రాజమండ్రి, మార్చి 23: రైతులందరినీ ఆదుకోవావడమే టిడిపి లక్ష్యమని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా కౌలు రైతులకు రుణమాఫీలో సహాయంచేసే విధంగానే విధి విధానాలను రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.శనివారం తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగిన కొత్తపేట, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం దండగ అని తాను అన్నానని కాంగ్రెస్ నాయకులు పదేపదే దుష్ప్రచారం చేసారన్నారు. ఇదే అంశంపై తాను అసెంబ్లీలో మాట్లాడుతూ, తానెప్పుడు అలా అన్నానో నిరూపించాలని, నిజంగా వ్యవసాయం దండగ అని తాను అన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి విరమించుకుంటానని వైఎస్‌తో సవాల్ చేసినపుడు ఆయన సమాధానం చెప్పలేకపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో గిట్టుబాటు ధర లభించక, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 25విచారణలు జరిపించిందని, హైకోర్టు, సుప్రీంకోర్టులో 35కేసులు వేసారని, 50మంది జడ్జిలు విచారణ జరిపారన్నారు. అయినా తనపై ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారన్నారు. ఐఏఎస్‌లను ఎంతో మభ్యపెట్టి తాను ఏదైనా తప్పుచేసి ఉంటే చెప్పాలని ఒత్తిడి చేసారన్నారు. చంద్రబాబు తినడు, ఎవర్నీ తిననీయడని అధికారులు చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో గౌరవం, పదవులు పొందిన కొంత మంది స్వార్థపరులు, పార్టీని విడిచి వెళ్లారని, అలాంటి వారు మళ్లీ పార్టీలోకి వస్తానంటే చచ్చినా చేర్చుకునేది లేదన్నారు. నాయకులు ఒక్కరు పోతే వంద మందిని తయారుచేసుకుంటానన్నారు. తెలుగుదేశం పార్టీ బలమైన, అంకితభావం కలిగిన కార్యకర్తలున్న పార్టీ అని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలకు 50శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని, అందువల్ల ఇప్పటి నుండే మహిళా నాయకులను తయారుచేయాలన్నారు. ఒకవేళ ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తే, మగవారు రాజకీయాలను విరమించి, తమ ఇంటి మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నారు. అలాగని మహిళలను బినామీగా తయారుచేసి, తాము పెత్తనం చేస్తామంటే కుదరదన్నారు. సమీక్ష జరుగుతున్నపుడు ఒక యువకుడు లేచి, ప్రజలు చంద్రబాబును నమ్మాలా? నమ్మకూడదా? అనే సందిగ్ధంలో ఉన్నారని చెప్పినపుడు చంద్రబాబు తనదైన శైలిలో ప్రతిపక్షాలు రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంటారని, వాటిని నమ్మవద్దని సమాధానం చెప్పారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో బాగా కష్టపడాలన్న ఉద్దేశ్యంతోనే యువకులు రాజకీయాల్లోకి రావటం లేదన్నారు. మన్మోహన్‌సింగ్‌లా మేధావి అయితేనే సరిపోదని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వారయి ఉండాలన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు, నీటిసంఘాలు, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణ, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పాదయాత్రకు విరామం
* రేపు మండపేటలో వస్తున్నా మీ కోసం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మార్చి 23: వస్తున్నా మీ కోసం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం ఒక్క రోజు విరామం ఇచ్చారు. ఇక నుండి ప్రతి ఆదివారం పాదయాత్రకు విరామం ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టినప్పటి తరువాత వరుసగా రెండు రోజులూ రాత్రి 1గంట దాటిన తరువాతగానీ రాత్రి మకాంకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోజుకు 15కిలోమీటర్ల నుండి 16కిలోమీటర్లు నడిచే విధంగా రూటు మ్యాప్‌ను ఖరారుచేయటంతో రాత్రి 1గంట వరకు పాదయాత్రను కొనసాగించాల్సి వచ్చింది. దీనివల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లభించటం లేదని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పటంతో, శనివారం వరకు ఉన్న రూటు మ్యాప్ ప్రకారం పాదయాత్రను కొనసాగించి, సోమవారం నుండి మార్పు చేసారు. రోజుకు 9 నుండి 10కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నడిచేవిధంగా రూటుమ్యాప్‌లో మార్పు చేసారు. సాయంత్రం 4గంటలకే బయలుదేరి, రాత్రి 11గంటలకే పాదయాత్రను ముగించే విధంగా యాత్ర షెడ్యూల్‌ను మార్చారు. దాంతో ఇంతకు ముందు నిర్ణయించిన రాత్రి బస చేసే ప్రాంతాలతో పాటు, పాదయాత్ర చేరుకునే సమయాల్లో కూడా మార్పు జరిగింది.
