రాజమండ్రి, మార్చి 20: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో వస్తున్నా మీ కోసం పాదయాత్రను ముగించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టే ముందు రోడ్డుకంరైలు వంతెనపై జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రోడ్‌కంరైలు వంతెనపైకి చంద్రబాబు సాయంత్రం 4గంటల 55నిమిషాలకు చేరుకున్నారు. వంతెనపైకి చేరుకున్న కొద్దిసేపటికే తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఎదురెళ్లి ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, గొల్లపల్లి సూర్యారావు, జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు చంద్రబాబుకు శాలువాకప్పి స్వాగతం పలికారు. అప్పటి నుండి కొద్దిదూరం మాత్రమే వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలు తరువాత వెనుదిరిగారు. అక్కడి నుండి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు వెన్నంటారు. రోడ్డుకంరైలు వంతెన ఫుట్‌పాత్‌పైనే చంద్రబాబు నడుస్తూ గోదావరి నదిని పరిశీలించారు. గోదావరిలో తెలుగుదేశం జెండాలతో ఏర్పాటుచేసిన పడవలను కొద్దిసేపు ఆగి చూసిన చంద్రబాబు, మత్స్యకారులకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. అయితే రోడ్డుకంరైలు వంతెనపై చంద్రబాబు నడస్తున్నంత సేపూ, 2003 మే 14న ఇదే రోడ్డుకంరైలు వంతెనపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్రను జనంతో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుర్తుచేసుకున్నారు. అప్పటికి ఇప్పటికి మధ్య ఉన్న తేడాను పోల్చి చూసారు. వైఎస్ పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులకు, ఇప్పటికి మధ్య చాలా తేడా ఉందని, అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటం వల్లే వైఎస్ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని కొంత మంది నాయకులు వ్యాఖ్యానించారు. అప్పట్లో వైఎస్ పాదయాత్రకు ముందు వెనుకా నడవటమే కష్టమయ్యేది. కానీ ఇపుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబును వెన్నంటి కార్యకర్తలు, నాయకులు బాగానే ఉన్నప్పటికీ, అప్పటి జనంతో పోలిస్తే మాత్రం కాస్తంత తక్కువగానే కనిపించారు. చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపించింది. గ్రూపులుగా వచ్చి చంద్రబాబును కలిసి, తరువాత వెళ్లిపోవటం తదితర పరిణామాలతో పాదయాత్రలో బాబు వెంట ఊహించినంత జనం కనిపించలేదు. కోటిపల్లి బస్టాండు సెంటరులో బాగానే జనం కనిపించారు. ఇక్కడ కూడా నాటి వైఎస్ పాదయాత్ర జరిగినప్పటి కన్నా జనం తక్కువగానే కనిపించారు. దారి పొడవునా వివిధ వర్గాలతో సమావేశమవుతూ చంద్రబాబు ముందుకు సాగారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
english title:
b
Date:
Thursday, March 21, 2013