Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పిచ్చుకలను బతకనిద్దాం

$
0
0

విశాఖపట్నం, మార్చి 19: తెల్లవారు జామున పిచ్చుకుల కిలకిలారావాలు చెవులకు ఎంత ఇంపుగా ఉంటాయి! అమాయకంగా ఇంటి ముంగిటకు వచ్చి వాలే ఆ పిచ్చుకులను చూస్తే మనసు ఎంత హాయిగా ఉంటుంది! అవన్నీ గుంపుగా ఎగిరితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది! అందంగా..అమాయకంగా కనిపించే ఆ పిచ్చుకలే కనుమరుగవుతున్నాయి.. వీటికి కారణం ఎవరో కాదు. మనమే. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వేయనక్కర్లేదు. ఆధునిక జీవనం కోసం మనం అనుసరిస్తున్న విధానాలతో వేలాది పిచ్చుకలకు ఈ భూమీద స్థానం లేకుండా చేస్తున్నాం. పిచ్చుక గూళ్ళను చేచేతులా తొలగించి, పురిటిలోనే పిచ్చుక పిల్లల ప్రాణాలను నులిమేస్తున్నాం. వాటికి ఎక్కడా నిలువ నీడ లేకుండా.. తినడానికి పిడికెడు గింజలు లేకుండా.. తాగేందుకు గుక్కెడు నీరు లేకుండా చేస్తున్నాం. మన చేష్టల వలన పిచ్చుకలు కొద్ది కాలంలోనే పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మానవాళికి పరోక్షంగా ఉపయోగపడే రాబందులను ఇప్పటికే మనం పోగొట్టుకున్నాం. కనీసం ఒక్క రాబందు కనిపించినా చాలన్న పరిస్థితికి వచ్చాం. రాంబందు ఆచూకీ చెపితే, వేల రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించే పరిస్థితిని మనకు మనమే తెచ్చుకున్నాం. రాబందులన్నీ అంతరించిపోయిన తరువాత దాని అవసరాన్ని, గొప్పతనాన్ని మనం గ్రహించాం. అలాగే ప్రకృతి సమతౌల్యం చేసే పిచ్చుకలను కూడా పోగొట్టుకుని ఆ తరువాత పశ్చాత్తాప పడితే ప్రయోజనం ఉండదు. నేడు ప్రపంచ పిచ్చుకల దినం సందర్భంగా వాటి విశిష్ఠత.. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పక్షి ప్రేమికులు వాటిని సంరక్షించేందుకు చేపడుతున్న చర్యల గురించి తెలుసుకుందాం.
ఒకప్పుడు భారత దేశంలో పిచ్చుకల సంఖ్య గణనీయంగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్లమీద, ఇళ్ళ సముదాయాలు ఉన్నచోట, పచ్చని తోటలు వద్ద కంటికింపుగా కనిపిస్తూ, కనువిందు చేసేవి. గతడిచిన రెండు దశాబ్దాలుగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పట్టణీకరణ పెరిగిపోవడం.. పచ్చని పొలాలు రియల్ ఎస్టేట్‌లుగా మారిపోవడం.. గార్డెన్స్ పూర్తిగా నిర్వీర్యమైపోవడం వలన పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. వీటిని కాపాడాలన్న లక్ష్యంతో నేచుర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా 2008 సంవత్సరం నుంచి ప్రపంచ పిచ్చుకల దినాన్ని పాటిస్తూ వస్తోంది. 2008 సంవత్సరంలో మహ్మద్ డిల్వర్ నాసిక్‌లో పిచ్చుకల దినాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఫ్రాన్స్‌లో యాక్షన్ ఫౌండేషన్ సంస్థ పిచ్చుకల దినాన్ని 2010 నుంచి పెద్దఎత్తున చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, లండన్‌లోని రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటక్షన్ ఆఫ్ బర్డ్స్, కేంబ్రిడ్జిలోని బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పిచ్చుకల దినాన్ని పాటిస్తూ వస్తున్నాయి.
పిచ్చుకలు తగ్గిపోవడం వలన ప్రకృతి సమతౌల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ పిచ్చుక తినేది తక్కువే అయినా, ఏది కనబడితే అది తింటుంది. కూరగాయ ముక్కలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తినే పిచ్చుకలు, గుడ్లు పెట్టే సమయంలోను, వాటిని పొదిగే సమయంలో చిన్న చిన్న పురుగులను తింటుంది. గుడ్లు, అందులో నుంచి వచ్చే పిల్లలు బలంగా ఉండేందుకు వీటిని తింటుంది. ఎవ్వరికీ హాని చేయని పిచ్చుకల సంఖ్య ఎలా తగ్గిపోతోందంటే..
పంటలపై చల్లే ఎరువులు, పురుగు ముందులు వీటికి కీడు తెచ్చిపెడుతున్నాయి. అలాగే సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ వలన పిచ్చుకల్లో వీర్య కణాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని స్పెయిన్‌లో జరిగిన పరిశోధనల ద్వారా వెల్లడైంది. అలాగే కోయంబత్తూరులోని సలీమాలీ ఆర్నిథాలజీ ఇనిస్టిట్యూట్ కూడా వీటిపై పరిశోధనలు జరిపి, పై నిర్థారణకే వచ్చింది. కల్తీ పురుగు మందుల వాసన పీల్చి ఇవి చనిపోతున్నాయి. పిచ్చుకలు ఏడాదికి మూడుసార్లు గుడ్లు పెడుతుంటాయి. అందుకే, వీర్యాభివృద్ధికి పిచ్చుక లేహ్యాన్ని వాడేవారు. అయితే, విపరీతమైన కాలుష్యం పెరిగిపోవడం వలన పిచ్చుక గుడ్లు బలహీనమైపోయాయి. గుడ్లు భూమీద పడినప్పుడే చితికిపోతున్నాయి. పొదిగే సమయంలో కొన్ని బద్దలైపోతున్నాయి. ఎట్టకేలకు మిగిలిన గుడ్లలో నుంచి వచ్చే పిచ్చుక పిల్లలు కూడా పౌష్ఠికాహారం లోపం వలన బలహీనంగా బయటపడుతున్నాయి. అవి ఎంతో కాలం జీవించకుండానే, చనిపోతున్నాయి. ఒక పిచ్చుక 20 సంవత్సరాల వరకూ జీవిస్తుంది.
ఇళ్ళలో ఎక్కడ రంధ్రాలు కనిపిస్తే, అక్కడ పిచ్చుక గూళ్ళు పెట్టేవి. ఇప్పుడు ఆ రంధ్రాలను మూసేస్తున్నారు. అలాగే చెట్లపై గూళ్ళు పెట్టేవి. వాటి సంఖ్య కూడా తగ్గిపోవడం వలన పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. గతంలో పంటలను కళ్ళాలలో నూడ్చేవారు. ఇప్పుడు ఆధునిక పద్ధతుల ద్వారా ధాన్యాన్ని నూడ్చడం వలన పిచ్చుకలకు ఆహారం లభించని పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలోని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, అమెరికా, అండమాన్ నికోబార్ తోపాటు ఇతర ద్వీపాల్లో పిచ్చుకలు కనిపించవు. మిగిలిన అన్ని దేశాల్లోనూ పిచ్చుకల ఉనికి ఉంది. అయితే పై దేశాలు కూడా పిచ్చుకలను తమ దేశంలో తెచ్చి పెట్టుకున్నాయి. నెదర్లాండ్‌లో సంరక్షించాల్సిన పక్షుల్లో పిచ్చుకలు కూడా ఉన్నాయి. లండన్‌లో 90 శాతం పిచ్చుకలు లేవని, ఇతర దేశాల్లో సుమారు 80 శాతం వరకూ అంతరించిపోయాయని లెక్కలు చెపుతున్నాయి. భారత దేశంలో వీటి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండడం అత్యంత దృరదృష్టకరం.