బ్యాంకుల ద్వారా చేయూత
కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 23: జిల్లాలో ఉన్న వివిధ రంగాలకు బ్యాంకుల ద్వారా ఆర్ధికంగా చేయూతను అందించేందుకు తగిన కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో బ్యాంకుల ద్వారా 8 వేల 101 కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. నాబార్డు రూపొందించిన ప్రొటెన్షియల్ లింక్డ్ ప్లాన్(పిఎల్‌పి)ను జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో శనివారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సలహా కమిటీ సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు బ్యాంకుల ద్వారా చేయూతను ఇచ్చేందుకు అవకాశం ఉన్న రంగాలను పరిశీలించి నాబార్డుచే 8వేల 101 కోట్ల రూపాయల బ్యాంకులచే రుణ సౌకర్యాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పిఎల్‌పిలో సగ భాగానికి పైగా నాలుగు వేల 765 కోట్లను వ్యవసాయ పంట రుణాలకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. అలాగే వ్యవసాయ టెర్మ్ లోన్లకు 1129 కోట్లు, స్వయం సహాయక బృందాలకు 581 కోట్లు, నాన్‌ఫార్మ్ రంగాలకు 720 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 907 కోట్ల రూపాయలను కేటయించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంక్ రుణాలు అందించని బ్యాంకుల నుండి ప్రభుత్వ డిపాజిట్‌లను విత్‌డ్రా చేసి బాగా పని చేసే బ్యాంకుల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా వారం రోజులు సమయం మాత్రమే ఉన్నందున బ్యాంకులకు కేటయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఆయా పధకాలకు త్వరితగతిన రుణాలను అందజేయాలని కోరారు. ఈ నెల 28వ తేదీన మరో సారి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయని బ్యాంకుల నుండి ప్రభుత్వ సొమ్ములను డ్రా చేసి మరో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. కౌలు రైతుల రుణ అర్హత కార్డులకు సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 38. 27 కోట్ల రూపాయలను బ్యాంకు రుణాలుగా అందించడం జరిగిందని ఇది చాలా తక్కువ లక్ష్యమన్నారు. 200 కోట్ల రూపాయలు లక్ష్యంగా ఉందని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అయినా బ్యాంకులు కౌలు రైతులకు రుణాలను ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ఎస్ జగన్నాధరాజు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఎజిఎం పిఎస్ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రగతి అనుకున్నంతగా లేదన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో నాబార్డు ఎజిఎం సోమయాజలు మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ రంగాలకు రుణ సౌకర్యం కల్పించేందుకు 8 వేల 101 కోట్ల రూపాయల మేర పిఎల్‌పిని రూపొందించామని ఇది రానున్న బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికకు ఇంచుమించుగా సరిపోతుందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ డిజిఎం వి సత్యనారాయణమూర్తి, డిఆర్‌డిఎ పిడి కె మధుకర్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి కె జయరాజు, వివిధ బ్యాంకుల జిల్లా కో-ఆర్డినేటర్లు, కంట్రోలింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాబుకు గుడ్‌నైట్ చెబుతున్న ఇన్‌చార్జిలు
