కర్నూలు, మార్చి 20: తెలంగాణా రాష్టస్రాధన కోసం ఆ ప్రాంత జెఎసి నాయకులు 3సడక్ బంద్2నకు పిలుపునివ్వడంతో గురువారం హైదరాబాదు రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగనుంది. ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ రహదారిలో వాహనాలను తిరగనివ్వబోమని ఆందోళనకారులు హెచ్చరించారు. దీంతో కర్నూలు నుంచి హైదరాబాదుకు వెళ్లే మార్గంలో వాహనాలు నగర శివార్లలోని అలంపూర్ చౌరస్తా వద్ద నిలిచిపోనున్నాయి. సడక్‌బంద్ కారణంగా ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. కర్నూలు నుంచి హైదరాబాదుకు బస్సులు నిర్వహించడానికి పోలీసుల అనుమతి ఉంటేనే సాధ్యపడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణా నేతల ఆందోళన కారణంగా హైదరాబాదు వైపు రాకపోకలకు సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంత బస్సులను శ్రీశైలం మీదుగా హైదరాబాదుకు బస్సులు మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. కాగా సడక్ బంద్‌కు ప్రభుత్వం ఇంత వరకు అనుమతి మంజూరు చేయకపోవడంతో రాష్ట్ర పోలీసులు హైదరాబాదు నుంచి అలంపూర్ చౌరస్తావరకు జాతీయ రహదారిపై 144వ సెక్షన్ విధించామని రాకపోకలకు అంతరాయం కలిగిస్తే అరెస్టుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ఆర్టీసీ బస్సులకు తగిన భద్రత కల్పించి బస్సులను నడుపుకోవడానికి అంగీకరించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఒకవేళ సడక్ బంద్‌కు ప్రభుత్వంఅనుమతినిస్తే బస్సులు తిప్పడం సాధ్యంకాదని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిన తరువాత ప్రత్యామ్నాయ మార్గాలపై తుదినిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
సుంకేసుల, మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు
సడక్ బంద్ దృష్ట్యా కర్నూలు నుండి ప్రత్యామ్నాయ మార్గాలద్వారా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కర్నూలు నుండి సుంకేసుల వంతెనను దాటి గద్వాల, మహబూబ్‌నగర్, చేవేళ్ల మీదుగా హైదరాబాద్ నగరానికి బస్సులు చేరుకుంటాయని అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు.
ప్రశాంతంగా పరీక్ష రాయండి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 20: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రశాంతయుత పరిస్థితుల్లో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎలాంటి ఆందోళనకు, ఒత్తిడికి గురికాకుండా పరీక్షలురాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కోరారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 801 పాఠశాలలకు చెందిన 53,094 మంది చిన్నారులు 225 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు చోటివ్వకుండా అన్ని ఏర్పట్లు చేశామన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 225 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లను, 225 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను, 2,561 మంది ఇన్విజిలేటర్లను నియమించామని ఆయన వివరించారు. పరీక్షల్లో విద్యార్థులు అక్రమాలకు పాల్పడకుండా 11 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వివరించారు. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు హాల్‌టికెట్లు అందని పక్షంలో వారు బోర్డ్ ఆఫ్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వాటిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ధృవీకరణ సంతకాలు చేయించుకొని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. హాల్ టికెట్‌లో విద్యార్థుల వివరాల్లో తప్పులు దొర్లితే వాటిని కూడా ప్రధానోపాధ్యాయులు సరి చేస్తారని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్షలు రాసేందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని వాటిలో ప్రయాణించే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపి బస్సుల్లో పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్షా సమయానికి అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకొని ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఎవరు, ఎలాంటి వదంతులను సృష్టించినా విద్యార్థులు వాటిని పట్టించుకోవద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీ అధికారులను చూసి ఆందోళన చెందడం, హడావుడిగా జవాబులను రాయడం వంటి చేయవద్దన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల సలహాను తీసుకొని పూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా పరీక్షలు రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి బుచ్చన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన అహోబిలేసుడు
ఆళ్లగడ్డ, మార్చి 20: పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి హనుమంతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రవిస్వామి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ త్రేతాయుగం తర్వాత శ్రీరాముని అనే్వషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన హనుమంతునికి శ్రీ నరసింహస్వామి, చేతిలో విల్లుతో దర్శనమిచ్చారు. అప్పుడు హనుమంతుడు కారంజ నరసింహస్వామికి వాహనంగా మారి స్వామి సేవలో తరిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమానికి మద్రాస్‌కు చెందిన కస్తూరి అండ్ సన్స్, కడపకు చెందిన రామశేషయ్య అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. దిగువ అహోబిలంలో రాత్రి శ్రీ ప్రహ్లాద వరద స్వామి సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి స్వామిని సూర్యప్రభ వాహనంలో కూర్చుండబెట్టి పూజలనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిననరసింహాచార్యులు అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. పూర్యునికి మద్యవర్తిగా శ్రీమన్కానరాయణుడు వేంచేసి యుండి ఈ జగత్తుకు ఆధారమై యున్నాడు. సూర్యునిపై వేంచేసిన భగంతున్ని దర్శించుకుంటే మోక్ష మార్గంలో సూర్య మండలంను దాటగలరని యజ్ఞవాల్క్యుడు చెప్పాడన్నారు. ఈ కార్యక్రమాలను తిలకించడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అంతకుముందు దిగువ అహోబిలంలో ఉదయం హంసవాహనంపై శ్రీ ప్రహ్లాద వరదస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మేనేజర్ బివి నరసయ్య ఆధ్వర్యంలో ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ శ్రీ ప్రహ్లాద వరదస్వామిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి హంసవాహనంపై కూర్చుండబెట్టి సాంప్రదాయం ప్రకారం పూజలనంతరం రామానుజాచార్యుల వారి ఆలయం వద్ద వేద పండితులు గోష్టి నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ హంస విలక్షణమైన పక్షి. హంసకు పాలు, నీటిని వేరుచేసే గుణం ఉన్నది. హంసవాహనంపై ఊరేగిన స్వామిని దర్శిస్తే మంచి, చెడులకు, సద్భుద్ది, దుర్భుద్ది, సత్కర్మ, దుష్కర్మల మద్య భేదములు తెలుసుకొని మంచిపనులు చేసి భగవంతుని ప్రీతినిపొంది మోక్షం పొందుతారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరుకు చెందిన ఆర్‌ఎస్ సంపత్ అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి,శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఎగువ అహోబిలంలో: ఎగువ అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అహోబిలం ఆలయ అర్చకులు ఎం రమేష్ ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించి స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
నేడు అహోబిలంలో : ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం ఉత్సవం, రాత్రి చం6ద ప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారని ఆలయ మేనేజర్ బివి నరసయ్య తెలిపారు. దిగువ అహోబిలంలో ఉదయం యోగానృసింహ గరుడ విమాన సేవ, రాత్రి హనుమంత వాహనంపై శ్రీ ప్రహ్లాదవరదుడు భక్తులకు దర్శనమిస్తారన్నారు.