Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మళ్లీ సర్‌చార్జీల బాదుడు వచ్చే నెల నుండి అమలు

$
0
0

ఒంగోలు, మార్చి 23: విద్యుత్ వినియోగదారులకు మరో షాక్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చేనెల ఒకటవ తేదీ నుండి విద్యుత్ వినియోగదారులను దోచుకోవడమే లక్ష్యంగా కొరడా ఝళిపించనుంది. మండలి తీసుకునే నిర్ణయంతో జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై అదనంగా నెలకు 40 కోట్ల రూపాయలకు పైగానే సర్‌చార్జీని విధించనున్నారు. ఇటీవల విధించిన సర్‌చార్జీలకే విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మరో రెండు విడతలుగా సర్‌చార్జీలను విధించాలని మండలి నిర్ణయం తీసుకోనుండటంతో విద్యుత్ వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యుత్ వినియోగదారులు వినియోగించుకున్న విద్యుత్‌కు యూనిట్‌కు మాములుగా వసూలు చేసేదానికన్నా 65 పైసలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా 2010 సంవత్సరం అక్టోబర్ నెలలో వినియోగదారులు వినియోగించుకున్న విద్యుత్‌కు 29.41 రూపాయలను అదనంగా వసూలు చేయనున్నట్లు ట్రాన్స్‌కో అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఒకే విడతగా ఏప్రిల్ నెల నుండి యూనిట్‌పై 95 పైసలు అదనంగా భారం పడనుంది. దీంతో నెలకు వంద రూపాయలు బిల్లు వచ్చే కుటుంబానికి మూడు వందల రూపాయలు ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంటుంది. ఐదు వందల రూపాయలు వచ్చే బిల్లుకు 1500 రూపాయలు వస్తుంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడనున్నారు. ఇదిలాఉండగా రొయ్యల సాగు, పరిశ్రమలపై కూడా ఈ విద్యుత్ భారం పడనుంది. దీంతో గృహయజమానులే కాకుండా ఇతర వర్గాల వారిపై కూడా భారీగా అదనపు భారం పడనుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు టెలిస్కోపిక్ పద్ధతిలో విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులకు కొంతమేర ఊరట కలుగుతోంది. ఈవిధానం ద్వారా 50 యూనిట్లకు ఒకరేటు, వంద నుండి రెండు వందల యూనిట్లకు మరొక రేటు ఉంటుంది. కాని విద్యుత్ వినియోగదారులను మండలి దోచుకునేవిధంగా చర్యలు తీసుకోనుంది. నాన్ టెలిస్కోపిక్ పద్ధతి ద్వారా అయితే యూనిట్ నుండి రేట్లు వసూలు చేయనుండటంతో వినియోగదారులపై భారీగా ఆదనపు భారం పడనుంది. ట్రాన్స్‌కో అధికారుల లెక్కల ప్రకారం ఏప్రిల్ నెల నుండి 110 శాతం బిల్లులను వినియోగదారుల నుండి వసూలు చేసే అవకాశాలున్నాయి. అసలే జిల్లాలో ట్రాన్స్‌కో అధికారులు అధికారక కోతలను విధిస్తున్నారు. ఆ కోతలు చాలదన్నట్లుగా అనధికార కోతలను విధిస్తూ జిల్లా ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాలు రాత్రివేళల్లో చిమ్మచీకట్లల్లో మగ్గుతున్నాయి. ఇకపై రానున్న రోజుల్లో విద్యుత్ సంక్షోభం మరింత పెరగనుంది. ఇదిలాఉండగా పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కాగా అధికార పార్టీ నేతల్లో మాత్రం ఆందోళన నెలకొంది. రానున్న రోజుల్లో పంచాయతీ, మునిసిపల్, జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశాలున్నాయని అధికారపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈపాటికే కొంతమంది విద్యుత్ వినియోగదారులు సోలార్ సిస్టంలను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నివారణ చట్టాన్ని