*రాత్రి వరకు నాయకులంతా నడక
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మార్చి 23: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ రోజుకారోజు వస్తున్నా మీ కోసం పాదయాత్రను ముగించిన తరువాత, ఇన్‌చార్జిలు చంద్రబాబుకు గుడ్‌నైట్ చెప్పిన తరువాతగానీ ఇళ్లకు వెళ్లటం లేదు. తాను పార్టీ కోసం కష్టపడి నడుస్తుంటే, ఇన్‌చార్జిలు, నాయకులు పాదయాత్ర మొదలుపెట్టే ముందే కనిపించి హలో చెప్పి, తరువాత కనిపించకుండా పోతున్నారని 21న రాత్రి పాదయాత్ర ముగించిన అనంతరం చంద్రబాబు కొంత అసహనం వ్యక్తంచేసారు. ఇక నుండి ప్రతి రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు కనిపించి, మళ్లీ పాదయాత్ర ముగించిన తరువాత తనకు కనిపించి మరీ వెళ్లాలని, పాదయాత్రలో నాయకులు, ఇన్‌చార్జిలంతా పాల్గొనాలని చంద్రబాబు గట్టిగానే ఆదేశాలు జారీచేసారు. దాంతో శుక్రవారం బాబు పాదయాత్రలో జిల్లాకు చెందిన నాయకులు, ఇన్‌చార్జిలంతా పాల్గొన్నారు. వీరంతా రాత్రి 12గంటలకు చంద్రబాబు పాదయాత్ర ముగిసే వరకు వెన్నంటే ఉన్నారు. పాదయాత్ర ముగించుకుని విశ్రాంతి తీసుకునే బస్సులోకి వెళ్లిన తరువాత, పాదయాత్ర ప్రారంభం నుండి చివరకు వరకు పాల్గొన్న నాయకులు, ఇన్‌చార్జిలు బస్సులోకి వెళ్లి చంద్రబాబుకు గుడ్‌నైట్ చెప్పి వచ్చారు. దాంతో పాదయాత్రలో తన వెంట ఎవరు పాల్గొన్నది చంద్రబాబు గుర్తించేందుకు అవకాశం కలిగింది. ఇదే సమయంలో కొంత మంది నాయకులు బస్సులోనే చంద్రబాబుతో కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గాన్ని తెలుగుదేశంవైపు మరింత ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కాపు సామాజికవర్గం కోసం ప్రత్యేకంగా రూపొందించాల్సిన పథకాలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి కాపులకు ప్రయోజనం కలిగించే అంశాల పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికేంద్రీకరించినట్టు తాజా పరిణామాలను అర్ధమవుతోంది.
నేడు పాదయాత్రకు విరామం
* రేపు మండపేటలో వస్తున్నా మీ కోసం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, మార్చి 23: వస్తున్నా మీ కోసం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం ఒక్క రోజు విరామం ఇచ్చారు. ఇక నుండి ప్రతి ఆదివారం పాదయాత్రకు విరామం ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టినప్పటి తరువాత వరుసగా రెండు రోజులూ రాత్రి 1గంట దాటిన తరువాతగానీ రాత్రి మకాంకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోజుకు 15కిలోమీటర్ల నుండి 16కిలోమీటర్లు నడిచే విధంగా రూటు మ్యాప్‌ను ఖరారుచేయటంతో రాత్రి 1గంట వరకు పాదయాత్రను కొనసాగించాల్సి వచ్చింది. దీనివల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లభించటం లేదని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పటంతో, శనివారం వరకు ఉన్న రూటు మ్యాప్ ప్రకారం పాదయాత్రను కొనసాగించి, సోమవారం నుండి మార్పు చేసారు. రోజుకు 9 నుండి 10కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నడిచేవిధంగా రూటుమ్యాప్‌లో మార్పు చేసారు. సాయంత్రం 4గంటలకే బయలుదేరి, రాత్రి 11గంటలకే పాదయాత్రను ముగించే విధంగా యాత్ర షెడ్యూల్‌ను మార్చారు. దాంతో ఇంతకు ముందు నిర్ణయించిన రాత్రి బస చేసే ప్రాంతాలతో పాటు, పాదయాత్ర చేరుకునే సమయాల్లో కూడా మార్పు జరిగింది.
