కడప, మార్చి 20 : ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణపై కలెక్టర్ కోన శశిధర్ కోరడా ఝుల్లిపిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో ఆక్రమణకు గురైన స్థలాల స్వాధీనానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కడప నగర పాలక పరిధిలోని రిమ్స్ పరిసర ప్రాంతాల్లో పేదలు వేసుకున్న వేలాది గుడిసెలను మంగళవారం రాత్రి తొలగించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి హేమసాగర్ నేతృత్వంలో కడప, చింతకొమ్మదినె్న తహశీల్దార్లు ఎ శ్రీనివాసులు, రవిశంకర్‌రెడ్డి భారీ ఎత్తున పోలీసు బలగాలతో వెళ్లి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా గుడిసెలు ఉన్న వారి వివరాలను సేకరించి ఇప్పటికే వారికి స్థలాలు ఉన్నాయా? లేవా? అనే వాటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే కడప నగర పాలకం చింతకొమ్మదినె్న, పెండ్లిమర్రి, చెన్నూరు మండలాల పరిధిలోని స్థలాలతో పాటు ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. రాయచోటి, పులివెందుల, ఎర్రగుంట్ల, బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ అరా తీస్తున్నారు. అలాగే గతంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన పట్టాలపై సైతం విచారణకు ఆదేశాలు ఇచినట్లు సమాచారం. నకిలీ పట్టాలు చెలమణి అవుతున్న ప్రాంతాలు కూడా గుర్తించడంతోపాటు, అవినీతి అక్రమాలకు పాల్పడే రెవెన్యూ అధికారులు, సిబ్బందిలపై చర్యలకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. పలువురు రాజకీయ నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమించుకున్న స్థలాలపై కూడా విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచినట్లు సమాచారం.
కకావికలం
* నగర శివారుల్లో గుడిసెల తొలగింపు
* పోలీసులపై పేదల తిరుగుబాటు
* వాగ్వాదాలతో ఉద్రిక్తం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 20: కడప నగర శివారులోని ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా వేసుకున్న దాదాపు ఐదువేల గుడిసెలను బుధవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పేదలకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. గత కొన్ని రోజులుగా వామపక్షాలకు చెందిన కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతుతో వేలాదిగా పేదలు రిమ్స్ పరిసర ప్రాంతాల్లోని స్థలాలను ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు వాటిని తొలగించాలని హెచ్చరించినా ఖాతరు చేయలేదు. ఈ విషయాన్ని కడప తహశీల్దార్ ఎ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి అనుమతి లేకుండా వేసిన గుడిసెలను తొలగించే బాధ్యతను డిఆర్‌వో సిహెచ్ హేమసాగర్, కడప ఆర్డీవో వీరబ్రహ్మంలకు అప్పగించారు. కలెక్టర్ సూచన మేరకు ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో కడప, చింతకొమ్మదినె్న తహశీల్దార్లతో పాటు కడప పరిసర ప్రాంతాల రెవెన్యూ అధికారులు, సిబ్బందిని వెంటబెట్టుకొని రంగంలోకి దిగారు. భారీగా మోహరించిన పోలీసుల సాయంతో అతి కష్టం మీద గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా గుడిసెలు వేసుకున్న కార్మికులు ఎదురుతిరిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకదశలో పోలీసులు లాఠీ చార్జీకి సిద్ధమయ్యారు. అయితే అర్హులందరికీ పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ చర్యలు తీసుకున్నారని హామీ బాధితులకు నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలావుండగా ఈ విషయమై సిపిఐ ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌లో చొరబడి నిలదీయడానికి విఫలయత్నం చేశారు.
సామాన్యుల బడ్జెట్
* 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి
చక్రాయపేట, మార్చి 20 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. బుధవారం గండిక్షేత్రం పున్నమి రెస్టారెంట్‌లో నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనకు, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనకు, పుంగనూరుకు, బెంగళూరుకు ఉన్న వ్యత్యాసం ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో 2013-14 సంవత్సరానికి ఎస్సీలకు 8585 కోట్లు కేటాయించడం చరిత్రలోనే సంచలనమన్నారు. వ్యవసాయానికి సంబంధించి టిడిపి హయాంలో 1166 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ 6128 కోట్లు కేటాయించిందన్నారు. ఏ ప్రభుత్వం కేటాయించని నిధులు ప్రస్తుత ప్రభుత్వం కేటాయించడంతో దిక్కుతోచక ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఇక వైకాపా ప్రవర్తన విచిత్రంగా ఉందన్నారు. గోడమీద పిల్లిలా వ్యవహరిస్తూ టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మాణానికి మద్దతు పలకడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మార్కెట్ యార్డు చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రుక్మాంగదరెడ్డి, మాజీ సర్పంచ్‌లు వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిటిసి నరసింహులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.