సమన్వయంతో అమలు చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 23: ఎస్‌సి, ఎస్‌టి తెగల అత్యాచార నివారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌టి తెగల ప్రజలపై అత్యాచారాలు జరిగినప్పుడు అధికారులు బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించి వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు జరిగిన సందర్భాల్లో పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదుచేసి కేసులు నీరుకారుస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారని, పోలీసు అధికారులు దర్యాప్తు సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలన్నారు. బాధితులపై కౌంటర్ కేసులు పెడుతున్నప్పుడు అధికారులు విజ్ఞతతో వ్యవహరించి అవి సరైన కేసులు అవునా కాదా అనే విషయం నిర్ధారించుకోవాలన్నారు. బాధితులకు మూడు దశల్లో అందించాల్సిన పరిహారాన్ని కూడా సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు జరిగిన సందర్భాల్లో రెవెన్యూ డివిజన్ అధికారులు ఇరువర్గాల నుండి అందిన పిర్యాదులతో పాటు ఇతర మార్గాల ద్వారా గ్రామస్థాయి నుండి సమాచారం తెప్పించుకుని దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాల ప్రజలను చైతన్యం చేసేందుకు నెలవారి సమావేశాలను పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. నిఘా, పర్యవేక్షణ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు కూడా చట్టాల పట్ల అవగాహన పెంచుకుని గ్రామాలకు వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అదేవిధంగా తప్పుడు కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నించవద్దని ఆయన హితవు పలికారు. తప్పుడు కేసులపై దృష్టి పెట్టినప్పుడు నిజమైన కేసులపై దాని ప్రభావం పడుతుందని దీనివల్ల ఎస్‌సి, ఎస్‌టి చట్టం కూడా నిర్వీర్యవౌతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల విషయంలో సమావేశంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఆర్‌డిఒలను కలిసి సమస్యలను తెలియచేయవచ్చునని ఆయన తెలిపారు. గిరిజనులకు సంబంధించి అటవీ హక్కుల చట్టం కింద ఏయే అంశాల్లో వారికి హక్కులు కల్పించారో పరిశీలించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ప్రభాకర్‌రావును కలెక్టర్ ఆదేశించారు. 75 సంవత్సరాలకు మించి అటవీభూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చామని, ఎవరైనా మిగిలి ఉంటే వారిని గుర్తించి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈసమావేశంలో జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిరంతరం ఆధార్ కార్డుల ప్రక్రియ
డిఎస్‌ఒ రంగాకుమారి వెల్లడి
ఒంగోలు, మార్చి 23: జిల్లాలో ఆధార్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎస్ రంగాకుమారి తెలిపారు. శనివారం స్థానిక ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోని జెడి శీలం కార్యాలయంలో పాత్రికేయుల కోసం ఏర్పాటుచేసిన ఆధార్ కార్డుల జారీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆధార్‌కేంద్రాలు మూసివేస్తారని ప్రజలు భయందోళన చెందవద్దని, ఆధార్ కేంద్రాలు ప్రజలు అందరికీ అందేవరకు కొనసాగిస్తామన్నారు. జిల్లాలో 33 లక్షల 92వేల 764 మంది ప్రజలు ఉన్నారని, దాదాపు 22 లక్షల 89వేల 121 మంది ఆధార్ కార్డులు కవర్ అయ్యారన్నారు. సుమారు జిల్లాలో 20లక్షల 80వేల 49 మంది ఆధార్‌కార్డులు కంప్యూటర్‌లో నమోదు అయిందన్నారు. జిల్లాలో 25 మండలాల్లో ప్రజలకు ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. 15 మండలాల్లో పాక్షికంగా పూర్తయిందని, పది మండలాల్లో ఆధార్ కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఆధార్‌కార్డుల జారీకోసం ప్రభుత్వం నాలుగు కంపెనీలకు అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాలో ప్రజలందరు ఈ ఆధార్ కేంద్రాలకు వచ్చి కంప్యూటర్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ఫారాలు ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి హనుమంతరావు, ఆధార్ కేంద్రం కో ఆర్డినేటర్ జి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ఆలయ భూముల స్వాహా
పట్టించుకునేవారేరీ?
