విశాఖపట్నం, మార్చి 19: రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుకు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అపరిష్కృత సమస్యలను ఈసదస్సులో పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఈ బాధ్యత పూర్తిగా విఆర్వోలదేనన్నారు. దేవాదాయ, వక్ఫ్, ఇతర ప్రభుత్వ ఆస్తులను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేయాలని, వీటిని అందరు కౌలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసే బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లా కలెక్టర్ వి శేషాద్రి మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 776 రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈసదస్సుల్లో 8372 ఆర్జీలు అందాయని, వాటిలో 271 ఆర్జీలను అనుమతించగా మిగిలిన వాటిని తిరస్కరించినట్టు వివరించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 194 రెవెన్యూ అధికారుల భవనాలను ప్రారంభించామని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రెవెన్యూ సదస్సులపై విస్తృత ప్రచారం చేపడుతున్నారని వెల్లడించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. సదస్సుల నిర్వాహణకు రెండు రోజుల ముందే విఆర్వోలు, ఐకెపి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఆర్జీలను స్వీకరించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సు జరిగేప్పుడు వాటిపై చేపట్టిన చర్యలను వివరించాలని సూచించారు. తహశీల్దార్లు, విఆర్వోలు ఆర్జీల స్వీకరణ, వాటి పరిష్కారానికి పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించాలని, సదస్సుల్లో వచ్చే ఆర్జీలను శతశాతం పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఓ డివి రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు రంగయ్య, వసంతరాయుడు, సర్వేశాఖ ఎడి కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ, గోవిందరాజులు, నరసింగరావు, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
* వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి రఘువీరా
english title:
raghuveera
Date:
Wednesday, March 20, 2013