పోలీసు స్టేషన్ నుండి హంతకుడు పరారీ
*హతుని బంధువుల ఆందోళన* పిఠాపురం స్టేషన్ ముట్టడి
పిఠాపురం, మార్చి 23: పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి హంతకుడు పరారీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘటనపై మృతుడు తేలు గోపాల్ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, ఒమ్మంగి ప్రజలు భారీగా తరలివచ్చి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు శనివారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని దుయ్యబడుతూ హంతకుడు పరారీకి పోలీసులే సహకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు రెండుగంటల పాటు స్టేషన్ వద్దే బైఠాయించారు. మృతుడి భార్య కృష్ణవేణి, తన పిల్లలు భవానీ, స్వాతి, భాను, మణికంఠలతో స్టేషన్ వద్ద తనకు న్యాయం ఏ విధంగా జరుగుతుందంటూ తీవ్రంగా రోదించిన తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. గోపాల్ పద్మశాలీ కావడంతో చేనేత సంఘాల నాయకులు కుటుంబానికి మద్దతిచ్చారు. ఎక్కడైనా జనం గుమిగూడితే చెదరగొట్టే పోలీసులు తమ స్టేషన్ ముందున్న జనం విషయంలో నిస్సహాయత ప్రదర్శించారు. చేసేదేమి లేక మిన్నకుండిపోయారు. మృతుని భార్య కృష్ణవేణి మాట్లాడుతూ తన భర్తను హత్యగావించిన హంతకుడు తనకు తనే లొంగిపోయాడని, అంతలోనే పరారయ్యాడని పోలీసులు రెండు మాటలు చెప్పడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్నాయన్నారు. తన భర్తపైనే ఆధారపడుతున్న మేము ఐదుగురు రోడ్డున పడ్డామని, తమకు రక్షణ కరువైందని, తమ బాధ్యతలు ఎవరు నెత్తిన వేసుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
బాధితులకు పోలీసుల 3హామీ2
పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చిన మృతుని కుంటుంబ సభ్యులతో సిఐ రాంబాబు, ఎస్సై లక్ష్మీనారాయణ తమ తప్పిదాన్ని ఒప్పుకొని వారిని తాత్కాలికంగా ఊరడించేందుకు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మృతుని కుటుంబ సభ్యులతో పాటు జిల్లా చేనేత సంఘ నాయకుడు పంపన రామకృష్ణ, ఉద్దండం రవి, మొండి నూకరాజు, జోగా అప్పారావుల సమక్షంలో పోలీసులు రెండు హామీలు ఇచ్చారు. రెండే రోజుల వ్యవధిలో హంతకుడిని పట్టుకుంటామని, పిల్లల చదువు విషయంలో డిపార్టుమెంట్ తరఫున కొంత నగదు సాయం చేసి ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో మృతుని బంధువులు కొంత శాంతించారు. అయితే రెండు రోజుల్లో హామీ ప్రకారం పోలీసు చర్యలు లేకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడతామని నాయకులు హెచ్చరించారు.
పోలీసులకు సవాల్‌గా మారిన హంతకుడి పరారీ
తనకు తానుగా చిక్కి, అంతలోనే మాయమైన హంతకుడు సత్తిబాబు పరారీ పిఠాపురం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా నిందితుడు హత్యానంతరం పరారీలో ఉంటాడు. పోలీసులు తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా లొంగిపోయి పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకొని దొరికిందే ఛాన్సుగా పలాయనం చిత్తగించాడు. ఈసారి తనను పట్టుకోండంటూ తనదైన శైలిలో సవాల్ విసిరాడు.
