మణుగూరు, మార్చి 20: పినపాక నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిగా, గతంలో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేసిన పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీగా ఎదిగిన సిపిఐని వీడి వైఎస్సార్ సిపిలోకి వెళ్లడం పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు ఆలోచనలో పడ్డారు. నియోజకవర్గంలోని సిపిఐ ముఖ్య నేతల్లో ఒకరు పాకాలపాటి వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) కాగా, తర్వాతి స్థానాల్లో బి అయోధ్య, పాయం వెంకటేశ్వర్లు పేర్లే గట్టిగా విన్పిస్తాయి. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ ఏం జరిగినా అయోధ్య పక్కనే పాయం కచ్చితంగా కన్పిస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా పాయం వెంకటేశ్వర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అకస్మాత్తుగా మంగళవారం వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిని జైలులో కలసి తదనంతరం వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. అయితే ఆయన వైఎస్సార్ సిపిలో చేరడంతో సిపిఐ నేతల గుండెల్లో పిడుగుపడినట్లైంది. పాయం పార్టీని వీడటం పార్టీకి నష్టమైనా వ్యక్తిగతంగా లాభ పడతారంటున్నారు విశే్లషకులు. ఇటీవల కొంత కాలంగా అయోధ్యతో పాయం దూరంగా ఉంటూ వైఎస్సార్ సిపి నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సిపిఐ నేతలకు తెలిసినప్పటికీ జాగ్రత్త పడకపోవడం గమనార్హం. పినపాక నియోజకవర్గం గతంలో బూర్గంపాడు నియోజకవర్గంగా ఉండేది. నాడు బూర్గంపాడు ఎమ్మెల్యేగా పాయం ఉన్నప్పప్పటికీ అయోధ్య పాలనే నడిచిందని కొందరి వాదన. కాగా ఈ సారి పాయంను ఎమ్మెల్యేగా ప్రతిపాదించడంలో అయోధ్య సహకరించకుండా చేస్తున్నారని కొందరి భావన. ఇవన్నీ పాయం పార్టీని వీడేందుకు కారణాలు కావచ్చనే చర్చ జరుగుతోంది. జగన్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తారని కచ్చితమైన హామీ తీసుకుని ఎన్నికల ఖర్చు, ప్యాకేజీలకు ఆశపడి వెళ్లాడా...? అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకులు, ప్రజల్లో మెదలుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు పినపాక నియోజకవర్గంలో కొన్ని సంచలనాలు చోటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
జగన్ సర్వేలో ముందున్న పాయం
పినపాక నియోజకవర్గంలో తమ పార్టీ టిక్కెట్టు ఎవరికి ఇస్తే గెలుస్తారో అని వైఎస్సార్ సిపి అధినేత జగన్ ఈ నియోజకవర్గంలో రహస్య సర్వేను జరిపించారు. ఈ సర్వేలో పాయం వెంకటేశ్వర్లుకు 48 శాతం ఓటర్లు మద్దతు ఉన్నట్లు తెలుసుకున్న జగన్ ఎమ్మెల్యేగా పాయంకు టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయించి ఆయనను పార్టీలోకి తీసుకెళ్లినట్లు తెలిసింది.
వైరాను ఖమ్మం డివిజన్‌లోనే ఉంచాలి
* అఖిలపక్ష నేతల డిమాండ్
వైరా, మార్చి 20: వైరా రెవిన్యూ మండలాన్ని ఖమ్మం రెవిన్యూ డివిజన్‌లోనే ఉంచాలని వైరా మండల అఖిలపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. బుధవారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనంలో వైరా మండల అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈసందర్భంగా మాజీ ఎంపిపి కట్టా కృష్ణార్జునరావు మాట్లాడుతూ వైరా మండల ప్రజలకు కూతవేటు దూరంలోఖమ్మం జిల్లా కేంద్రం ఉండగా, పరిపాలనా సౌలభ్యం సాకుతో అధికారులు వైరా మండలాన్ని సత్తుపల్లి రెవిన్యూ డివిజన్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం వైరాకు చెందిన రైతులు, విద్యార్థులు, ప్రజలందరికీ అసౌకర్యమేనన్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ, కోర్టు తదితర కార్యాలయాలన్నీ ఉండటంతో విషయాన్ని ప్రజల సౌకర్యార్థం మరోసారి పరిశీలించాలన్నారు. ఈవిషయమై వైరా ఎమ్మేల్యే చంద్రావతి, శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలవనున్నట్లు ఆయన తెలిపారు. ఈసమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఆకుల ప్రసాద్, గాలి వెంకటాద్రి, శీలం నర్సిరెడ్డి, లాల్ అహ్మద్, సూతకాని జైపాల్,చావా కుమార్, ఓర్సు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సిబ్బందిని నిర్బంధించిన గ్రామస్థులు
తిరుమలాయపాలెం, మార్చి 20: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయని కారణంగా విద్యుత్ సిబ్బందిని విద్యుత్ ఉపకేంద్రంలో ఉంచి తాళం వేసిన సంఘటన బుధవారం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. ఈసందర్భంగా న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తిప్పారెడ్డిగూడెం గ్రామస్థులకు, వ్యవసాయరంగానికి మంగళవారం ఉదయం, రాత్రంతా విద్యుత్ సరఫరా చేయలేదని, బుధవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి విద్యుత్ సరఫరా చేయనికారణంగా రైతులు ఆందోళనకు దిగారని ఆరోపించారు. రైతులకు విద్యుత్ సరఫరాను అధికారులు ప్రకటించిన విధంగా సరఫరా చేయాలని, రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పోట్ల సూర్యచంద్రం, అచ్చా మల్లయ్య, ఉప్పలయ్య, అజ్మీర శంకర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమం చేస్తాం
కారేపల్లి, మార్చి 20: ప్రభుత్వం అదనపు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమం చేస్తామని టిఆర్‌ఎల్‌డి మండల అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసచారి అన్నారు. బుధవారం ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కోతలతో గ్రామాలు అంధకారంలో ఉందన్నారు. విద్యుత్ లేక తాగునీరు సకాలంలో అందక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రాము, వెంకన్న, విజయ్, కళ్యాణ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలకు- ప్రభుత్వానికి
వారిధిగా ఉంటా
* అభినందన సభలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
తాడేపల్లి, మార్చి 20: అనేక రంగాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా తన విజయాన్ని పురస్కరించుకుని బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని గౌడ కళ్యాణ మండపంలో జరిగిన అభినందన సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తరఫున తమ గళాన్ని శాసనమండలిలో వినిపిస్తానన్నారు. పిడిఎస్ అభ్యర్థిగా పోటీ చేయటం, ప్రజా సంఘాలు బాధ్యత వహించి తన గెలుపునకు కృషి చేయటంతో ‘ఇది నిజాయితీ గెలుపు’గా భావిస్తున్నానన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుకి వినతిపత్రం అందించారు. కార్యక్రమం ప్రారంభంలో చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు అలరించాయి. తొలుత నాగేశ్వరరావు తాడేపల్లి మండలంలోని తహశీల్దార్, ఎంపిడిఓ, పోలీసు స్టేషన్‌లు సందర్శించి తనను పరిచయం చేసుకుని తన గెలుపునకు కారణమైన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జన విజ్ఞానవేదిక నాయకులు గోనీలం సాంబశివరావు, వై మల్లారెడ్డి, హుస్సేన్, బూరగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ పరీక్షల నియంత్రణకు సమైక్య కృషి