గంట్యాడ, మార్చి 19 : ఇక్కడి ఎల్లామాంబ సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. డప్పు వాయిద్వాలు, భక్తులు శరణు ఘోషతో, కుర్రకారు కేరింతలతో సాగిన సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు, ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాదిగా భక్త జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయం వద్ద దాతల సహకారంతో పులిహోర, లడ్డూ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారు ఆవహించిన పూజారిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సిరిమానుపై అధిరోహింప జేశారు. అనంతరం భక్త జనం జయజయ ధ్వానాల మధ్య శతకం పుట్ట నుంచి సిరిమాను రథం బయలుదేరింది. ప్రధానవీధిలో అమ్మవారి ఆలయం వరకూ మూడు పర్యాయాలు సిరిమాను రథం తిరిగింది. ఈ రథం వెంట గ్రామ పెద్దలు రఘమండ స్వామినాయుడు, మాజీ ఎంపిపి కొండలరావు, తీగెల ఈశ్వరరావు సుంకరి రామునాయుడు, ఎం. కృష్ణరాజు ఉన్నారు. స్థానిక ఎస్‌ఐ విఎన్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద జరిగిన తీర్ధమహోత్సవానికి కూడా జనం తరలివచ్చారు. మండలంలో బుడతనాపల్లి గ్రామంలో జరిగిన ఎల్లమ్మ సిర్లు జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘటాలను ఘనంగా ఊరేగించారు.
సిరిమానోత్సవం
english title:
sirimanu
Date:
Wednesday, March 20, 2013