, 25న గరుడోత్సవం, 26న గజేంద్రోత్సవం, 27న స్వామి కల్యాణోత్సవం, మధ్యాహ్నాం రథోత్సవం, 28న హంసవాహనం, 29న హంస వాహనం, 30న గ్రామోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్రహోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని, ప్రాథమిక కమిటీని ఏర్పాటు చేసినట్లు దేవదాయశాఖ అధికారి దేవదాసు, గుర్రప్పలు తెలిపారు.
నెమలి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ చంద్రవౌళేశ్వర స్వామి
ఉరవకొండ, మార్చి 18: పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ కరిబసప్పస్వామి గవి మఠంలో వెలసిన శ్రీ చంద్రవౌళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాల్గున శుద్ధ సప్తమి సోమవారం నెమలి వాహనంపై శ్రీ చంద్రవౌళేశ్వర స్వామిని కొలువుతీర్చి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్టు శ్రీ చంద్రవౌళేశ్వర స్వామికి సుప్రభాత సేవలో భాగంగా అభిషేకం, అలంకరణ, అర్చన, ఉత్సవ, నిత్య హోమం, బలిహారణ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ చంద్రవౌళేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి, ప్రత్యేకంగా తయారు చేసిన నెమలి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం భాజా భజంత్రీలు, మేళతాళాల మధ్య మఠం నుండి ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. నెమలి ఉత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా సిఐ యలమరాజు, ఎస్సై శంకర్‌రెడ్డిలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత 8వ పీఠాధిపతి శ్రీ జగద్గురు చెన్నబసవరాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వాములు, సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, గవిమఠం ఏజెంట్ రాజన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భూ ఆక్రమణలు కమ్యూనిస్టులతోనే సాధ్యం
రొద్దం, మార్చి 18: భూమిలేని నిరుపేదలకు భూమిని అందించడంలో కమ్యూనిస్టు పార్టీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. రొద్దంలో గత 8 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 685లోని 4.40 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉంది. సోమవారం సం బంధిత భూమలో సిపిఐ ఆధ్వర్యంలో భూ ఆక్రమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు సంబంధిత భూ వివాదాన్ని పరిష్కరించాలని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సిపిఐ ఆధ్వర్యంలో భూ ఆక్రమణలను చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ భూమిని అందించడమే తమ ధ్యేయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ స్వాముల నుండి భూమిని తీసుకొని నేడు వాటిని కంపెనీల పేరిట ఉన్నవారికే కట్టబెట్టే ఆలోచనలో ఉందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమస్యపై తాము జిల్లా కలెక్టర్‌తో చర్చించి తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముళ్ళ పొదలను తొలగించి పార్టీ జెండాలను నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెవి.రమణ, కేశవరెడ్డి, గంగాధర్, రమణ, అనిల్, మహేష్, హరీష్ పాల్గొన్నారు.
విరాళాలతో వీధి దీపాలు!
మడకశిర, మార్చి 18: మడకశిర నగర పంచాయతీలో విరాళాలు ఇచ్చి న కాలనీలకు మాత్రమే వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. 18 నెలల క్రితం రాష్ట్ర ప్రభు త్వం మడకశిర మేజర్ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి నుండి కనీస స్థాయిలో కూడా నగర పంచాయతీలో వౌలిక సదుపాయాలు లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మడకశిర నగర పంచాయతీకి దినసరి మార్కెట్, మటన్ మార్కెట్, బస్టాండ్ వేలాలు, ఆస్తి, నీటి పన్ను రూపేణా ఆదాయం వస్తోంది. వీటిని అధికారులు ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తున్నారే తప్ప సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా వీధి దీపాలకు అవసరమైన సా మాగ్రిని కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీధి దీపాలు వెలగని కారణంగా రాత్రి వేళల్లో బయటకు వచ్చేందుకు స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నగర పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పలు కాలనీలకు చెందిన వారు విరాళాలు సేకరించి సామాగ్రిని కొనుగోలు చేసి ఇస్తే ఆయా కాలనీలకు మాత్రం వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని వీధి దీపాల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఇక్కడ పర్యటించిన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ మురళీకృష్ణగౌడ్ దృష్టికి వీధి దీపాలకు విరాళాలు సేకరిస్తున్న విషయాన్ని తీసుకెళ్ళగా అలాంటి విరాళాలు సేకరించవద్దని అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడి అధికారులు మాత్రం విరాళాలు సేకరించి వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.