రైల్వే రిజర్వేషన్ ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
విశాఖపట్నం, మార్చి 19: రిజర్వేషన్ టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రతిఒక్కరూ ఇక నుంచి కచ్చితంగా గుర్తింపుకార్డును వెంట పెట్టుకోవాల్సిందే. అదీ ఒరిజనల్ ఐడి కార్డు ఉంటే తప్ప ప్రయాణం చేసే విలుండదు. రిజర్వేషన్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు టిక్కెట్‌తో పాటు ఒరిజనల్ ఐడి కార్డును తన ప్రయాణంలో తప్పనిసరిగా చూపాల్సిందేనని రైల్వే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో సంబల్‌పూర్, ఖుర్ధా, వాల్తేరు డివిజన్లలో ఈ కొత్త విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమర్షియల్ విభాగం అధికారులు నిర్ణయించారు. గుర్తింపుకార్డు లేని ప్రయాణికులపై చర్యలు తప్పవని రైల్వే హెచ్చరించింది. గుర్తింపుకార్డు లేని ప్రయాణికులను రిజర్వేషన్ టికెట్ తీయని వారిగానే పరిగణనలోకి తీసుకుని చర్యలుంటాయని వాల్తేరు డివిజన్ అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రైళ్ళల్లో తరచూ జరిగే ప్రత్యేక దాడులు, ఆకస్మీక తనిఖీల్లో భాగంగా రిజర్వేషన్ టికెట్‌తోపాటుగా గుర్తింపుకార్డులను పరిశీలిస్తారన్నారు. భారతీయ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ ఫొటో గుర్తింపుకార్డు, పాస్‌పోర్టు, ఆదాయపన్ను విభాగం జారీ చేసిన పాన్‌కార్డు, ఆర్టీఓ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సీరియల్ నెంబర్లతో జారీ చేసే ఫొటో గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఖచ్చితంగా ఉండి తీరాలని వివరించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులుండాలని, లేదంటే జాతీయబ్యాంకు పాస్ పుస్తకం (పొటోతో), లామినేషన్ ఫొటోతో కూడిన బ్యాంకు జారీ చేసిన క్రెడిట్‌కార్డులు, ఆదార్, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లాయంత్రాంగం జారీ చేసే ఫొటోగుర్తింపుకార్డులు, మునిసిపాలిటీలు, పంచాయతీ పాలనాధికారులు జారీ చేసే గుర్తింపుకార్డుల్లో ఏదైనా చూపాల్సి ఉంటుందన్నారు.

