మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 20: వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం 100 మందికి పైగా వస్త్ర వ్యాపారులు కళ్ళకు గంతలు కట్టుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరేట్ వద్ద వున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను తొలగించి సెన్సిటివ్ కమోడిటీస్ పరిధి నుంచి వస్త్రాలను తొలగించాలని నినాదాలు చేశారు. టిడిపి పట్టణ అధ్యక్షులు మోటమర్రి బాబాప్రసాద్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. బుధవారం నాటి రిలే దీక్షలో మల్లవోలు, కాజ, పోలవరం, చిన్నాపురం గ్రామాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. అధ్యక్షులు వి రాములు, సెక్రటరీ టి గుప్తా, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.
పోలీస్ సేవల కోసం డయల్ నెం.100
* ఉగాది నుండి అమలు
* ఎస్పీ ప్రభాకరరావు వెల్లడి
నూజివీడు, మార్చి 20: జిల్లా ప్రజలు శాంతి పరిరక్షణతోపాటు సమస్యలు, ఫిర్యాదులపై 100 ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని జిల్లా ఎస్‌పి జె ప్రభాకరరావు తెలిపారు. డివిజన్ ప్రధాన కేంద్రమైన నూజివీడులో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ సెంటరును బుధవారం సాయంత్రం ఎస్‌పి ప్రభాకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యసేవల కోసం 108 నెంబరు పనిచేస్తున్నవిధంగా పోలీసు సేవల కోసం 100 నెంబరు కేటాయించామని, దీని సేవలు ఉగాది పర్వదినం నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 100 నెంబరుకు ఫోన్‌చేస్తే నేరుగా ఏలూరు రేంజ్ డిఐజీ కార్యాలయం చేరుతుందని, అక్కని నుండి కేసు పరిశీలన, పరిశోధన ప్రారంభం అవుతుందని అన్నారు. 100 ఫోన్‌సేవలువల్ల నిందితులతోపాటు పోలీసులు కూడా పనిలో ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అన్ని పోలీసు స్టేషన్లకు సమాచార వ్యవస్థను సెంట్రలైజేషన్ చేశామని తెలిపారు. మహిళలు వారి సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని, ఇటీవలి కాలంలో 26హత్యలు జరుగ్గా, వీటిలో 22కేసులను ఛేదించామని, ఇంకా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. నూజివీడులో జరిగిన మహిళ హత్య కేసు ఇంకా విచారణలో ఉందని, పెండింగ్‌లో ఉన్న హత్యకేసులను ఛేదించేదుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ ప్రభాకరరావు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు డిఐజీ ఆదేశాల మేరకు ప్రముఖ పట్టణాలలో పోలీసింగ్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి ఏర్పాటు వల్ల ప్రతి చిన్న విషయం పోలీసు దృష్టికి వస్తుందని, దాని పరిష్కరించటం సులువు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు డిఎస్‌పి సిహెచ్ చెన్నయ్య, సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నూజివీడు డిఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ప్రభాకరరావు వార్షిక తనిఖీ చేశారు.
సమ్మె నోటీసిచ్చిన
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
తోట్లవల్లూరు, మార్చి 20: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉపాధి హామీ ఎపిడి పచ్చిగళ్ళ దేవానందంకు బుధవారం నోటీసు అందజేసినట్లు తోట్లవల్లూరు మండల ఫీల్డ్ అసిసెంట్లు పాముల శ్రీనివాసరావు, నక్కా శివప్రకాష్, ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేసి నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, మ్యాన్‌డెస్ విధానం రద్దుచేయాలని, హెచ్‌ఆర్ పాలసీ రెగ్యులర్ చేయాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని సమ్మె చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ డిమాండ్లు తీర్చేవరకు నిరవధిక సమ్మె చేస్తామని వారు వివరించారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య
బంటుమిల్లి, మార్చి 20: మండల పరిధిలోని జానకీరామపురం, లక్ష్మీనారాయణపురంలో తాగునీరు రాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు కూడా నీరు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు బుధవారం ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వారి గోడు పట్టించుకునే నాథుడు లేకపోవటం, ఆఫీసుకు తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఎండివో కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్ళి ఎండివో సువర్ణరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పెడన నియోజకవర్గం నాయకులు పరుచూరి ధనశ్రీ, మాజేటి పద్మ, శారదాదేవి, సిపిఎం నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, పోసిన మోహనరావు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, ఎం శివశ్రీనివాసరావు, అజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు.