విశాఖపట్నం, మార్చి 19: ఇసుక అక్రమ రవాణాదార్లు పేట్రేగిపోతోన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కేవలం సమావేశాలకే పరిమితమవుతోంది. ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ఇసుక అక్రమ రవాణాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలోని శారద, తాండవ, గోస్తనీ నదీ గర్భాల నుంచి ఇసుకను కొల్లగొడుతున్న మాఫియాను నియంత్రించడం జిల్లా యంత్రాంగానికి సాధ్యం కావట్లేదు. శారదానదిలో గ్రోయిన్లను సైతం పేల్చి ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నట్టు శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు సమావేశంలో ఫిర్యాదు చేశారు కూడా. స్థానిక ఛోటానాయకులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నది బహిరంగ రహస్యంగానే అందరూ అంగీకరిస్తున్నప్పటికీ నియంత్రణ చర్యలకు మాత్రం ముందుకు రావట్లేదు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వి శేషాద్రి క్షేత్రస్థాయిలో విజిలెన్స్ కమిటీల నియామకానికి చర్యలు తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో రెవెన్యూ, పోలీసు, గనుల శాఖ సిబ్బందితో కమిటీలను వేయడం, దీనిపై మండల, జిల్లా స్థాయి కమిటీలను నిఘాపెట్టగలిగితే కొంతమేర పరిస్థితిలో మార్పు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సమావేశం జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.
నిర్మాణ రంగం జోరుతో ఇసుకకు గిరాకీ
నిర్మాణ రంగం జోరందుకోవడంతో ఇసుకకు పూర్తి స్థాయిలో గిరాకీ వచ్చిందనే చెప్పాలి. పట్టణ పరిధిలో బహుళ అంతస్తుల భవనసముదాయాల నిర్మాణం పెరిగింది. జిల్లాలో అత్యధికంగా వినియోగిస్తున్నది శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వంశధార నది ఇసుకనే. యూనిట్ ఇసుక ధర మూడు వేల రూపాయలుండటంతో లారీ యజమానులు తమ తిరుగుప్రయాణంలో ఇసుక రవాణాకే ప్రాధాన్యతనిస్తున్నారు. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఇసుక నిల్వకేంద్రాలను ఏర్పాటు చేసి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలను నిలువరించడంతో పాటు రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టినప్పుడే తవ్వకాలను నియంత్రించే అవకాశం ఉంది.
ఇసుక అక్రమ రవాణాదార్లు పేట్రేగిపోతోన్నారు
english title:
sand danda
Date:
Wednesday, March 20, 2013