అనంతపురం కల్చరల్, మార్చి 20: మాదిగ కులంలో పుట్టడం తాను వరంగా భావిస్తున్నానని తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన పి.శమంతకమణి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం వివిధ దళిత సంఘాలు ఆమెకు ఘన స్వాగతం పలకడంతోపాటు ఆమెకు ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేశాయి. గీతా మందిరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఆమె మాట్లాడుతూ మాదిగ కులంలో పుట్టడం వరమన్నారు. నమ్మకం, విశ్వాసాలు మాదిగల ఆభరణాలన్నారు. సమాజంలో మాదిగల పట్ల వివక్ష ఉన్నప్పటికీ మాదిగలకు మాత్రం సమాజం పట్ల వివక్షలేదన్నారు. కోకిలను అందరూ అభిమానించడం, కాకిని ద్వేషించడం సహజమని, అయితే కాకి ఎవరికీ అన్యాయం చేసిందిలేదన్నారు. అందరూ ప్రేమించే కోకిల గుడ్లను పొదిగే కాకి, తన పిల్లల మాదిరే కోకిల పిల్లలను చూసుకుంటుందంటూ, మాదిగలది కూడా కాకిలాంటి గుణమే అని కథ ద్వారా వివరించారు. ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్.రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలవ మాట్లాడుతూ టిడిపి దళితులకు ఉన్నత పదవులను కట్టబెట్టి సామాజిక న్యాయం పాటించిందన్నారు. దళితులు, వెనుకబడిన కులాల కోసం ఎన్టీఆర్, టిడిపి కృషి చేశాయన్నారు. రాజు మాట్లాడుతూ శమంతకమణి నిజంగా దళితులకు మణివంటిదని, అనేక ఉన్నత పదవులను చేపట్టిన ఆమె దళితుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు. అంతకుముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆమెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. నగరానికి వచ్చిన ఆమె మహాత్మాగాంధీ, బాబూ జగజ్జీవన్‌రాం, అంబేద్కర్, గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలం నరసానాయుడు, నదీమ్ అహ్మద్, తాడిపత్రి రాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు జెసి.సిద్ధూ, కుంటిమద్ది ఓబులేసు, రంగనాథ్, కనేకల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత సంరక్షణ సమితి నాయకులు బంగి సుదర్శన్ ఆధ్వర్యంలో రహ్మత్ ఫంక్షన్ హాలులో జరిగిన సన్మాన సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభాకరచౌదరి, రైల్వే స్టేషన్ మేనేజర్ అశ్వర్థనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శమంతకమణి సేవలను కొనియాడారు.
అట్టహాసంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి, మార్చి 20: పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి జరిగిన అంకురార్పణ అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు యాగశాలలో ప్రత్యేక పూజలు, నిత్య కైంకర్యములు పూర్తి చేశారు. వేదమంత్రాలు, శ్లోకాలు పఠించి, శే్వతవర్ణంతో కూడిన వస్త్రాన్ని గావించారు. అంకురార్పణ సందర్భంగా నవ ధాన్యాలను మొలక కట్టి పెడతారు. వీటిలో ఏ మొలకైతే బాగా వేపుగా వస్తుందో ఆ పంట బాగా పండుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో వుంది. అంతేకాకుండా నవ ధాన్యాలు అన్ని బాగా మొలకెత్తితే అన్ని రకాల పంటలు బాగా పండి ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా వుంటుందనే ప్రచారం అధికంగా వుంది.
నేడు శ్రీవారి కల్యాణోత్సవం
ఖాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి దేవదేవతలంతా విచ్చేసి దగ్గరుండి వైభవంగా నిర్వహిస్తారని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఫాల్గుణ శుద్దనవమి గురువారం రాత్రి 7:30గంటలకు జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి టిటిడి వారు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమం ఉభయదారులుగా పట్టణానికి చెందిన నామా రామచంద్రయ్యశెట్టి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారు.
పారిశుద్ధ్య పనుల కోసం ఎత్తులకు పైఎత్తులు!
