పార్వతీపురం, మార్చి 19: వచ్చే మూడేళ్లలో 600కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ షెడ్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం గిరిజన పథకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ వాటర్ షెడ్ పథకాల అమలు చేయడం ద్వారా సాగునీటి వనరులు గిరిజనులకు అందుబాటులోనికి తెచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఐ డబ్ల్యు ఎం పి పథకంలోభాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ పథకం కింద చేపట్టే ఉపాధిపనుల బాధ్యతలు పీవోలకు అప్పగించినందున గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని కోరారు. అలాగే ఈపనులు నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లువంటి అవసరాలను గుర్తించి కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఇప్పటికే పీవోలకు అనుమతి ఇచ్చామన్నారు. రాజీవ్ బాల సంజీవిని పథకం అమలు కోసం మండలాల వారిగా, తరగతుల వారీగా గిరిజన ప్రాంతాల్లో ఉండే విద్యాసంస్థల జాబితాలను రూపొందించాలని కమిషనర్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్‌టి యువతకు జాబ్ మేళా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో బ్యాంకు సేవలు అందించేందుకు వీలుగా గ్రామీణ బ్యాంకుల ద్వారా సేవలందించడానికి బ్యాంకులు ప్రారంభించడానికి అనువుగా ఆయా జిల్లా అధికారులతో చర్చంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఏజెన్సీలో చేపట్టే ఇంజనీరింగ్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే విద్యాసంస్థల తనిఖీలు కూడా చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఈ ఏడాది రాజీవ్ యువకిరణాల ద్వారా 666 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అదేవిధంగా ఈనెల 22న నిర్వహించే జాబ్‌మేళాలో మరో 400మందిని ఎంపిక చేసి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని పీవో తెలిపారు. అలాగే పార్వతీపురం ఐటిడిఎ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టి 35 ఏళ్లు గస్తున్న నేపథ్యంలో కొత్త్భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీవో అంబేద్కర్ కోరగా అందుకు స్పందించిన కమిషనర్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ పాతభవనంపై అదనపు అంతస్తుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ సి ఎ ఆనంద్ మణికుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
గజపతినగరం, మార్చి 19 : విద్యుత్ శాఖ పనితీరుపై స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ పనితీరును సమీక్షిస్తూ ఆశాఖ పనితీరుబాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఎఇ రామకృష్ణపై మండి పడుతూ ఆ శాఖ పనితీరు కారణంగా తమ పదవులకు ముప్పు వచ్చేట్లుందని అసహనం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో సమస్యలపై వినియోగదారులు నేరుగా తనకే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారని పద్ధతి మార్చుకుని బాధ్యతగా వ్యవహరించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోఓల్టేజి, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు వంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే చూచించారు. ఉపాధి హామీ పధకం పనితీరు సమీక్షిస్తూ కొత్త పనుల వివరాలు అడిగితెలుసుకున్నారు. గ్రావెల్ రోడ్డు నిర్మాణాల్లో తీసుకుంటున్న కొలతలపై ఎపిఒ రవిబాబును ప్రశ్నించారు. మండలంలో అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ప్రతిపాదనలు పంపించాలని ఐసిడిఎస్ సిడిపిఒ అనురాధను ఆదేశించారు. అనంతరం వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖలను సమీక్షించారు. దీపం పధకం కింద గ్యాస్ కనెక్షన్లు వివరాలను రెవెన్యూ అధికారి సత్యంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బొత్స మాట్లాడుతూ ప్రతి అధికారి బాధ్యతా యుతంగా పనిచేసి మండల ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జి.లక్ష్మణ్, మాజీ జెడ్‌పిటిసి గార తౌడు, పిఎసిఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, ఎంపిడిఓ ఎం.శ్రీరంగ తదితరులు పాల్గొన్నారు.
