విశాఖపట్నం, మార్చి 19: నిర్ధేశిత గడువులోగా వుడా ప్రాజెక్టులను పూర్తి చేసే చర్యల్లో భాగంగా వుడా యంత్రాంగానికి పనులను కేటాయింపు చర్యలను విసి ఎన్ యువరాజ్ చేపట్టారు. వుడా విశ్వశనీయతకు భంగం కలుగకుండా పనులకు మోక్షం కలిగించేందుకు చర్యలు చేపడుతున్నారు. అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకున్న హరిత హౌసింగ్ పనులను 18 నెల్ల నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లకు పనులను కేటాయిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులను ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్లు ఎం బలరామయ్య, ఎన్‌వి ప్రసాదమూర్తిలకు కేటాయించారు. కొమ్మాది, గణేష్‌నగర్, పోతినమల్లయ్యపాలెం మాస్టర్ ప్లాన్ రహదార్లు, ఓజోన్‌వెలీ వౌలిక సదుపాయాల కల్పన పనులను ఎం అప్పన్నకు, వుడా పార్కు, కైలాసగిరి, తొట్లకొండ, సబ్‌మెరైన్ మ్యూజియం, ఆర్కెబీచ్ ఏరియా, కాపులుప్పాడ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సింహాచలం దేవస్థానం, అనకాపల్లి, యలమంచిలి పనులు, వాహనాల నిర్వహణను డివి వర్మకు అప్పగించారు. భీమిలి, విజయనగరం శ్రీకాకుళం, సైబర్‌వేలీ, ఎండాడ మాస్టర్‌ప్లాన్ పనులను జి కల్పనకు, వుడా చిల్డ్రన్స్ ఎరీనా, చినముషిడివాడ లేఅవుట్, ఎండాడ పనులను ఐ సూరయ్యకు అప్పగించారు. వైఎస్సార్ పార్కు, సీతమ్మధార, పిఠాపురం కాలనీ కాంప్లెక్స్‌లు, పిపిపి ప్రాజెక్టులు, ఐటిసెల్, ఎలక్ట్రికల్ పనుల నిర్వహణను వి భవానీశంకర్‌కు, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాభివృద్ధి పనులను పదోన్నతిపై రానున్న ఇంజనీర్‌కు కేటాయించనున్నారు.
నాలుగు జిల్లాల్లో ప్రణాళికాబద్దమైన ప్రగతిని సాధించడంతో పాటు వౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో భాగమైన వుడాకు వ్యవస్థీకృత నిబంధనావళి అవసరాన్ని విసి యువరాజ్ గుర్తించారు. వ్యక్తిగత నిర్ణయాల వల్ల పారదర్శకత లోపించడంతో పాటు అక్రమాలకు ఆస్కారమేర్పడుతుందని భావించి కట్టుదిట్టమైన నిబంధనావళిని అమల్లోకి తీసుకురానున్నారు. ఈమేరకు విభాగాధితులైన కార్యదర్శి జెసి కిషోర్ కుమార్, ఛీఫ్ ఇంజనీర్ ఐ విశ్వదాధరావు, ఛీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యుల్లత, ఛీఫ్ ఎకౌంట్స్ అధికారి డి విజయభారతి, డిఎఫ్‌ఓ బివిఎ కృష్ణమూర్తి, ఎస్టేట్ అధికారి బి భవానీదాస్ తదితరులతో సమీక్షించిన ఆయన నిబంధనావళి ముసాయిదాను రూపొందించాలని ఆదేశించారు.
* అధికారులకు పనుల కేటాయింపు
english title:
vuda projects
Date:
Wednesday, March 20, 2013