జూన్ 28 వరకు విశాఖ-కొల్లాం
* డిమాండ్ ఉన్నా పొడిగింపులతోనే సరి
విశాఖపట్నం, మార్చి 19: విపరీతమైన రద్దీతో నడుస్తున్న విశాఖ-కొల్లాం ప్రత్యేక రైలును ఇంకా పొడిగింపులతోనే సరిపెడుతున్నారు. దీనిని రెగ్యులర్ చేయాల్సిందిగా చేసిన డిమాండ్లను రైల్వే ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల విడుదలైన రైల్వేబడ్జెట్‌లో సైతం దీనిని రెగ్యులర్ చేయాలని, లేదంటే కనీసం వారంలో మూడు రోజులైనా నిర్వహించాల్సిందిగా కోరినా ఫలితం లేకపోయింది. చివరకు మరోసారి పొడిగిస్తున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం జూన్ 28వ తేదీ వరకు ఇది నడవనుంది. ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం-కొల్లాం (08569) ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు ప్రతి గురువారం దీనిని నిర్వహిస్తారు. అలాగే కొల్లాం-విశాఖపట్నం (08570) మధ్య నడిచే ఇది కొల్లాం నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ విధంగా ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నడువనుంది. విశాఖలో బయలుదేరే ఇది దువ్వాడ, అనకాపల్లి, విజయవాడ, తిరుపతి, కాట్పాడి, జోలార్‌పెటాయి, సాలేం, ఎరోడ్, కోయింబత్తూరు, పాలక్కాడ్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ క్లాస్-8, సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి-1 మొత్తం 16కోచ్‌లు సదుపాయం కల్పించబడింది. దీనిని సద్వినియోగపర్చుకోవాల్సిందిగా సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వేందర్‌యాదవ్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

జాతరకు వెళ్లివస్తుండగా ప్రమాదం .. నలుగురి మృతి
* ఐదుగురికి తీవ్ర గాయాలు
* ఒకరి పరిస్దితి విషమం
పాయకరావుపేట, మార్చి 19:జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. మం డలం పి.ఎల్.పురం జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరొకరు విశాఖ కెజిహెచ్‌లో వైద్యం పొందుతూ మృతి చెందాడు. ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాలర్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన వారే. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మోదుగుళ్లపేట, కృష్ణశాస్త్రులుపురం, గడిరిపాడు గ్రామాలకు చెందిన 14 మంది కలిసి ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగే గంగాలమ్మ జాతరకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు సోమవారం రాత్రి భీమడోలులో జగ్గయ్యపేట నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సిమెంటు లోడు ఉన్న లారీని ఎక్కారు. ఇందులో కొందరు లారీ పైభాగంపై ఎక్కగా, మిగిలిన వారు క్యాబిన్‌లో కూర్చున్నారు. స్దానిక పి.ఎల్.పురం జంక్షన్ సమీపంలోకి చేరుకునే సరికి జంషడ్‌పూర్ నుంచి ముంబాయి వెళ్తున్న ట్రాలర్ ఆయిల్ కొట్టించుకుని రాంగ్ రూట్‌లో రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జుయింది. అందులో ఉన్న పొగిరి రాము(40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకుని తీవ్రగాయాలైన వారందరినీ తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో దూబా గైరమ్మ(60), పొగిరి రమణ(45) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. అలాగే పొగిరి అప్పలనాయుడు(11) పొగిరి సురేష్‌కుమార్(25), దుబా జనార్దనరావు(26), గిరడా సరోజనమ్మ (45), గురవాన లక్ష్మణరావు(30)లకు ప్రథమ చికిత్స నిర్వహించి అక్కడ నుంచి విశాఖ కె.జి.హెచ్.కి తరలించారు. వీరిలో పొగిరి సురేష్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడి కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న పొగిరి సురేష్‌కుమార్ మృతి చెందాడని వైద్యులు, పోలీసులు తెలిపారు. మృతి చెందిన రాము, రమణలు భార్యభర్తలు కాగా, గైరమ్మ ప్రమాద స్థలంలో మృతి చెందిన రాము తల్లి. మృతి చెందిన వారిని పోస్టుమార్టానికి తరలించారు. దూబా జనార్దనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై జి.ప్రేమకుమార్ తెలిపారు.

