గుంటూరు, మార్చి 20: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలను నియంత్రించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం డిఆర్‌సి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లింగనిర్ధారణ నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ లింగనిర్ధారణ నియంత్రణ చట్టం కింద జిల్లాలో 264 నర్సింగ్ హోంలు ప్రభుత్వ గుర్తింపు పొందివున్నాయన్నారు. ఈ నర్సింగ్ హోంలలో ఏ విధమైన లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా ఉండేందుకు విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ చట్టాన్ని ఏ కేంద్రం కూడా అతిక్రమిస్తున్నట్లు ఫిర్యాదులు అందలేదన్నారు. చట్టం ఏర్పడి జిల్లా స్థాయిలో సలహా సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 49 సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన నిబంధనల అపకారం ఈ సంఘంలో న్యాయశాఖకు చెందిన న్యాయ మూర్తులను కూడా సభ్యులుగా నియమించడం హర్షణీయమని పేర్కొన్నారు. స్ర్తి పురుషుల నిష్పత్తిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వెయ్యి మంది పురుషులకు జిల్లాలో 1991లో 978 మంది, 2001లో 984 కాగా 2011లో 1003 మంది స్ర్తిలు ఉన్నట్లు చెప్పారు. అయితే జీరో నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్య గల పిల్లల విషయంలో ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాల్లోనే మూఢ నమ్మకాలపై ఉన్న ఆచారం కొద్దీ ఆడపిల్లలను తృణీకరిస్తున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో చట్టాన్ని అతిక్రమించిన 9 కేంద్రాలపై 10 వేల వంతున జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ సామాజిక అంశంపై మరింతగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈనెల 25న గుంటూరులో, 26న తెనాలి, 28న నరసరావుపేటలో జరుగుతాయని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లా స్థాయిలోని న్యాయసేవాధికార సంస్థ ద్వారా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్గించేందుకు సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. అదేవిధంగా లింగనిర్ధారణ నియంత్రణ చట్టం గురించి మరింత విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ న్యాయస్థానంకు చెందిన న్యాయమూర్తి విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ మాట్లాడుతూ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసే విషయంలో పూర్తి సహాయ సహకారాలందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి టి అన్నపూర్ణ, నరసరావుపేట అదనపు జిల్లా జడ్జి బి రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నరసింహారావు, కన్సల్టెంట్ సిహెచ్ జె విజయకుమార్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎం గోపీనాయక్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
* కలెక్టర్ సురేష్‌కుమార్ పిలుపు
english title:
l
Date:
Thursday, March 21, 2013