మద్దతు ఉప సంహరించుకున్న నేతలపై దాడులా!
వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జనక్ ప్రసాద్
ఏలేశ్వరం, మార్చి 23: కాంగ్రెస్ కీలుబొమ్మగా సిబిఐ తయారైందని రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జనక్ ప్రసాద్ ఆరోపించారు. శనివారం ఏలేరు ఆధునికీకరణ కొరకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ఆయన ఏలేశ్వరం మండలం గెద్దనాపల్లి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకున్న నేతలపై దాడులు నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకే తమ పార్టీ ఉద్యమిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని అసమర్ధ పాలన కొనసాగుతోందన్నారు. ఏలేరు ఆధునికీకరణకు దివంగత వైఎస్సార్ రూ.138కోట్లు విడుదలచేస్తే, కిరణ్ సర్కార్ దానిని తగ్గించి రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏలేరు ముంపు బాధితులకు ఇప్పటి వరకూ తగిన న్యాయం చేయలేదని, వెంటనే ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రూ.258కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జ్యోతుల పాదయాత్ర లింగంపర్తి, భద్రవరం, చిన శంకర్లపూడి, చిన ఏలూరు, సిరిపురం, చిన్నింపేట గ్రామాల మీదుగా పెద్దనాపల్లి వరకూ 13కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. జ్యోతుల వెంట ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, నేతలు తోట సుబ్బారావునాయుడు, గొల్లపల్లి బుజ్జి, గొల్లపల్లి కాశీవిశ్వనాధ్ తదితర్లు ఉన్నారు. పాదయాత్రకు ప్రజలు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు.
వైద్యరంగంలో నర్సుల పాత్ర విశిష్టమైనది
నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి జార్జివిక్టర్
రాజానగరం, మార్చి 23: వైద్య రంగంలో నర్సుల పాత్ర అత్యంత విశిష్టమైందని నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పి జార్జివిక్టర్ అన్నారు. స్థానిక జిఎస్‌ఎల్ వైద్య కళాశాలలోని చరఖా ఆడిటోరియంలో జిఎస్‌ఎల్ నర్సింగ్ సంస్థలు గ్రాడ్యూయేషన్ లేంప్ లైటింగ్ ఉత్సవాలు శనివారం జరిగాయి. జిఎస్‌ఎల్ సంస్థల ఛైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నన్నయ ఉప కులపతి జార్జివిక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాధుల నివారణలో రోగులకు నర్సులు అందించే సేవలు, చూపే ఆదరణ ఎంతో విలువైందని చెప్పారు. ప్రాణాంతక సమయంలో రోగుల బంధువుల కంటే కూడా నర్సులు ఎంతో శ్రద్ధ వహించి, వారి ప్రాణాలను కాపాడేందుకు శత విధాలా కృషిచేస్తారన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సులు సేవలు ఉత్తేజకరమైనవని చెప్పారు. సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నర్సులు, మిడ్‌వైల్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సిహెచ్ రోజారాణి మాట్లాడుతూ నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి సమాజంలో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన దేశంలో రోగులు, నర్సులు నిష్పత్తిలో చాలా భేదం కనిపిస్తోందన్నారు. యుఎస్‌ఎలో రోగులు, నర్సులు నిష్పత్తి 1:200 ఉంటే మన దేశంలో ఈ నిష్పత్తి 1:1200 వరకూ ఉందన్నారు. నర్సులు అంటే ప్రత్యేకమైన పనికోసం ఏర్పాటైన ఒక బృందమని, విశ్వవ్యాప్తంగా నర్సింగ్ వృత్తిలో ఉన్నవారంతా ఒకే కుటుంబమని అన్నారు. డిగ్రీలు చేతపట్టుకుని బయట ప్రపంచంలో అడుగుపెడుతున్న నర్సులు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, తమ నైపుణ్యాలతో రోగులకు మంచి సేవలు అందించాలని రిజిస్ట్రార్ రోజారాణి సూచించారు. తొలుత ఫ్లోరెన్స్ ఆఫ్ నైటింగేల్ చిత్ర పటానికి విద్యార్థులు పూలమాలలు వేశారు. అనంతరం జిఎస్‌ఎల్ స్వతంత్ర నర్సింగ్ సంస్థల్లో డిగ్రీ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన వారికి పట్టాలు ప్రదానం, ఉత్తమ విద్యార్థులకు పతకాలను ఉప కులపతి జార్జివిక్టర్, రిజిస్ట్రార్ రోజారాణి ప్రదానం చేశారు. 