గ్రూపులను ప్రోత్సహించేది చంద్రబాబే
* మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ఆరోపణ
పాయకరావుపేట, మార్చి 19: తెలుగుదేశం పార్టీలో గ్రూపులను ప్రోత్సహించేది ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు విమర్శించారు. మంగళవారం స్దానిక విలేకర్లతో మాట్లాడుతూ మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు తనను ఎవరూ వెన్నుపోటు పొడవకుండా ఉండేందుకు పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. కొంతమంది నాయకుల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు చంద్రబాబు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తెలుగుదేశం, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే సమయంలో కూడా కొమ్ముకాసిందన్నారు. వీరంతా సీట్లకోసం, పదవులు కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పెట్టడం లేదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నా, క్రమశిక్షణతో మెలగాలన్నా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని వెంకట్రావు అన్నారు.
లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు
చీడికాడ, మార్చి 19: లారీబోల్తా పడటంతో ము గ్గురికి గాయాలయ్యాయి. మండలంలో మంచాల ను ండి కోనాం వరకు జరుగుతున్న రోడ్డు పనులకు ఎపి 31వై 9333 నెంబర్‌గల లారీ క్రషర్ బుగ్గిని తీసుకెళుతుండగా గుంటికొత్తూ రు దగ్గరలో రోడ్డుపై ఉన్న చెరకు పిప్పి జారుతుండడంతో లారీ పంట భూముల్లో బోల్తాపడింది. డ్రైవర్ సకిరెడ్డి అప్పలరాజుకు స్వల్పంగా గాయపడగా, క్లీనర్ పప్పల రమేష్, మెకానిక్ రామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.శ్రీనివారావు తెలిపారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై 25 నుండి సిపిఐ ప్రచారం
కొయ్యూరు, మార్చి 19: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసపూరిత చర్యలపై ఈ నెల 25నుండి 31వతేదీ వరకు గ్రా మాల్లో పర్యటించి ప్రజలకు వివరిస్తామని సి.పి.ఐ. జిల్లా నేత బడుగు రామరాజ్యం పేర్కొన్నారు. స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. మోసపూరిత చర్యలతో ప్రజల ను మోసం చేస్తూ కాంగ్రెస్ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని చెబుతూనే సర్‌ఛార్జీలను విధిస్తూ ప్రజానీకంపై మరింత భారాన్ని మోపి బతుకులు అగమ్యగోచరంగా చేస్తున్నారన్నా రు. గతంలో పనిచేసిన సి.ఎం.లు మన్యం వాసులకు ఇచ్చిన హామీలు అధికారం చేపట్టాక గాలిమాటలుగా మిగిలాయి తప్పితే కార్యరూపం దాల్చలేదన్నారు. అలాగే గూడెం పర్యటనకు వచ్చిన సి.ఎం. కిరణ్‌కుమార్‌రెడ్డి బాక్సై ట్ తవ్వకాలపై కచ్చిత నిర్ణయాన్ని తెలపలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు గిరిజనేతరులకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ఎన్నికల స్టంట్ మా త్రమే కాంగ్రెస్ నేతలు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రోత్సహిస్తున్నారని, తద్వారా గిరిజనులను భయబ్రాంతులకు గురిచేసి గ్రా మాలు విడిచిపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారన్నా రు. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా 25వతేదీ నుండి గ్రామ పర్యటనలకు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 23వతేదీ నుండి రాజధానిలో ఆందోళనలు చేపట్టనున్నట్లు రామరాజ్యం వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు గోకిరి చిన్నారావు, జె.రాజా పాల్గొన్నారు.