హిందూపురం, మార్చి 20: హిందూపురం మున్సిపల్ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిపై పారిశుద్ధ్య పనుల నిర్వహణకు గతంలో మహిళా గ్రూపులకు కేటాయిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ద్వారా పారిశుద్ధ్య పనులను నిర్వహించేందుకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల షెడ్యూల్ తీసుకొనేందుకు బుధవారం సాయంత్రం గడువు ముగియడంతో దాదాపు 30 మంది దాకా షెడ్యూల్స్ తీసుకొన్నట్లు సమాచారం. కాగా గతంలో సంబంధిత శానిటేషన్ పనుల్లో లాభసాటిగా ఉండటంతో ప్రస్తుత టెండర్లలో వివిధ వర్గాలు పోటాపోటీగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. గతంలో శానిటేషన్ పనులు దక్కించుకొన్న కొందరు రికార్డు పరంగా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నట్లు చూపిస్తూ తక్కువ మందితోనే పనులు చేయించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు సంబంధిత కార్మికులకు నిబంధనల ప్రకారం ఇచ్చే పారితోషికంలో కూడా కోత విధిస్తూ నిధులు బొక్కేసినట్లు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో శానిటేషన్ పనులను పొందిన కొందరు ఆర్థికంగా లబ్ధి పొంది పైస్థాయికి చేరడంతో ప్రస్తుత టెండర్లలో తీవ్ర పోటీ నెలకొంది. నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ.6,700 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉండగా కొందరు కాంట్రాక్టర్లు అందులో కనీసం సగం కూడా చెల్లించక స్వాహా చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఓ మాజీ కౌన్సిలర్ ఆయా శానిటేషన్ పనుల్లో పెద్ద ఎత్తున లబ్ధి పొందగా ప్రస్తుత టెండర్లలో కూడా పనులు దక్కించుకొనేందుకు పావులు కదుపుతున్నారు. అయితే రాజకీయంగా గతంలో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉండి ప్రస్తుతం వ్యతిరేకమైన ఓ అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత టెండర్లలో జోక్యం చేసుకోవడంతో సంబంధిత మాజీ కౌన్సిలర్ ఖంగుతింటున్నారు. ఆ అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత టెండర్లలో మున్సిపల్ యంత్రాంగం చేసిన కోడ్ చేసిన మొత్తం కన్నా అతి తక్కువగా తమ వర్గీయులతో టెండర్లు దాఖలు చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఓ నేత సూచనతో నేరుగా జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి ద్వారా ఈ టెండర్లను రద్దు చేయించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. జిల్లా స్థాయి అధికారితో ఆ అమాత్యుడు చర్చించగా గతంలోనే శానిటేషన్ పనులను టెండర్ల ద్వారా పిలవాలని స్పష్టం చేయడం జరిగిందని చెప్పడంతో నిబంధనల ప్రకారమే చేసేందుకు మార్గం సుగమమయింది. ఇకపోతే ప్రస్తుతం నాలుగు సర్కిళ్లలో ఒక సర్కిల్ పనులను నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి పిల్లలు నిర్వహిస్తున్న గ్రూపుకు కేటాయించగా మిగిలిన మూడు సర్కిల్‌కు 175 మంది కార్మికులను నియమించుకొనేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఈ మూడు సర్కిళ్ల పనులను దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల వర్గీయులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. కాగా టెండర్ల దాఖలు విషయంలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రోద్భలంతోనే కొందరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు లోపాయికారిగా ముందస్తుగానే ఒప్పందాలు కుదుర్చుకొని తమ వర్గీయులే షెడ్యూల్ తీసుకొని టెండర్లు దాఖలు చేసే విధంగా అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాలు పోటాపోటీగా వ్యవహరించిట్లు సమాచారం. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేని విధంగా శానిటేషన్ పనుల టెండర్ల కోసం అధికార పార్టీ నాయకుల్లో పోటాపోటీ నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకొంది.