విశాఖపట్నం (జగదాంబ), మార్చి 20 : 22వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి కె.కృష్ణవేణి తెలిపారు. బుధవారం కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 62,118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. పరీక్షల నిర్వహణకు 266 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో నగరంలో 140, గ్రామీణ ప్రాంతాలలో 83, ఏజెన్సీలో 43 కేంద్రాలను కేటాయించామన్నారు. అలాగే 28 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు 266 మంది చీఫ్ సూపరింటెండ్లను, 30 మంది సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. అలాగే 3,811 మంది ఇన్విజిలేటర్లు, 75 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఫర్నిచర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫర్నిచర్ ఏర్పాటు చేయకపోతే ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష రాసే సమయంలో విద్యుత్ సరఫరాలో కోత ఉన్నందున జనరేటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతే కాకుండా విద్యార్థ్ధులకు హాల్ టిక్కెట్లు ఇప్పటికే అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు డిఇఒ కార్యాలయాల్లో ప్రత్యేక ఫోన్ నెంబర్‌తో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని, కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లన్నింటినీ మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయించాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఇన్విజిలేటర్లు, విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమన్నారు. ఎవరైనా తీసుకువస్తే కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అప్పగించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ల తనిఖీల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీసీ ద్వారా పరీక్షా కేంద్రాలకు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులంతా పరీక్షా సమయానికి అర్ధగంట ముందు కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.
సరిహద్దుల్లో కొనసాగుతున్న గాలింపులు
గూడెంకొత్తవీధి, మార్చి 20: ఆంధ్రా - ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు కదలికలను అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతుంది. సాగుల సంఘటన అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు కొంత మేర పెరిగాయి. గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోని సంపంగి గొంది, చీపురుగొంది గ్రామాల్లో మావోయిస్టులను సజీవంగా పట్టుకున్న విషయం తెలిసిందే. తదనంతరం మావోయిస్టు కార్యకలాపాలు కొంత మేర తగ్గాయి. పూర్తిగా కదిలికలు తగ్గుముఖం పట్టాయని భావించిన పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలను కొంత మేర తగ్గించారు. దీంతో చాప కింద నీరులా సి.పి. ఐ. మావోయిస్టులు తమ మిలీషియా సభ్యులతో ఆయా ప్రాంతాల్లో పార్టీ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టారు. గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహించేందుకు మావోయిస్టులు చేస్తున్నప్రయత్నంలో భాగంగా గత నెల 19న లక్కవరం గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో కమిటీల కోసం ప్రస్తావించగా సాగులకు చెందిన కొందరు గిరిజనులు కమిటీల్లో మేము లేవని తెలపడంతో మావోయిస్టులు గిరిజనులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో ముగ్గురు గిరిజనులు మృతి చెందడమే కాకుండా అనేక మంది గిరిజనులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను తగ్గించారు. సాగుల సంఘటనతో మావోయిస్టులపై పెరిగిన వ్యతిరేకతను తగ్గించేందుకు ఈప్రాంతంలపై పట్టున్న మావోయిస్టు నేత కొంత ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో మళ్ళీ మావోల కదలికలు పెరిగాయన్న తెలిసిన పోలీస్ యంత్రాంగం విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు.
చెత్త తరలింపుపై ముదురుతున్న వివాదం
అనకాపల్లి టౌన్, మార్చి 20: మున్సిపల్ చెత్త తరలింపుపై గత కొంతకాలంగా నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడుతుంది. మున్సిపల్ చెత్తను జననివాసాల మధ్యగల కొత్తూరు కంపోస్టుయార్డుకు తరలింపు చర్యలను నిలుపుదల చేయాలని మండలంలోని కుంచంగి సమీపంలోని క్వారీ గోతుల్లోకి ఈ చెత్తను తరలించాలని మంత్రి గంటా ఆదేశాలు కార్యరూపం దాల్చడంలో ఎడతెగని జాప్యం జరుగుతుంది. మంత్రి గంటా ఆదేశాలకు అనుగుణంగా కొత్తూరుకు చెత్త తరలింపునిలిచిపోయినప్పటికీ కుంచంగి సమీపంలోని క్వారీ గోతుల్లోకి చెత్త తరలింపును అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీంతో గతంలో ప్రభుత్వ అనుమతి పొందిన మండలంలోని అచ్చియ్యపేట, సుందరయ్యపేట గ్రామాలకు సమీపంలోని ప్రభుత్వ స్థలంలోకి మున్సిపల్ చెత్తను పోలీసు బందోబస్తుతో బుధవారం తీసుకెళుతుండగా ఆ రెండు గ్రామాలకు చెందిన దాదాపు 20మంది అడ్డుకున్నారు. చెత్త వేయడానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఉత్తర్వులు ఉన్నాయని ఇందుకు ప్రతికూలంగా మీవద్ద ఏమైనా ఉత్తర్వులు ఉంటే చూపాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నాగేశ్వరరావు ప్రశ్నించారు. చెత్తను