కందుకూరు, మార్చి 23: కందుకూరు నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిత్య దూప, దీప, నైవేద్యాలకు పూర్వీకులు తమ భూములను దానం చేస్తే ప్రస్తుతం చాలావరకు భూములు అక్రమార్కుల కబంధ హస్తాలలో ఉన్నాయి. ప్రస్తుతం భూముల విలువలు పెరగడంతో దేవుని మాన్యాల ధరలు కూడా పెరిగాయి. దీంతో ఆక్రమణదారులు దేవాదాయ భూములపై కనే్నశారు. దేవాదాయ భూములను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులపై ఉంది. అయితే వారు కూడా చేతులెత్తేశారన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం అడపాదడపా ఆక్రమణదారులు వేసిన రాళ్ళను, షెడ్లను తొలగిస్తున్నారు. వారు వెళ్లిన వెంటనే మరలా రాళ్లు వేయడం, షెడ్లు వేయడం పరిపాటిగా మారింది. దీంతో కందుకూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన ఆలయ భూములు నేడు పరాధీనంలో ఉన్నాయి. కందుకూరు పట్టణంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి జనార్దనస్వామి, ప్రసన్నాంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి ఆస్తుల మొత్తం 822.21 ఎకరాలు కాగా, ప్రస్తుతం 254.64 ఎకరాలు ప్రతి ఏడాది వేలం వేస్తున్నారు. 297/1 సర్వే నెంబర్‌లో ఈ మాన్యం ఉంది. మిగిలిన భూములలో కొంత రామతీర్థం జలాశయానికి, పేదలకు పట్టాలు ఇచ్చారు. గతంలో టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 ఎకరాలు, ఉప్పు చెరువుకు 33 ఎకరాలు, 56 ఎకరాలు ఇళ్ల స్థలాలకు, 15 ఎకరాలు నాల్గవ తరగతి ఉద్యోగులకు పట్టాలు పంపిణీ చేశారు. 3 ఎకరాలు విద్యుత్ కేంద్రానికి కేటాయించారు. 4.52 ఎకరాలు లుంబినివనం పేరుతో పేదలకు పట్టాలు ఇచ్చారు. అయితే అనేక ప్రాంతాలలో జనార్దనస్వామి ఆలయానికి సంబంధించిన భూములను కొంతమంది ఆక్రమించుకున్నారు. కొందరైతే కోవూరు రోడ్డులో ఆక్రమించి షెడ్లు వేశారు. రెవెన్యూ అధికారులు ఎన్ని దఫాలు తొలగించినా మళ్లీ వారి అండదండలతోనే షెడ్లు నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువచేసే భూములు అక్కడ ఆక్రమణలో ఉన్నాయి. పట్టణం నుంచి కొస్టాలకు వెళ్లే రహదారిలో 18.71 ఎకరాలు ఒక వ్యక్తి స్వాధీనం చేసుకుని కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాడు. అక్కడే బావిని తవ్వి సాగు చేస్తున్నారు. అక్కడ సుమారు ఎకరా భూమి 70 లక్షల విలువ చేస్తుంది. ఈప్రకారం దీని విలువ 13 కోట్లకు పైగా ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఎకరాలు అక్రమార్కుల కబంధ హస్తాలలో ఉన్నాయి. హైకోర్టులో కూడా వీటిపై వాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు కూడా ఆక్రమణదారుల కోరల్లో చిక్కుకున్నాయి. ఏడాదికి 3 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కింద ఆలయాన్ని చేర్చినా యంత్రాంగం భూముల రక్షణ తమది కాదన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 53 స్థలాలు, 5.11 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నట్లు తెలిసింది. లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామంలో 50 సెంట్లలో దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం ఉంది. దీనిని గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఆక్రమించి భవనాలు నిర్మించారు.

నెలకు రూ. 40 కోట్లకు పైగానే జిల్లా ప్రజలపై అదనపు భారం ఆందోళనలో ప్రజలు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>