చెరువు గర్భంలోని ఆక్రమణలు తొలగించాలి
గజపతినగరం, మార్చి 19 : చెరువు గర్భాల్లో ఆక్రమణలు గుర్తించి తొలగింపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం పాతబగ్గాంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకోవడానికే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మండలం పరిధిలో ఇంత వరకు జరిగిన సదస్సుల్లో 138 దరఖాస్తులు అందాయన్నారు. చిన్న సమస్యలు సదస్సుల్లోనే పరిష్కరిస్తున్నట్లు మిగిలిన సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామన్నారు. 40 ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న 31 రైతుల సాగుభూమి సమస్యకు 2,3 నెలల్లో పరిష్కారం చూపాలని లేని పక్షంలో డి పట్టాలు అందజేస్తామని ఫిర్యాదుదారుడు లెంక సన్యాసిరావుకు భరోసా ఇచ్చారు. పాతబగ్గాం గ్రామంలో నాదృష్టికి వచ్చిన 30 సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీఇచ్చారు. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఆర్డీఓ జి.రాజకుమారి మాట్లాడుతూ పాతబగ్గాంలో ఇప్పటి వరకు 58 ఎకరాల అసైన్డ్ భూమి పంపిణీ చేశామన్నారు. ఇంకా రెండు ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని అర్హులైన వారు దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అతుకుబడి భూములు క్రయవిక్రయాలు జరపరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కౌలు రైతులకు రాయితీ సదుపాయాలు వర్తింపు చేస్తున్నట్లు పంట రుణాలు అందజేసామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్ధార్ జయరామ్, ఆర్‌ఐలు సత్యన్నారాయణ, రమణారావు, సర్వేయర్ బి.వెంకటపతిరాజు, ఐకెపి ఎపిఎం ఆర్.శ్రీనివాసరావు, ఎపిఓ రవిబాబు, విఆర్వో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
బొబ్బిలి, మార్చి 19: మంచినీటి కోనేరులో ఈతకు దిగి గల్లంతైన విద్యార్ధి మృతదేహాన్ని మంగళవారం గజ ఈతగాల సహాయంతో బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మంచినీటి కోనేరులో కోమటిపల్లి పాలిటెక్నిక్‌లో డిప్లమో మెకానికల్ చదువుతున్న డి.శివప్రసాద్ సోమవారం సాయంత్రం గల్లంతైన విషయం విదితమే. ఈమేరకు మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు శంకరరావు, చిన్నిమ్మిలతోపాటు తోటి విద్యార్థులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా మృతుడి తండ్రి శంకరరావు అనకాపల్లిలో రిక్షా పుల్లర్‌గా పనిచేస్తు చెమటోడ్చి సంపాదించిన మొత్తంతో కుమారుడు శివప్రసాద్‌ను డిప్లమో చదివిస్తున్నాడు. కన్నకొడుకు ఉన్నత చదువులు చదివి తమకు కూడుపెడతాడని ఆశించిన తరుణంలో మృత్యువు కబలించడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి మార్కులు సాధిస్తుండటంతో తన కొడుకు జీవితం బంగారుబాటగా మారుతుందన్న పడ్డ ఆశలు అడియాశలుగా మారిందని తండ్రి శంకరరావు బోరున విలపించాడు. తహశీల్దారు కృష్ణారావు, ఆర్. ఐ. అప్పలనాయుడులు సంఘటనా స్థలం వద్ద శవపంచానామా చేసి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి. ఐ. రాఘవరావు తెలిపారు.
ఎంపిడిఒ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు
డెంకాడ, మార్చి 19 : గతంలో ఫింఛన్ అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడులు విజిలెన్స్ సిఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో జరిగింది. కార్యాలయంలో ఫింఛన్లకు సంబంధించి రికార్డులను ఆయన పరిశీలించారు.దీనిపై ఎంపిడిఓ నిర్మాలాదేవిని వివరాలు అగిడి తెలుసుకున్నారు. గత సామాజిక తనిఖీలో సామాజిక సిబ్బంది ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. వెదుర్లవలస, గోడ్డపాలెం గ్రామాల్లో కొంత మంది భర్త ఉండగానే విడో పింఛన్ తీసుకుంటున్నారని అలాగే పనిపోయిన వారి పేర్లమీద కుటుంబ సభ్యులకు తెలియకుండా పింఛన్ తీసుకున్నారని తనిఖీ బృందం వెల్లడించింది. దీనిపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగిందని సమాచారం. ఈ విషయమై విజిలెన్స్ సిఐ పైడపునాయుడును వివరణ కోరగా వివరాలను బహిర్గతం చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ దాడులు మండలంలో సంచలనం కలిగించాయి. వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.