నిస్వార్థ కార్యకర్తలే పార్టీకి అండ
* టిడిపి జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్
పాయకరావుపేట, మార్చి 19: నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని పార్టీ జిల్లా రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్ అ న్నారు. మంగళవారం స్దానిక లక్ష్మీ ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వుడ్ నియోజకవర్గమైనా తాము పోటీచేసే అవకాశం లేకపోయినా ఎవరు టిక్కెట్టు తెచ్చుకు న్నా, తామే పోటీలో ఉన్నట్లుగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు పార్టీలో ఉన్నారన్నారు. ఈనెల 23వతేదీన మండలంలో సినీహీరో నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలని కోరా రు. అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీ ఆర్ విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరిస్తారన్నారు. కుమారుపురంలో జరిగే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో పర్యటన 13 రోజులపాటు ఉంటుందని, కోటవురట్లలో పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కంకిపాటి వెంకటేశ్వరరావు, లాలం కాశినాయు డు, విజయ్‌కుమార్, రెడ్డి రామకృష్ణ, మజ్జూరి నారాయణరావు, పెదిరెడ్డి చిట్టిబాబు, కురందాసు నూకరాజు, చింతకాయల రాంబాబు, గొర్రెల రాజబాబు పాల్గొన్నారు.

ముదురుతున్న రావణాపల్లి రిజర్వాయర్ చేపల వివాదం
నర్సీపట్నం, మార్చి 19: రావణాపల్లి రిజర్వాయర్‌లో చేపల వేట వివాదం ముదురుతోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య వివాదం నెలకొని శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఏర్పడింది. మంగళవారం స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో ఇరువర్లాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు, ప్రజా సంఘాల నాయకులు సమావేశమయ్యారు. రావణాపల్లి రిజర్వాయర్ మత్య్సకార సంఘంలో స్థానికేతరులకే సభ్యత్వం ఉండడం పట్ల స్థానికులైన గైరంపేట, గబ్బాడ గ్రామాల మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు సభ్యత్వం కల్పించి చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని గత కొంతకాలంగా కోరుతున్నారు. మత్య్సశాఖ ఆధ్వర్యంలో సభ్యులుగా ఉన్న మత్స్యకారులు పెట్టుబడి పెట్టి రిజర్వాయర్‌లో చేప పిల్లలను వేశారు. ప్రస్తుతం స్థానికేతరులు చేపలు పట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీనిని మత్స్యశాఖ అధికారులకు బదిలీ చేశారు. దీంతో మంగళవారం మత్స్యశాఖ ఎ.డి. ఫ్రభుదాస్ ఇరువర్గాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరువర్గాలు వాదోపవాదాలకు దిగడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునేందుకు తగిన రక్షణ కల్పించాలని సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ పోలీస్ అధికారులను కోరారు. అలాగే చేపలు పడితే తాము అడ్డుకుంటామని గైరంపేట, గబ్బాడ గ్రామాల మత్స్యకారులు స్పష్టం చేశారు. ఇరువర్గాలు అంగీకారానికి రాలేదు. ఈ చర్చల్లో గొలుగొండ ఎస్సై మల్లేశ్వరరావు, మత్స్యశాఖ అధికారిణి నిర్మల, గబ్బాడ మాజీ సర్పంచ్ పోతురాజునాయుడు, సి.పి.ఐ., సి.పి.ఎం. పార్టీల నేతలు మజేటి నూకరాజు, వనుం శ్రీనివాసరావు, రుత్తల పెదబుజ్జి, ఎం.అప్పలరాజులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ బోల్తా 14 మందికి తీవ్ర గాయాలు
* ముగ్గురి పరిస్థితి విషమం
సీలేరు, మార్చి 19: గూడెంకొత్తవీధి మండలం దారాలమ్మ ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దబ్బకోట గ్రామస్థులు దారాలమ్మ ఆలయంవద్ద మంగళవారం మొక్కు తీర్చుకోవడానికి వారి బంధువులను నర్సీపట్నం నుంచి ఆహ్వానించారు. దబ్బకోట వారితోపాటు బంధువులు 20 మంది ట్రాక్టర్‌లో దబ్బకోట నుంచి బయలుదేరి వెళ్ళారు. మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దారకొండ వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ యాక్సిల్ విరిగిపోయింది. దీంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దారకొండ గ్రామస్థులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి వారిని దారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్ వై.వి. ప్రదీప్‌కుమార్ క్షతగాత్రులకు ప్రధమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్య సేవలకు చింతపల్లికి, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈసంఘటనలో నర్సీపట్నానికి చెందిన సూరిశెట్టి నారాయణమ్మ, కాళ్ళ సత్యవతి, కాళ్ళ లక్ష్మిల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవల సీలేరు సమీపంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.

తెల్లవారు జామున పిచ్చుకుల కిలకిలారావాలు చెవులకు ఎంత
english title: 
birds

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>