తీసుకెళుతుండగా అడ్డుకుంటున్న నిరసనకారులపై మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో టౌన్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సిఐ గోవిందరావు, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తమ పోలీస్ సిబ్బందితోపాటుగా వెళ్లి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ అధికారులతో నిరసనకారులు వాగ్వివాదానికి దిగారు. జననివాసాల మధ్య మున్సిపల్ చెత్త వేయడం అన్యాయమని, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మంత్రి, అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు బాలకృష్ణ, వైఎన్ బద్రం, జిల్లా వ్యవసాయ వృత్తిదార్ల యూనియన్ నాయకులు పిఎస్ అజయ్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ మున్సిపాల్టీ చెత్తను గ్రామీణులను నివశించే ప్రాంతాల్లో వేయడం చట్టవిరుద్దమని గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూపారు. సంబంధిత కోర్టు ఉత్తర్వులు ప్రస్తుతం తాము చెత్త వేస్తున్న ప్రాంతానికి వర్తించదని మున్సిపల్ అధికారులు ఖరాఖండిగా చెప్పారు. కోర్టు ఉత్తర్వులు గ్రామాల్లో ఏ ప్రాంతానికైనా వర్తిస్తాయని ఆందోళనకారులు ఖరాఖండిగా చెప్పారు. ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించారనే అభియోగాలపై ఉద్యమనాయకులు పిఎస్ అజయ్‌కుమార్, ఎ. బాలకృష్ణ, వైఎన్ బద్రం, కోన లక్ష్మణ తదితరులను అరెస్టు చేసి అనకాపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ ఆందోళనా కార్యక్రమంలో మహిళలు కూడా ఉన్నప్పటికీ రాత్రివేళల్లో మహిళలను పోలీస్ స్టేషన్‌లో ఉంచే పరిస్థితి లేనందున గురువారం వీరిని అరెస్టు చేసే పరిస్థితి ఉందని పోలీసులు సూచనప్రాయంగా తెలిపారు. మున్సిపల్ చెత్త తరలింపును అడ్డుకుంటున్న ఉద్యమనాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరశిస్తూ సుందరయ్యపేట, అచ్చియ్యపేట గ్రామస్తులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు.
జిల్లాలో తాగునీటి సమస్య జటిలం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 20: జిల్లాలో తాగునీటి సమస్య మరింత జటిలంగా మారుతోంది. వేసవి ఎండలతో పాటు తాగునీటి ఎద్దడి కూడా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ సమస్య జిల్లా ప్రజలను పట్టి పీడిస్తోంది. ఏప్రిల్ నెల నుంచి గ్రీష్మతాపం మరింత పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇంతకుముందు కంటే ఈ సంవత్సరం ఎండ ప్రభావం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24న జరగనున్న డిఆర్‌సి సమావేశంలో తాగునీటి సమస్యపై ప్రతిపక్షం అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే చెరువులు, బావులలో నీరు అడుగంటింది. డెల్టా ప్రాంతంలో సైతం మార్చి నెల నుంచే తాగునీటి ఇక్కట్లు ఎదురవటం గమనార్హం. ఈ సంవత్సరం దాళ్వా సాగు లేకపోవటంతో మూడునెలల ముందే కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేశారు. ఫలితంగా చెరువుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఇక పశ్చిమకృష్ణా సంగతి చెప్పుకోనవసరం లేదు. ఎక్కువ గ్రామాలు నూతులు, చేతి పంపులపై ఆధారపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో అవసరమైన మేరకు నీరు అందుబాటులోకి రావటం లేదు. చేతిపంపులు కూడా పాడై మూలనపడ్డాయి. రక్షిత మంచినీటి పథకాలు సక్రమంగా పని చేయటం లేదు. ఎక్కడన్నా ఒకటీ అరా పనిచేస్తున్నా విద్యుత్ సమస్య పెద్ద ఆటంకంగా మారింది. సముద్ర తీరప్రాంత ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మచిలీపట్నం, గుడివాడ డివిజన్ల పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో 365 రోజులు తాగునీటికి ఇక్కట్లు తప్పవు. సముద్రానికి అతి చేరువలో ఉండటం వల్ల బావుల్లో ఉప్పునీరు లభ్యమవుతోంది. ఈ నీరు వాడకానికి కూడా పనికిరావు. నిత్యం ట్యాంకర్లపై ఆధారపడాల్సిందే. అన్ని ప్రాంతాలకు ఒకేసారి నీటి ఎద్దడి ప్రారంభమవటంతో తాగునీరు తీర గ్రామాలకు అందుబాటులోకి రావటం లేదు. మచిలీపట్నం పురపాలక సంఘం పరిధిలోనే రోజువిడిచి రోజు గంట పాటు కుళాయిలకు తాగునీరు విడుదల చేస్తున్నారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్న మచిలీపట్నానికే ఈ పరిస్థితి ఉంటే అసలు వనరులు లేని ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం లేదు. జిల్లాలో దాదాపు 300 గ్రామాలకు పైగా తాగునీటి ఎద్దడి ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు, చేతిపంపుల మరమ్మతులకు తదితర అవసరాల కోసం సంబంధిత అధికారులు 3.60 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 340 మంచినీటి చెరువులు ఉండగా 80శాతం పైబడి చెరువుల్లో నీరు అడుగంటింది. మార్చి మూడో వారానికే తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ముందుముందు ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయో చెప్పనవసరం లేదు. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే భవిష్యత్తు మరింత ఇరకాటంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు. రక్షిత మంచినీటి పథకాలు, చేతిపంపులకు తక్షణం మరమ్మతులు జరిపించటం, అడుగంటిన చెరువుల్లో నీటిని నింపేందుకు కాలువలకు నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.