శ్రీకాకుళం, మార్చి 20: గ్రామ పంచాయతీల ఫొటో ఓటర్ల జాబితాను ఈనెల 26న ప్రకటించనున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2013 జనవరి ఒకటవ తేదీన ప్రాతిపదికగా చేసుకుని ఓటర్ల జాబితాను తయారు చేశామన్నారు. జాబితాను పరిశీలించి సవరణ ఉంటే వాటిని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకురావాలని కోరారు. తప్పులు లేని జాబితాకు సహకరించాలని కోరారు. సూచించే సవరణ శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు సరిపడి ఉండాలని స్పష్టంచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయువరకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 22ను అనుసరించి సవర్తిన్నామన్నారు. ఓటర్ల జాబితా ప్రకటన అనంతరం ప్రతిని ఉచితంగాను, ఇతరులకు నిర్ధేశిత ధర చెల్లింపుపైన జిల్లా పంచాయతీ అధికారి అందిస్తారని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుపైన ప్రతులను ఉంచామన్నారు. ఓటరు గుర్తింపు కార్డు పోగొట్టుకున్నారు లేదా పూర్తిగా పాడైనప్పుడు పది రూపాయలు చెల్లించి మీసేవా కేంద్రాల్లో డూప్లికేటు కార్డులను పొందవచ్చునని చెప్పారు.
వేర్వేరు అగ్నిప్రమాదాల్లో 52 పూరిళ్లు దగ్ధం
రణస్థలం, మార్చి 20: మండలంలో రెండుచోట్ల బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 52 పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. 40 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా. ప్రమాదంలో మహిళ సజీవ దహనమైంది. వివరాల్లోకి వెళితే... పెద్దపిసిని గ్రామంలో అగ్నిప్రమాదంలో 39 పూరిళ్లు, చిల్లపేటరాజాం గ్రామంలో 13 పూరిళ్లు బుధవారం సాయంత్రం దగ్ధమయ్యాయి.. ఈ ఘటనలో కర్రోతు సుశీల(35) అనే వివాహిత సజీవదహనమైంది. సుమారు 35 లక్షల రూపాయలు ఆస్తినష్టం సంభవించిందని అధికారులు ధృవీకరించారు. కర్రోతి పైడినాయుడు ఇంటిలో ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదం క్షణంలోనే గ్రామాన్ని చుట్టిముట్టడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధిత కుటుంబాలు పరుగులు తీశాయి. రెప్పపాటులోనే అంతా కాలిబూడిదకావడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అగ్నిమంటల్లో కాలిబూడిదవుతున్న బంగారం, నగదు, వివిధ సామాగ్రిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన కర్రోతి రాజినాయుడు భార్య సుశీల మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన నర్సుహులు కుమార్తె రజస్వల విందు కోసం గ్రామానికి చేరుకున్న బంధువులు, ఆత్మీయులు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంలో నర్సుహులు ఇల్లుతోపాటు విందుకోసం ఏర్పాటుచేసిన టెంట్‌సామాగ్రి, వంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో పత్తి, మొక్కజొన్న, ధాన్యం వంటి తిండిగింజలు, అపరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. తొలుత అగ్నిమంటలు ఎగిసిపడిన పైడినాయుడు ఇంటిలో లక్షరూపాయల పత్తి, ఆబోతుల కాలిబాబు ఇంటిలో 50 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక సిబ్బందిపై బాధితుల ఆగ్రహం
మండలంలో రణస్థలం అగ్నిమాపక శకటం మరమ్మతులకు గురికావడంతో పొందూరుకు చెందిన అగ్నిమాపక శకటం ఆలస్యంగా పెద్దపిసిని గ్రామానికి చేరుకోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికే కళ్లముందే సర్వం కాలిబూడిదవ్వడంతో కట్టలుతెంచిన కోపాన్ని గ్రామస్థులు తెచ్చుకుని శకటంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో శకటం అద్దాలు పగిలాయి. సిబ్బందికి కూడా స్వల్పగాయాలయ్యాయి. ఎ.డి.ఎఫ్.ఒ జె.మోహనరావు, బి.లక్ష్మణరావులు దాడిలో అద్దాలు పగిలిన అగ్నిమాపక శకటాన్ని పరిశీలించి ఘటనపై ఆరాతీశారు.
బాధితులకు జెసి పరామర్శ
అగ్నిప్రమాద విషయాన్ని తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్, ఆర్డీఒ జి.గణేష్‌కుమార్‌లు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళ సజీవ దహనంకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఐ.ఎ.వై ఇళ్లు మంజూరుకు హామీఇచ్చారు. ఈయనతోపాటు మండల ప్రత్యేకాధికారి రెడ్డిగున్నయ్య, తహశీల్దార్ రమేష్‌బాబు, ఎంపిడిఒ వాసుదేవరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. బాధిత కుటుంబాలకు ఐదువేల రూపాయలు నగదు, పదికిలోల బియ్యం వంతున పంపిణీ చేసి పునరావాస కార్యక్రమాలను స్థానికంగా ఏర్పాటు చేశారు.
మృతదేహానికి శవపంచనామా
మంటల్లో సజీవదహనమైన సుశీల మృతదేహానికి శ్రీకాకుళం డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో జె.ఆర్.పురం సి.ఐ వేణుగోపాలనాయుడు, ఎస్సై ప్రకాష్‌లు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
చిల్లపేటరాజాంలో 13 పూరిళ్లు దగ్ధం
మండలంలో చిల్లపేటరాజాం గ్రామంలో 13 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదు లక్షల రూపాయలు ఆస్థినష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని ఆస్తినష్టంపై అంచనాలు రూపొందించారు. అలాగే బాధిత కుటుంబాలకు పునరావాస కార్యక్రమంతోపాటు బియ్యం, నగదును అందించారు. ప్రత్యేకాధికారి రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ రమేష్‌బాబులు, ఎంపిడిఒ వాసుదేవరావులు ఘటన జరిగిన తీరుపై ఆరాతీశారు. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని హామీచ్చారు.