2012-16 సంవత్సరం నర్సింగ్ బ్యాచ్ కొవ్వొత్తులతో లేంప్ లైటింగ్ ఉత్సవం నిర్వహించగా, స్వతంత్ర నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ టి కుసుమకుమారి వారిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిఎస్‌ఎల్ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ వైవి శర్మ, ఎ పుష్పవతి, జిఎస్‌ఎల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి సత్యనారాయణ తదితర్లు పాల్గొన్నారు.
నాలెడ్జి పార్క్‌లు అవసరం
జెఎన్‌టియుకె
విసి తులసీరామ్‌దాస్
కాకినాడ సిటీ, మార్చి 23: దేశాభివృద్ధికి నాలెడ్జ్ పార్క్‌లు ఎంతో అవసరమని జెఎన్‌టియుకె విసి డాక్టర్ తులసీరామ్‌దాస్ అన్నారు. వర్సిటీలోని సెనేట్ హాలులో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ ఏరియాస్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ, జెఎన్‌టియుకె సమాఖ్యంగా శనివారం ఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన విసి తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ బయోటెక్నాలజి ద్వారా మెరైన్ కల్చర్ అభివృద్ధి జరుగుతుందన్నారు. కాకినాడ తీర ప్రాంతంలో అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు ఉన్నందున పరిశోధనలు చేసి ప్రజలకు జీవనోపాధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ మోహన్‌కందా మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు దేశంలో మాత్రం ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదన్నారు. భావి అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వనరులను సరైన రితీలో ఉపయోగించాలని కోరారు. నేడు వ్యవసాయం నిర్లక్ష్యానికి గురౌతుందని లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమ అవసరమని తెలిపారు. మానవ వనరులు దేశాభివృద్ధికి ఎంతో అవసరమని కలలను సాకరం చేసుకునేందుకు ప్రతీ ఒక్కరు లక్ష్యాలను నిర్ధేంచుకోవాలన్నారు. ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి సుదీర్గమైన సముద్ర తీర ప్రాంతం ఉందని దీనిని సరైన రితీలో ఉపయోగించుకుంటే ప్రజలకు, దేశానికి మేలు కలుగుతుందన్నారు. పరిశోధనల వల్ల జ్ఞాన సముపార్జనతో నలుగురికి మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ డాక్టర్ ఇవి ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ జివిఆర్ ప్రసాదరాజు, డైరెక్టర్లు ఎం ప్రసాద్, టి రాజ్యలక్ష్మి, పివిఎ రామారావు తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజు టెన్త్ పరీక్షలు ప్రశాంతం
కాకినాడ మార్చి 23: పదవ తరగతిలో రెండవ రోజు శనివారం జరిగిన తెలుగు పేపర్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పరిశీలకులు జిల్లా వ్యాప్తంగా 91 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలియజేశారు. మొత్తం 59 వేల 53 మంది విద్యార్థులకు గాను పరీక్షకు 58 వేల 603 విద్యార్థులు హాజరయ్యారని డిఇఓ శ్రీనివాసులరెడ్డి చెప్పారు.